వర్గల్(గజ్వేల్): ‘ఏమమ్మా.. ఊరిలో అంతా బాగేనా’అని బుధవారం తన ఫామ్‌హౌస్ మామిడి తోటలో పనికోసం వచ్చిన మహిళలను సీఎం కేసీఆర్ పలకరించారు. దానికి వారు తమ గ్రామ సమస్యలు ఏకరువు పెట్టారు. ‘సారూ.. మా ఊరినిండా ఇబ్బందులే.. మోరీలు సరిగా తీస్తలేరు. నాలుగైదు రోజుల సంది నీళ్లు సక్కగొస్తలేవు. డబుల్ బెడ్రూం ఇండ్లు లేవు.. పింఛన్లు లేవు. చెక్కులు లేవు. మా గోస పట్టించుకునేటోళ్లు లేరు’అని ఫామ్‌హౌస్‌లో పనికోసం వెళ్లిన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాతూరు మహిళలు సీఎం కేసీఆర్‌తో మొరపెట్టుకున్నారు. వెంటనే స్పందించిన సీఎం అక్కడి నుంచే కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు.
సీఎం ఆదేశాల మేరకు గురువారం ఉదయం కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, గడా అధికారి హన్మంతరావు, జిల్లా అధికారులతో కలసి పాతూరు గ్రామం చేరుకున్నారు. గ్రామ పాఠశాల వద్ద శాఖల వారీగా విజ్ఞాపనలు స్వీకరించేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి 500 వరకు ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. అందులో పింఛన్లు, రెవెన్యూ సమస్యలు, డబుల్ బెడ్రూం ఇండ్లు, రేషన్‌కార్డులు వంటి సమస్యలపై వినతులు అందగా, కొన్నింటిని అక్కడికక్కడే విచా రణ జరిపి పరిష్కరించారు.
కలెక్టర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామంలో సమస్యల పరిష్కారానికి అధికారగణం వచ్చిందని, తక్షణమే పరిష్కరించగలిగే సమస్యలు పరిశీలించి, మిగతా సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. దీనిపై నివేదికను, ఇంకా పరిష్కారం కాని సమస్యలను సీఎం కేసీఆర్‌కు నివేదిస్తామని గ్రామస్తులకు చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సమస్యలు నివేదిస్తూ గ్రామస్తుల విజ్ఞాపనల జోరు కొనసాగింది. అధికారులు గ్రామానికి వచ్చి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment