అప్పుడే తగిన గుర్తింపు
సమర్థంగా పనిచేసిన వారికి ప్రోత్సాహం
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఎన్.సత్యనారాయణ
అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
సాక్షి, కామారెడ్డి :
కామారెడ్డి నూతన జిల్లాగా ఏర్పడినందున పాత పద్ధతులకు స్వస్తిపలికి నూతన ఒరవడితో, రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగాలని కలెక్టర్ ఎన్.సత్యనారాయణ సూచించారు. అప్పుడే తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. గురువారం సాయంత్రం ఆయన కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమర్థవంతంగా పనిచేసే అధికారులకు ప్రోత్సాహం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి కృషిచేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజల మెప్పు పొందాలన్నారు.
కామారెడ్డి జిల్లాలోని ఆయా కార్యాలయాల బోర్డులను మార్చాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూకు సంబంధించి మ్యూటేషన్ల అమలు చేయాలని, పట్టాదారు పాసుపుస్తకాలను ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేసి రైతులకు అందించాలన్నారు. సాదాబైనామాలపై దృష్టి సారించి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పూర్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ పరమైన సమస్యలు ఎక్కడా పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. ఎఫ్‌లైన్ పిటీషన్లకు సంబంధించి సర్వే ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. పంటలకు సంబంధించిన వివరాలను కూడా రిజిస్టర్లలో నమోదు చేయాలని సూచించారు.
స్వచ్ఛభారత్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించి ఐహెచ్‌ఎల్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు. మండలాల్లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పూర్తిచేయాలని, ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పంచాయతీల్లో వంద శాతం పన్నులు వసూలయ్యేలా చర్యలు తీసుకోవాలని డీపీవోను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సత్తయ్య, ఆర్డీవో గడ్డం నగేశ్ తదితరులు పాల్గొన్నారు.