చట్ట సభల్లో బీసీ కోటా | TS to urge center for BC quota in Legislatures | Sakshi
Sakshi News home page

చట్ట సభల్లో బీసీ కోటా

Published Mon, Dec 4 2017 2:52 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

TS to urge center for BC quota in Legislatures - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల అమలుకు పార్లమెంటులో చట్టం తేవాలని రాష్ట్రం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని తీర్మానం చేసినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్‌ కావాలని కోరుకుంటున్నాయని, దీన్ని తెలంగాణ డిమాండ్‌గా కేంద్రం ముందు పెడతామన్నారు. రాష్ట్రం నుంచి అఖిలపక్ష కమిటీ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలసి ఈ విషయంపై ఒత్తిడి తెస్తుందని ప్రకటించారు. కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలని, పదోన్నతుల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరతామన్నారు.

బీసీల సంక్షేమం, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్‌ ఆదివారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో సగభాగం కన్నా అధికంగా ఉన్న బలహీన వర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. బీసీల అభ్యున్నతికి ఇప్పటికే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, వారి జీవన ప్రమాణాలు మరింతగా పెరగాలంటే మరిన్ని చర్యలు అవసరమని పేర్కొన్నారు.

అసెంబ్లీలో బీసీలపై చర్చ
బీసీ డిమాండ్లు, అభ్యున్నతి కోసం త్వరలోనే అసెంబ్లీలో ఒకరోజు పూర్తిస్థాయి చర్చ చేపట్టాలని అసెంబ్లీ స్పీకర్‌ను సీఎం కోరారు. బీసీ ప్రజాప్రతినిధులంతా రెండు మూడ్రోజులపాటు సమావేశాలు నిర్వహించుకుని, తమకు ఏం కావాలో నిర్ణయించుకున్న తర్వాత అసెంబ్లీలో చర్చించాలని, ఆ మేరకు అవసరమైన తీర్మానాలు,  చట్టాలు, జీవోలు తేవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వాటిని నూటికి నూరు శాతం చిత్తశుద్ధితో అమలు చేస్తామని ప్రకటించారు.  బీసీ ప్రజాప్రతినిధులు చెప్పిన ప్రకారం అవసరమైన చట్టాలు తేవడానికి, ఉత్తర్వులు జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుత విధానంలో ఏమైనా లోపాలుంటే మార్చుకోవడానికి కూడా తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. అంతిమంగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో బీసీలకు మేలు కలగాలని, వారి భవిష్యత్‌కు మంచి బాటలు పడాలన్నదే తన లక్ష్యమన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వాలు మారినా విధానపరమైన విషయాల్లో స్థిరత్వం ఉంటుందని, కానీ మనదేశంలో విధానపరమైన స్థిరత్వం లేకపోవడం ప్రధానలోపమన్నారు. బీసీల కోసం విధానాలు, పథకాలు రూపకల్పన చేసే సందర్భంలో భవిష్యత్‌లో వాటినెవరూ తొలగించలేనంత పకడ్బందీగా రూపొందించాలన్నారు. బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్‌ ఎలా పనిచేయాలో, స్వయం ఉపాధి పథకాల స్వరూపం ఎలా ఉండాలో సూచించాలన్నారు. రాజకీయాలకతీతంగా బీసీ వర్గాల  ప్రజాప్రతినిధులు అన్ని కులాల అభిప్రాయాలు తీసుకుని.. ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలన్నారు.

బీసీ పారిశ్రామికవేత్తలకు భూముల్లో రిజర్వేషన్‌
‘‘కొన్ని కులాలకు సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో ఇబ్బందులున్నాయి. ప్రభుత్వ లబ్ధి అందుకునే అంశంపై కొన్ని కులాల మధ్య ఘర్షణలున్నాయి. కొన్ని కులాల గుర్తింపునకు సంబంధించిన సమస్యలున్నాయి. ఇలాంటి అన్ని విషయాల్లో ఆచరణీయమైన మార్గాన్ని ప్రజాప్రతినిధులు సూచించాలి’’ అని సీఎం కోరారు. ‘‘బీసీల అభ్యున్నతి కోసం రాష్ట్ర పరిధిలో ఉన్న అన్ని అంశాలపై సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసుకుందాం. బీసీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి టీఎస్‌ఐఐసీ ఇచ్చే భూముల్లో బీసీలకు రిజర్వేషన్‌ కల్పిస్తాం. ఇంకా బీసీలకు ఏం చేయాలో కొత్త పథకాలు రచించండి. అన్ని కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించండి. అందరి అభిప్రాయాలు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి. మీరు ఇచ్చిన నివేదికనే ప్రభుత్వం ఆదేశంగా స్వీకరించి అమలు చేస్తుంది. మీరు చర్చించిన అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చించి అప్పటికప్పుడు విధానపరమైన నిర్ణయాలు ప్రకటిద్దాం. బీసీల విషయంలో రాజకీయాల్లేవు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఒకేలా కోరుకుంటున్నారు. ఉన్నంతలో బీసీల  కోసం ఎంత ఉన్నతంగా పనిచేయగలమన్నదే ప్రధానాంశం. కేవలం ప్రభుత్వమే ఖ్యాతి పొందాలనుకోవడం లేదు. అన్ని పార్టీలు కలసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలని ప్రజలకు చెబుదాం. దీంతో ప్రజలకు కూడా మంచి సందేశం పోతుంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

అమలు చేసే బాధ్యత నాది..
‘‘సమున్నత లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నం. అన్ని వర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ప్రతీ వర్గం ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు రావాలి. ఎవరూ ఆత్మన్యూనతతో ఉండడానికి వీల్లేదు. అంతా ఆత్మవిశ్వాసంతో బతకాలి. అందరికీ అవకాశాలు రావాలి. ఎవరి పెత్తనం కిందో బతకాల్సిన అవసరం లేదు. అందరూ బాగుపడాలి. అందరూ అవకాశాలు పొందాలి. ఇందుకనుగుణంగానే ఇప్పుడు బాటలు పడాలి. అదే బాటలో భవిష్యత్‌ తెలంగాణ నడవాలి. సగానికి పైగా ఉన్న బీసీల కోసం ప్రజాప్రతినిధులు సమయం వెచ్చించి, లోతుగా అధ్యయనం చేసి విధానాలు రూపకల్పన చేయాలి. ఇందులో రాజకీయ ప్రయోజనం లేదు. అన్ని పార్టీల ప్రతినిధులు కలిసి చర్చించండి. సమైక్యంగానే ప్రభుత్వానికి సిఫారసులు ఇవ్వండి. వాటిని అమలు చేసే బాధ్యత నాది. అనుకున్నట్లుగానే తెలంగాణకు మంచి ఆదాయ వనరులున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాలకు కలిపి ఏడాది రూ.1.25 లక్షల కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే అంత ఖర్చు పెడుతున్నాం. ఈ ఖర్చంతా రాష్ట్రంలోని పేదరికాన్ని నిర్మూలించడానికి ఉపయోగపడాలి’’ అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ పెంచుతాం..
‘‘బీసీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. అవి మంచి ఫలితాలు ఇస్తున్నాయి. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో బీసీల కోసం కేవలం 19 రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా 123 స్కూళ్లు స్థాపించుకున్నాం. వీటి ద్వారా 91,520 మంది బీసీ పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుతున్నది. రెసిడెన్షియల్‌ స్కూళ్ల సంఖ్యను ఇంకా పెంచడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిల్లలకు మంచి విద్య అందించడం ద్వారా భావి తరాలకు బంగారు భవిష్యత్‌ ప్రసాదించగలుగుతాం’’ అని సీఎం అన్నారు. బీసీలకు కల్యాణలక్ష్మి, మార్కెట్‌ కమిటీల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. రిజర్వేషన్లతో రాష్ట్రంలో 50 మంది బీసీలకు మార్కెట్‌ చైర్మన్‌ పదవులు లభించాయన్నారు. బీడీ కార్మికులకు భృతి ఇవ్వాలనే నిర్ణయం వల్ల ఎక్కువ మంది బీసీలు, అందులోనూ పద్మశాలిలకు ఎక్కువ మేలు కలిగిందన్నారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ఆర్థిక సహాయం అందించే పథకాలకు రూపకల్పన చేయాలని కోరారు.

