ఆదిలాబాద్‌అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టం మొదలైంది. ఓటు హక్కు వినియోగించుకునే సమయం ఆసన్నమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. జిల్లాల్లోని ఆరు మండలాల్లో తొలి విడత ఎన్నికల జరగనున్నాయి. సుమారు 80 వేల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పోలింగ్ అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. తర్వాత అక్కడే చేతులెత్తే పద్ధతిలో ఉప సర్పంచ్ ఎన్నిక చేపడుతారు. కాగా పోలింగ్ జరగనున్న 103 పంచాయతీల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటేసేందుకు అధికారులు అన్ని సిద్ధం చేశారు.
దీంతో పాటు సర్వీసు ఓటర్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలింగ్ సిబ్బంది కూడా ఆన్‌లైన్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఆదివారం ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల్లో ఉదయం నుంచి పోలింగ్ సామగ్రిని సిద్ధం చేసుకున్న సిబ్బంది సాయంత్రం వారికి కేటాయించిన వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లోనే (గ్రామంలో) రాత్రికి బస చేసి ఉదయం నుంచి ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. అయితే సిబ్బందికి అందజేసిన కిట్‌లో ఆరోగ్య దృష్ట్యా కోల్‌గేట్, సబ్బులు, మందులు, టార్చ్‌లైట్, తదితర వస్తువులు ఉండేట్లు అధికారులు చర్యలు తీసుకున్నారు.
పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ
తొలి విడత ఎన్నికలు జరుగుతున్న 103 పంచాయతీల్లో ఐదు జీపీలు సమస్యాత్మకంగా ఉండగా, 17 జీపీలు అత్యంత సమస్యాత్మకంగా, 10 జీపీలు క్రిటికల్‌గా ఉన్నాయి. మిగతా 71 జీపీలు సాధారణంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సమస్యాత్మక జీపీలతో కలిపి ఎనిమిది చోట్ల వెబ్‌కాస్టింగ్ చేపట్టి జిల్లా, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్ సీన్‌ను లైవ్‌లో వీక్షించనున్నారు. మిగతా పంచాయతీల్లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మండలానికో ఫ్‌లైయిండ్ స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటు చేసి, ఒక్కో బృందంలో డిప్యూటీ తహశీల్దార్, ఆర్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్, వీడియోగ్రాఫర్‌తో కలిపి మొత్తం నలుగురు ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
దీంతోపాటు ఆయా జీపీల్లోని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా 80 మంది స్టేజ్–1, 153 మంది స్టేజ్–2 అధికారులను నియమించారు. ఎన్నికల్లో మొత్తం 1546 బ్యాలెట్ బాక్సులను వినియోగించగా, 1240 సిరా బాటిళ్లను అందుబాటులో ఉంచారు. కాగా, సర్పంచ్ ఎన్నికకు మొత్తం 1,11,200, వార్డు సభ్యులకు 85,550 బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నారు. కాగా ఎన్నికల నిర్వహణకు 23 జోనల్ అధికారులు, 28 మంది రూట్ అధికారులను నియమించారు.
103 సర్పంచ్, 638 వార్డులకు ఎన్నికలు
జిల్లాలోని ఆరు మండలాల్లో 153 పంచాయతీలు ఉండగా, 50 జీపీలు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. అయితే 103 పంచాయతీలకు సోమవారం పోలింగ్ జరగనుంది. తొలి విడతలోని 103 సర్పంచ్ స్థానాలకు 318 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 638 వార్డులకు 1465 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మండలాల వారీగా గమనిస్తే... ఆదిలాబాద్ మండలంలోని 22 జీపీలకు ఎన్నికలు జరగనుండగా, 67 మంది అభ్యర్థులు సర్పంచ్ బరిలో ఉన్నారు. ఇదే మండలంలో 159 వార్డులకు 349 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మావలలో 3 జీపీలు ఉండగా, 16 అభ్యర్థులు, 21 వార్డులకు 52 మంది అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. బేలలోని 26 జీపీలకు 71 మంది, 127 వార్డులకు 280 మంది, జైనథ్‌లో 36 సర్పంచ్ స్థానాలకు 96 మంది, 219 వార్డులకు 479 మంది అభ్యర్థులు తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక తాంసిలోని 5 జీపీలకు 24 మంది, 45 వార్డులకు 110 మంది, భీంపూర్‌లోని 11 జీపీలకు 44 మంది, 67 వార్డులకు 195 మంది బరిలో నిల్చున్నారు. వీరిలో పదవి ఎవరిని వరిస్తుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి
జిల్లాలోని 103 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఒక్కో పంచాయతీల్లో 4 నుంచి 6 వార్డుల వరకు ఉన్నాయి. ఒక్కో పంచాయతీలో 12 వార్డులు కూడా ఉన్నాయి. అయితే ఆయా పదవులకు పోలింగ్ నిర్వహించేందుకు వార్డుకోకటి చొప్పున పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. కాగా, రెండు రోజుల క్రితం నుంచి కొనసాగుతున్న పోల్ చిటీల పంపిణీ ఆదివారం కూడా కొనసాగుతోంది. కాగా, పంచాయతీల వారీగా ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసుకుని సిబ్బంది సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment