rain devastation
-
శ్రీవారి మెట్టు మార్గంలో గాలివాన బీభత్సం
-
10 వేల ఎకరాల్లో పంట నష్టం
వడగళ్ల వాన బీభత్సంతో నష్టపోయిన రైతులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన వ్యవసాయ శాఖ సాక్షి, హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో పంట చేతికొస్తుందని రైతు ఆనందంగా ఉన్న సమయంలో అకాల వర్షం వారి ఆశలపై నీళ్లు చల్లింది. సిద్ధంగా ఉన్న వరి, మొక్కజొన్న చేతికొస్తే కొంతలో కొంత ఉపశమనం కలుగుతుందన్న తరుణంలో ‘వడగళ్లు’విరుచుకు పడ్డాయి. మూడు రోజులుగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానతో 10 వేల ఎకరాల్లో పంట ధ్వంసమైంది. నష్టం వివరాలపై వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాను గురువారం ప్రభుత్వానికి అందజేసింది. సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నష్టం భారీగా ఉండగా, జగిత్యాల, జనగామ, రంగారెడ్డి, నల్లగొండ, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కొంతమేర వరి, మొక్కజొన్న పంట ధ్వంసమైంది. కొన్ని ప్రాంతాల్లో మామిడికి కూడా భారీ నష్టం వాటిల్లింది. వరి గింజ గట్టిపడే సమయంలో పంట నష్ట పోవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. సిద్ధిపేట జిల్లాలో అత్యధికంగా నష్టం.. సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 3,958 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. భువనగిరి యదాద్రి జిల్లాలో 3,792 ఎకరాలు, జనగామలో 699 ఎకరాలు, రాజన్న సిరిసిల్లలో 540 ఎకరాలు, రంగారెడ్డిలో 490 ఎకరాలు, నల్లగొండలో 322 ఎకరాలు, జగిత్యాలలో 50 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. వడగళ్ల ధాటికి మామిడి కాయలు నేలరాలాయి. సిద్దిపేట జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో పంట నష్టం జరిగిన తీరును మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. తమను ఆదుకోవాలంటూ పలువురు రైతులు ఆయన కాళ్లపై పడి వేడుకున్నారు. వడగళ్ల వల్ల మొత్తం ఏడు జిల్లాల్లోని 58 గ్రామాల్లో 1,277 మంది రైతులు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. -
వడగండ్ల బీభత్సం
ఉత్తర తెలంగాణలో ఈదురుగాలులు, వడగండ్ల బీభత్సం కామారెడ్డిలో గంటపాటు రాళ్ల వాన.. భయాందోళనలో ప్రజలు పలుచోట్ల నేలకొరిగిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు సాక్షి, నెట్వర్క్: ఉత్తర తెలంగాణలో గురువారం ఈదురుగాలులు, వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. విద్యుత్ స్తంభా లు, భారీ చెట్లు నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చేతికొచ్చిన పంటలు నేలపాలవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం గంటపాటు పెద్ద వడగండ్లు పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సుమారు 500 గ్రాముల బరువు గల వడగళ్లు పడ్డాయి. బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, బిచ్కుంద, నిజాంసాగర్ తదితర ప్రాం తాల్లో పొట్ట దశలో వున్న వరిపంటకు తీవ్ర నష్టం జరిగింది. కామారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, రామారెడ్డి, సదాశివనగర్, గాంధారి, మాచారెడ్డి తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 10,581 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వరి, మొక్కజొన్న పంటలతో పాటు మినుము, పొద్దు తిరుగుడు పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 201 హెక్టార్లలో వివిధ రకాల ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు శాఖ అధికారులు భావిస్తున్నారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ యోగితారాణా గురువారం నవీపేట్, మాక్లూర్ మండలాల్లో పర్యటించి పంటలను పరిశీలించారు. అంధకారంలో 30కి పైగా గ్రామాలు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానకు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్తంభాలు నేలకొరగడంతో తీగలు తెగి పోయాయి. దీంతో నవీపేట్, నందిపేట్, మాక్లూర్ మండలాల్లోని సుమారు 30కిపైగా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మాక్లూర్ మండలంలో 40 ఇళ్లు పాక్షికంగా, 3 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. భూపాలపల్లి జిల్లాలో నీటిపాలైన మిర్చి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం, కన్నాయిగూడెంతో పాటు వాజేడు, కాటారం, కాళేశ్వరం మండలాల్లో మిర్చితో పాటు పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల మీద ఉన్న మిర్చి నీటిపాలైంది. చేతికొచ్చిన పత్తి, మొక్కజొన్న మట్టిపాలయ్యాయి. కాటారం ఒడిపిలవంచలో పిడుగు పడి వేముల రమేశ్‌కు చెందిన 6 క్వింటాళ్ల పత్తి కాలిపోయింది. రాకపోకలకు అంతరాయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు ప్రాంతాల్లో మిర్చి, మొక్కజొన్న మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాల్వంచలోని ఎన్ఎండీసీ వద్ద భారీ చెటుల విరిగి రోడ్డుకు అడ్డంగా పడడంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. కొత్తగూడెం, ఇల్లెందు, టేకులపల్లి, అశ్వారావుపేట తదితర ప్రాంతాల్లోనూ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కొత్తగూడెం అనిశెట్టిపల్లి వద్ద రోడ్డుపక్కన నిలిపిన లారీలపై చెట్లు విరిగి పడడంతో అవి ధ్వంసమయ్యాయి. కందులు నీటిపాలు అకాల వర్షానికి ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో వందలాది క్వింటాళ్ల కందులు నీటిపాలయ్యాయి. సోమవారం కందుల కొనుగోళ్లు ప్రారంభం కావడంతో మండలాల నుంచి రైతులు మార్కెట్‌కు తరలించా రు. దీంతో నాలుగు ప్లాట్‌ఫారాలు నిండిపోయాయి. గురువారం కురిసిన వర్షానికి సంచుల్లోని కందులు తడిసిపోయాయి. కొన్ని కుప్పలు కొట్టుకుపోయాయి. -
వర్ష బీభత్సం
రాష్ట్రంలో రెండురోజుల పాటు కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా వందలాది ఎకరాల్లో పంటనష్టం సంభవించింది. దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: కన్యాకుమారి సముద్రతీరంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు తడిసిముద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పెద్ద శబ్దాలతో కూడిన వడగళ్లవాన ప్రజలను భయపెట్టింది. ఉరుములతో కూడిన పిడుగులతో అనేక జిల్లాలు దద్దరిల్లాయి. వరదనీటితో అనేక చెరువులు, ఏరులు పొంగిపొర్లాయి. గత కొన్ని రోజులుగా కొన్ని జిల్లాల్లో అడపాదడపా వర్షాలు పడుతున్నా గురువారం రాత్రి అనేక చోట్ల వర్షం తీవ్రరూపం దాల్చింది. తిరునెల్వేలీలో కుండపోత వర్షంతో అక్కడి కుట్రాలం జలపాతం భీకరంగా మారింది. దీంతో పర్యాటకులకు నిషేధం విధించారు. చెన్నై తండయార్‌పేటలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురుస్తుండగా పిడుగు పడడంతో ఆ ప్రాంతానికి చెందిన 10 ఇళ్లలోని పది టీవీలు కాలిపోయాయి. వాదరవాక్కంలో మదియళగన్ అనే వ్యక్తి ఇంటిపై పిడుగుపడి ఇల్లు కాలిపోయింది. దక్షిణాది జిల్లాల్లో వందలాది ఎకరాల్లో అరటితోట నేలమట్టమైంది. తంజావూరు, తిరువారూరులలో వందల ఏళ్లనాటి వృక్షాలు నేలకొరిగాయి. మరో 24 గంటల్లో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. శుక్రవారం రాత్రి సింగపూరు నుంచి తిరుచ్చికి చేరుకున్న విమానం భారీ వర్షాల కారణంగా రన్‌వేలో దిగలేక పోయింది. దీంతో ఆ విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో దింపి శనివారం ఉదయం తిరుచ్చికి పంపారు. చెన్నై, కన్యాకుమారి, తిరుచ్చిరాపల్లి, తూత్తూకూడి, నాగపట్నం జిల్లాలో భారీ వర్షాలను చవిచూశాయి. పొంగిపొర్లుతున్న చెరువులు: చెన్నై నగరం, శివార్లలో కురిసిన భారీ వర్షాల కారణంగా పూండి, పుళల్, చెంబరబాక్కం, చోళవరం చెరువుల్లోకి భారీస్థాయిలో వరదనీరు చేరింది. పూండి చెరువుకు రికార్డు స్థాయిలో ఒకేరోజు 84 ఘనపుటడుగుల నీరు చేరుకుంది. పూండి పరిసరాల్లో శుక్రవారం రాత్రి 45 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పుళల్‌లో 29, చెంబరబాక్కంలో 32, చోళవరంలో 16 మిల్లీ మీటర్ల వర్షం పడింది. ఆరుగురి మృతి: భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం ఆరుగురు మృతి చెందారు. నెల్లైలో పొలంపనికి వెళ్లి ఇంటికి వస్తున్న అభిషేక్ (19) అనే యువకునిపై పిడుగుపడడంతో ప్రాణాలు విడిచాడు. పెరుంబాక్కం గ్రామంలో భాస్కర్, నటరాజన్, వైకుంఠరాజన్ పిడుగుకు బలైయ్యారు. నాగపట్నంలో పూల్పాండి పిడుగుపాటుతోమృతి చెందాడు. దుర్గాదేవి అనే బాలిక కుట్రాలం జలపాతంలో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచింది. తిరుచ్చిలో గురువమ్మాళ్ తెగిన విద్యుత్ వైరుపై కాలువేసి విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది.