కొత్తగా పది మున్సిపాలిటీలు | ten the municipalities in GHMC | Sakshi
Sakshi News home page

కొత్తగా పది మున్సిపాలిటీలు

Published Wed, Nov 20 2013 2:58 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

ten the municipalities in GHMC

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : కొత్త మున్సిపాలిటీలపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. శివారు పంచాయతీలను హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పునరాలోచనలో పడ్డ ప్రభుత్వం.. వీటిని మున్సిపాలిటీలుగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో కలెక్టర్ బి.శ్రీధర్ నేతృత్వంలోని అధికారుల బృందం కొత్త మున్సిపాలిటీలపై ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిపింది.
 
  గ్రేటర్ విలీన ప్రతిపాదిత 32 గ్రామాలను పది మున్సిపాలిటీల పరిధిలోకి తేవాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. జవహర్‌నగర్, గుండ్లపోచంపల్లి గ్రామ పంచాయతీలను ఈ జాబితాల్లో చేర్చకూడదని భావించింది. శామీర్‌పేట మండలంలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీగా ఉన్న జవహర్‌నగర్‌ను విలీనం చేసుకునేందుకు గ్రేటర్ పాలకవర్గం మొగ్గు చూపుతోంది. అక్కడే డంపింగ్ యార్డు ఉండటం, విస్తారంగా ప్రభుత్వ భూములు ఉన్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు ఈ గ్రామ విలీనం అనివార్యమని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఈ పంచాయతీని కలుపుకొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే గుండ్లపోచంపల్లి గ్రామాన్ని గ్రేటర్‌లో విలీనం చేయకుండా మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేద్దామని తొలుత భావించినప్పటికీ, నిర్దేశించిన జనాభా లేనందున.. ప్రస్తుతానికి దీన్ని గ్రామ పంచాయతీగానే కొనసాగించాలనే అభిప్రాయానికొచ్చింది.
 
 పదింటికీ ఒకే..!
 గ్రేటర్‌లో శివారు గ్రామాల విలీన ప్రక్రియపై న్యాయస్థానం ఆక్షేపించడంతోపాటు ఎన్నికల కమిషన్ కూడా తుది నిర్ణయాన్ని వెల్లడించాలని స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాలతో త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు వారం రోజులుగా వీటి భవిష్యత్తుపై తర్జనభర్జనలు పడ్డ జిల్లా యంత్రాంగం ఓ నివేదికను రూపొందించింది. ఈ నేపథ్యంలో గుండ్లపోచంపల్లి, జవహర్‌నగర్‌ను మినహాయించి మిగతా గ్రామాలను 8 నుంచి పది మున్సిపాలిటీలు చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు జిల్లా ప్రజాప్రతినిధులను సంప్రదించి తుది ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించాలని యోచిస్తోంది. వీటికి ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే రాష్ట్రంలోనే అత్యధిక మున్సిపాలిటీల(16)తో మన జిల్లా అగ్రస్థానంలో నిలవనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement