రాష్ట్రంలో రెండురోజుల పాటు కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా వందలాది ఎకరాల్లో పంటనష్టం సంభవించింది. దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: కన్యాకుమారి సముద్రతీరంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు తడిసిముద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పెద్ద శబ్దాలతో కూడిన వడగళ్లవాన ప్రజలను భయపెట్టింది. ఉరుములతో కూడిన పిడుగులతో అనేక జిల్లాలు దద్దరిల్లాయి. వరదనీటితో అనేక చెరువులు, ఏరులు పొంగిపొర్లాయి. గత కొన్ని రోజులుగా కొన్ని జిల్లాల్లో అడపాదడపా వర్షాలు పడుతున్నా గురువారం రాత్రి అనేక చోట్ల వర్షం తీవ్రరూపం దాల్చింది. తిరునెల్వేలీలో కుండపోత వర్షంతో అక్కడి కుట్రాలం జలపాతం భీకరంగా మారింది.
దీంతో పర్యాటకులకు నిషేధం విధించారు. చెన్నై తండయార్‌పేటలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురుస్తుండగా పిడుగు పడడంతో ఆ ప్రాంతానికి చెందిన 10 ఇళ్లలోని పది టీవీలు కాలిపోయాయి. వాదరవాక్కంలో మదియళగన్ అనే వ్యక్తి ఇంటిపై పిడుగుపడి ఇల్లు కాలిపోయింది. దక్షిణాది జిల్లాల్లో వందలాది ఎకరాల్లో అరటితోట నేలమట్టమైంది. తంజావూరు, తిరువారూరులలో వందల ఏళ్లనాటి వృక్షాలు నేలకొరిగాయి. మరో 24 గంటల్లో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. శుక్రవారం రాత్రి సింగపూరు నుంచి తిరుచ్చికి చేరుకున్న విమానం భారీ వర్షాల కారణంగా రన్‌వేలో దిగలేక పోయింది. దీంతో ఆ విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో దింపి శనివారం ఉదయం తిరుచ్చికి పంపారు. చెన్నై, కన్యాకుమారి, తిరుచ్చిరాపల్లి, తూత్తూకూడి, నాగపట్నం జిల్లాలో భారీ వర్షాలను చవిచూశాయి.
పొంగిపొర్లుతున్న చెరువులు:
చెన్నై నగరం, శివార్లలో కురిసిన భారీ వర్షాల కారణంగా పూండి, పుళల్, చెంబరబాక్కం, చోళవరం చెరువుల్లోకి భారీస్థాయిలో వరదనీరు చేరింది. పూండి చెరువుకు రికార్డు స్థాయిలో ఒకేరోజు 84 ఘనపుటడుగుల నీరు చేరుకుంది. పూండి పరిసరాల్లో శుక్రవారం రాత్రి 45 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పుళల్‌లో 29, చెంబరబాక్కంలో 32, చోళవరంలో 16 మిల్లీ మీటర్ల వర్షం పడింది.
ఆరుగురి మృతి:
భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం ఆరుగురు మృతి చెందారు. నెల్లైలో పొలంపనికి వెళ్లి ఇంటికి వస్తున్న అభిషేక్ (19) అనే యువకునిపై పిడుగుపడడంతో ప్రాణాలు విడిచాడు. పెరుంబాక్కం గ్రామంలో భాస్కర్, నటరాజన్, వైకుంఠరాజన్ పిడుగుకు బలైయ్యారు. నాగపట్నంలో పూల్‌పాండి పిడుగుపాటుతోమృతి చెందాడు. దుర్గాదేవి అనే బాలిక కుట్రాలం జలపాతంలో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచింది. తిరుచ్చిలో గురువమ్మాళ్ తెగిన విద్యుత్ వైరుపై కాలువేసి విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది.
వర్ష బీభత్సం
Published Sun, Apr 26 2015 2:09 AM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM
Advertisement
Advertisement