![Farmer Cheated By Cyber Criminals sale Of Buffaloes On whatsapp At Shamshabad - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/13/buffalo.jpg.webp?itok=VfKXaCXp)
సాక్షి, రంగారెడ్డి: వాట్సాప్‌లో అమ్మకానికి పెట్టిన గేదెలను కొనడానికి యత్నించిన ఓ రైతు సైబర్ నేరగాళ్లకు రూ.1,31,500 సమర్పించుకున్నాడు. పోలీసుల చెప్పిన వివరాల మేరకు... కవ్వగూడకు చెందిన రైతు బొద్దం శ్రీకాంత్ యాదవ్ వాట్సాప్ నంబరుకు గుర్తు తెలియని ఓ వ్యక్తి నుంచి ఈ నెల 6న హాయ్ అంటూ మెసేజ్ వచ్చింది. తర్వాత కొద్దిసేపటికి గేదెల ఫొటోలు పోస్టు చేసి, రెండు గేదెలు అమ్మకానికి ఉన్నాయని వాటి ధర రూ.1,10,000గా చెప్పాడు. గేదెలు కొనేందుకు శ్రీకాంత్ ఆసక్తి చూపడంతో సదరు వ్యక్తి ముందుగా రూ.10 వేలు చెల్లించాలని చెప్పాడు.
అందుకు ఒప్పుకుని ఫోన్‌పే ద్వారా పలుసార్లు రూ.9వేలు పంపించాడు. గేదెలు పంపించడానికి బోర్డర్ చార్జీలు, జీఎస్‌టీ కలిపి అదనంగా రూ.11,500 అవుతుందని చెప్పగా ఆ మొత్తాన్ని కూడా చెల్లించాడు. గేదెలు ఇంటికి పంపించిన తర్వాత రూ.లక్ష ఇవ్వవచ్చని, మిగిలిన మొత్తాన్ని ముందుగానే చెల్లించాలని షరతు పెట్టారు. దీంతో ఈ నెల 10న గేదెలు పంపిస్తున్నట్లు చెప్పడంతో తన చిరునామా వివరాలు అందజేశాడు. ఇలా శ్రీకాంత్‌ను నమ్మించి పలుసార్లు మొత్తంగా రూ.1,31,500 వసూలు చేశారు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించిన శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment