సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ నివాస్
సాక్షి, శ్రీకాకుళం : పార్లమెంట్, శాసససభ నియోజకవర్గాలకు జరిగే సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్ ప్రకటించారు. ఆదివారం ఎన్నికల కమిషన్ సాధారణ ఎన్నికల హెడ్యూల్ ప్రకటిం చిన అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
అమల్లోకి ఎన్నికల నియమావళి
ఆదివారం రాత్రి నుంచి తక్షణం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని కలెక్టర్ ప్రకటించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాయని చెప్పారు. రాజకీయ పార్టీలతో తక్షణం సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుచేసే అధికారులు, సిబ్బందికి వెంటనే శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా , సజావుగా నిర్వహించుటకు అన్నిచర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
పలు కొత్త విధానాలు..
ఎన్నికల సంఘం ఈసారి పలు కొత్త విధానాలను తీసుకువచ్చిందని కలెక్టర్ తెలిపారు. నామినేషన్లు వేసేందుకు సువిధ యాప్‌ను వినియోగించుకోవచ్చని చెప్పారు. సింగిల్ విండో విధానంగా సువిధ యాప్ పనిచేస్తుందన్నారు. ప్రతి అనుమతికి సువిధ ద్వారా దరఖాస్తు చేయాలన్నారు.
ఈ నెల 15 వరకు కొత్త ఓటర్ల నమోదు..
ఎన్నికల నోఫికేషన్ ఈ నెల 18న విడుదల అవుతుందని పేర్కొన్న జిల్లా కలెక్టర్ నామినేషన్ల చివరి తేదీ వరకు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునే అవకా>శం ఉందన్నారు. షెడ్యూల్డ్ ప్రకటించిన అనంతరం ఓట్ల తొలగింపు జరగదని స్పష్టం చేశారు. మరణాల కేసులు పక్కాగా ఉంటేనే ఎన్నికల కమిషన్ అనుమతితోనే తొలగింపు చేయాలని సూచించారు.
శాంతిభద్రతలకు పటిష్ట చర్యలు
జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అడ్డాల వెంకటరత్నం మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. 15,000 మంది సిబ్బందిని సిద్ధం చేశామని చెప్పారు. ఆయుధాలన్నింటినీ ఇప్పటికే డిపాజిట్ చేయించామన్నారు. వారెంట్ కలిగిన వాటిలో ఐదు మినహా మిగిలినవన్నీ పర్యవేక్షణలో ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేసేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఫారం–7 పై బూర్జలో 28 కేసులు, మిగిలిన మండలాల్లో 22 కేసులు, వెరసి 50 కేసులు నమోదయ్యాయని వివరించారు.
దీనిపై సిట్ విచారణ చేపడుతోందన్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేవీఎన్.చక్రధర్‌బాబు, ఐటీడీఏ పీవో లోతేటి శివశంకర్, జాయింట్ కలెక్టర్–2 పి.రజనీకాంతరావు, డీఆర్‌వో కె.నరేద్రప్రసాద్, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అదికారి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి షెడ్యూల్డ్‌ను ప్రకటించినందున తక్షణం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేయాలని ఆదేశించారు. ప్రతీ అంశాన్ని పకడ్బందీగా చేపట్టాలన్నారు.
- అడ్డాల వెంకటరత్నం, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment