ఉత్తర తెలంగాణలో ఈదురుగాలులు, వడగండ్ల బీభత్సం
కామారెడ్డిలో గంటపాటు రాళ్ల వాన.. భయాందోళనలో ప్రజలు
పలుచోట్ల నేలకొరిగిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు
సాక్షి, నెట్‌వర్క్: ఉత్తర తెలంగాణలో గురువారం ఈదురుగాలులు, వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. విద్యుత్ స్తంభా లు, భారీ చెట్లు నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చేతికొచ్చిన పంటలు నేలపాలవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం గంటపాటు పెద్ద వడగండ్లు పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సుమారు 500 గ్రాముల బరువు గల వడగళ్లు పడ్డాయి.
బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, బిచ్కుంద, నిజాంసాగర్ తదితర ప్రాం తాల్లో పొట్ట దశలో వున్న వరిపంటకు తీవ్ర నష్టం జరిగింది. కామారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, రామారెడ్డి, సదాశివనగర్, గాంధారి, మాచారెడ్డి తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 10,581 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వరి, మొక్కజొన్న పంటలతో పాటు మినుము, పొద్దు తిరుగుడు పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 201 హెక్టార్లలో వివిధ రకాల ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు శాఖ అధికారులు భావిస్తున్నారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ యోగితారాణా గురువారం నవీపేట్, మాక్లూర్ మండలాల్లో పర్యటించి పంటలను పరిశీలించారు.
అంధకారంలో 30కి పైగా గ్రామాలు
ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానకు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్తంభాలు నేలకొరగడంతో తీగలు తెగి పోయాయి. దీంతో నవీపేట్, నందిపేట్, మాక్లూర్ మండలాల్లోని సుమారు 30కిపైగా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మాక్లూర్ మండలంలో 40 ఇళ్లు పాక్షికంగా, 3 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
భూపాలపల్లి జిల్లాలో నీటిపాలైన మిర్చి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం, కన్నాయిగూడెంతో పాటు వాజేడు, కాటారం, కాళేశ్వరం మండలాల్లో మిర్చితో పాటు పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల మీద ఉన్న మిర్చి నీటిపాలైంది. చేతికొచ్చిన పత్తి, మొక్కజొన్న మట్టిపాలయ్యాయి. కాటారం ఒడిపిలవంచలో పిడుగు పడి వేముల రమేశ్‌కు చెందిన 6 క్వింటాళ్ల పత్తి కాలిపోయింది.
రాకపోకలకు అంతరాయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు ప్రాంతాల్లో మిర్చి, మొక్కజొన్న మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాల్వంచలోని ఎన్‌ఎండీసీ వద్ద భారీ చెటుల విరిగి రోడ్డుకు అడ్డంగా పడడంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. కొత్తగూడెం, ఇల్లెందు, టేకులపల్లి, అశ్వారావుపేట తదితర ప్రాంతాల్లోనూ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కొత్తగూడెం అనిశెట్టిపల్లి వద్ద రోడ్డుపక్కన నిలిపిన లారీలపై చెట్లు విరిగి పడడంతో అవి ధ్వంసమయ్యాయి.
కందులు నీటిపాలు
అకాల వర్షానికి ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో వందలాది క్వింటాళ్ల కందులు నీటిపాలయ్యాయి. సోమవారం కందుల కొనుగోళ్లు ప్రారంభం కావడంతో మండలాల నుంచి రైతులు మార్కెట్‌కు తరలించా రు. దీంతో నాలుగు ప్లాట్‌ఫారాలు నిండిపోయాయి. గురువారం కురిసిన వర్షానికి సంచుల్లోని కందులు తడిసిపోయాయి. కొన్ని కుప్పలు కొట్టుకుపోయాయి.
వడగండ్ల బీభత్సం
Published Fri, Mar 17 2017 3:27 AM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM
Advertisement