సాక్షి, హైదరాబాద్: పాడి రైతులకు సబ్సిడీపై ఇచ్చే బర్రెలను రూ.80 వేల చొప్పున కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యూనిట్ ధరను పశుసంవర్థక శాఖ ఖరారు చేసింది. సబ్సిడీ బర్రెల కొనుగోలు కోసం రూ. 971 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. రెండ్రోజుల్లో ఫైలు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లనుందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వెంటనే జాతీయ సహకారాభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) నుంచిగానీ, నాబార్డు నుంచిగానీ, ఏదో ఒక వాణిజ్య బ్యాంకు నుంచిగానీ రుణాల కోసం అధికారులు ప్రయత్నిస్తారు. వచ్చే నెల నుంచి బర్రెలను పంపిణీ చేస్తారు.
2.17 లక్షల మంది రైతులకు లబ్ధి
విజయ డెయిరీ, రంగారెడ్డి–నల్లగొండ పాల ఉత్పత్తిదారుల సంఘం, కరీంనగర్ డెయిరీ, ముల్కనూరు డెయిరీలకు పాలు పోసే రైతులకు ఒక్కో బర్రెను సబ్సిడీపై ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయా సంఘాల పరిధిలో మొత్తం 2.17 లక్షల మంది రైతులున్నారు. వారిలో ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం సబ్సిడీపై, బీసీలు, ఇతర వర్గాలకు 50 శాతం సబ్సిడీపై బర్రెలను పంపిణీ చేస్తారు. ఒక్కో బర్రె 8–10 లీటర్లు ఇచ్చేలా ఉండాలని నిర్ణయించారు.
ధర ఎక్కువైతే లబ్ధిదారులపైనే భారం
బర్రె యూనిట్ ధర రూ. 80 వేలుండగా, అంతకంటే ఎక్కువ ధర పలికితే లబ్ధిదారుడే భరించాలని మార్గదర్శకాల్లో పేర్కొంటామని అధికారులు చెబుతున్నారు. యూనిట్ ధరలోనే రవాణా ఖర్చు సహా అన్నీ కలిపి ఉంటాయి. బర్రెలను హరియాణాలో కొనుగోలు చేసి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఒక్కో బర్రె ఎన్ని పాలు ఇస్తుందో మూడు రోజులపాటు గమనించి 8–10 లీటర్లు ఇస్తుందని నిర్ధారించుకున్నాక కొనుగోలు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment