ప్రాదేశిక పోరులో భాగంగా మలి విడత ప్రచారానికి బుధవారం సాయంత్రం 5 గంటలతో తెరపడింది. ఈ దఫాలో జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్, వెల్దుర్తి, శివ్వంపేట, కౌడిపల్లి, చిలిప్‌చెడ్, కొల్చారం మండలాల పరిధిలో శుక్రవారం పోలింగ్ జరగనుంది. చివరి రోజు ఆయా పార్టీల అభ్యర్థులు పోటాపోటీ ప్రచారంతో హోరెత్తించారు. ఎన్నికలకు ఒక రోజు మాత్రమే మిగిలి ఉండడంతో రాత్రి వేళ గ్రామాల్లో ప్రలోభాల పర్వం తారస్థాయికి చేరింది. పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. మరోపక్క అధికారులు పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు.
సాక్షి, మెదక్ : రెండో విడత ప్రాదేశిక పోరులో ఆరు జెడ్పీటీసీ స్థానాలకు 22 మంది పోటీలో ఉన్నారు. నర్సాపూర్ జెడ్పీటీసీ పదవికి ముగ్గురు (టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ), వెల్దుర్తిలో నలుగురు (టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం), శివ్వంపేటలో ఐదుగురు (టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, స్వతంత్ర), కౌడిపల్లిలో ముగ్గురు (టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ), చిలిప్‌చెడ్‌లో ముగ్గురు (టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ), కొల్చారంలో నలుగురు (టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ) పోటీ పడుతున్నారు.
అదేవిధంగా, 60 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా.. శివంపేట మండలంలోని చండి ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమైంది. దీంతో మిగిలిన 59 ఎంపీటీసీ స్థానాలకు 209 మంది పోటీలో ఉన్నారు. ఈ లెక్కన ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు తీవ్ర పోటీ నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు చెమటోడుస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా చివరి రోజు పోటాపోటీగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దీంతోపాటు మద్యం, ఇతర తాయిలాలతో ఓటర్లను ప్రభావితం చేసేలా రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
చివరి రోజు నేతల జోరు
టీఆర్‌ఎస్‌లో అభ్యర్థులకు మద్దతుగా చివరి రోజు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కొల్చారం మండల కేంద్రంతో పాటు ఎనగళ్ల, పైకర, రంగంపేట, సంగాయిపేట, చిన్నఘనపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి సునీతారెడ్డి శివ్వంపేట మండలం పొద్దగొట్టిముక్కుల గ్రామంలో ప్రచారం చేపట్టి టీఆర్‌ఎస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నర్సంపేట మండలం కాజీపేట ఎంపీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్ ప్రచారం నిర్వహించి తనను గెలిపించాలని అభ్యర్థించారు. అదేవిధంగా ఆయన పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు తమ అభ్యర్థులకు మద్దతుగా కొల్చారం మండలంలోని సంగాయిపేట్, చిన్నఘనపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
మద్యం.. డబ్బులు..
పోలింగ్‌కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో అభ్యర్థులు బుధవారం సాయంత్రం నేతలతో మంతనాల్లో మునిగినట్లు తెలుస్తోంది. తీవ్ర పోటీ నెలకొనడంతో ఎక్కడెక్కడ.. ఏయే పంచాయతీలు.. ఏయే వార్డులు తమకు అనుకూలంగా ఉన్నాయి.. ఏవి అనుకూలంగా లేవు.. ఏం చేయాలి వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రలోభ పర్వానికి తెరలేచినట్లు సమాచారం. కొన్నిచోట్ల ఇంటింటికీ మద్యం బాటిళ్లతోపాటు డబ్బులు పంపిణీ చేసేలా అభ్యర్థులు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇందుకోసం పలువురిని కేటాయించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment