10 వేల ఎకరాల్లో పంట నష్టం
వడగళ్ల వాన బీభత్సంతో నష్టపోయిన రైతులు
ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన వ్యవసాయ శాఖ
సాక్షి, హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో పంట చేతికొస్తుందని రైతు ఆనందంగా ఉన్న సమయంలో అకాల వర్షం వారి ఆశలపై నీళ్లు చల్లింది. సిద్ధంగా ఉన్న వరి, మొక్కజొన్న చేతికొస్తే కొంతలో కొంత ఉపశమనం కలుగుతుందన్న తరుణంలో ‘వడగళ్లు’విరుచుకు పడ్డాయి. మూడు రోజులుగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానతో 10 వేల ఎకరాల్లో పంట ధ్వంసమైంది.
నష్టం వివరాలపై వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాను గురువారం ప్రభుత్వానికి అందజేసింది. సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నష్టం భారీగా ఉండగా, జగిత్యాల, జనగామ, రంగారెడ్డి, నల్లగొండ, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కొంతమేర వరి, మొక్కజొన్న పంట ధ్వంసమైంది. కొన్ని ప్రాంతాల్లో మామిడికి కూడా భారీ నష్టం వాటిల్లింది. వరి గింజ గట్టిపడే సమయంలో పంట నష్ట పోవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
సిద్ధిపేట జిల్లాలో అత్యధికంగా నష్టం..
సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 3,958 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. భువనగిరి యదాద్రి జిల్లాలో 3,792 ఎకరాలు, జనగామలో 699 ఎకరాలు, రాజన్న సిరిసిల్లలో 540 ఎకరాలు, రంగారెడ్డిలో 490 ఎకరాలు, నల్లగొండలో 322 ఎకరాలు, జగిత్యాలలో 50 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. వడగళ్ల ధాటికి మామిడి కాయలు నేలరాలాయి.
సిద్దిపేట జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో పంట నష్టం జరిగిన తీరును మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. తమను ఆదుకోవాలంటూ పలువురు రైతులు ఆయన కాళ్లపై పడి వేడుకున్నారు. వడగళ్ల వల్ల మొత్తం ఏడు జిల్లాల్లోని 58 గ్రామాల్లో 1,277 మంది రైతులు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.