
సాక్షి, హైదరాబాద్ : భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతుండటంతో ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకుంది. 49 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులకు ప్రమోషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం 15 జీవోలు జారీ చేసింది. 26 ఐఏఎస్‌లకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం వారిలో ముగ్గురికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ప్రమోషన్ ఇచ్చింది.
ఒకరికి ముఖ్య కార్యదర్శి, నలుగురికి కార్యదర్శి, ఆరుగురికి అదనపు కార్యదర్శులుగా పదోన్నతులు ఇచ్చారు. ఐదుగురు ఐఏఎస్‌లకు సంయుక్త కార్యదర్శిగా, మరో నలుగురికి డిప్యూటీ సెక్రెటరీలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇక కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో ముగ్గురు ఐఏఎస్‌లకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది. 23 మంది ఐపీఎస్‌లకు ప్రమోషన్ ఇచ్చిన సర్కార్.. వారిలో ఐదుగురికి అదనపు డీజీలుగా, నలుగురికి ఐజి, ఏడుగురికి డీఐజీ, ఆరుగురికి సీనియర్ స్కేల్ అధికారులుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరొక ఐపీఎస్ అధికారికి కూడా ఐజీగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment