legislatures
-
Hindustan Times Leadership Summit: కోర్టు తీర్పులను చట్టసభలు పక్కన పెట్టజాలవు
న్యూఢిల్లీ: కోర్టు తీర్పుల విషయంలో చట్టసభలు ఏం చేయగలవు, ఏం చేయలేవనే విషయంలో స్పష్టమైన విభజన రేఖ ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ‘‘తీర్పులు ఏమైనా చట్టపరమైన లోపాలను ఎత్తి చూపితే వాటిని సవరించేందుకు, సరిచేసేందుకు చట్టసభలు కొత్త చట్టాలను చేయవచ్చు. అంతే తప్ప తీర్పులు తప్పనే అభిప్రాయంతో వాటిని నేరుగా, పూర్తిగా పక్కన పెట్టేయజాలవు’’ అని స్పష్టం చేశారు. శనివారం ఇక్కడ హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్‌లో ఆయన మాట్లాడారు. పలు అంశాలపై తీర్పులిచ్చేటప్పుడు ప్రభుత్వ విభాగాల మాదిరిగా వాటిపై సమాజం ఎలా స్పందిస్తుందని న్యాయమూర్తులు ఆలోచించరన్నారు. వారు రాజ్యాంగ నైతికతకు కట్టుబడి పని చేస్తారే తప్ప ప్రజల నైతికతకు కాదని చెప్పారు. మన దేశంలో జడ్జిలకు ఎన్నిక జరగదన్నది లోపం కాదని, మన వ్యవస్థ తాలూకు బలమని సీజేఐ అన్నారు. ‘‘మన సుప్రీంకోర్టు ప్రజల కోర్టు. అమెరికా సుప్రీంకోర్టు ఏటా పరిష్కరించే కేసుల సంఖ్య కేవలం 80. కానీ మన సుప్రీంకోర్టు ఈ ఏడాది ఇప్పటికే ఏకంగా 72 వేల కేసులను పరిష్కరించింది. ప్రజలకు చేరువయే లక్ష్యంతో సుప్రీంకోర్టు తీర్పులను భారతీయ భాషల్లోకి అనువదింపజేస్తున్నాం. అలా ఇప్పటిదాకా 31 వేల తీర్పులను అనువదించారు’’ అని చెప్పారు. -
ఎమ్మెల్సీగా మధుసూదనాచారి ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా నియమితులైన సిరికొండ మధుసూదనాచా రి ఆదివారం రాష్ట్ర శాసనమండలి చైర్మన్ చాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు మధుసూదనాచారి గన్ పార్కులోని అమరవీరుల స్థూపాన్ని సందర్శించి నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు. -
అది వారి హక్కు! వేసే ‘ముష్టి’ కాదు!!
జనాభాలో 50 శాతంగా ఉన్న మహిళలకు చట్టసభల్లో ‘ముష్టి’ 30 శాతం సీట్లు ఇవ్వడానికి కూడా పాలకులకు చేతులు రావడం లేదు. ఈ నేపథ్యంలో మహిళలకు న్యాయస్థానాల్లోనూ 50 శాతం దక్కవలసిందేనని, ఇది ‘దానం’ కాదు ‘మహిళల హక్కు’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ వక్కాణించారు. అయితే, భారత సమాజం ప్రగతిశీలకం కావడానికి ఏ మార్పుల్ని ఆశిస్తున్నామో, ఆ మార్పులకు యువ సీఎం వైఎస్ జగన్ నవరత్నాల దీప్తితో ఆంధ్రప్రదేశ్‌లో పెక్కు ప్రజాహిత సంస్కరణల ద్వారా శ్రీకారం చుట్టి ప్రశంసలు పొందుతున్నారని మరచిపోరాదు. ఈ సంస్కరణలు అట్టడుగు పేదవర్గాలకూ, నిరుపేద మహిళలకూ సానుకూలమైన నిష్పక్షపాత సంస్కరణలుగా కొనసాగుతున్నాయని గుర్తించాలి. భర్త బూర్జువాగా, భార్య శ్రమజీవి అయిన కార్మికురాలిగా ఉంటున్న స్థితి పోవాలంటే ఆకాశంలో సగానికి అన్నింటిలోనూ సగభాగం దక్కాల్సిందే మరి! భిన్నత్వంలో ఏకత్వమంటే అర్థం ఏమిటి? భిన్నత్వమంటే అసమానతా కాదు, ఒకర్ని తక్కువగాను, ఇంకొకర్ని ఎక్కువగానూ చూడడం కాదు. ప్రకృతి ముందు ఏదీ, ఎవరూ ఒకరికన్నా ఎక్కువా కాదు, మరొకరు తక్కువా కాదు గదా! ఆ లెక్కన నిప్పు ఎక్కువా, నీరు ఎక్కువా? ప్రకృతిలోని పక్షులు, సీతాకోక చిలు కలు, జంతువులు, చీమలు, ఏనుగుల్లో ఏది ఎక్కువ, ఏది తక్కువ? అలాగే సముద్రాలు, కొండలు, గ్రామాల్లో ఏది ఎక్కువ, ఏది తక్కువ? చలికాలం, వేసవి, వానాకాలం, వసంత రుతువుల్లో ఏది గొప్పది, ఏది కాదు? ఒక్కముక్కలో పగలు, రాత్రి, ఏది ఎక్కువ, ఏది తక్కువ? అలాగే ఈ కుటుంబాలలో కూడా ప్రతి ఒక్క పురుషునికి, స్త్రీకి ఎవరి స్థానం వారిదే, ఎవరి వ్యక్తిత్వం వారిదే. అందువల్ల సమా జంలో సమానన్యాయం, సమానత్వం లేకపోతే సామూహిక సద్వర్తనం దుర్లభం. అందువల్ల విభిన్న వ్యక్తుల మధ్య ఐక్యత అనేది పరస్పర న్యాయం, సదవగాహన, గౌరవం ఉన్నప్పుడే సాధ్యం. 1970లలో మహిళా హక్కుల కోసం నిరంతరం, పోరుసల్పుతూ వచ్చిన తొలి భారత మహిళా నాయకులలో ఒకరుగా సామాజిక శాస్త్ర వేత్త కమలా భాసిన్ సుప్రసిద్ధురాలు. ఆమె వెలిబుచ్చిన భావాలతో ఏకీభవిస్తూ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ గత కొద్ది రోజులుగా దేశంలోని మహిళా హక్కుల రక్షణ గురించి నొక్కి చెబుతున్నారు. వలస పాలనావశేషంగా మిగిలి పోయిన భారతదేశ ప్రస్తుత న్యాయవ్యవస్థను స్వతంత్ర భారత న్యాయవ్యవస్థగా రూపొందించుకోవలసిన అవసరం గురించి ఆయన ప్రస్తావించడం ప్రజాబాహుళ్యానికి ఎంతో ఉపయోగకారి. గత నెల చీఫ్ జస్టిస్ చేసిన రెండు ప్రకటనలూ, నూతన మార్గంలో దేశ ప్రగతిని ఆశిస్తున్న అభ్యు దయ శక్తులలో మరింత చైతన్యానికి దోహదపడగల అవకాశం ఉంది. దేశం 75 ఏళ్ళ అమృతోత్సవం జరుపుకుంటున్నవేళ, దేశ చట్టసభలలో ఇన్నేళ్లుగా జనాభాలో 50 శాతంగా ఉన్న మహిళలకు కనీసం ‘ముష్టి’ 30 శాతం సీట్లు ఇవ్వడానికి కూడా ఈ రోజుకీ పాల కులకు చేతులు రాని దుస్థితిలో ప్రధాన న్యాయమూర్తి దేశంలోని మహిళలందరికీ న్యాయస్థానాల్లో 50 శాతం దక్కవలసిందేనని, ఇది ‘దానం’ కాదు ‘మహిళల హక్కు’ అని స్థిరంగా ప్రకటించారు! దేశంలోని ప్రస్తుత న్యాయవ్యవస్థను సామ్రాజ్యవాద వలస పాల కులు ప్రవేశపెట్టి, స్వతంత్ర భారత న్యాయవ్యవస్థ పురోగతికి అవ రోధం కలిగించి ‘భారతీయ న్యాయవ్యవస్థ’గా రూపొందకుండా చేశారు. దాని ఫలితంగా భారత సమాజం ఆచరణలో ఎదుర్కొం టున్న పెక్కు సమస్యలను చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ అనేక ఉదాహర ణలతో ప్రజల దృష్టికి, పాలకుల దృష్టికి తీసుకువచ్చారు. ‘‘నేడు ఇన్నేళ్ళ స్వాతంత్య్రం తరువాత కూడా దేశంలోని సామాన్య పౌరులు తమ అభిప్రాయాలకు కోర్టులలో విలువలేదని భావిస్తున్నారు. వాద ప్రతివాదాలు అంతూ పొంతూ లేకుండా సుదీర్ఘంగా కొనసాగడం, సామాన్య కక్షిదారులకు ఖర్చులు తడిసిమోపడవుతుండడం, పైగా ప్రసంగాలు వారి మాతృభాషలో కాకుండా ఇంగ్లిష్‌లో కొనసాగు తూండడం, ఇక తీర్పులైతే సుదీర్ఘంగా సాగడం లేదా అర్థం కాని అతి సాంకేతిక పదజాలంతో ఉండడం వంటి కారణాలతో ఇవి రొడ్డ కొట్టుడుగా తయారవుతూ వచ్చాయి.’’ అందువల్ల వలస పాలనావ శేషంగా సంక్రమించిన ఈ మైకం నుంచి మన న్యాయస్థానాలు ఇక నైనా మేలుకొని మన న్యాయవ్యవస్థ దేశీయ ప్రయోజనాల రక్షణకు నడుం కట్టవలసిన సమయం వచ్చిందని ప్రధాన న్యాయమూర్తి (19–9–2021) వక్కాణించారు. మన కోర్టుల్ని చూసి, న్యాయమూర్తులను చూసి న్యాయాన్ని ఆశించి వచ్చే పేదలు బెదిరిపోని పరిస్థితులు రావాలనీ, పేదసాదలకు నిర్మొహమాటంగా వాస్తవాల్ని ప్రకటించుకునే భాగ్యం కలగాలనీ ఆయన ఆశిస్తున్నారు! ఎందుకంటే, ఈ రోజు దాకా మనం అనుస రిస్తూ, ఆచరిస్తున్న విధానాలు, న్యాయసూత్రాలూ వలస పాలనా రోజుల నాటివి కనుకనే ఆచరణలో స్వతంత్ర భారత సమాజ పౌరుల వాస్తవ పరిస్థితులకు పరమ విరుద్ధమని ఆయన భావిస్తున్నారు. మహిళా హక్కుల పరిరక్షణ కోసం సరికొత్తగా ఆయన మరో బాంబు వదిలారు. దేశ న్యాయ వ్యవస్థలో కూడా 50 శాతం స్థానాలు మహిళ లకే ఉండాలని, అది వారి హక్కేగాని ‘దానధర్మం’ కాదని మొదటి సారిగా ప్రకటించడమే కాదు... వేలాది సంవత్సరాలుగా అణచివేతకు గురైన మహిళలు ఈ హక్కుకు అర్హులని చెబుతూ శాస్త్రీయ సోషలిజం పితామహుడు, కమ్యూనిస్టు మానిఫెస్టో సిద్ధాంత కర్త కారల్‌మార్క్స్ ప్రపంచ కార్మిక లోకాన్ని చైతన్యవంతుల్ని చేస్తూ, ‘ఏకమై ఉద్యమిం చండి మీకు సంకెళ్ళు తప్ప కోల్పోయేదేమీలేదు...’ అన్న చరిత్రాత్మక సందేశాన్ని గుర్తు చేశారు. ప్రపంచ మహిళల్లారా ఐక్యంగా ఉద్యమిం చండి, మీరు కోల్పోయేదేమీ లేదు, సంకెళ్లు తప్ప అని మహిళల పరంగా ఉద్బోధించడం ఓ కొత్త మలుపు. ఈ సందర్భంగా ఒక సమకాలీన సత్యాన్ని మరుగున పడకుండా ఉదాహరించాల్సిన అవసరం ఉంది. ప్రధాన న్యాయమూర్తి భారత సమాజం ప్రగతిశీలం కావడానికి ఏ మార్పుల్ని ఆశిస్తున్నారో, ఆ మార్పులకు ఇప్పటికే దేశంలో ఇతర రాష్ట్రాలకన్నా ముందుగానే ముందుచూపుతో యువ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవ రత్నాల దీప్తితో ఆంధ్రప్రదేశ్‌లో పెక్కు ప్రజాహిత సంస్కరణల ద్వారా శ్రీకారం చుట్టి, దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నారని మరచి పోరాదు. ఈ సంస్కరణలు కులాలతో, మతాలతో పార్టీలు, ప్రాంతా లతో సంబంధం లేకుండా సకల ప్రజా బాహుళ్యంలోని అట్టడుగు పేదవర్గాలకూ, నిరుపేద మహిళలకూ సానుకూలమైన నిష్పక్షపాత సంస్కరణలుగా నమోదవుతున్నాయని మరిచిపోరాదు. ఈ సంస్కరణలు మార్క్స్, అంబేడ్కర్, మౌలానా ఆజాద్ భావాల మేలుకలయిక. అందుకే మార్క్స్, ఎంగెల్స్‌లు అన్నారు. ‘ధనిక వర్గసమాజపు కుటుంబ వ్యవస్థలో భర్త ఆనే వాడు భార్యపై దాష్టీకం చెలాయించగల ఒక బూర్జువా అయితే, భార్య శ్రమజీవి అయిన ఒక కార్మికురాలు (ప్రొలిటేరియట్). ఎందుకంటే, ధనికవర్గ సామాజిక వ్యవస్థలో న్యాయచట్టాలనేవి, ఆ వ్యవస్థపై పెత్తనం ఏ వర్గం చెలాయిస్తుం టుందో ఆ వర్గ ప్రయోజనాలనే తు.చ. తప్ప కుండా కాపాడటానికి ఎలాంటి ‘కొత్త’కి చోటివ్వని న్యాయచట్టాన్నే కోరుకుంటాయి. అందుకే ‘ప్రజల హక్కు’ అన్న భావననే అది సహించదు పైగా చంపేస్తుంది’. కనుకనే ‘పెట్టుబడి అనేది ఇతరుల శ్రమ ఆధారంగా బతకజూసే నిర్జీవ పదార్థం. శ్రమజీవుల శ్రమపై బతికేదే పెట్టుబడి. అలా ఎన్నాళ్లు బతికితే అన్నాళ్లూ ఇతరుల శ్రమను దోచుకుని బలుస్తూనే ఉంటుం ద’ని మార్క్స్ సూత్రీకరించారు. అందుకే ఆయనను ఆధునిక అరి స్టాటిల్ అన్నారు. మానవుణ్ణి మార్క్స్ మొత్తం తాత్విక ప్రపంచానికే కేంద్ర బిందువుగా చేశాడు. ఇంతవరకు తత్వశాస్త్రజ్ఞులు ప్రపంచాన్ని భిన్న కోణాల నుంచి రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మన కర్తవ్యం మానవుణ్ణి తాత్వికకోణానికి కేంద్ర బిందువును చేసి యావత్తు మానవాళిని ఉన్నత స్థానంలో నిలిపి మానవ ప్రగతికి అతడినే మూల కారణం చేయాలి. అదొక్కటే... స్వార్థపరులు మాన వాళి అణచివేతకు ఎక్కుపెట్టిన దుష్టశాసనాలను బదాబదులు చేయ గల ‘పాశుపతాస్త్రం’ అని మార్క్స్ 150 ఏళ్లకు ముందే ప్రవచించాడు. ఆ సంగతి మరవరాదు. ‘మహిళా విమోచన’ అనేది యావత్తు మానవాళి స్వేచ్ఛకోసం వేసే తొలి అడుగు అని మార్క్స్ నిర్వచించారు. ఈ సత్యాన్ని మనం గ్రహించడానికి ఏళ్లూ పూళ్లూ గడిపినా దేశ రాజకీయ (వి)నాయకులకు మాత్రం నేటికీ మనసొప్పడం లేదు. ఎందుకని? ‘పుచ్చిపోతున్న విత్త నాలను బతికించలేమ’న్నది సామెత. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
చట్టసభల గౌరవం పెంచాలి
సాక్షి, బనశంకరి(కర్ణాటక): మంచి నడవడికతో చట్టసభల గౌరవం పెంచాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపైనే ఉందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయన శనివారం బెంగళూరులో విధానసౌధలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సభా గౌరవం పెంచడంలో ప్రజాప్రతినిధుల పాత్ర అపారమైనదన్నారు. ఏదైనా చట్టం తీసుకువచ్చే బాధ్యత ప్రభుత్వనిదే. స్పీకర్ దీనిపై చర్చ జరిగేలా చూసుకోవాలి అని చెప్పారు. తరచూ చట్టసభల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడటం పట్ల స్పీకర్ స్పందిస్తూ సభను సజావుగా నడిపించే బాధ్యత సభాపతిదేనన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టంపై నివేదిక.. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టానికి సంబంధించి రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి నేతృత్వంలోని కమిటీ నివేదిక అందజేసిందని, దీనిపై ఈ నెల 26 నుంచి 28 వరకు సిమ్లాలో జరిగే సమ్మేళనంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. స్పీకర్ పరిధి, నిబంధనల్లో స్పష్టత, ఏ కాల పరిమితిలోగా చర్యలు తీసుకోవాలనేదానిపై ఇందులో నియమావళి ఉంటుందని చెప్పారు. చదవండి: న్యాయమూర్తులకు నైతికతే కీలకం -
చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలి
-
‘చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి’
-
‘చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి’
సాక్షి, ఢిల్లీ: మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్యసభలో మహిళలపై చర్చ జరిగింది. ఈ చర్చలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. దేశంలో వరకట్న నిషేధ చట్టం సరిగ్గా అమలు కావడం లేదని తెలిపారు. దీనిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాక చట్ట సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గర్భంలోనే ఆడ శిశువుల అబార్షన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ విజయసాయి రెడ్డి కోరారు. -
చట్ట సభల్లో బీసీ కోటా
-
చట్ట సభల్లో బీసీ కోటా
సాక్షి, హైదరాబాద్ : బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల అమలుకు పార్లమెంటులో చట్టం తేవాలని రాష్ట్రం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని తీర్మానం చేసినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాయని, దీన్ని తెలంగాణ డిమాండ్‌గా కేంద్రం ముందు పెడతామన్నారు. రాష్ట్రం నుంచి అఖిలపక్ష కమిటీ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలసి ఈ విషయంపై ఒత్తిడి తెస్తుందని ప్రకటించారు. కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలని, పదోన్నతుల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరతామన్నారు. బీసీల సంక్షేమం, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ ఆదివారం అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో సగభాగం కన్నా అధికంగా ఉన్న బలహీన వర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. బీసీల అభ్యున్నతికి ఇప్పటికే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, వారి జీవన ప్రమాణాలు మరింతగా పెరగాలంటే మరిన్ని చర్యలు అవసరమని పేర్కొన్నారు. అసెంబ్లీలో బీసీలపై చర్చ బీసీ డిమాండ్లు, అభ్యున్నతి కోసం త్వరలోనే అసెంబ్లీలో ఒకరోజు పూర్తిస్థాయి చర్చ చేపట్టాలని అసెంబ్లీ స్పీకర్‌ను సీఎం కోరారు. బీసీ ప్రజాప్రతినిధులంతా రెండు మూడ్రోజులపాటు సమావేశాలు నిర్వహించుకుని, తమకు ఏం కావాలో నిర్ణయించుకున్న తర్వాత అసెంబ్లీలో చర్చించాలని, ఆ మేరకు అవసరమైన తీర్మానాలు, చట్టాలు, జీవోలు తేవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వాటిని నూటికి నూరు శాతం చిత్తశుద్ధితో అమలు చేస్తామని ప్రకటించారు. బీసీ ప్రజాప్రతినిధులు చెప్పిన ప్రకారం అవసరమైన చట్టాలు తేవడానికి, ఉత్తర్వులు జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుత విధానంలో ఏమైనా లోపాలుంటే మార్చుకోవడానికి కూడా తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. అంతిమంగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో బీసీలకు మేలు కలగాలని, వారి భవిష్యత్‌కు మంచి బాటలు పడాలన్నదే తన లక్ష్యమన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వాలు మారినా విధానపరమైన విషయాల్లో స్థిరత్వం ఉంటుందని, కానీ మనదేశంలో విధానపరమైన స్థిరత్వం లేకపోవడం ప్రధానలోపమన్నారు. బీసీల కోసం విధానాలు, పథకాలు రూపకల్పన చేసే సందర్భంలో భవిష్యత్‌లో వాటినెవరూ తొలగించలేనంత పకడ్బందీగా రూపొందించాలన్నారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్ ఎలా పనిచేయాలో, స్వయం ఉపాధి పథకాల స్వరూపం ఎలా ఉండాలో సూచించాలన్నారు. రాజకీయాలకతీతంగా బీసీ వర్గాల ప్రజాప్రతినిధులు అన్ని కులాల అభిప్రాయాలు తీసుకుని.. ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలన్నారు. బీసీ పారిశ్రామికవేత్తలకు భూముల్లో రిజర్వేషన్ ‘‘కొన్ని కులాలకు సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో ఇబ్బందులున్నాయి. ప్రభుత్వ లబ్ధి అందుకునే అంశంపై కొన్ని కులాల మధ్య ఘర్షణలున్నాయి. కొన్ని కులాల గుర్తింపునకు సంబంధించిన సమస్యలున్నాయి. ఇలాంటి అన్ని విషయాల్లో ఆచరణీయమైన మార్గాన్ని ప్రజాప్రతినిధులు సూచించాలి’’ అని సీఎం కోరారు. ‘‘బీసీల అభ్యున్నతి కోసం రాష్ట్ర పరిధిలో ఉన్న అన్ని అంశాలపై సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసుకుందాం. బీసీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి టీఎస్ఐఐసీ ఇచ్చే భూముల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం. ఇంకా బీసీలకు ఏం చేయాలో కొత్త పథకాలు రచించండి. అన్ని కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించండి. అందరి అభిప్రాయాలు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి. మీరు ఇచ్చిన నివేదికనే ప్రభుత్వం ఆదేశంగా స్వీకరించి అమలు చేస్తుంది. మీరు చర్చించిన అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చించి అప్పటికప్పుడు విధానపరమైన నిర్ణయాలు ప్రకటిద్దాం. బీసీల విషయంలో రాజకీయాల్లేవు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఒకేలా కోరుకుంటున్నారు. ఉన్నంతలో బీసీల కోసం ఎంత ఉన్నతంగా పనిచేయగలమన్నదే ప్రధానాంశం. కేవలం ప్రభుత్వమే ఖ్యాతి పొందాలనుకోవడం లేదు. అన్ని పార్టీలు కలసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలని ప్రజలకు చెబుదాం. దీంతో ప్రజలకు కూడా మంచి సందేశం పోతుంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు. అమలు చేసే బాధ్యత నాది.. ‘‘సమున్నత లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నం. అన్ని వర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ప్రతీ వర్గం ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు రావాలి. ఎవరూ ఆత్మన్యూనతతో ఉండడానికి వీల్లేదు. అంతా ఆత్మవిశ్వాసంతో బతకాలి. అందరికీ అవకాశాలు రావాలి. ఎవరి పెత్తనం కిందో బతకాల్సిన అవసరం లేదు. అందరూ బాగుపడాలి. అందరూ అవకాశాలు పొందాలి. ఇందుకనుగుణంగానే ఇప్పుడు బాటలు పడాలి. అదే బాటలో భవిష్యత్ తెలంగాణ నడవాలి. సగానికి పైగా ఉన్న బీసీల కోసం ప్రజాప్రతినిధులు సమయం వెచ్చించి, లోతుగా అధ్యయనం చేసి విధానాలు రూపకల్పన చేయాలి. ఇందులో రాజకీయ ప్రయోజనం లేదు. అన్ని పార్టీల ప్రతినిధులు కలిసి చర్చించండి. సమైక్యంగానే ప్రభుత్వానికి సిఫారసులు ఇవ్వండి. వాటిని అమలు చేసే బాధ్యత నాది. అనుకున్నట్లుగానే తెలంగాణకు మంచి ఆదాయ వనరులున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాలకు కలిపి ఏడాది రూ.1.25 లక్షల కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే అంత ఖర్చు పెడుతున్నాం. ఈ ఖర్చంతా రాష్ట్రంలోని పేదరికాన్ని నిర్మూలించడానికి ఉపయోగపడాలి’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచుతాం.. ‘‘బీసీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. అవి మంచి ఫలితాలు ఇస్తున్నాయి. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో బీసీల కోసం కేవలం 19 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా 123 స్కూళ్లు స్థాపించుకున్నాం. వీటి ద్వారా 91,520 మంది బీసీ పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుతున్నది. రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్యను ఇంకా పెంచడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిల్లలకు మంచి విద్య అందించడం ద్వారా భావి తరాలకు బంగారు భవిష్యత్ ప్రసాదించగలుగుతాం’’ అని సీఎం అన్నారు. బీసీలకు కల్యాణలక్ష్మి, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. రిజర్వేషన్లతో రాష్ట్రంలో 50 మంది బీసీలకు మార్కెట్ చైర్మన్ పదవులు లభించాయన్నారు. బీడీ కార్మికులకు భృతి ఇవ్వాలనే నిర్ణయం వల్ల ఎక్కువ మంది బీసీలు, అందులోనూ పద్మశాలిలకు ఎక్కువ మేలు కలిగిందన్నారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ఆర్థిక సహాయం అందించే పథకాలకు రూపకల్పన చేయాలని కోరారు. కుల వృత్తులకు ప్రోత్సాహం.. ‘‘చెప్పులు కుట్టుకునే వృత్తి తప్ప మిగతా వృత్తిదారులంతా బీసీలేæ. చేతి వృత్తులను నమ్ముకుని బతుకుతున్నారు. వారి వృత్తిలో వారికి నైపుణ్యం ఉన్నా సరైన ప్రోత్సాహం, ఆర్థిక చేయూత లేక వారు సతమతమవుతున్నారు. అందుకే మనుగడ సాధ్యమయ్యే కుల వృత్తులను, చేతి వృత్తులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాం. సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు మూసివేయడంతో గీత కార్మికులు ఉపాధి కోల్పోయారు. తెలంగాణ వచ్చిన వెంటనే కల్లు దుకాణాలు పునరుద్ధరించాం. దీనివల్ల హైదరాబాద్‌లో ఉన్న వారికే కాకుండా గ్రామాల్లోని గీత కార్మికులకు కూడా మేలు కలిగింది. చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. రూ.1,200 కోట్ల వ్యయంతో కార్యక్రమాలు అమలు చేస్తోంది. పవర్‌లూమ్‌లను వందశాతం ప్రభుత్వ ఖర్చుతో ఆధునీకరిస్తున్నాం. 50 శాతం సబ్సిడీతో నూలు, రసాయనాలు అందిస్తున్నాం. నేత కార్మికులు తయారు చేసిన దుస్తులు, ఇతర ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. వరంగల్‌లో టెక్స్టైల్ పార్కుతో.. వలసలు పోయిన వారు తిరిగి సొంత గడ్డకు వస్తున్నారు. సిరిసిల్లలో కాటన్ టు గార్మెంట్ పద్ధతిలో వస్త్ర పరిశ్రమను విస్తరిస్తున్నాం. 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. పథకం ప్రారంభించిన నాలుగు నెలల్లోనే 29.50 లక్షల గొర్రెల పంపిణీ జరిగింది. పంపిణీ చేసిన గొర్రెలకు మరో 10 లక్షల పిల్లలు పుట్టాయి. ఇప్పటికి లక్షా 41 వేల కుటుంబాలకు గొర్రెల పంపిణీ జరిగింది. మొత్తం 7.30 లక్షల కుటుంబాలకు గొర్రెలు పంపిణీ చేస్తాం. దేశంలోకెల్లా తెలంగాణలోని గొర్రెల కాపరులే అత్యంత ధనవంతులు అవుతారు. గొల్ల, కుర్మల జీవితంలో గొప్ప మార్పు రాబోతోంది. 100 శాతం సబ్సిడీపై చేపల పంపిణీ చేపట్టాం. మత్స్యకారులకు ఉపయోగకరంగా ఉండేలా రూ.5 వేల కోట్లతో మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేస్తున్నాం. రజకులకు అవసరమైన చేయూత అందిస్తాం. నాయీ బ్రాహ్మణులకు ఆధునిక సెలూన్లు ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తాం. విశ్వ బ్రాహ్మణుల కుల వృత్తులను ప్రోత్సహించడానికి రూ.250 కోట్లతో కార్యక్రమాలు అమలు చేస్తాం’’ అని సీఎం ప్రకటించారు. ఈ సమావేశంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, మంత్రులు జోగు రామన్న, ఈటల రాజేందర్, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్‌లు బోడకుంటి వెంకటేశ్వర్లు, గంప గోవర్ధన్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీలు కె.కేశవరావు, డి.శ్రీనివాస్, రాపోలు ఆనంద భాస్కర్, బూర నర్సయ్య గౌడ్, బీబీ పాటిల్, అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. ఎవరేమన్నారు? బీసీ సంక్షేమంపై సీఎంతో సమావేశమైన తర్వాత పలువురు సభ్యులు మీడియాతో అభిప్రాయాలను పంచుకున్నారు. అవి వారి మాటల్లోనే... అన్ని వర్గాలకూ ప్రాధాన్యం : రాజేందర్, ఆర్థిక మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో బీసీ సమస్యలపై గళమెత్తితే అధికార పార్టీ అహంకారంతో స్పందించింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకుని బీసీ ప్రణాళిక రూపొందిస్తున్నాం. పది రకాల అంశాలను ప్రాతిపదికన తీసుకుంటున్నాం. ఉత్పాదక కులాలు, సేవా ఆధారిత కులాలు, ఆదరణ లేని కులాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే ప్రణాళిక దేశానికే ఆదర్శంగా నిలవాలి. మరో రెండ్రోజుల పాటు ఇదే హాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చా కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం ప్రతిపాదనలను సీఎంకు నివేదిస్తాం. – ఈటల అన్ని వర్గాలకు న్యాయం : జోగు రామన్న, బీసీ మంత్రి బీసీ కులాల్లో కిందిస్థాయిలో ఉన్న వర్గాలకూ న్యాయం జరగాలి. కులాల వారీగా స్థితిగతులను అంచనా వేసి ప్రతిపాదనలు రూపొందిస్తాం. ఫెడరేషన్ల విషయంలో ప్రత్యేక చర్చ నిర్వహించి తగిన విధంగా వాటిని అభివృద్ధి చేస్తాం. గతంలో ఏ ప్రభుత్వం కూడా బీసీల అభివృద్ధికి శ్రద్ద చూపలేదు. కొత్త రాష్ట్రంలో అణగారిన వర్గాలను ఆర్థిక, సామాజిక, రాజకీయంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం ఈ మేరకు నిర్ణయించారు. బీసీ ఉప ప్రణాళిక తేవాలి : ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే బీసీలు సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకంగా ఉప ప్రణాళిక తీసుకు రావాలి. ఈ డిమాండ్ గతంలో ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించాం. తాజా చర్చలో సీఎం సానుకూలంగా స్పందించారు. సభ్యులంతా ఏకాభిప్రాయంతో వస్తే ఎన్ని ప్రతిపాదనలైనా ఏకపక్షంగా ఆమోదిస్తామని చెప్పడం సంతోషకరం. బీసీల సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించి ప్రతిపాదనలు రూపొందిస్తాం. ముఖ్యంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్లకు నిధుల కేటాయింపుతో పాటు రుణాల వితరణపైనా చర్చించాలి. 12 ఫెడరేషన్లకు కూడా బడ్జెట్ కేటాయించాలి. కుల సంఘాలతో చర్చించి వారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బీసీలకున్న క్రీమీలేయర్‌ను తొలగించాలి. రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి : కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, ఆర్థిక, సామాజిక, విద్యాపరమైన అభివృద్ధికి నిధులిచ్చి ఖర్చు చేయాలనే అంశాన్ని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించా. దానికి అనుగుణంగా సీఎం స్పందించి ఒకరోజు బీసీ సంక్షేమంపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి చర్చిద్దామని చెప్పారు. రాష్ట్ర జనాభాలో 54 శాతం బీసీలున్నారు. బీసీలు మరింత వేగంగా అభివృద్ధి కావాలంటే రాజకీయంగా ఎదగాలి. అందుకు రాజకీయ రిజర్వేషన్లు తీసుకురావాలి. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీ విద్యార్థులకు కూడా పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. ఫెడరేషన్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి : ఆకుల లలిత, ఎమ్మెల్సీ ప్రస్తుతమున్న బీసీ ఫెడరేషన్లలో చాలావరకు పనిచేయడం లేదు. వీటన్నిటినీ కలిపి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. నిధులు వేరుగా కేటాయించినా పనితీరు వేగవంతమయ్యేందుకు కార్పొరేషన్ కిందకు తేవాలి. బీసీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాల పరిమితిని పెంచాలి. గ్రామ స్థాయిలో కులవృత్తులకు ఆర్థిక చేయూత ఇవ్వాలి. మండలానికో గురుకులం : శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే అభివృద్ధిలో కీలకం విద్యే. అందులో భాగంగా బీసీ పిల్లలందరికీ చదువును మరింత చేరువ చేయాలి. అందుకు ప్రతి మండలంలో ఒక గురుకులాన్ని తెరవాలి. ఒకేసారి సాధ్యం కాదు కాబట్టి ఏటా వంద చొప్పున ప్రారంభిస్తే మూడు, నాలుగేళ్లలో అన్ని మండల కేంద్రాల్లో గురుకులాలు అందుబాటులోకి వస్తాయి. కొన్ని కులాలు లెక్కలో లేవు. వాటికి కుల ధ్రువీకరణ అందని పరిస్థితి నెలకొంది. వాటిని గుర్తించేందుకు బీసీ కమిషన్ చర్యలు చేపట్టాలి. -
చట్టసభలు–జీతభత్యాలు
‘మనదో చిత్రమైన ప్రజాస్వామ్యం. ఇక్కడ న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించుకుంటారు. ఎంపీలు వాళ్ల జీతాల్ని వాళ్లే పెంచుకుంటారు’– పన్నెండేళ్ల క్రితం అప్పటి లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ చేసిన వ్యాఖ్య ఇది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఎంపీల జీతభత్యాలపై విమర్శనాత్మక వ్యాఖ్య పార్లమెంటులో వినబడింది. బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ జీరో అవర్‌లో దీన్ని లేవనెత్తుతూ కనీసం ఈ లోక్‌సభ కాలపరిమితి వరకూ మనం దాని జోలికి పోవద్దని కోరారు. అయితే ఆయనకు ఎవరినుంచీ పెద్దగా మద్దతు లభించలేదు. రాజ్యాంగంలోని 106, 195 అధికర ణాలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ జీతభత్యాలను తామే పెంచుకునే అధికారాన్నిస్తున్నాయి. న్యాయమూర్తుల నియామకాల కోసం ఉన్న కొలీజియం వ్యవస్థకు బదులు న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటుకు పార్లమెంటు ఒక చట్టం చేయడం, దాన్ని సుప్రీంకోర్టు కొట్టేయడం చరిత్ర. చట్టసభల సభ్యుల జీత భత్యాలకు సంబంధించి అలాంటి ప్రయత్నమేదీ జరగలేదు. అయితే సోమనాథ్ ఛటర్జీ కేవలం వ్యాఖ్యానించి ఊరుకోలేదు. ఈ అంశంపై ఒక అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో దాదాపు అన్ని పార్టీల నేతలూ ఈ విధానం సరైంది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీతభత్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అది అక్కడే ఆగిపోయింది. ఈ విషయంలో రాజ్యాంగ సవరణ బిల్లుగానీ, జీతభత్యాల కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లుగానీ రూపొం దించే ప్రయత్నమే జరగలేదు. ఈలోగా మూడు, నాలుగు దఫాలు ఎంపీల జీత భత్యాలు మాత్రం పెరిగాయి. ఎంపీల జీతభత్యాలపై ఉభయ సభల సభ్యులతో ఒక కమిటీ ఉంటుంది. ప్రస్తుత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని కమిటీ నిరుడు ఎంపీల జీతభత్యాలు సవరిస్తూ సిఫార్సు చేసింది. అంతా పారదర్శకంగా, హేతుబద్ధంగా సాగుతుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. దాన్ని ప్రశ్నించేవారు కూడా ఉండరు. అలా లేనప్పుడే సమస్య అవు తుంది. ఏ ప్రమాణాల ఆధారంగా జీతభత్యాల పెంపు చేస్తున్నారో ఎవరికీ తెలి యదు. వరుణ్‌గాంధీ బ్రిటన్ ఎంపీలతో తెచ్చిన పోలిక ఆలోచించదగ్గది. అక్కడి ఎంపీల జీతభత్యాలు గత పదేళ్లలో 13 శాతం పెరిగితే, మన ఎంపీలకు 400 శాతం పెరిగాయని ఆయన వివరించారు. బ్రిటన్ ఎంపీల జీతాల అంశాన్ని పరిశీలించేం దుకు ఒక స్వతంత్ర సంస్థ ఉంది. ఆస్ట్రేలియాలో సైతం ఇలాంటి ఏర్పాటే చేసుకు న్నారు. ఈ కారణం వల్లనే కావొచ్చు... ఆ దేశాల ఎంపీల జీతభత్యాల పెరుగుదల మరీ అతిగా లేదు. మన దేశంలో చిత్రమైన పరిస్థితి. సాగు ఖర్చు అపరిమితంగా పెరిగి, పండిన పంటకు గిట్టుబాటు ధర లభించక చివరకు అప్పుల ఊబిలో కూరు కుపోయి ఏం చేయాలో దిక్కుతోచక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఇంతవరకూ దేశవ్యాప్తంగా 1,600మంది రైతులకు పైగా బలవన్మరణాల పాలయ్యారు. కేంద్రంలో పాలకులెవరున్నా రైతుల వ్యథ తీరడం లేదు. కానీ చట్ట సభల సభ్యులకు మాత్రమే కాదు... కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఉద్యోగుల జీతభ త్యాలు కూడా ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. 1970లో గోధుమ మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 76గా ఉంటే ఇప్పుడది రూ. 1,625 అయింది. అంటే ఈ 47 ఏళ్ల లోనూ 21 రెట్లు పెరిగింది. మిగిలిన పంటల మద్దతు ధరలు కూడా అంతంత మాత్రమే. ఇదే కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సిబ్బంది జీతాలు దాదాపు 150 శాతం పెరిగాయి. ఇలాంటి వ్యత్యాసాలు బాహాటంగా కనిపిస్తున్నప్పుడు కనీసం తమవరకైనా సంయమనం పాటించాలన్న స్పృహ చట్టసభల సభ్యులకు ఉండాలి. 2001లో రూ. 12,000గా ఉన్న ఎంపీ జీతం నిరుడు పెంచిన తర్వాత రూ. 1,00,000 అయింది. తమ పంటలకు గిట్టుబాటు ధరలు కావాలని, రుణమాఫీ వర్తింపజేయాలని తమిళనాడు రైతులు గత కొన్ని నెలల నుంచి సాగిస్తున్న ఆందో ళన ఇంకా విరమించలేదు. వారి సమస్య మాటేమోగానీ తమిళనాడు అసెంబ్లీ గత వారం ఎమ్మెల్యేల జీతాలను రూ. 55,000 నుంచి ఒక్కసారిగా రూ. 1,05,000కు పెంచుతూ తీర్మానించింది. రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా చోటుచేసుకునే మహా రాష్ట్రలో నిరుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు రూ. 75,000 నుంచి ఒకేసారి రూ. 1,70,000కు పెరిగాయి. చిత్రమేమంటే ఇలా పెంచినప్పుడు చట్టసభల్లో కనీసం ఒక్క నిరసన స్వరమైనా వినబడటం లేదు. ఆమధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి కొన్ని మినహా చాలా దేశాల్లో ఎంపీల జీతభత్యాల పెంపును అక్కడి చట్టసభల్లోనే నిర్ణయిస్తారు. అమెరికాలో వివిధ రాష్ట్రాలు వివిధ రకాల విధానాలను అనుసరిస్తున్నాయి. దాదాపు 19 రాష్ట్రాలు ఎంపీల జీతభత్యా లపై కమిషన్లు ఏర్పాటు చేయగా కొన్నిచోట్ల చట్టసభలే ఆ నిర్ణయం తీసుకుం టాయి. మరికొన్ని రాష్ట్రాలు కమిషన్ నిర్ణయాలను సభలో చర్చించి వాటిని సవరిం చుకునే స్వేచ్ఛను దఖలు పరచుకున్నాయి. మన రాజ్యాంగ నిర్మాతలు అప్పట్లో వివిధ దేశాల రాజ్యాంగాలనూ, అక్కడి పాలనా సంప్రదాయాలనూ అధ్యయనం చేశారు. ఆ సమయంలో చాలాచోట్ల చట్టసభల నిర్ణయమే అంతిమంగా ఉండేది కనుక ఆ ఒరవడినే బహుశా ఇక్కడా కొనసాగించి ఉండొచ్చు. అయితే వరుణ్‌గాంధీ చెప్పినట్టు ఎంపీల జీతభత్యాలు దశాబ్దకాలంలో 400 శాతం పెరగడం ఆరోగ్యకర ధోరణిని ప్రతిబింబించదు. కనీసం ఇలా పెంచినప్పుడు చర్చ జరగడం, ఆ నిర్ణ యంపై అన్ని పార్టీల సభ్యులు మాట్లాడటమనే సంప్రదాయం ఉంటే అందులోని మంచిచెడ్డలు ప్రజలందరికీ అర్ధమవుతాయి. అలాకాక అన్ని పార్టీలూ మౌనంగా ఉండిపోవడం ద్వారా ఆమోదముద్ర వేస్తుంటే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? ప్రతి అంశంపైనా చట్టసభల్లో చర్చ జరగడం ప్రజాస్వామ్యానికి ఆరోగ్య కర లక్షణం. అది ఎటూ లేదు. కనీసం తమ జీతాల విషయంలోనైనా దాన్ని పాటిం చడం అత్యవసరమని ప్రజాప్రతినిధులు గుర్తించాలి. -
మమత ఏకగ్రీవ ఎన్నిక
కోల్ కతా: తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ శాసన సభా పక్ష నేతగా మమతాబెనర్జీని ఆపార్టీ శాసన సభ సభ్యులు శుక్రవారం సమావేశమై ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఎంసీ సెక్రెటరీ జనరల్ పార్థ చటర్జీ మమత పేరును మొదట ప్రతిపాదించారు. తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆమె పేరును ప్రతిపాదించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత మమత రాజ్ భవన్ కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ తో చర్చించారు. -
ఫిరాయింపుల పీచమణగాలి!
రెండో మాట ‘ఒక పార్టీ టికెట్ పైన ఎన్నికలలో గెలిచిన లెజిస్లేటర్లు మరో పార్టీలోకి ఉడాయించడం అనేది జాతీయ స్థాయిలో ప్రబలిపోతున్న జబ్బు. ఈ జబ్బు మన ప్రజాస్వామ్య వ్యవస్థ జవజీవాలను తోడేస్తున్నది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రాజకీయ పక్షాలు నిర్దిష్ట ప్రవర్తనా నిబంధనావళికీ, నియమబద్ధ సంప్రదాయాలకూ బద్ధమై ఉండడం వల్లనే సాధ్యం. అలాగే ప్రజాస్వామ్య సంస్థలను, కార్యకలాపాలను శాసించగల మౌలికమైన యోగ్యతా మర్యాదల ను, ఔచిత్యాన్ని పరిగణనలోనికి తీసుకుని పార్టీలు వ్యవహరించేలా ఉండాలి.’ (ఫిబ్రవరి 18, 1969న నాటి కేంద్ర హోంమంత్రి వైబీ చవాన్ కమిటీ పార్లమెంట్‌కు సమర్పించిన నివేదిక) ఆనాటి లోక్‌సభలో సోషలిస్ట్ నాయకుడు మధు లిమాయే ప్రతిపాదించిన సవరణలతో ఏర్పడిన చవాన్ కమిటీ, ఒక పార్టీ టికెట్ మీద గెలిచి అనంతరం మరో పార్టీ ఒరలోకి దూరిపోయే జంప్ జిలానీల (ఆయారామ్ గయారామ్‌లు) ప్రవర్తన అరికట్టేందుకు తన నివేదికలో అనేక విలువైన ప్రతిపాదనలు చేసింది. అయినా, ‘బుద్ధి గడ్డి తినడానికి’ అలవాటు పడినప్పుడు ఈ గోడ దూకుడు గాళ్లకు ఏ రాజ్యాంగం గానీ, ఏ నిబంధన గానీ, ఏ చట్టం గానీ అడ్డంకాదని స్వతంత్ర భారత లె జిస్లేచర్లలో ఇన్నేళ్లుగానూ జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. లెజిస్లేచర్లలో (పార్లమెంట్/ అసెంబ్లీలు) మెజారిటీ ఉన్న అధికార పార్టీలు కూడా విద్వేషభావంతో ప్రతిపక్షాలకు శాసన వేదికలలో ప్రాతినిధ్యం అంటూ లేకుండా అందులో ఉన్న సభ్యులను కూడా రకరకాల ప్రలోభాలతో అధికార పార్టీలో చేర్చుకుంటున్నాయి. అలా ప్రతిపక్షాన్ని క్రమంగా నిశ్శేషం చేసే ఓ కొత్త రాజకీయ క్రీడకు పాల్పడుతున్నాయి. అధికార పార్టీలు (రెండు తెలుగు రాష్ట్రాలు సహా) ఆది నుంచి జంప్ జిలానీల మీదనే ఆధారపడుతూ వచ్చాయి. ఈ రెండు రకాల అధికార పార్టీలూ ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలోను అధికార పీఠాలను ఇలాగే కాపాడుకోజూస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పక్షం ఒక తెలుగు రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వంలో చిన్న భాగస్వామిగా కూడా ఉంది. అయితే రేపోమాపో ఏ మిషతో అయినా ఆ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటే తమ ఉనికి ప్రమాదంలో పడుతుందని ఈ ప్రాంతీయ పార్టీ మొదటి నుంచి భావిస్తూ బలమైన విపక్షంగా ఉన్న పార్టీ లెజిస్లేటర్లను ప్రలోభ పెట్టే దశకు చేరుకుంది. అదే రెండు తెలుగు రాష్ట్రాలలోను ప్రతిబింబిస్తున్నది. కప్పదాట్లు సాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒక్కసారి గతంలోకి వెళితే, లెజిస్లేటర్ల కప్పదాట్లను అరికట్టడం కోసం 1973లో ఆనాటి కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యాంగంలో చేర్చడానికి సిద్ధంచేసిన ఎనిమిది అధికరణలకు అవకాశవాద రాజకీయాల వల్ల విలువ లేకుండా పోయింది. ఎందుకంటే పార్టీ విధానాలతో సంబంధం లేకుండా లెజిస్లేటర్లు జంప్ జిలానీలుగా మారుతున్న దశలో చవాన్ కమిటీ నివేదిక లోని సిఫారసులను బిల్లులో చేర్చకుండా స్వార్థం కొద్దీ తప్పించారు. 1977 వచ్చేసరికి ఎవరో కొందరు ధనవంతులు, అవకాశవాదుల కుట్ర వల్ల లోక్‌సభ రద్దయింది. అలా 395 అధికరణలతో 12 షెడ్యూల్స్‌తో పలు సవరణలతో కూడిన రాజ్యాంగం మనకు ఉండి కూడా ఆచరణలో ప్రజలు మోసాలకు గురి కావలసి వస్తున్నది. కమిటీలతో పాలకపక్షం, ప్రతిపక్షం చేస్తున్న కాలయాపన కారణంగా నివేదికలకు విలువ లేకుండా పోయింది. అయినా కమిటీల మీద కమిటీలు వస్తూనే ఉన్నాయి. జనతా పాలనలోనూ ఇదే తంతు నడిచింది. ఫిరాయింపులు అరికట్టడమనే మిషతో చరణ్‌సింగ్ హోంమంత్రిగా మరో రాజ్యాంగ సవరణ బిల్లు వచ్చింది. ఈ బిల్లు పార్టీ ఫిరాయించే లెజిస్లేటర్లపై అనర్హత వేటు వేయాలని సిఫారసు చేసింది (102,191 అధికరణల కింద). ఇది రాజ్యాంగం 10వ షెడ్యూల్ కింద అనివార్యమయింది. అయినా ప్రలోభాల ద్వారా ప్రతిపక్షం నుంచి లెజిస్లేటర్ల ఫిరాయింపులను బాహాటంగా ప్రోత్సహించి మొత్తం ప్రజాస్వామ్య ప్రక్రియనే అవహేళన చేసే దశకు పాలక పక్షాలు చేరుకున్నాయి. సభ్యుల భిన్నాభిప్రాయ ప్రకటనకు, పార్టీ ఫిరాయింపులకు తేడాను గుర్తించలేనంత గుడ్డివాళ్లుగా జంప్ జిలానీ లెజిస్లేటర్లు తయారవుతున్నారు. పార్టీనీ, పార్టీ విప్‌నూ లెక్క చేయకుండా ప్రలోభం మత్తులో గోడ దూకే లెజిస్లేటర్ లెజిస్లేచర్ సభ్యునిగా అనర్హుడని సుప్రీంకోర్టు తీర్పులు (1987/1992) తీర్పు ఇచ్చిందని మరచిపోరాదు. ‘ఒక రాజకీయ పార్టీ గుర్తు మీద ఎన్నికైన లెజిస్లేటర్ ఆ పార్టీ నిర్ణయం లేదా అనుమతి లేకుండా మరో పార్టీలోకి దూకేయడాన్ని విభీషణ పాత్రగా, లేదా కప్పగంతుగా పరిగణించాల్సిందే’నని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫిరాయింపుదారు అనర్హుడే 1967-1977 మధ్య 542 ఫిరాయింపు కేసులు నమోదైనాయి. అందులో ఒక్క ఏడాది మాత్రం 438 కేసులు నమోదైనాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గెలిచిన వారిలో 157 మందికి పైగా వివిధ పార్టీల తీర్థం పుచ్చుకున్నారు. 1985లో రాజ్యాంగానికి వచ్చిన 52వ సవరణ ప్రకారం ఇలాంటి ఫిరాయింపుల గురించి సుప్రీంకోర్టు ఇలా ఘాటైన హెచ్చరిక చేసింది: ‘మన ప్రజాస్వామిక వ్యవస్థ ఒక గర్వకారణమైన వ్యవస్థగా మాత్రమే మిగిలిపోకుండా, బాహ్య ప్రపంచానికి ఆదర్శనీయమైన పాలనా వ్యవస్థగా కూడా భావించేలా ఉండాలి’. బహుశా అందుకే బ్రిటిష్ రాజ్యాంగ వ్యవహారాల మీద సాధికార వ్యాఖ్యాతలలో ఒకరైన ఐవర్ జెన్నింగ్స్ కూడా ‘మధ్యలో ఒక పార్టీని విడనాడడమంటే తరువాతి ఎన్నికలలో ఆ పార్టీ మద్దతును కోల్పోవడమే’ అన్న స్పృహ ఉండాలన్నాడు. అంతేగాదు, ఓటు హక్కును వినియోగించుకునే సగటు సామాన్య ఓటరు పార్టీ గుర్తుకు మాత్రమే ఓటు వేస్తాడు. అంటే అంతకు ముందు ఆ పార్టీని అర్ధాంతరంగా ఫిరాయించిన లెజిస్లేటర్ ఇక ఎన్నిక కాబోడనే దాని అర్థం కూడా అని జెన్నింగ్స్ అన్నాడు. అందుకని భారత రాజ్యాంగానికి వచ్చిన 52వ సవరణ ఎందుకంత కీలకమైంది? లెజిస్లేటర్ లేదా ఫిరాయింపుదారు ఈ సవరణ ప్రకారం లెజిస్లేచర్ సభ్యత్వాన్ని వదులుకోవలసిందే, సీటు ఖాళీ చేయవలసిందే, లెజిస్లేటర్‌గా అనర్హుడు కావలసిందేనని ఆ సవరణ స్పష్టం చేసింది. అందుకే సుప్రీం కోర్టు లెజిస్లేటర్ల ఫిరాయింపుల నిషేధ చట్టం రాజ్యాంగ బద్ధతను ఖాయం చేస్తూ 1993లోనే విలువైన తీర్పు చెప్పింది. ఈ తీర్పు చెప్పిన ఐదుగురు సభ్యులుగల సుప్రీంకోర్టు ధర్మాసనంలో సుప్రసిద్ధ న్యాయమూర్తి వెంకటాచలయ్య కూడా ఉన్నారు (కిహోటా హల్లోహన్ జాబిల్హూ కేసు). చివరికి ఇలా ఫిరాయించే లెజిస్లేటర్లు స్వతంత్ర/ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా సభలో కూర్చోవడానికి సిద్ధపడడం కూడా ‘ఓటర్లను మోసగించడం’గా ఆస్ట్రేలియా రాజ్యాంగ చట్టం, మరికొన్ని దేశాల రాజ్యాంగాలు పరిగణించాయి. మన దేశంలో కూడా ఎన్నికల కమిషన్లు, ప్రజాప్రాతినిధ్య చట్టం లాంటి అనేక రాజ్యాంగ సంస్థలు పదే పదే ఫిరాయింపులను గురించి హెచ్చరిస్తూ వచ్చినా రాజకీయాలలో నేరపూరిత వ్యూహాలు, పద్ధతులు పెరిగిపోతున్నాయి తప్ప, ఆగడం లేదని ప్రజల అనుభవం. ఇదే అంశాన్ని పాతికేళ్ల క్రితం ప్రస్తావించి నపుడు హోంశాఖ మాజీ కార్యదర్శి ఓరా కమిటీ పోలీసులు, రాజకీయులు, మాఫియా మధ్య బలమైన పీటముడి ఉందని హెచ్చరించ వలసి వచ్చింది. నేరమయ రాజకీయాలలో ఫిరాయింపులు ఒక భాగం. రాజకీయాలు నేరమయం కావడం గురించి కోర్టులు, సుప్రీంకోర్టులలో అనేక ఫిర్యాదులు అప్పీళ్ల రూపంలో పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే కోర్టులు మాత్రం ఎన్ని పెండింగ్ కేసులని పరిష్కరిస్తాయి? బలవంతులకు, ధనవం తులకు కొమ్ము కాసే స్థితికి పాలకపక్షం, ప్రభుత్వాల రాజకీయ స్థాయి చేరకూ డదు. రైతుల, మధ్య తరగతి ప్రజల సమస్యలను పరిష్కరించే నాథుడు లేడు. నియంతృత్వ శక్తులకు ఊతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీలోకి గెంతి స్పీకర్స్ చాటున దాగి నెలల తరబడి గుర్తింపు పొందాలన్న తహతహను కూడా సుప్రీం నిరసించింది. ఒక పార్టీ అభ్యర్థి ఒకే రోజున మూడు పార్టీలు ఫిరాయించిన చరిత్ర కూడా ఇక్కడ ఉంది. స్పీకర్ నిర్ణయానికి తిరుగులేదనుకునే వారికి కూడా సమాధానంగా అత్యున్నత ధర్మాసనానికి స్పీకర్ల నిర్ణయాలను కూడా సమీక్షించే హక్కు ఉందని చెప్పవలసి వచ్చిందని మరువరాదు. అంతేగాదు, 2007లో లోక్‌సభలో ఆ తరువాత రాష్ట్ర శాసనసభలలో ఫిరాయింపులను ప్రోత్సహించడానికి లేదా సభలో ఫలానా ప్రశ్న వేస్తే ఇంత రొఖ్ఖం చెల్లిస్తామని బేరాలాడే సందర్భాలలో సుప్రీం ముందుకు ఒక కేసు విచారణకు వచ్చింది (రాజారాంపాల్ వర్సెస్ లోక్‌సభ స్పీకర్: క్యాష్ ఫర్ క్యారీ). ఆ కేసులో వాదించిన సుప్రీం న్యాయవాది డాక్టర్ చౌహాన్ ఒక సందర్భంలో ఫిరాయింపులలో ఎక్కువ భాగం తమను మంత్రులుగా నియమించవచ్చునన్న ఆశలతో ఉండి ఆ పదవులు రాకపోతే హతాశులైన సభ్యులని వెల్లడించాడు. ఇందుకు ఉదాహరణగా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, బహుజన సమాజ్‌వాది పార్టీల నుంచి వచ్చిన ఫిరాయింపుదారులతో (1997)బీజేపీ కల్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. అలాగే 2008లో కాంగ్రెస్‌పార్టీలో ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా కర్ణాటకలో బీఎస్ ఎడ్యూరప్ప (బీజేపీ) మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఎన్నో ఉదాహరణలు ఇవ్వవచ్చు. లెజిస్లేటర్లలో వక్రీకరించే బుద్ధుల నుంచి పుట్టే ఫిరాయింపుల సంస్కృతికి ధనిక వర్గ రాజకీయ పక్షాలే ప్రధాన కారణం. ఈ సంస్కృతి వల్ల ప్రజాతంత్ర శక్తుల ఉదాసీనత వల్ల ఫిరాయింపుల ద్వారా విపక్షాన్ని నిశ్శేషం చేసి నియంతృత్వ శక్తులు పెట్రేగిపోయే ప్రమాదం ఉంది. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
చట్టసభలపై చులకనభావం!
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆవేదన సాక్షి, హైదరాబాద్: చట్టసభలన్నా, రాజకీయ నాయకులన్నా ఇటీవల ప్రజల్లో చులకన భావం ఏర్పడిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ పనిదినాలు మరింత పెరగాలని, సభలో జరిగే చర్చలు అర్థవంతంగా ఉండాలని సూచించారు. ఇందుకు విరుద్ధంగా జరుగుతుండటమే చట్టసభలు చులకన కావడానికి కారణమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం అరుదైన అవకాశమని, ప్రతిఒక్కరూ దాన్ని సద్వినియోగం చేసుకొని మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. సభలు జరగకపోవడం వల్ల ప్రతిపక్షానికి, ప్రజలకూ నష్టమని, ప్రభుత్వం సమాధానం చెప్పకుండా తప్పించుకుంటుందని అన్నారు. ప్రతిపక్షం సభను జరగనిస్తూనే ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజలముందు నిలబెట్టాలని ఉద్బోధించారు. ప్రభుత్వం సరిగా నడవాలంటే గట్టి ప్రతిపక్షం ఉండాలని మంత్రి చెప్పారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహిస్తున్న రెండురోజుల అవగాహన సదస్సులో భాగంగా తొలిరోజు శుక్రవారం వెంకయ్యనాయుడు ప్రసంగించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు సదస్సుకు అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మండలి చైర్మన్ ఎ.చక్రపాణి, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, పార్లమెంటు మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. దాదాపు గంటసేపు సాగిన వెంకయ్యనాయుడు ప్రసంగం ఆద్యంతం ఛలోక్తులతో సాగి నవ్వులు పూయించింది. అధికార, ప్రతిపక్షాలు ఏకాభిప్రాయంతో కలసికట్టుగా ముందుకు కదలిన ప్పుడే విభజనతో ఏర్పడిన సమస్యలు పరిష్కారమై రాష్ట్రం అభివృద్ధి సాధించగలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. సమస్యల్లో ఉన్నాం.. సహకరించండి: ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రం అనేక సమస్యల్లో ఉందని, ఎమ్మెల్యేలు ఈ దిశగా ఆలోచించి సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. ‘‘ఎన్నికలు ముగిశాయి. మరో అయిదేళ్ల వరకు ఎన్నికలు లేవు. అధికార పక్షం, ప్రతిపక్షంగా కాకుండా అందరం కలసికట్టుగా అభివృద్ధి పక్షంగా ముందుకు నడుద్దాం..’’ అని పిలుపునిచ్చారు.