వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. జనాలకు ఇదొక నిత్యవ్యవహారం(నిత్యావసరం!). కానీ, రాజకీయ పార్టీలకు, నేతలకు మాత్రం అవసరాన్ని బట్టి వాడకంగా మారింది. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో ఇది వాళ్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చే అంశం. త్వరగతిన ప్రజలకు చేరాలంటే సోషల్ మీడియాను మించిన వేగవంతమైన వేదిక వాళ్లకు మరొకటి కనిపించడం లేదు మరి. అందుకే.. అన్ని మాధ్యమాల్లో ఈసారి ఎన్నడూ లేనంతంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల Telangana Assembly Election 2023 కంటెంట్ వైరల్ అయ్యింది. నిస్సారంగా సాగుతున్న నేతల ప్రసంగాల నడుమ.. ఒక రకంగా ఎన్నికల సమరానికి ఊపు తెచ్చింది కూడా ఈ సామాజిక మాధ్యమ ప్రచారమే!
సోషల్ మీడియా ప్రచారంలో నేతల ఊకదంపుడు ఉపన్యాసాలుంటేనే సరిపోదు. జనంలోకి దూసుకెళ్లే స్థాయిలోనే కంటెంట్‌లో దమ్ముండాలి. అయితే ఇక్కడ నేతల డిజిటల్ క్యాంపెయినింగ్‌పైనా ఎన్నికల సంఘం నజర్ ఉంటుంది. అభ్యర్థుల ఖర్చు పరిమితి రూ.40లక్షలు దాటకూడదని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఉన్నాయి. కాబట్టి తమ ప్రచార ఖర్చులన్నింటిలోనే సోషల్ మీడియా నిర్వహణ కూడా ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత ఖాతాల నిర్వహణ.. వాటి కోసం ఎంత మంది పని చేస్తున్నారు.. వాళ్ల జీతభత్యాలు, ఇతర ఖర్చుల వివరాలు.. నేతల ప్రసంగాల్లో ఈసీ కోడ్ ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయా?.. నిశిత పరిశీలన ఉండాలి. అదే.. ఎన్నికల నిబంధనల్లో ఎక్కడా పార్టీల ఖర్చు పరిమితిపై ఆంక్షలు లేవు. దీంతో నేతల పేర్ల ప్రస్తావన తేకుండా.. పార్టీలను గెలిపించాలంటూ ప్రధానంగా సోషల్ మీడియా ప్రచారం ఉవ్వెత్తున సాగింది.
పాటలు.. పదనునైన తూటాలు
గులాబీల జెండలే రామక్క..
మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి..
సాలు దొర, సెలవు దొర అంటూ.. ప్రకటనలు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపాయి
స్వరాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగేసేలా చేసి.. ఇక్కడి ప్రజల నరాల్ని ఉత్తేజితం చేసిన తెలంగాణ పాటకు ఇప్పుడు రాజకీయ రంగు పలుముకుంది. ఉద్యమ గాయకులు, జానపద కళాకారులుగా పేరొందిన ఎందరో.. పూర్తిగా పార్టీలకు ఆస్థాన గాయకులుగా పని చేశారు. పొగడ్తలు, విమర్శలతో.. విడివిడిగా, కలగలిపి రూపొందించిన పాటలు ఈసారి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో Telangana Assembly Election 2023 ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్పెషల్ సాంగ్స్‌తో పాటుగా జానపద గేయాలకు.. ఆఖరికి సినిమా పాటల పేరడీలు సైతం జనాదరణతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో జబర్దస్త్ ఫేమ్ వేణు డైరెక్ట్ చేసిన బలగం సినిమాను సైతం.. ఏ నేత వదలకుండా ‘ప్రజలే మా బలగం’ అంటూ పోస్టర్లు వదిలారు.
ఇంటర్వ్యూల పర్వం..
వయసు తారతమ్యాలు లేకుండా యూట్యూబ్‌కు ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యం ఉంటోంది. ఫుల్ వీడియోలతో పాటు షార్ట్ వీడియోలపై ఎక్కువ స్క్రీన్ టైం గడిపేస్తున్నారు. అందుకే యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌ను తమ ప్రచారం కోసం వాడేసుకున్నాయి పొలిటికల్ పార్టీలు. రాజకీయ మేధావులు, ప్రముఖ జర్నలిస్టులతో పాటు అటు జాతీయస్థాయిలో.. ఇటు స్థానికంగానూ జనాల నోళ్లలో ఎక్కువగా నానుతుండే యూట్యూబర్లు, బుల్లి తెర నుంచి జనాలకు ఎక్కువగా పరిచయమున్న వాళ్లు.. రాజకీయ నేతల్ని ఇంటర్వ్యూలు చేశారు. లీడర్లు సైతం తమ ప్రచారానికి ఉపయోగపడే రీతిలో ఉండేలాగానే ఆ ఇంటర్వ్యూల్ని ప్లాన్ చేయించుకోవడం గమనార్హం. ఈ విషయంలో ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదురైనా సరే నేతలు తేలికగా తీసుకున్నారు. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ ఇంటర్వ్యూలలో పాడ్‌కాస్ట్, రేడియోలను సైతం వదల్లేదు.
వ్యక్తిగత దూషణలు
ఈసారి తెలంగాణలో ప్రధాన పార్టీల కీలక నేతల ప్రచారాల ప్రసంగాల్లో పెద్దగా ప్రత్యేకత ఏం కనిపించలేదు. సామెతలు, పిట్ట కథలతో సమాజాన్ని ఆకట్టుకునే కేసీఆర్ సైతం.. ప్రతిపక్షాలపై సాధారణ విమర్శలతోనే సరిపెట్టారు. అయితే వ్యక్తిగత విమర్శల పర్వం మాత్రం షరా మామూలుగా కొనసాగింది. ‘‘చిప్పకూడు తిన్న సిగ్గు రాలే..!!’’ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, బక్కోడు భూబకాసరుడు అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు.. ఓ మోతాడు డోసుతో సాగింది విమర్శల పర్వం. బడా-చోటా నేతలు ప్రచారంలో విమర్శలు-ప్రతివిమర్శలకు దిగి ఎన్నికల సమరాన్ని హీటెక్కించారు. రాజకీయ ప్రసంగాలు సాదాసీదాగా సాగినప్పటికీ.. అక్కడక్కడ మాత్రం ఆ విమర్శలు బూతుల దాకా వెళ్లాయి. ఉదాహరణకు.. మొన్నటిదాకా బీఆర్‌ఎస్‌లో ఉన్న ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్.. టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ కండువా కప్పేసుకుని కేసీఆర్‌పైనే వ్యక్తిగత దూషణలకు దిగారు. మైనంపల్లి, మల్లారెడ్డిల మధ్య విమర్శలైతే ఒక పరిధిని దాటాయి. ఇక.. పార్టీల మధ్య దూషణలు, విమర్శలు తీవ్రతరమై యాడ్స్ రూపేణా కనిపించడంతో ఎన్నికల సంఘం కలుగజేసుకుని చర్యలతో వాటిని కట్టడి చేసింది.
Credits: Nenu Mari Antha Yedvanaaaa Insta Page
ఇదేందయ్యా ఇది.. ఇది ఊహించలే!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు Telangana Assembly Election 2023 ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇదే. సాధారణంగా.. నేతలు తమ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలలో, పార్టీలు తమ అధికారిక పేజీలలో.. ఇవేగాక ఫలానా నేతల ‘సైన్యం’(ఆర్మీ) పేరిట పేజీలు, ఫ్యాన్ మేడ్ హ్యాండిల్స్ ఉండనే ఉన్నాయి. అయితే అదేం విచిత్రమో.. నిత్యం సినిమా డైలాగులు, ఫన్నీ సీన్ల ఫొటోలతో మీమ్స్ వేసి ఫాలోవర్లకు వినోదం పంచే సోషల్ మీడియా పేజీలు సైతం పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ఫలానా పేజీ ఫలానా రాజకీయ పార్టీకి.. వకాల్తా పుచ్చుకుని మరీ పోస్టింగ్‌లు చేశాయి. ప్రభుత్వ, పార్టీ విజయాలపై లబ్ధిదారులతో ప్రచారం. ఈసారి వ్యహారమంతా పార్టీల పరాజయాలపై పోస్టులు. నేతల స్పీచ్‌లలోని తప్పులు.. చేష్టలపై మీమ్స్.. ట్రోల్స్ ఇలా నడిచింది. ఆఖరికి.. పార్టీల మేనిఫెస్టోలను కూడా సోషల్ మీడియా పేజీలు ప్రచారం చేశాయంటే ఈసారి సోషల్ ప్రచారం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 29ఏళ్ల లోపు ఓటర్లు 72లక్షల మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 10 లక్షల మంది 18-19 వయసులో(కొత్త ఓటర్లు) ఉన్నవాళ్లు ఉన్నారు. ఇక 30పైబడిన వాళ్లలోనూ సామాజిక మాధ్యమాలలో టైంపాస్ బాపతు ఎక్కువే ఉన్నారు. వీళ్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగానే.. ఇలాంటి పేజీలను పొలిటికల్ పార్టీలు తమ ఆధీనంలోకి తీసుకుని ఉంటాయనేది స్పష్టంగా తెలుస్తోంది.
ట్రెండింగ్‌లో హెలికాఫ్టర్
ఎక్కడో ఆదిలాబాద్‌లో పార్టీ ప్రచార సభలో మాట్లాడిన నేత.. గంటన్నర తర్వాత సంగారెడ్డి మీటింగ్‌లో కనిపిస్తారు. ఆ తర్వాత గంటకు ఎక్కడో నల్లగొండ బహిరంగ సభలో ప్రసంగిస్తుంటారు. వందల కిలోమీటర్ల దూరం.. వాయువేగంతోనే వెళ్తే సాధ్యమవుతుంది కదా!. అలా ఈసారి ఎన్నికల్లో నేతల హెలికాఫ్టర్ల వాడకం ఎక్కువగా కనిపించింది. ప్రధాన పార్టీల అగ్రనేతలు మాత్రమే కాదు.. స్టార్ క్యాంపెయినర్‌ల జాబితాలో ఉన్నవాళ్లూ, కీలక నేతలు, ఓ మోస్తరు నేతలు సైతం విమానల్లో చక్కర్లు కొట్టేశారు. అదే సమయంలో.. రెంట్‌కు హెలికాఫ్టర్లను అందించే కంపెనీలకైతే ఫుల్ గిరాకీ నడిచింది. అలా హెలికాఫ్టర్ ట్రెండ్ కూడా సోషల్ మీడియాకు ఎక్కింది.
బర్రెలక్క
నాగర్ కర్నూల్ పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల కర్నె శిరీష.. ‘బర్రెలక్క’గా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ ఇప్పుడు. స్వతంత్ర అభ్యర్థినిగా నాగర్ కర్నూల్ బరిలో నిలిచిన శిరీష గురించి మీడియా, సోషల్ మీడియా విపరీతంగా చర్చించింది. చాలాకాలం కిందట.. డిగ్రీ చదివి కూడా నిరుద్యోగిగా ఉన్నానంటూ ఉద్యోగాల నోటిఫికేషన్.. నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ బర్రెలను మేపుతూ సరదాగా వీడియో అప్‌లోడ్ చేసి ‘బర్రెలక్క’ ఫేమస్ అయ్యింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నామినేషన్ వేయడం.. ప్రచారం చేసుకునేందుకు సైతం డబ్బులు లేవంటూ సోషల్ మీడియాలో విజ్ఞప్తులు.. ఆ వీడియోకు నిరుద్యోగ యువత కదిలివచ్చి చందాలేసుకుని మరీ ఆమె కోసం ప్రచారంలోకి దిగడం.. గుర్తుతెలియని వర్గం ఆమె బృందంపై దాడి చేయడం.. కన్నీళ్లతో ఆమె మాట్లాడిన మాటలు.. ఆ వెంటనే ఆమె లభించిన మేధోవర్గాల, కొందరు రాజకీయ నేతల మద్ధతు.. హైకోర్టు ఆదేశాలతో గన్‌మెన్ సెక్యూరిటీ.. ఈ పరిణామాలన్నింటిని నడుమ సోషల్‌మీడియాలో ఆమెకు విపరీతంగా పెరిగిన సానుభూతి రప్పించి ఈ దఫా ఎన్నికల్లో ఈమె గురించి చర్చించుకునేలా చేశాయి.
ఇవేకావు తమ నియోజకవర్గ ఓటర్లు ఏ ప్రాంతంలో ఉన్నా.. ఫోన్లు చేసి, మెసేజ్‌లు పంపి మీటింగ్‌లకు రమ్మని ఆహ్వానాలు పంపడం. వాట్సాప్‌లో సందేశాలు.. ఒక అడుగు ముందుకేసి రాజకీయ ప్రత్యర్థుల అవినీతి-అసమర్థతలను ఎండగట్టే రీతిలో రూపొందించిన కరపత్రాల పంపిణీ.. ఫేక్ ప్రచారాలు వాటిని ఖండిస్తూ వచ్చిన ఫ్యాక్ట్ చెకింగ్ కౌంటర్‌లు.. ఇలా షరామాములుగానే కనిపించింది.
నవంబర్ 28 సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో కథనం
Comments
Please login to add a commentAdd a comment