రుణమాఫీకి ఆధార్ తప్పనిసరి
ఎచ్చెర్ల రూరల్: రైతు రుణమాఫీకి రేషన్ కార్డు నంబర్, ఆధార్ నంబర్లను తప్పనిసరిగా సేకరించాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. స్థానిక సాంకేతిక శిక్షణాభివృద్ధి కేంద్రంలో వివిధ బ్యాంక్‌ల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు రుణమాఫీ వర్తింపజేసేందుకు బ్యాంక్‌లకు ప్రొఫార్మాలు పంపిస్తారని, వాటిలో అన్ని కాలమ్స్ నింపాలని సూచించారు. ఆధార్ నంబర్, పాస్ పుస్తకం, కార్డు నంబర్, సర్వే నంబర్లు ఇలా..అన్ని వివరాలు పొందుపరచాలని సూచించారు.
రుణమాఫీకి ఎంతమంది రైతులు ఉన్నారు..వారికి ఎంతెంత రుణాలు అందజేశారు..ఎంత మేర మాఫీ చేయాల్సి ఉందన్న విషయాలను తెలపాలన్నారు. అర్హత గల రైతులను ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పారు. మాఫీ వివరాలను రైతులకు తెలియజేసేందుకు బ్యాంక్‌ల వద్ద నోడల్ అధికారులు ఏర్పా టు చేస్తారన్నారు. కౌలు రైతులకు సంబంధించి వారు..సాగు చేస్తున్న పంట భూముల సర్వే నంబర్లు సేకరించాలని సూచించారు. రైతుమిత్ర సంఘాలకు సంబంధించి..వేర్వేరుగా రైతుల వివరాలు సేకరించాలన్నారు.
ఈ విషయంలో లోపాలు, సమస్యలు ఉంటే..తమకు మెయిల్ చేయాలని, వాటిని ప్రధాన కార్యదర్శికి పంపి..పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. ప్రతి ఎస్‌హెచ్‌జీకి రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేస్తామన్నారు. ఈ ఏడాది బ్యాంక్ లింకేజీల లక్ష్యాలను సకాలంలో అధిగమించాలని సూచించారు. రైతు రుణమాఫీకి సంబంధించి..క్షేత్రస్థాయిలో స్పష్టంగా పరిశీలించి..నివేదికలను సక్రమంగా తయారు చేయాలని, అర్హులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ తనూజారాణి, ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం రాజేంద్రకుమార్, ఎస్‌బీఐ ఏజీఎం రాజారామ మోహన్‌రాయ్, ఏపీజీవీబీ ఆర్‌వో జీఎస్‌ఎన్ రాజు, సెర్ప్ డెరైక్టర్ వై.రఘునాథరెడ్డి, ఎల్‌డీఎం రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.