Kamareddi District
-
తెల్లవారుజాము 3 గంటల నుంచే..
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు ఉదయం 3 గంటల నుంచే క్యూలైన్లో నిలబడ్డారు. ఉదయం 10 గంటల వరకు కూడా అధికారులు రాకపోవడంతో వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత వచ్చింది వచ్చినట్లుగానే లారీల్లో నుంచి యూరియా ఖాళీ అయిపోయింది. అయితే చాలామంది మొక్కజొన్న రైతులకు యూరియా అందలేదు. ఇప్పటి వరకు 538 టన్నుల యూరి యా పంపిణీ చేశామని, మరో 150 టన్నులు వస్తే ఈ సీజన్‌కు యూరియా సరిపోతుందని వ్యవసాయాధికారి ప్రజాపతి తెలిపారు. యూరి యా కోసం రైతులు ఆందోళన చెందనవసరం లేదన్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి
-
మనవడ్ని చంపిన తాతకు జీవిత ఖైదు
కామారెడ్డి క్రైం: కుటుంబ కలహాల నేపథ్యంలో మనవడిని హత్య చేయడమే కాకుండా సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన ఓ వృద్ధుడికి కామారెడ్డి జిల్లా అదనపు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. కామారెడ్డి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైద్య అమృతరావు కథనం ప్రకారం 2017 డిసెంబర్ 26న జరిగిన ఈ హత్యకేసు వివరాలిలా ఉన్నాయి. రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన వడ్ల వెంకటి కుమారుడైన స్వామి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. ఇంటి వద్ద తండ్రి వెంకటితో పాటు తల్లి పద్మ, భార్య కృష్ణవేణి, కొడుకు దేవేందర్‌స్వామి (12) ఉంటున్నారు. 2017 డిసెంబర్ 26న కుటుంబ సభ్యులంతా కలిసి పత్తి చేనులో పనికి వెళ్లారు. ఒంటి గంట ప్రాంతంలో దేవేందర్‌స్వామి చదువుకుంటానని చెప్పి ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత తాత వడ్ల వెంకటి కూడా ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే దేవేందర్‌స్వామి ఇంట్లో అనుమానాస్పదంగా చనిపోయాడు. తన మనవడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తాత వెంకటి చుట్టుపక్కల వారిని, పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించాడు. కానీ అతనిపై అనుమానంతో కోడలు కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన పోలీసులు నిందితుడిపై హత్య నేరం కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. అప్పటి భిక్కనూరు సీఐ కోటేశ్వర్రావు కేసును దర్యాపు చేసిన తర్వాత కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడి కోడలు కృష్ణవేణితో పాటు మరో 10 మంది సాక్ష్యాలను ప్రవేశపెట్టారు. హత్య జరిగిన సమయంలో తాత, మనవడు కాకుండా మరెవెరూ ఇంట్లో లేకపోవడం, వెంకటి స్వయంగా తన మనవడు ఆత్మహత్య చేసుకున్నాడని అందర్నీ నమ్మించడం, పోస్టుమార్టంలో అది హత్యగా తేలడంతో పాటు మిగతా సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు తాతే మనువడిని హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చింది. నేరం రుజువు కావడంతో వెంకటికి జీవితఖైదు, రూ.500 జరిమానా, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినందుకు గాను మరోమూడు నెలల సాధారణ జైలుశిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ కామారెడ్డి అదనపు జిల్లా న్యాయమూర్తి సత్తయ్య మంగళవారం తీర్పు వెల్లడించారు. -
జోరుగా ఎమ్మెల్సీ ప్రచారం
సాక్షి, కామారెడ్డి : ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నెల 22న ఎన్నికలు జరుగనుండడంతో సమయాన్ని వృథా చేయకుండా జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు తమ తమ సంఘాల నాయకుల ద్వారా గ్రూపు మీటింగులు ఏర్పాటు చేసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మండలి ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులు, వారి తరఫున పని చేస్తున్న వారు గ్రూపు సమావేశాలు ఏర్పాటు చేసి ఓట్లు అడుగుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లోనూ ప్రచారం జోరందుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం నామినేషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డితో పాటు చంద్రశేఖర్‌గౌడ్, రణజిత్‌మోహన్ తదితరులు జిల్లాలో ప్రచారం నిర్వహించారు. న్యాయవాదులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులు, ఇతర వర్గాలకు చెందిన పట్టభద్రులపై అభ్యర్థులు దృష్టి సారించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయా సంఘాలకు చెందిన అభ్యర్థులు జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాములు, కొండల్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలు సమావేశాలు ఏర్పాటు చేసి ఓట్లు అభ్యర్థించారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం.. వాట్సప్ గ్రూపుల్లో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దాదాపు ప్రతీ ఓటరు కూడా స్మార్ట్, అండ్రాయిడ్ ఫోన్లు వాడుతుండడంతో వాట్సాప్, ఫేస్బుక్ తదితర మాధ్యమాల్లో ఓటర్లను ఆకర్శించడానికి రకరకాల పోస్టింగులు పెడుతున్నారు. కొందరు అభ్యర్థులు ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెడుతూ తమకు ఓటు వేయాలని వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌లు పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఫోన్ నంబర్లు సేకరించిన అభ్యర్థులు, వారి తరపు వ్యక్తులు ఓటర్లను ఆకర్శించడానికి పోస్టులు పెడుతున్నారు. అభ్యర్థులు తమ ప్రత్యేకతలను, ఏజెండాలను వివరిస్తూ గ్రూపులలో పోస్టింగ్‌లతో ప్రచారం చేస్తున్నారు. ఓటర్ల చెంతకు పరుగులు... ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూనే, మరో వైపు ఓటర్లను నేరుగా కలిసేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఒకటి నుంచి రెండు జిల్లాలకు ఒక్కో రోజు సమయాన్ని కేటాయిస్తూ జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాలను చుట్టేస్తున్నారు. రెండు రోజుల క్రితం పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పర్యటించారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీ మధుయాష్కిలతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి పట్టభద్రులు, న్యాయవాదులను కలిశారు. కామారెడ్డికి చెందిన రణజిత్ మోహన్ సైతం నాలుగు జిల్లాలలో పర్యటిస్తూ ఏబీవీపీ పూర్వ నాయకులు, పట్టభద్రులను, విద్యాసంస్థల్లో పని చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగులను, ఉపాధ్యాయులను కలుస్తూ ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్‌కు చెందిన ఎడ్ల రవి సైతం పట్టభద్రుల ఎన్నికల బరిలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్‌రెడ్డి, అన్ని జిల్లాలోని ఉపాధ్యాయులను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థులు ఓటర్లను కలువడమే కాకుండా గ్రూపు సమావేశాలు నిర్వహిస్తూ తమకు అవకాశం కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. -
ఉలిక్కిపడిన గ్రామం : ఇద్దరి దారుణ హత్య
సాక్షి, కామారెడ్డి : బికనూర్ మండలం జంగంపల్లిలో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. గ్రామ కమిటీ అధ్యక్షులు రమేష్, కోశాధికారి రాములును అర్ధరాత్రి గ్రామ శివారులో అత్యంత పాశవికంగా బండరాళ్లతో మోది చంపారు. సంఘటన స్థలంలో మద్యం సీసాలు ఉన్నాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలో తగాదాలు జరిగినప్పుడు తరచుగా పంచాయితీలు నిర్వహించడం ఆనవాయితీ. మృతులిద్దరూ పంచాయతీ వివాదాల్లో తలదూర్చడం వల్లే హత్యలకు కారణాలుగా భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డి సందర్శించారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు జల్లెడ పడుతున్నారు. -
వడగండ్ల బీభత్సం
ఉత్తర తెలంగాణలో ఈదురుగాలులు, వడగండ్ల బీభత్సం కామారెడ్డిలో గంటపాటు రాళ్ల వాన.. భయాందోళనలో ప్రజలు పలుచోట్ల నేలకొరిగిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు సాక్షి, నెట్వర్క్: ఉత్తర తెలంగాణలో గురువారం ఈదురుగాలులు, వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. విద్యుత్ స్తంభా లు, భారీ చెట్లు నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చేతికొచ్చిన పంటలు నేలపాలవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం గంటపాటు పెద్ద వడగండ్లు పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సుమారు 500 గ్రాముల బరువు గల వడగళ్లు పడ్డాయి. బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, బిచ్కుంద, నిజాంసాగర్ తదితర ప్రాం తాల్లో పొట్ట దశలో వున్న వరిపంటకు తీవ్ర నష్టం జరిగింది. కామారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, రామారెడ్డి, సదాశివనగర్, గాంధారి, మాచారెడ్డి తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 10,581 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వరి, మొక్కజొన్న పంటలతో పాటు మినుము, పొద్దు తిరుగుడు పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 