సమావేశంలో పాల్గొన్న రిటర్నింగ్ అధికారులు
సాక్షి, శ్రీకాకుళం : ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎలక్షన్ కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఎన్నికల నోడల్ అధికారులతో ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు సమాచారాన్ని 1950 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని చెప్పారు. ఇతర అధికారుల ఫోన్ నంబర్లకు పలువురు ఫోన్ చేస్తున్నారని, ఓట్ల వివరాలు అధికారుల వద్ద తక్షణం అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 1950 నంబరుకు డయల్ చేయడం, ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ద్వారా వివరాలు సులువుగా తెలుసుకోవచ్చని చెప్పారు.
ఇప్పటి వరకు ఓటు హక్కు లేని వారు కూడా కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఓటరు హెల్ప్‌లైన్ యాప్ ద్వారా ఓటు వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. పోలింగు కేంద్రాల వద్ద దివ్యాంగులకు ప్రత్యేకంగా ర్యాంపులు, త్రిచక్ర వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఫ్‌లైయింగ్ స్కాడ్స్, వీడియో సర్వేలియన్స్ బృందాలు, ప్రవర్తనా నియమావళి అమలు అధికారులు, సెక్టార్ అధికారులు తక్షణం రంగంలోకి దిగాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలతో షెడ్యూలు వచ్చిన వెంటనే సమావేశాలు ఏర్పాటు చేసి విధివిధానాలు తెలియజేయాలని ఆదేశించారు.
సమావేశాలకు, ప్రచారం చేసుకొనే వాహనాలకు అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. సువిధ యాప్ ద్వారా రిటర్నింగు అధికారులకు దరఖాస్తు చేయవచ్చని సూచించారు. పోస్టల్ బ్యాలెట్లపై స్పష్టమైన సమాచారం అందించాలని రిటర్నింగు అధికారులను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ వేసే విధానంపై శిక్షణ ఇవ్వాలన్నారు. శిక్షణకు వినియోగించే ఈవీఎంలను సైతం స్ట్రాంగ్‌రూమ్‌లలో పెట్టాలని సూచించారు. స్ట్రాంగ్‌రూమ్, రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద సీసీ కెమెరాలు ఉండాలని ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు మాట్లాడుతూ ఎన్నికలకు అవసరమైన సామగ్రి పూర్తి స్థాయిలో ప్రతి విభాగం కలిగి ఉండాలన్నారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన అనంతరం అభ్యర్థులు, పార్టీల నుంచి వచ్చే ఎస్‌ఎంఎస్, ఐవీఆర్ ఎస్ కాల్స్, ఎఫ్‌ఎం రేడియో, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తదితర విధాలుగా వచ్చే సమాచారాన్ని పరిశీలించాలని ఆదేశించారు. స్థానికంగా రిటర్నింగు అధికారులు ప్రింటింగ్ ప్రెస్‌లు, కేబుల్ ఆపరేటర్లతో సమావవేశాలు నిర్వహించి విధివిధానాలు తెలియజేయాలన్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్–2 పి.రజనీకాంతారావు, ఏఎస్పీ టి.పనసారెడ్డి, రిటర్నింగు అధికారులు లోతేటి శివశంకర్, ఎం.వి.రమణ, గణపతి, మహాలక్ష్మి, భాస్కరరెడ్డి, దొర, పి. అప్పారావు, రఘురాం, జయదేవి, ఎస్‌డీ అనిత, నోడల్ అధికారులు టి.కైలాష్ గిరీశ్వర్, ఎ.కళ్యాణ చక్రవర్తి, హెచ్.కూర్మారావు, ఎల్.రమేష్, ఎం.మోహనరావు, వి.వి.లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment