చట్టసభలపై చులకనభావం!
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆవేదన
సాక్షి, హైదరాబాద్: చట్టసభలన్నా, రాజకీయ నాయకులన్నా ఇటీవల ప్రజల్లో చులకన భావం ఏర్పడిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ పనిదినాలు మరింత పెరగాలని, సభలో జరిగే చర్చలు అర్థవంతంగా ఉండాలని సూచించారు. ఇందుకు విరుద్ధంగా జరుగుతుండటమే చట్టసభలు చులకన కావడానికి కారణమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం అరుదైన అవకాశమని, ప్రతిఒక్కరూ దాన్ని సద్వినియోగం చేసుకొని మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. సభలు జరగకపోవడం వల్ల ప్రతిపక్షానికి, ప్రజలకూ నష్టమని, ప్రభుత్వం సమాధానం చెప్పకుండా తప్పించుకుంటుందని అన్నారు. ప్రతిపక్షం సభను జరగనిస్తూనే ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజలముందు నిలబెట్టాలని ఉద్బోధించారు. ప్రభుత్వం సరిగా నడవాలంటే గట్టి ప్రతిపక్షం ఉండాలని మంత్రి చెప్పారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహిస్తున్న రెండురోజుల అవగాహన సదస్సులో భాగంగా తొలిరోజు శుక్రవారం వెంకయ్యనాయుడు ప్రసంగించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు సదస్సుకు అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మండలి చైర్మన్ ఎ.చక్రపాణి, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, పార్లమెంటు మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. దాదాపు గంటసేపు సాగిన వెంకయ్యనాయుడు ప్రసంగం ఆద్యంతం ఛలోక్తులతో సాగి నవ్వులు పూయించింది. అధికార, ప్రతిపక్షాలు ఏకాభిప్రాయంతో కలసికట్టుగా ముందుకు కదలిన ప్పుడే విభజనతో ఏర్పడిన సమస్యలు పరిష్కారమై రాష్ట్రం అభివృద్ధి సాధించగలుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
సమస్యల్లో ఉన్నాం.. సహకరించండి: ఏపీ సీఎం చంద్రబాబు
రాష్ట్రం అనేక సమస్యల్లో ఉందని, ఎమ్మెల్యేలు ఈ దిశగా ఆలోచించి సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. ‘‘ఎన్నికలు ముగిశాయి. మరో అయిదేళ్ల వరకు ఎన్నికలు లేవు. అధికార పక్షం, ప్రతిపక్షంగా కాకుండా అందరం కలసికట్టుగా అభివృద్ధి పక్షంగా ముందుకు నడుద్దాం..’’ అని పిలుపునిచ్చారు.