201 హెక్టార్లలో వివిధ రకాల ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు శాఖ అధికారులు భావిస్తున్నారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ యోగితారాణా గురువారం నవీపేట్, మాక్లూర్ మండలాల్లో పర్యటించి పంటలను పరిశీలించారు. అంధకారంలో 30కి పైగా గ్రామాలు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానకు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్తంభాలు నేలకొరగడంతో తీగలు తెగి పోయాయి. దీంతో నవీపేట్, నందిపేట్, మాక్లూర్ మండలాల్లోని సుమారు 30కిపైగా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మాక్లూర్ మండలంలో 40 ఇళ్లు పాక్షికంగా, 3 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. భూపాలపల్లి జిల్లాలో నీటిపాలైన మిర్చి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం, కన్నాయిగూడెంతో పాటు వాజేడు, కాటారం, కాళేశ్వరం మండలాల్లో మిర్చితో పాటు పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల మీద ఉన్న మిర్చి నీటిపాలైంది. చేతికొచ్చిన పత్తి, మొక్కజొన్న మట్టిపాలయ్యాయి. కాటారం ఒడిపిలవంచలో పిడుగు పడి వేముల రమేశ్‌కు చెందిన 6 క్వింటాళ్ల పత్తి కాలిపోయింది. రాకపోకలకు అంతరాయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు ప్రాంతాల్లో మిర్చి, మొక్కజొన్న మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాల్వంచలోని ఎన్ఎండీసీ వద్ద భారీ చెటుల విరిగి రోడ్డుకు అడ్డంగా పడడంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. కొత్తగూడెం, ఇల్లెందు, టేకులపల్లి, అశ్వారావుపేట తదితర ప్రాంతాల్లోనూ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కొత్తగూడెం అనిశెట్టిపల్లి వద్ద రోడ్డుపక్కన నిలిపిన లారీలపై చెట్లు విరిగి పడడంతో అవి ధ్వంసమయ్యాయి. కందులు నీటిపాలు అకాల వర్షానికి ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో వందలాది క్వింటాళ్ల కందులు నీటిపాలయ్యాయి. సోమవారం కందుల కొనుగోళ్లు ప్రారంభం కావడంతో మండలాల నుంచి రైతులు మార్కెట్‌కు తరలించా రు. దీంతో నాలుగు ప్లాట్‌ఫారాలు నిండిపోయాయి. గురువారం కురిసిన వర్షానికి సంచుల్లోని కందులు తడిసిపోయాయి. కొన్ని కుప్పలు కొట్టుకుపోయాయి. -
నవోత్సాహంతో పనిచేయాలి
అప్పుడే తగిన గుర్తింపు సమర్థంగా పనిచేసిన వారికి ప్రోత్సాహం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఎన్.సత్యనారాయణ అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక సాక్షి, కామారెడ్డి : కామారెడ్డి నూతన జిల్లాగా ఏర్పడినందున పాత పద్ధతులకు స్వస్తిపలికి నూతన ఒరవడితో, రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగాలని కలెక్టర్ ఎన్.సత్యనారాయణ సూచించారు. అప్పుడే తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. గురువారం సాయంత్రం ఆయన కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమర్థవంతంగా పనిచేసే అధికారులకు ప్రోత్సాహం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి కృషిచేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజల మెప్పు పొందాలన్నారు. కామారెడ్డి జిల్లాలోని ఆయా కార్యాలయాల బోర్డులను మార్చాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూకు సంబంధించి మ్యూటేషన్ల అమలు చేయాలని, పట్టాదారు పాసుపుస్తకాలను ఆన్లైన్ ద్వారా పూర్తి చేసి రైతులకు అందించాలన్నారు. సాదాబైనామాలపై దృష్టి సారించి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పూర్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ పరమైన సమస్యలు ఎక్కడా పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. ఎఫ్‌లైన్ పిటీషన్లకు సంబంధించి సర్వే ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. పంటలకు సంబంధించిన వివరాలను కూడా రిజిస్టర్లలో నమోదు చేయాలని సూచించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించి ఐహెచ్ఎల్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు. మండలాల్లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పూర్తిచేయాలని, ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పంచాయతీల్లో వంద శాతం పన్నులు వసూలయ్యేలా చర్యలు తీసుకోవాలని డీపీవోను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సత్తయ్య, ఆర్డీవో గడ్డం నగేశ్ తదితరులు పాల్గొన్నారు.