పాస్‌పుస్తకాల గందరగోళం
Published Fri, Jul 8 2016 4:36 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
అయోమయంలో రైతులు
స్పష్టత లేదంటున్న రిజిస్ట్రేషన్ అధికారులు
నెల్లూరు: ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయంలోనూ స్పష్టత లేదనే విషయానికి రిజిస్ట్రేషన్ శాఖ నిదర్శనంగా నిలుస్తోంది. కొంతకాలంగా రైతుల వద్ద ఉన్న పాస్‌పుస్తకాలకు కాలం చెల్లుతుందని, వాటి స్థానంలో మ్యుటేషన్ పద్ధతిలో వన్ బీ వస్తుందని చెప్పుకొంటూ వచ్చారు. వాస్తవానికి మే 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పినా అప్పుడు తాత్కాలికంగా నిలిపేశారు. అప్పటి నుంచి పాస్‌పుస్తకాలు ఉండవని ప్రభుత్వం పేర్కొంది. మరోసారి జూలై 1 నుంచి అమలు చేస్తున్నట్లు ఇటీవల ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు రెండు రోజుల క్రితం ఆ శాఖ మంత్రి పాస్‌పుస్తకాలను రద్దు చేయట్లేదని చెప్పడం రైతుల్లో అయోమయానికి దారితీసింది. రిజిస్ట్రేషన్‌కు వచ్చే రైతులు పాస్‌పుస్తకాల విషయమై అడుగుతుండటంతో ఏమి చెప్పాలో పాలుపోక రిజిస్ట్రార్ అధికారులు తికమకపడుతున్నారు.
పాస్‌పుస్తకాలు రద్దయితే సమస్యలు..
పాస్‌పుస్తకాలు రద్దయితే చాలా సమస్యలు వస్తాయని పలువురు రిజిస్ట్రేషన్ అధికారులు పేర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్‌కు వచ్చే వారి వద్ద నుంచి పాస్‌పుస్తకాన్ని తీసుకొని ఎంత పొలం మరొకరికి రిజిస్ట్రేషన్ చేస్తారో తెలుసుకుంటారు. అక్కడ సర్వే నంబర్, ఎంత పొలం అనే నంబర్ వద్ద రిజిస్ట్రేషన్ అధికారులు రౌండ్‌మార్క్ చేస్తారు. అయితే పాస్‌పుస్తకాల రద్దుతో ఒక స్థలాన్ని విక్రయించే సమయంలో డబుల్, త్రిబుల్ రిజిస్ట్రేషన్లు కూడా జరిగే అవకాశం ఉంది.
‘చుక్కల’ విషయంలోనూ స్పష్టతేదీ..?
జిల్లాలో వేల ఎకరాల చుక్కల భూములు ఉన్నాయి. వాటిని హక్కుదారులు మాత్రమే అనుభవించేందుకు అర్హులని ప్రభుత్వం పేర్కొంది. చుక్కల భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఇటీవల చెప్పినా, దానిపైనా స్పష్టత లేదు. రెవెన్యూ శాఖ వద్ద మాత్రం చుక్కల భూమికి డాట్‌లు కనిపిస్తుండటం, రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్దకు వచ్చే సరికి మాత్రం చుక్కలు కనిపించడంలేదు. ఈ పరిణామంతో రైతులతో పాటు రిజిస్ట్రేషన్ అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు.
వెబ్‌ల్యాండ్‌లో డేటా ఆధారంగా చేస్తున్నాం:
పట్టాదారు పాస్‌పుస్తకాలు లేకపోయినా ప్రస్తుతానికి వెబ్‌ల్యాండ్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. బ్యాంకులకు సంబంధించిన పాస్‌పుస్తకాలు ఉంటాయి అంటున్నారు. అయితే ఆ విషయం తెలీదు. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తాం.
మునుస్వామి, రిజిస్ట్రేషన్ అధికారి
Advertisement