ముగిసిన మలివిడత ప్రచారం  | Telangana Panchayat Second Phase Election Campaigns End | Sakshi
Sakshi News home page

ముగిసిన మలివిడత ప్రచారం 

Published Thu, Jan 24 2019 10:26 AM | Last Updated on Tue, Aug 27 2019 4:45 PM

Telangana Panchayat Second Phase Election Campaigns End - Sakshi

మిర్యాలగూడ : గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల ప్రచారం బుధవారంతో ముగిసింది. ఈ నెల 17వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించారు.  నాటినుంచి ఎన్నికల ప్రచారం చేపట్టారు. బుధవారం సాయంత్రం వరకు ఇంటింటికీ తిరిగారు. మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలోని పది మండలాల్లో రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 276 సర్పంచ్‌లకు 2,376 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. నామినేషన్ల ఉప సంహరణ ముగిసిన అనంతరం 52 గ్రామ పంచాయతీలు, 585 వార్డుసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో 5 వార్డులకు నామినేషన్లు రాకపోవడం వల్ల ఎన్నికలు నిర్వహించడం లేదు. ఈ నెల 25వ తేదీన నిర్వహించే పోలింగ్‌లో 224 సర్పంచ్‌లకు, 1,786 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం డివిజన్‌ వ్యాప్తంగా 678 మంది సర్పంచ్‌ అభ్యర్థులు, 4125 మంది వార్డు సభ్యులకు పోటీలో ఉన్నారు.

ప్రలోభాలకు సిద్ధమైన అభ్యర్థులు
వారం రోజులపాటు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థుల విజయం కోసం స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, నల్లగొండ పార్లమెంట్‌ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి  ప్రచారం నిర్వహించారు. ఇక ప్రచారం ముగియడంతో ఒక్క రోజులో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి పోటీలో ఉన్న అభ్యర్థులు సిద్దమయ్యారు.

మద్యం, డబ్బు పంపిణీకి సిద్ధం
పోటా పోటీగా ఉన్న గ్రామ పంచాయతీల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి అభ్యర్థులు డబ్బు, మద్యం పంపిణీకి సిద్ధమయ్యారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో నామినేషన్‌ వేసిన నాటినుంచి కూడా మద్యం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. గ్రామాల్లో బెల్ట్‌షాపులు జోరుగా సాగుతున్నాయి. కొన్ని గ్రామాలలో సర్పంచ్‌కు ఓటు ఎటు వేసుకున్నా వార్డు సభ్యుడిగా మాత్రం నాకు ఓటెయ్యాలనే ప్రచారం కూడా సాగుతోంది. వార్డు, సభ్యులు సర్పంచ్‌లు కూడా వేర్వేరుగా ప్రచారం నిర్వహిస్తున్న గ్రామాలు సైతం ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement