సాక్షి, కామారెడ్డి : ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నెల 22న ఎన్నికలు జరుగనుండడంతో సమయాన్ని వృథా చేయకుండా జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు తమ తమ సంఘాల నాయకుల ద్వారా గ్రూపు మీటింగులు ఏర్పాటు చేసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మండలి ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులు, వారి తరఫున పని చేస్తున్న వారు గ్రూపు సమావేశాలు ఏర్పాటు చేసి ఓట్లు అడుగుతున్నారు.
జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లోనూ ప్రచారం జోరందుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం నామినేషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డితో పాటు చంద్రశేఖర్‌గౌడ్, రణజిత్‌మోహన్ తదితరులు జిల్లాలో ప్రచారం నిర్వహించారు. న్యాయవాదులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులు, ఇతర వర్గాలకు చెందిన పట్టభద్రులపై అభ్యర్థులు దృష్టి సారించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయా సంఘాలకు చెందిన అభ్యర్థులు జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాములు, కొండల్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలు సమావేశాలు ఏర్పాటు చేసి ఓట్లు అభ్యర్థించారు.
సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం..
వాట్సప్ గ్రూపుల్లో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దాదాపు ప్రతీ ఓటరు కూడా స్మార్ట్, అండ్రాయిడ్ ఫోన్లు వాడుతుండడంతో వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర మాధ్యమాల్లో ఓటర్లను ఆకర్శించడానికి రకరకాల పోస్టింగులు పెడుతున్నారు. కొందరు అభ్యర్థులు ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెడుతూ తమకు ఓటు వేయాలని వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌లు పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఫోన్ నంబర్లు సేకరించిన అభ్యర్థులు, వారి తరపు వ్యక్తులు ఓటర్లను ఆకర్శించడానికి పోస్టులు పెడుతున్నారు. అభ్యర్థులు తమ ప్రత్యేకతలను, ఏజెండాలను వివరిస్తూ గ్రూపులలో పోస్టింగ్‌లతో ప్రచారం చేస్తున్నారు.
ఓటర్ల చెంతకు పరుగులు...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూనే, మరో వైపు ఓటర్లను నేరుగా కలిసేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఒకటి నుంచి రెండు జిల్లాలకు ఒక్కో రోజు సమయాన్ని కేటాయిస్తూ జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాలను చుట్టేస్తున్నారు. రెండు రోజుల క్రితం పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పర్యటించారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీ మధుయాష్కిలతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి పట్టభద్రులు, న్యాయవాదులను కలిశారు.
కామారెడ్డికి చెందిన రణజిత్ మోహన్ సైతం నాలుగు జిల్లాలలో పర్యటిస్తూ ఏబీవీపీ పూర్వ నాయకులు, పట్టభద్రులను, విద్యాసంస్థల్లో పని చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగులను, ఉపాధ్యాయులను కలుస్తూ ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్‌కు చెందిన ఎడ్ల రవి సైతం పట్టభద్రుల ఎన్నికల బరిలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్‌రెడ్డి, అన్ని జిల్లాలోని ఉపాధ్యాయులను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థులు ఓటర్లను కలువడమే కాకుండా గ్రూపు సమావేశాలు నిర్వహిస్తూ తమకు అవకాశం కల్పించాలని అభ్యర్థిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment