సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 26 నుంచి రైతులకు ఇవ్వనున్న కొత్త పాసుపుస్తకాలపై సర్కారు మెలిక పెట్టనుంది. పంట రుణం లేదా భూమిని కుదువపెట్టి రుణాలు తెచ్చుకున్న రైతులు తమ భూములకు కొత్త పాసుపుస్తకాలు పొందాలనుకుంటే కచ్చితంగా రుణం ఇచ్చిన బ్యాంకు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తెచ్చుకోవాలని, అప్పుడే రైతులకు కొత్త పాసుపుస్తకాలు మంజూరు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. భూ రికార్డుల ప్రక్షాళన ఈ నెల 31 నాటికి పూర్తి కానుండటంతో ఆ రికార్డుల ఆధారంగా ఇచ్చే కొత్త పాసుపుస్తకాల విషయంలో కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందిస్తోంది.
రుణాలు లేకుంటే నేరుగా ఇంటికే..
కొత్త పాసుపుస్తకాల కోసం రైతులు ఎలాంటి దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రికార్డుల ప్రక్షాళన పూర్తయిన తర్వాత ప్రభుత్వమే రైతుల ఇళ్లకు కొరియర్ ద్వారా పాసుపుస్తకాలు పంపుతుందని, పాసుపుస్తకాల కోసం రైతులు ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదంటున్నారు. అయితే ఇది బ్యాంకుల్లో ఎలాంటి రుణాలు లేని భూములకు మాత్రమే వర్తించనుంది. బ్యాంకుల్లో పంట రుణాలు లేదా ఇతర రుణాలు తీసుకొని ఉంటే మాత్రం రైతులు ఆ రుణాలను చెల్లించి బ్యాంకుల నుంచి ఎన్‌వోసీ తెచ్చుకుని తహసీల్దార్ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 26.90 లక్షల మంది రుణాలు తీసుకున్న రైతులు, అంతకు ముందు రుణాలు తీసుకున్న వారు కచ్చితంగా బ్యాంకుల నుంచి ఎన్‌వోసీలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే పాసుపుస్తకంపై తహసీల్దార్ డిజిటల్ సిగ్నేచర్ చేస్తారు. అప్పుడు కూడా ఎలాంటి దరఖాస్తు లేకుండానే రైతు ఇంటికి పాసు పుస్తకం వస్తుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి.
ప్రచురించేది ఎవరు?
కొత్త పాసుపుస్తకాల ప్రచురణ విషయంలో కూడా ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. అత్యంత పకడ్బందీగా రూపొందిస్తున్న పాసుపుస్తకాలను ప్రచురించి జారీ చేసే అధికారం తహసీల్దార్లకు ఇవ్వాలా లేదా ప్రభుత్వమే ప్రచురించి రైతులకు నేరుగా పంపాలా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఒకవేళ తహసీల్దార్లకు ఆ అధికారం ఇస్తే మాత్రం మంజూరీతోపాటు పబ్లిషర్ సిగ్నేచర్ కూడా వారికే ఇవ్వాలని లేదంటే నేరుగా సీసీఎల్‌ఏ నుంచి పంపాలని యోచిస్తోంది. ఈ విషయంలో రెవెన్యూ ఉన్నతాధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.
భూ రికార్డులకు కొత్త పోర్టల్
భూ రికార్డులను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేందుకు ఇప్పుడున్న వెబ్‌ల్యాండ్ పోర్టల్ స్థానంలో కొత్త పోర్టల్ తేవాలనే యోచనలో రెవెన్యూ ఉన్నతాధికారులున్నారు. వెబ్‌ల్యాండ్ పోర్టల్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేయగా ప్రస్తుతం జరుగుతున్న భూ రికార్డుల ప్రక్షాళన వివరాలను ల్యాండ్ రికార్డ్స్ అప్‌డేషన్ ప్రాసెస్ (ఎల్‌ఆర్‌యూపీ) అనే పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. దీన్ని పబ్లిక్ డొమైన్‌లో అనుసంధానించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ అధికారులకు మాత్రమే ఈ పోర్టల్‌లో లాగిన్ అయ్యే అవకాశం ఉంది. అయితే భూ రికార్డుల ప్రక్షాళన పూర్తయ్యాక ఈ పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం ఇప్పుడున్న వెబ్‌ల్యాండ్ పోర్టల్ కాకుండా కొత్త పోర్టల్‌తో అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment