
కృష్ణా పుష్కరాలకు భారీ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యంకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని సీఎస్ రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. ఆగస్టులో జరగనున్న కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. స్నానఘట్టాల నిర్మాణంతో పాటు దేవాలయాల మరమ్మతులు, రహదారుల అభివృద్ధి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణం, విద్యుత్ సౌక ర్యం తదితర పనులపై సమీక్షించారు. ఆయా శాఖలన్నీ తమ ప్రతిపాదనలను సంబంధిత కార్యదర్శి ద్వారా ప్రభుత్వానికి పంపించాలని సీఎస్ కోరారు.
పుష్కరాల సందర్భంగా చేపట్టే పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని సీఎస్ సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 52, నల్లగొండ జిల్లాలో 34 స్నాన ఘట్టాలు నిర్మిస్తున్నామని సీఎస్ తెలిపారు. కృష్ణా పుష్కరాలకు తగినంత ప్రచారం కల్పించాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌ను కోరారు. అవసరమైన చోట ఎల్‌ఈడీ స్క్రీన్లు, సీసీ కెమెరాలు, హోర్డింగులు, పబ్లిక్ అడ్రస్ సిస్టంలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.