కుల వృత్తులకు ప్రోత్సాహం..
‘‘చెప్పులు కుట్టుకునే వృత్తి తప్ప మిగతా వృత్తిదారులంతా బీసీలేæ. చేతి వృత్తులను నమ్ముకుని బతుకుతున్నారు. వారి వృత్తిలో వారికి నైపుణ్యం ఉన్నా సరైన ప్రోత్సాహం, ఆర్థిక చేయూత లేక వారు సతమతమవుతున్నారు. అందుకే మనుగడ సాధ్యమయ్యే కుల వృత్తులను, చేతి వృత్తులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాం. సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు మూసివేయడంతో గీత కార్మికులు ఉపాధి కోల్పోయారు. తెలంగాణ వచ్చిన వెంటనే కల్లు దుకాణాలు పునరుద్ధరించాం. దీనివల్ల హైదరాబాద్‌లో ఉన్న వారికే కాకుండా గ్రామాల్లోని గీత కార్మికులకు కూడా మేలు కలిగింది. చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. రూ.1,200 కోట్ల వ్యయంతో కార్యక్రమాలు అమలు చేస్తోంది. పవర్‌లూమ్‌లను వందశాతం ప్రభుత్వ ఖర్చుతో ఆధునీకరిస్తున్నాం. 50 శాతం సబ్సిడీతో నూలు, రసాయనాలు అందిస్తున్నాం. నేత కార్మికులు తయారు చేసిన దుస్తులు, ఇతర ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్కుతో.. వలసలు పోయిన వారు తిరిగి సొంత గడ్డకు వస్తున్నారు. సిరిసిల్లలో కాటన్‌ టు గార్మెంట్‌ పద్ధతిలో వస్త్ర పరిశ్రమను విస్తరిస్తున్నాం. 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. పథకం ప్రారంభించిన నాలుగు నెలల్లోనే 29.50 లక్షల గొర్రెల పంపిణీ జరిగింది. పంపిణీ చేసిన గొర్రెలకు మరో 10 లక్షల పిల్లలు పుట్టాయి. ఇప్పటికి లక్షా 41 వేల కుటుంబాలకు గొర్రెల పంపిణీ జరిగింది. మొత్తం 7.30 లక్షల కుటుంబాలకు గొర్రెలు పంపిణీ చేస్తాం. దేశంలోకెల్లా తెలంగాణలోని గొర్రెల కాపరులే అత్యంత ధనవంతులు అవుతారు. గొల్ల, కుర్మల జీవితంలో గొప్ప మార్పు రాబోతోంది. 100 శాతం సబ్సిడీపై చేపల పంపిణీ చేపట్టాం. మత్స్యకారులకు ఉపయోగకరంగా ఉండేలా రూ.5 వేల కోట్లతో మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేస్తున్నాం. రజకులకు అవసరమైన చేయూత అందిస్తాం. నాయీ బ్రాహ్మణులకు ఆధునిక సెలూన్లు ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తాం. విశ్వ బ్రాహ్మణుల కుల వృత్తులను ప్రోత్సహించడానికి రూ.250 కోట్లతో కార్యక్రమాలు అమలు చేస్తాం’’ అని సీఎం ప్రకటించారు. ఈ సమావేశంలో శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి డిప్యూటీ చైర్మన్‌ విద్యాసాగర్, మంత్రులు జోగు రామన్న, ఈటల రాజేందర్, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ప్రభుత్వ విప్‌లు బోడకుంటి వెంకటేశ్వర్లు, గంప గోవర్ధన్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీలు కె.కేశవరావు, డి.శ్రీనివాస్, రాపోలు ఆనంద భాస్కర్, బూర నర్సయ్య గౌడ్, బీబీ పాటిల్, అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

ఎవరేమన్నారు?
బీసీ సంక్షేమంపై సీఎంతో సమావేశమైన తర్వాత పలువురు సభ్యులు మీడియాతో అభిప్రాయాలను పంచుకున్నారు. అవి వారి మాటల్లోనే...

అన్ని వర్గాలకూ ప్రాధాన్యం : రాజేందర్, ఆర్థిక మంత్రి
ఉమ్మడి రాష్ట్రంలో బీసీ సమస్యలపై గళమెత్తితే అధికార పార్టీ అహంకారంతో స్పందించింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకుని బీసీ ప్రణాళిక రూపొందిస్తున్నాం. పది రకాల అంశాలను ప్రాతిపదికన తీసుకుంటున్నాం. ఉత్పాదక కులాలు, సేవా ఆధారిత కులాలు, ఆదరణ లేని కులాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే ప్రణాళిక దేశానికే ఆదర్శంగా నిలవాలి. మరో రెండ్రోజుల పాటు ఇదే హాల్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చా కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం ప్రతిపాదనలను సీఎంకు నివేదిస్తాం. – ఈటల

అన్ని వర్గాలకు న్యాయం : జోగు రామన్న, బీసీ మంత్రి
బీసీ కులాల్లో కిందిస్థాయిలో ఉన్న వర్గాలకూ న్యాయం జరగాలి. కులాల వారీగా స్థితిగతులను అంచనా వేసి ప్రతిపాదనలు రూపొందిస్తాం. ఫెడరేషన్ల విషయంలో ప్రత్యేక చర్చ నిర్వహించి తగిన విధంగా వాటిని అభివృద్ధి చేస్తాం. గతంలో ఏ ప్రభుత్వం కూడా బీసీల అభివృద్ధికి శ్రద్ద చూపలేదు. కొత్త రాష్ట్రంలో అణగారిన వర్గాలను ఆర్థిక, సామాజిక, రాజకీయంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం ఈ మేరకు నిర్ణయించారు. 

బీసీ ఉప ప్రణాళిక తేవాలి : ఆర్‌.కృష్ణయ్య, ఎమ్మెల్యే
బీసీలు సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకంగా ఉప ప్రణాళిక తీసుకు రావాలి. ఈ డిమాండ్‌ గతంలో ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించాం. తాజా చర్చలో సీఎం సానుకూలంగా స్పందించారు. సభ్యులంతా ఏకాభిప్రాయంతో వస్తే ఎన్ని ప్రతిపాదనలైనా ఏకపక్షంగా ఆమోదిస్తామని చెప్పడం సంతోషకరం. బీసీల సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించి ప్రతిపాదనలు రూపొందిస్తాం. ముఖ్యంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్‌లకు నిధుల కేటాయింపుతో పాటు రుణాల వితరణపైనా చర్చించాలి. 12 ఫెడరేషన్లకు కూడా బడ్జెట్‌ కేటాయించాలి. కుల సంఘాలతో చర్చించి వారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బీసీలకున్న క్రీమీలేయర్‌ను తొలగించాలి.

రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి : కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
బీసీ సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, ఆర్థిక, సామాజిక, విద్యాపరమైన అభివృద్ధికి నిధులిచ్చి ఖర్చు చేయాలనే అంశాన్ని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించా. దానికి అనుగుణంగా సీఎం స్పందించి ఒకరోజు బీసీ సంక్షేమంపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి చర్చిద్దామని చెప్పారు. రాష్ట్ర జనాభాలో 54 శాతం బీసీలున్నారు. బీసీలు మరింత వేగంగా అభివృద్ధి కావాలంటే రాజకీయంగా ఎదగాలి. అందుకు రాజకీయ రిజర్వేషన్లు తీసుకురావాలి. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీ విద్యార్థులకు కూడా పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలి.

ఫెడరేషన్లతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి : ఆకుల లలిత, ఎమ్మెల్సీ
ప్రస్తుతమున్న బీసీ ఫెడరేషన్‌లలో చాలావరకు పనిచేయడం లేదు. వీటన్నిటినీ కలిపి ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి. నిధులు వేరుగా కేటాయించినా పనితీరు వేగవంతమయ్యేందుకు కార్పొరేషన్‌ కిందకు తేవాలి. బీసీ కార్పొరేషన్‌ ద్వారా ఇచ్చే రుణాల పరిమితిని పెంచాలి. గ్రామ స్థాయిలో కులవృత్తులకు ఆర్థిక చేయూత ఇవ్వాలి.

మండలానికో గురుకులం : శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే
అభివృద్ధిలో కీలకం విద్యే. అందులో భాగంగా బీసీ పిల్లలందరికీ చదువును మరింత చేరువ చేయాలి. అందుకు ప్రతి మండలంలో ఒక గురుకులాన్ని తెరవాలి. ఒకేసారి సాధ్యం కాదు కాబట్టి ఏటా వంద చొప్పున ప్రారంభిస్తే మూడు, నాలుగేళ్లలో అన్ని మండల కేంద్రాల్లో గురుకులాలు అందుబాటులోకి వస్తాయి. కొన్ని కులాలు లెక్కలో లేవు. వాటికి కుల ధ్రువీకరణ అందని పరిస్థితి నెలకొంది. వాటిని గుర్తించేందుకు బీసీ కమిషన్‌ చర్యలు చేపట్టాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement