హుజూర్‌నగర్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారపర్వం ముమ్మరమైంది. ఆయా ప్రాంతాల్లో ఆత్మీయ సభలు, సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఓటున్న ప్రతి పట్టభద్రుడినీ అభ్యర్థులు కలిసే సమయం లేకపోవడంతో సోషల్ మీడియానే ప్రధాన ప్రచార అస్త్రంగా ఎంచుకున్నారు. బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు మొదలుకొని స్వతంత్రుల వరకు అందరూ సామాజిక మాధ్యమాలనే నమ్ముకున్నారు. దయచేసి మీ ఓటు మాకే వేయాలంటూ మెసేజ్‌లు పంపుతున్నారు. అంతేకా కుండా తమనే గెలిపించాలని వాయిస్ కాల్స్ ద్వారా ఓట్లను అభ్యర్థిస్తున్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఈ సారి 71మంది పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. ఈనెల 14న పోలింగ్ జరగనుండగా.. రెండు రోజులముందే 12వ తేదీన ప్రచారం ముగియనుంది. దీంతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారపర్వం ఊపందుకుంది.
ఓట్లు రాబట్టేందుకు నానాతిప్పలు...
ఒకప్పుడు ఎన్నికలంటే పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఊరూరా, వాడవాడలా, ఇంటింటికీ తి రిగేవారు. గ్రామాల్లో ర్యాలీలు తీస్తూ... ఊరేగింపులు నిర్వహిస్తూ.. డప్పుచప్పుళ్లతో నానా హంగామా చేసేవారు. నాలుగు కూడళ్ల వద్ద సభలు నిర్వహించి నాలుగు మాటలు చెబుతూ ప్రచారం సాగించేవారు. కాని ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధి మూడు ఉమ్మడి జిల్లాల (వీటి పరిధిలో 11 జిల్లాలు)కు విస్తరించి ఉండడం అభ్యర్థులకు సమయం సరిపోకపోవడంతో సోషల్‌మీడియాపైనే ఆధారపడుతున్నా రు. అయితే సాధారణ ఓటర్లకు, పట్టభద్రుల ఓ ట ర్లకు ఎంతో వ్యత్యాసం ఉంది. గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు అయినందున ప్రతిఒక్కరి వద్ద దాదాపు స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ ఇలా పలు రకాల సామాజిక మాధ్యమాలను వినియోగిస్తుంటారు. దీంతో అభ్యర్థులు వీటిని ఉపయోగించుకుంటూ ఓట్లు రాబట్టేందుకు నానాతిప్పలు పడుతున్నారు. ఓటరు క్రమసంఖ్య, పోలింగ్ కేంద్రం నంబరు వివరాలు పెడుతూ ఓట్లు వేయాలని కోరుతున్నారు.
పెద్దసంఖ్యలో గ్రూపులు...
ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగడమే కాకుండా తమ తరుపున ప్రచారం చేసేందుకు పలువురిని బాధ్యులుగా నియమించుకున్నారు. నియోజకవర్గాల వారీగా వాట్సాప్ గ్రూపులు పెట్టి మీడియా ప్రతినిధులను, పట్టభద్రులను చేర్చి తమ ఎమ్మెల్సీ అభ్యర్థి చేసిన ప్రచారంపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యర్థుల వైఫల్యాలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ తమ బలం పెంచుకునేందుకు శక్తియుక్తులు ప్రదర్శిస్తున్నారు. ఇక ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ల ద్వారా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి పేరిట కనీసం 5 నుంచి 10 వరకు అకౌంట్లు తెరిచి ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ స్లిప్పుల పంపిణీ ప్రక్రియ పూర్తి కావొచ్చింది.
ఓటు ఎలా వేయాలో అవగాహన..
కేవలం అభ్యర్థుల ప్రచారానికి మాత్రమే కాకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలనే అంశంపై కూడా పార్టీలు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నాయి. సాధారణ ఎన్నికల కంటే పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు వేయడంలో చాలా తేడా ఉంటుంది. ప్రాధాన్యత ప్రకారం ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయొచ్చు. అయితే పట్టభద్రులే అయినా చాలా మందికి ఓటు వేసే విధానంపై అవగాహన ఉండదు. అందుకే ఓటు ఎలా వినియోగించుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తూ.. తమ అభ్యర్థికే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఆయా పార్టీలు కోరుతున్నాయి.
చదవండి : (ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలా? ఇవి ఫాలో అవండి)
(మాకు ఓటేయకుంటే బాగుపడరు.. మంత్రి శాపనార్ధాలు)
Comments
Please login to add a commentAdd a comment