మూడోవిడత షురూ..!
నల్లగొండ : పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడతకు బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి నోటిఫికేషన్ జారీచేశారు. నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. మొదటి విడత దేవరకొండ, రెండో విడత మిర్యాలగూడ డివిజన్లలో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. మూడో విడతకు సంబంధించి నల్లగొండ డివిజన్‌లోని 11 మండలాల్లోగల పంచాయతీల్లో ఎన్నికల కోసం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కాగా మొదటి రోజు అన్ని మండలాల్లోనూ నామినేషన్లు పడ్డాయి.
11 మండలాల్లో మూడో విడత పోరు..
నల్లగొండ డివిజన్ పరిధిలో 11 మండలాలు ఉన్నాయి. 11 మండలాల పరిధిలోని 257 గ్రామ పంచాయతీలు, 2,322 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో తొలిరోజు 11 మండలాల పరిధిలో 60 మంది సర్పంచ్ పదవులకు నామినేషన్ దాఖలు చేయగా 90 మంది ఆయా గ్రామాల్లోని వార్డులకు నామినేషన్లు వేశారు.
ముహూర్తాలు చూసుకుని..
కనుమ మంచి రోజు కాదని చాలా మంది నామినేషన్లు వేసేందుకు ముందుకు రాలేదు. జాతకాలు చూపించుకుని మంచిరోజు కాదనడంతో చాలామంది వెనుకడుగు వేశారని తెలుస్తోంది. మంచిరోజు కాకుండా నామినేషన్ వేస్తే కలిసిరాదేమోనన్న పెద్దల సూచనల మేరకు చాలా వరకు నామినేషన్ల దాఖలు వాయిదా వేసుకున్నట్లు చెప్తున్నారు. గురువారం ఏకాదశి మంచిరోజు కావడంతో అన్ని గ్రామ పంచాయతీలకు నామినేషన్ భారీగా వేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment