సాక్షి,ఆదిలాబాద్ : కంది పంట మార్కెట్‌కు వచ్చే సమయం సమీపిస్తున్నా ఇంకా కొనుగోలు తేదీలు ఖరారు కాలేదు. మొన్నటివరకు కొనుగోలు కేంద్రాల విషయంలో తకరారు నెలకొగా, ఇప్పుడు కేంద్రాలు ఖరారు చేసినా కందులను ఎప్పటినుంచి కొంటారనే విషయంలో స్పష్టత లేదు. ఇప్పటికే చేలల్లో కంది కోతలు ప్రారంభమయ్యాయి. పక్షం రోజుల్లో పంట రైతుల చేతికొచ్చే పరిస్థితి ఉంది. ప్రభుత్వం కందులను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ప్రకటించినా తేదీలు ఖరారు చేయకపోవడంతో పంటను మార్కెట్‌కు తీసుకొచ్చే విషయంలో రైతుల్లో అయోమయం నెలకొంది. వెంటనే కొనుగోలు తేదీలను ప్రకటించి రైతులకు న్యాయం చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
2.43 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా..
జిల్లాలో కంది పంట సాధారణ విస్తీర్ణం 16,338 హెక్టార్లు కాగా ఈ ఏడాది 19,447 హెక్టార్లలో సాగైంది. హెక్టారుకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి పట్టుకున్నా సుమారు 2లక్షల 43వేల 090 క్వింటాల్ల దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు. గతేడాది జిల్లాలో 24వేల హెక్టార్లలో పంట సాగు కాగా, రూ.142 కోట్ల విలువైన 2,83,097 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేయడం జరిగింది. గతేడాది ఆదిలాబాద్, తాంసి, ఇచ్చోడ, బోథ్, ఇంద్రవెల్లి, జైనథ్‌లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాఫెడ్, ఎఫ్‌సీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టారు. 14,642 మంది రైతులు పంటలను విక్రయించినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. డబ్బులు సైతం పూర్తిస్థాయిలో చెల్లించినట్లు తెలిపారు. ఈఏడాది పంట సాగు విస్తీర్ణం సుమారు 5వేల హెక్టార్లు తగ్గిపోయింది. దిగుబడి కూడా తగ్గే అవకాశాలున్నాయి. కాగా ఈసారి ఆదిలాబాద్, బండల్‌నాగాపూర్, తాంసి, ఇచ్చోడ, బోథ్, ఇంద్రవెల్లి, జైనథ్‌లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
మద్దతు ధర దక్కేనా..
క్వింటాలు కందులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర రూ.5450 ప్రకటించాయి. గతేడాది కనీస మద్దతు ధర రూ.5050 ఉంది. ఈ ఏడాది మద్దతు ధరను పెంచినా రాష్ట్ర ప్రభుత్వం రూ.225 బోనస్ కుదించడంతో కంది రైతులకు ధర తగ్గిపోయింది. గతేడాది పంటను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. నిబంధనల పేరిట రైతులకు మొండి చేయి చూపించిన యంత్రాంగం, రైతుల ముసుగులో వచ్చిన దళారులకు ప్రయోజనం కల్పించేలా వ్యవహరించి సొమ్ము చేసుకున్నారన్న విమర్శలు బాహాటంగానే వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి మార్కెట్లో రైతులు నష్టపోకుండా కందుల కొనుగోలు కోసం అధికార యంత్రాంగం సరైన ప్రణాళిక రూపొందించి రైతులకు మద్దతు ధర కల్పిస్తారన్న ఆశ పెట్టుకున్నారు.
త్వరలో కొనుగోలు చేస్తాం
కందుల కొనుగోళ్లకు సంబంధించి తేదీ ఖరారు కాలేదు. జనవరి 12 తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మార్కెట్‌కు ఇంకా కందులు రాలేదు. మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తాం. ఈవిషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – టి.శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి
Comments
Please login to add a commentAdd a comment