సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగుస్తుండటంతో పూర్తిగా క్షేత్రస్థాయిలో ప్రచారంపై ఫోకస్ చేయాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఈ నెల 28న ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో.. వచ్చే 20రోజుల పాటు పార్టీ యంత్రాంగం మొత్తాన్ని ప్రజాక్షేత్రంలోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలతోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావులతో రోడ్‌షోలు, సభల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
ప్రచార గడువు ముగిసేవరకు కూడా పార్టీ అభ్యర్థులు, ఇన్‌చార్జులు, ఇతర ముఖ్య నేతలెవరూ తమకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించిన చోటి నుంచి కదలవద్దని పార్టీ అధినేత ఆదేశించారు. పార్టీ తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న సెగ్మెంట్లతోపాటు బీఆర్‌ఎస్ అభ్యర్థులు బలహీనంగా ఉన్నచోట ఇప్పటికే సుమారు 60కి మందికిపైగా నాయకులకు ఇన్‌చార్జులుగా సమన్వయ బాధ్యతలు అప్పగించారు. కీలక నియోజకవర్గాల్లో స్థానికంగా పార్టీ యంత్రాంగాన్ని కదిలించి ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మండల స్థాయిలోనూ ఇన్‌చార్జులను నియమిస్తున్నారు.
అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండటంతో సొంత నియోజకవర్గం వదిలి ఇతర నియోజకవర్గాలకు వెళ్లేందుకు పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థులపై అసంతృప్తి ఉన్న నేతలను గుర్తించి వారికి ఇతర నియోజకవర్గాల్లో మండల స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనితో ఇటు ఆయా సెగ్మెంట్లలో పారీ్టకి నష్టం జరగకుండా చూసుకోవడంతోపాటు ఇతర నియోజకవర్గాల్లో బాధ్యతల అప్పగింత ద్వారా వారిని విశ్వాసంలోకి తీసుకుంటున్నామనే భరోసా ఇవ్వొచ్చని భావిస్తున్నారు.
దీపావళి తర్వాత మళ్లీ కేసీఆర్ సభలు
అభ్యర్థుల ఎంపిక, బీఫారాల జారీతోపాటు బహిరంగ సభల నిర్వహణలోనూ బీఆర్‌ఎస్ విపక్షాలతో పోలిస్తే దూకుడుగా వ్యవహరిస్తోంది. గత నెల 15న బీఫారాల జారీని ప్రారంభించడంతోపాటు హుస్నాబాద్‌లో బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. గత నెల 15 నుంచి ఈ నెల 9 వరకు 17 రోజుల వ్యవధిలో 43 చోట్ల కేసీఆర్ సభలు నిర్వహించారు. దీపావళి పండుగ నేపథ్యంలో 10 నుంచి 12వ తేదీ వరకు విరామం ప్రకటించారు.
తిరిగి ఈ నెల 13 నుంచి 28వ తేదీ వరకు 54 నియోజకవర్గాల్లో జరిగే సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. మొత్తంగా ఎన్నికల ప్రచారం ముగిసే నాటికి 97 నియోజకవర్గాలను చుట్టేయనున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోటీచేస్తున్న జనగామలో ఇప్పటికే ఒక బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.. ఆ నియోజకవర్గంలోని చేర్యాలలో ఈ నెల 18న రోడ్‌షో నిర్వహించనున్నారు. కేసీఆర్ ప్రచారంలో ఇదొక్కటి మాత్రమే రోడ్‌షో.
మిగతావన్నీ సభలే. ఈ నెల 28న గజ్వేల్‌లో ప్రచారంతో కేసీఆర్ పర్యటనలు ముగుస్తాయి. ఇక తొలి విడతలో సీఎం కేసీఆర్ సభలు జరిగిన నియోజకవర్గాల్లో కేటీఆర్, హరీశ్‌రావుల రోడ్‌షోలు, బహిరంగ సభలు ఉండే అవకాశముంది. మరోవైపు 38 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్లతో కూడిన జాబితాను బీఆర్‌ఎస్ గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి సమరి్పంచినట్టు తెలిసింది.
అఫిడవిట్లను జల్లెడ పడుతున్న లీగల్ సెల్
నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారం ముగుస్తుండగా పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను బీఆర్‌ఎస్ లీగల్ సెల్ జల్లెడ పడుతోంది. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లపై న్యాయపరమైన చిక్కులు తలెత్తిన నేపథ్యంలో.. వీలైనంత మేర నామినేషన్ల పత్రాల్లో లోపాలు దొర్లకుండా లోతుగా పరిశీలించి గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు.
వార్‌రూమ్‌లతో సమన్వయం
నియోజకవర్గాల స్థాయిలో వార్‌రూమ్‌లను ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్.. వాటిని హైదరాబాద్‌లోని సెంట్రల్ వార్‌రూమ్‌తో అనుసంధానం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్‌రావుల దిశానిర్దేశం మేరకు సెంట్రల్ వార్ రూమ్ ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వార్‌రూమ్‌లతో సమన్వయం చేసుకుంటోంది. ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రచార తీరుతెన్నులు తదితరాలపై ఎప్పటికప్పుడు ఆదేశాలు పంపుతోంది.
వాట్సాప్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలు వేదికగా కూడా పార్టీ ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు. వివిధ సంస్థల నుంచి అందుతున్న సర్వే నివేదికలు, ఫీడ్‌బ్యాక్ ఆధారంగా క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థులు, ప్రచార తీరుతెన్నులను బీఆర్‌ఎస్ పెద్దలు మదింపు చేస్తూ.. వ్యూహాలకు పదును పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment