వారణాసి: ఆవులు, గేదెలపై జోకులేస్తూ విపక్ష పార్టీలు.. పశుసంపదపై ఆధారపడ్డ ఎనిమిది కోట్ల మంది ప్రజానీకాన్ని అవమానపరుస్తున్నాయని ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన వారణాసిలో పాడి పరిశ్రమ సహా రూ.2,095 కోట్ల విలువైన 27 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తర్వాత జరిగిన బహిరంగ సభలో పాల్గొని మోదీ ప్రసంగించారు. ‘ గోమాత మనకు మాతృ సమానురాలు. దేశానికే గర్వకారణమైన పశుసంపద(ఆవులు, గేదెలు..)పై ఆధారపడి దాదాపు ఎనిమిది కోట్ల జనాభా జీవనం కొనసాగిస్తోందనే విషయాన్ని విపక్షాలు మరిచాయి. ఆవులు, గేదెలు, ఆవు పేడపై జోకులేస్తూ విపక్ష పార్టీలు పాపం మూటగట్టుకుంటున్నాయి. వారు ఆవులపై ఎగతాళిగా మాట్లాడతారు. కానీ, మనకు గోమాత పూజనీయం’ అని మోదీ వ్యాఖ్యానించారు.
‘సమాజ్‌వాదీ పార్టీ పదకోశంలో మాఫియావాదీ, పరివార్‌వాదీ అనే పదాలుంటాయి. కానీ, మా డిక్షనరీలో ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ లాంటివే ఉంటాయి. కులం, మతం, వర్గం దృక్కోణంలోనే ఆలోచిస్తారు తప్ప ఉత్తరప్రదేశ్ అభివృద్ధి వారికి పట్టదు’ అని విమర్శించారు. ‘భావితరాల పరిరక్షణకు మళ్లీ సేంద్రీయ వ్యవసాయాన్ని అవలంభించాల్సిందే’ అని మోదీ అన్నారు. గత పది రోజుల వ్యవధిలో మోదీ తన సొంత పార్లమెంట్ స్థానం వారణాసిలో పర్యటించడం ఇది రెండోసారి. కర్ఖియాన్‌లో నిర్మించే భారీ డైరీ ప్రాజెక్టు ‘బనాస్ డైరీ శంకుల్’కు మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. రూ.475 కోట్ల వ్యయంతో 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసే ఈ డైరీ ప్రాజెక్టు ద్వారా రోజుకు 5 లక్షల లీటర్ల పాల దిగుబడి సాధ్యంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment