గులాబీ గాలికి.. ఎదురీది!  | TRS Win Telangana Panchayat Elections Nalgonda | Sakshi
Sakshi News home page

గులాబీ గాలికి.. ఎదురీది! 

Published Mon, Jan 28 2019 11:17 AM | Last Updated on Mon, Jan 28 2019 11:17 AM

TRS Win Telangana Panchayat Elections Nalgonda - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా గులాబీ గాలి వీస్తోంది. ఇప్పటి వరకు రెండు విడతలుగా 20 మండలాల పరిధిలోని 581 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నెల 30వ తేదీన నల్లగొండ డివిజన్‌లోని 256 పంచాయతీలకు పోలింగ్‌ జరగాల్సి ఉంది. గత నెలలో జరిగిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో జిల్లాలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో నాలుగు చోట్ల విజయఢంకా మోగించిన టీఆర్‌ఎస్‌ అదే ఊపును పంచాయతీ ఎన్నికల్లో కొనసాగిస్తోంది. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితమే అయినా.. ఆ పార్టీ మద్దతుదారులు అత్యధిక పంచాయతీల్లో సర్పంచ్‌లుగా విజయం సాధించారు. ఇంతగా టీఆర్‌ఎస్‌ గాలి వీస్తున్నా.. కొన్ని పంచా యతీల్లో ఈ గాలిని తట్టుకుని కాంగ్రెస్‌ మద్దతుదారులు కొందరు సర్పంచులుగా గెలిచారు.

తొలి, మలి విడతల్లో కలిపి కాంగ్రెస్‌ మద్దతుదారులు సర్పంచ్‌లుగా 168 పంచాయతీల్లో విజయం సాధించారు. అధికార టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుల గ్రామాలు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు  ప్రచారం చేసినా.. తమ పార్టీ మద్దతుదారులను గట్టెకించుకోలేకపోయారు. టీఆర్‌ఎస్‌ నాయకత్వం కట్టకట్టుకుని ప్రచారం చేసిన పంచాయతీల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులే సర్పంచ్‌లుగా గెలవడం, అత్యధిక వార్డులను కైవసం చేసుకోవడం వంటి అంశాలు గులాబీ నేతలను షాక్‌కు గురిచేస్తున్నాయి.

నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో..
నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో మొదటి, రెండో విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆయా మండలాల్లో మొత్తం 48 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. అనుముల మండలంలో కొత్తపల్లి, పంగవానికుంట గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. పెద్దవూర మండలంలో 5 చోట్ల కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో పర్వేదుల, కొత్తల్లూరు, శిరసనగండ్ల, కుంకుడుచెట్టు తండా, చలకుర్తి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తిరుమలగిరి మండలంలో 4 చోట్ల కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు శ్రీరాంపురం, అల్వాల, నాయకునితండా, తునుకినూతల గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నారు.

త్రిపురారం మండలంలో 16 చోట్ల కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఈ మండలంలో బాబుసాయిపేట, పెద్దదేవులపల్లి, బెజ్జికల్, వస్త్రాంతండా, అన్నారం, బొర్రాయిపాలెం, రాజేంద్రనగర్, చెన్నాయిపాలెం, సత్యనారాయణపురం, డొంకతండా, మాటూరు, దుగ్గెపల్లి, కామారెడ్డిగూడెం, నీలాయిగూడెం, అంజనపల్లి గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. అదే విధంగా నిడమనూరు మండలంలో 10 చోట్ల కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు.

ఈ మండలంలో నారమ్మగూడెం, తుమ్మడం, పార్వతీపురం, మార్లగడ్డతండా, రాజన్నగూడెం, శాఖాపురం, బంకాపురం, ఊట్కూరు, ముప్పారం, వడ్డెరగూడెం గ్రామ పంచాయతీలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. గుర్రంపోడు మండలంలో 11 చోట్ల కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ మండలంలో బుద్దరెడ్డిగూడెం, పాల్వాయి, జూనూతల, కాల్వపల్లి, తేరాటిగూడెం, నడికుడ, కొత్తలాపురం, తేనేపల్లి, పోచంపల్లి, ఎల్లమోనిగూడెం, ముల్కలపల్లి గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు.
 
ఎమ్మెల్యే నోముల ప్రచారం చేసినా..
నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మొదటి, రెండో విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థుల విజయానికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. త్రిపురారం మండలంలో అప్పలగూడెం, త్రిపురారం, మర్రిగూడెం గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేశారు. ఆయా గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించగా మాటూరు, చెన్నాయిపాలెం, డొంకతండా, అంజనపల్లి, నీలాయిగూడెం, సత్యనారాయణపురం, బెజ్జికల్‌ గ్రామాల్లో ఎమ్మెల్యే నోముల ప్రచారం చేసినా లాభం లేకుండా పోయింది.

ఈ పంచాయతీల్లో కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. అదే విధంగా పెద్దవూర మండలంలోని పర్వేదులలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థుల విజయానికి ప్రచారం చేసినా కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. ఈ గ్రామంలో 10 వార్డులకు పది కాంగ్రెస్‌ గెలుచుకుంది. నిడమనూరు మండలంలో బంకాపురం, నిడమనూరు, ముప్పారం, నారమ్మగూడెంలో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థుల విజయానికి ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రచారం ఉపయోగపడలేదు. ఈ పంచాయతీల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు.

మిర్యాలగూడ నియోజకవర్గంలో..
మిర్యాలగూడ డివిజన్‌లోనే అతిపెద్ద గ్రామ పంచాయతీగా ఉన్న దామరచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. దామరచర్ల మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు కలిసి కాంగ్రెస్‌ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కోటిరెడ్డిని టీఆర్‌ఎస్‌లో చేర్పించి తమ పార్టీ మద్దతుతో పోటీ చేయించారు. ఆయనతోపాటు స్థానిక టీడీపీ నాయకులను కూడా టీఆర్‌ఎస్‌లో చేర్పించారు. అయినా కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థి విజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఈ మండలంలోని పెద్ద గ్రామ పంచాయతీలైన వీర్లపాలెం, కొండ్రపోల్, నర్సాపురం, కల్లేపల్లి, మిర్యాలగూడ మండలంలోని తడకమళ్ల, ఉట్లపల్లి, ఆలగడప, తుంగపాడు, రాయినిపాలెం, గూ డూరు, మాడ్గులపల్లి మండల కేంద్రంతోపాటు మండలంలోని తోపుచర్ల, చిరుమర్తి, కన్నెకల్, వేములపల్లి మండలంలోని సల్కునూరు, కామేపల్లి, ఆమనగల్లు, అడవిదేవులపల్లి మండలంలోని ఉల్సాయిపాలెం పంచాయతీలో కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు.

ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రచారం చేసినా..
మిర్యాలగూడ నియోజకవర్గంలో తడకమళ్ల, ఉట్లపల్లి, ఆలగడప, తుంగపాడు గ్రామాల్లో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. అయినా కాంగ్రెస్‌ బలపర్చిన వారే విజయం సాధించారు. మిర్యాలగూడ మండలంలోని గూడూరు, రాయినిపాలెం, దామరచర్ల మండలంలోని దామరచర్ల, వీర్లపాలెం, కల్లేపల్లి, నర్సాపురం, కొండ్రపోల్‌ గ్రామాల్లో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఎన్నికల ప్రచారం చేశారు.

దామరచర్ల మండలం టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు దుర్గంపూడి నారాయణరెడ్డి స్వగ్రామమైన వీర్లపాలెంలో కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలిచారు. వేములపల్లి మండలంలోని సల్కునూరు, ఆమనగల్లు, కామేపల్లి, అడవిదేవులపల్లి మండలంలోని ఉల్సాయిపాలెం, మాడ్గులపల్లి మండలంలోని చిరుమర్తిలో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థుల విజయం కోసం ఎమ్మెల్యే భాస్కర్‌రావు ప్రచారం చేసినా కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. మాడ్గులపల్లి మండల కేంద్రంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థి విజయానికి ప్రచారం చేసినా కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. కన్నెకల్‌లో నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రచారం చేసినా కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించారు.

దేవరకొండ డివిజన్‌లో..
దేవరకొండ నియోజకవర్గ పరిధిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పంచాయతీలను కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. దేవరకొండ మండలంలో తాటికోల్, తెలుగుపల్లి, కొమ్మేపల్లి, గొట్టిముక్కల గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించిన వారు గెలుపొందారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ తాటికోల్, తెలుగుపల్లి, కొమ్మేపల్లి గ్రామపంచాయతీల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించినప్పటికీ స్పల్ప మెజార్టీతో కాంగ్రెస్‌ మద్దతుదారులు గెలిచారు. డిండి మండల పరిధిలోని మేజర్‌ గ్రామపంచాయతీలైన డిండి పట్టణం, కామేపల్లి, తవక్లాపూర్, టి.గౌరారం, ప్రతాప్‌నగర్, ఎర్రగుంటపల్లి గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు.

కాగా టీఆర్‌ఎస్‌ పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ డిండి, ఎర్రగుంటపల్లి గ్రామపంచాయతీల్లో రోడ్‌షో నిర్వహించినప్పటికీ పలితం లేదు. ఉమ్మడి చందంపేట మండలంలోని ప్రధాన పంచాయతీలైన కాచరాజుపల్లి, పాత కంబాలపల్లి, చిత్రియాల, రేకులగడ్డ, బుడ్డోనితండాలలో టీఆర్‌ఎస్‌ మద్దతుదారుల తరఫున ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులే గెలుపొందారు.

పెద్దఅడిశర్లపల్లి మండలంలో మేడారం, అంగడిపేట ఎక్స్‌రోడ్, చిల్కమర్రి, వద్దిపట్ల, పడమటితండా, అజ్మాపురం, నంభాపురం, కేశంనేనిపల్లి గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించిన వారు గెలుపొందారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ మేడారం, అంగడిపేట ఎక్స్‌రోడ్, చిల్కమర్రి, వద్దిపట్ల గ్రామపంచాయతీల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించినప్పటికీ  మెజార్టీతో కాంగ్రెస్‌ మద్దతుదారులు ఆయా పంచాయతీలను కైవసం చేసుకున్నారు. చింతపల్లి మండలంలో వెంకటంపేట, చింతపల్లి గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. టీఆర్‌ఎస్‌ పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌  ప్రచారం నిర్వహించినప్పటికీ భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ మద్దతుదారులే గెలుపొందారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement