TRS Congress
-
జానారెడ్డి స్వగ్రామంలో ఉద్రిక్తత: నోముల భగత్‌కు నో ఎంట్రీ
నాగార్జున సాగర్: ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం చేసేందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని అనుముల గ్రామానికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ చేరుకునేసరికి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టీఆర్ఎస్ నాయకులు రావొద్దంటూ కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం ఆందోళన చేపట్టాయి. అనుముల గ్రామానికి టీఆర్ఎస్ ప్రచారానికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కారులో హాలియా వైపు వెళ్తుండగా జై తెలంగాణ అంటూ కారు వద్ద నినాదాలు చేశాడు. దీంతో ఇబ్బందికి గురిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వ్యక్తం చేసింది. తమ నాయకుణ్ణి ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు టీఆర్ఎస్ నాయకులు అనుముల గ్రామానికి రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి తనయుడు జయవీర్ రెడ్డి వాగ్వాదానికి దిగాడు. జీపు టాప్‌పైకి ఎక్కి టీఆర్ఎస్, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశాడు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ఇరుపక్షాలకు సర్దిచెబుతున్నారు. అనుముల గ్రామం జానారెడ్డి సొంతగ్రామం కావడంతో టీఆర్ఎస్కు ప్రవేశం నిషేధించారు. కాగా టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ బహిరంగ సభ సందర్భంగా విస్తృత ప్రచారం చేస్తూ అనుముల గ్రామానికి వచ్చారు. -
ఏకగ్రీవ నజరానా ఏదీ
బషీరాబాద్: జిల్లాలోని ఏకగ్రీవ పంచాయతీలు ప్రభుత్వ నజరానా కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ డబ్బులు వస్తే తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామని ప్రజాప్రతినిధులు, స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు మధ్య కుదిరిన అంగీకారం ప్రభుత్వానికి లక్షల రూపాయల వ్యయాన్ని తగ్గించింది. ఒక్కో జీపీలో ఎన్నికల నిర్వహణకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఖర్చవుతుందని అధికారుల అంచనా. అయితే జిల్లాలో 75 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 71 జీపీలు సంపూర్ణంగా యునానిమస్ అయ్యాయి. మొత్తం 460 వార్డులు కూడా ఏకగ్రీవం సాధించాయి. తద్వారా ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు ఆదా కావడంతో పాటు అభ్యర్థులకు ఖర్చు బెడద తప్పింది. అధికార పార్టీ చొరవ.. జిల్లాలోని 565 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్‌లకు అన్ని అధికారాలు కట్టబెట్టడంతో ఆ పదవికోసం గ్రామాల్లో తీవ్ర పోటీ నెలకొంది. పంచాయతీ బరిలో మండల స్థాయి రాజకీయ నేతలతో పాటు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు వర్గాల వారు రంగంలోకి దిగడంతో ఎన్నికలు ఖరీదుగా మారాయి. జిల్లాలో అర్బన్ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న పంచాయతీల్లో ఎలాగైన సర్పంచ్ పీఠం దక్కించుకోవాలని కొందరు అభ్యర్థులు రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఖర్చుపెట్టారు. మరీ ముఖ్యగా తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి పట్టణాలకు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచాయతీలు, గనుల ప్రాంతాల జీపీల్లో తీవ్ర పోటీ కొనసాగింది. ఇదిలా ఉండగా మెజార్టీ జీపీలను తన ఖాతాలో వేసుకునేందుకు అధికార పార్టీ ఏకగ్రీవాలను ప్రోత్సహించింది. సంపూర్ణ ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నజరానా ఇస్తామని ప్రకటించింది. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులకు రెబల్స్‌గా పోటీ చేసిన వారిని బుజ్జగించేందుకు.. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డితో పాటు అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో జిల్లాలోని 75 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే వీటిలో కొన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో కూడా చేరాయి. జిల్లాలో మొదటి విడతలో 34, రెండో విడతలో 18, తుది విడతలో 23 పంచాయతీలు యునానిమస్ అయ్యాయి. 71 పంచాయతీలకే నజరానా జిల్లాలో మూడు విడతల్లో 75 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో 71 పంచాయతీలలో సర్పంచ్‌లతో పాటు వార్డు సభ్యులు మొత్తం పోటీలేకుండా గెలపుపొందారు. దీంతో వీటిని మాత్రమే సంపూర్ణ ఏకగ్రీవ పంచాయతీలుగా గుర్తించిన ప్రభుత్వం.. ఒక్కో జీపీకి రూ.10 లక్షల చొప్పున పంచాయతీ ఖాతాల్లో జమచేయనున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పటివరకు జీపీలకు ప్రోత్సాహక నిధులు అందలేదు. అభివృద్ధికి ఊతం.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి వచ్చే రూ.10 లక్షల నజరానా అభివృద్ధికి ఊతం ఇవ్వనుంది. ఈ నిధులతో పాటు జెడ్పీ నుంచి మరో రూ.10 లక్షలు ఇస్తామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి తాండూరులో ప్రకటించారు. ఇలా మొత్తం రూ.20 లక్షల నిధులు ఏక కాలంలో పంచాయతీలకు అందితే వేగంగా అభివృద్ధి అవకాశం ఉంది. ఇటీవల ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ ఇవ్వడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏకగ్రీవ ప్రోత్సాహకం రాకపోవడంపై గ్రామ ప్రథమ పౌరులు అసంతృప్తిగా ఉన్నారు. అభివృద్ధి కోసం ఏకమయ్యాం ప్రభుత్వం మా తండాను కొత్త పంచాయతీగా ఏర్పాటు చేసింది. గతంలో ఉమ్మడి జీపీగా ఉన్నప్పుడు తండాలకు సర్పంచ్‌గా అయ్యే అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంతా ఏకమయ్యాం. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో సర్పంచ్‌తో పాటు వార్డుల సభ్యులను ఏకగ్రీవం చేసుకున్నాం. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు, జెడ్పీ నుంచి రూ.10 లక్షలు వస్తే ఊరిలోని అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. – రవి, సర్పంచ్, కొత్లాపూర్(బి) -
ఉత్కంఠకు తెర
సాక్షి, యాదాద్రి : జిల్లా వ్యాప్తంగా ఉన్న 17 మండలాల్లో మండల పరిషత్ అ«ధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. టీఆర్ఎస్ 10 ఎంపీపీలను కైవసం చేసుకోగా ఏడు మండలాలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే క్యాంప్ రాజకీయాలకు తెరలేపిన టీఆర్ఎస్, కాంగ్రెస్.. సభ్యులతో బేరసారాలకు దిగాయి. పదవుల పందేరాలపై హామీలు, సామాజిక సమీకరణాల ప్రాతిపదికన ఇరు పార్టీలు ఎంపీపీ, వైఎస్ ఎంపీపీలను ఎంపిక చేశాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల్లో ఎంపీపీ అభ్యర్థుల ఎంపిక సందర్భంగా కొన్ని చోట్ల నాయకుల మధ్యన విబేధాలు తలెత్తాయి. అయితే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సమన్వయంతో అభ్యర్థులను ఎంపిక చేయగా కాంగ్రెస్ తమ అభ్యర్థుల మధ్య ఏకాభిప్రాయం కుదుర్చడానికి చాలానే శ్రమించాల్సి వచ్చింది. అయితే ఆద్యంతం ఆసక్తి రేకెత్తించిన తుర్కపల్లి, రాజాపేట స్థానా లను టీఆర్ఎస్, మోత్కూర్ ఎంపీపీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆసక్తి రేకెత్తించిన మోత్కూర్ ఎంపీపీ స్థానాన్ని కాంగ్రెస్ లాటరీ ద్వారా కైవసం చేసుకుంది. సంస్థాన్ నారాయణపురం, తుర్కపల్లి వైస్ ఎంపీపీల ఎన్నిక వాయిదాపడింది. క్యాంప్‌ల నుంచి నేరుగా సమావేశాలకు.. ఈనెల 4న ఎన్నికల ఫలితాలు వెలువడగానే కాంగ్రెస్, టీఆర్ఎస్లు తమ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను క్యాంప్‌లకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ ఎన్నిక కోసం క్యాంప్‌ల నుంచి నేరుగా మండల పరిషత్ కార్యాలయాలకు చేరుకున్నారు. క్యాంప్‌ల్లోనే అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ కొన్నిచోట్ల ఎంపిక సమయానికి ముందు వరకు వివాదాలు జరిగాయి. ఎంపీటీసీలను సమన్వయం చేయడానికి నాయకులు చాలా శ్రమించారు. కులాల వారీగా సమీకరణాలు చేస్తూ భవిష్యత్‌లో పార్టీకి నష్టం కలగకుండా ఉండేందుకు పార్టీ తరఫున రకరకాల బుజ్జగింపులు పెద్ద ఎత్తునే జరిగాయి. టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలు పైళ్ల శేఖరెడ్డి, గొంగిడిసునీతామహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున కోమటిరెడ్డి సోదరులు, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి బాధ్యతలను భుజాన వేసుకున్నారు. కోరం లేక వాయిదాపడ్డ తుర్కపల్లి వైస్ ఎంపీపీ ఎన్నిక తుర్కపల్లి వైస్ ఎంపీపీ ఎన్నిక కోరం లేక వాయిదాపడింది. 10 ఎంపీటీసీ స్థానాలు ఉన్న ఆ మండలంలో 5 కాంగ్రెస్, 4 టీఆర్ఎస్, ఒకరు ఇండిపెండెంట్ గెలిచారు. మెజార్టీ ఉన్న కాంగ్రెస్‌కే ఎంపీపీ దక్కుతుందని భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. కాంగ్రెస్ నుంచి గెలిచిన మాదాపూర్ ఎంపీటీసీ టీఆర్ఎస్ శిబిరంలో చేరడంతో వారి సంఖ్య బలం 6కు చేరింది. సమావేశానికి 9మంది టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇండిపెండెంట్ ఎంపీటీసీలు హాజరయ్యారు. ఎంపీపీ ఎన్నిక జరిగిన వెంటనే టీఆర్ఎస్ సభ్యులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. దీంతో సమావేశంలో నలుగురు ఎంపీటీసీలే మిగలడంతో వైస్ ఎంపీపీకి కోరం లేక ఎన్నిక శనివారానికి వాయిదా పడింది. నారాయణపురంలో మరో తీరు.. వైస్ ఎంపీపీ ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ ఎంపీటీసీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదాపడింది. 13మంది ఎంపీటీసీలు ఉన్న ఈమండలంలో ఎన్నికల ముందు టీఆర్ఎస్, సీపీఎంలు పొత్తు పెట్టుకున్నాయి. సీపీఎంకు వైస్ ఎంపీపీ ఇస్తానన్న ఒ ప్పందం ఉంది. అయితే త మకు 9మంది ఎంపీటీసీలు గెలిచి పూర్తి మెజార్టీ ఉన్నందున సీపీఎంకు వైఎస్ ఎంపీపీ ఎందుకు ఇవ్వాలని కొందరు టీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో వివాదం తలెత్తి వైస్ ఎంపీపీ శనివారానికి వాయిదాపడింది. లాటరీ పద్ధతిలో కాంగ్రెస్‌ను వరించిన ఎంపీపీ.. నలుగురు సభ్యులు ఉన్న మోత్కూర్ మండల పరిషత్ అధ్యక్ష పదవి లాటరీ పద్ధతిలో కాంగ్రెస్‌ను వరించింది. రెండు స్థానాల్లో టీఆర్ఎస్, రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందిన విషయం తెలిసిందే. అందరూ ఆసక్తిగా గమనిస్తున్న ఈ ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ పదవులు లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన దీటి సంధ్యారాణి, వైఎస్ ఎంపీపీ టీఆర్ఎస్కు చెందిన భూష్పాక లక్ష్మి గెలుపొందారు. ప్రజాప్రతినిధుల హాజరు ఎంపీపీ ఎన్నికల సందర్భంగా ప్రజాప్రతినిధులు సమావేశాలకు హాజరయ్యారు. మోత్కూర్ ఎంపీపీ ఎన్నికల సమావేశానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, యాదగిరిగుట్ట ఎంపీపీ సమావేశానికి ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి హాజరయ్యారు. బీబీనగర్, పోచంపల్లి ఎంపీపీ సమావేశాలకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, తుర్కపల్లి, రాజాపేట ఎంపీపీ సమావేశాలకు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిలు హాజరయ్యారు. -
నేడే ‘జెడ్పీ’ పట్టాభిషేకం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గులాబీ జెండాల రెపరెపల మధ్య జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుల పట్టాభిషేకం శనివారం జరగనుంది. ప్రత్యర్థి పార్టీల ఉనికి సైతం కనిపించని రీతిలో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున జెడ్పీటీసీలుగా గెలిచిన నేతలు జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నారు. ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని నాలుగు జిల్లాలకు చైర్పర్సన్/చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు జెడ్పీటీసీలను ఎన్నుకోనున్నారు. అంతకుముందే ఉదయం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికతో జిల్లా పరిషత్‌లలో పాలక మండళ్ల ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది. కాగా, ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ జిల్లా పరిషత్‌కు 15 మంది జెడ్పీటీసీలు టీఆర్ఎస్ నుంచే ఎన్నికవడంతో ఇక్కడ ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. పెద్దపల్లిలో 13 సభ్యులకు గాను ఇద్దరు కాంగ్రెస్ నుంచి ఎన్నికవగా, 11 మంది సభ్యులతో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కో సభ్యుడు ఎన్నిక కాగా, మిగతా సీట్లలో టీఆర్ఎస్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో జెడ్పీ అధ్యక్షుల ఎన్నిక లాంఛనమే. మూడు జిల్లాల్లో స్పష్టత– జగిత్యాల తప్ప టీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌గా పుట్ట మధును స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికలకు ముందు రాజన్న సిరిసిల్ల జిల్లా చైర్‌పర్సన్‌గా న్యాలకొండ అరుణ పేరును కేటీఆర్ ఓకే చేశారు. ఇక కరీంనగర్ చైర్‌పర్సన్‌గా ఇల్లందకుంట జెడ్పీటీసీ కనుమండ్ల విజయను మంత్రి ఈటల రాజేందర్ తెరపైకి తెచ్చారు. ఈ మూడు జిల్లాలకు చైర్పర్సన్లకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కాగా, జగిత్యాల జిల్లాపైనే తొలి నుంచి పీఠముడే కొనసాగుతోంది. తొలుత బుగ్గారం జెడ్పీటీసీ బాదినేని రాజేందర్‌కు చైర్మన్ పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపించాయి. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చినట్టుగా భావిస్తున్న లీకుల్లో కోరుట్ల జెడ్పీటీసీ దాసెట్టి లావణ్య పేరు తెరపైకి వచ్చింది. శుక్రవారం సీను మారింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్‌కుమార్ రంగంలోకి దిగారు. జగిత్యాల రూరల్ జెడ్పీటీసీ దావ వసంతకు చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వాలని పావులు కదుపుతున్నారు. దీంతో రాత్రి వరకు జగిత్యాలపై పీఠముడి వీడలేదు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల పంచాయితీని తెంపే పనిలో పడ్డారు. రాత్రి వేళ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలతో మంతనాలు జరిపి, అధిష్టానం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. రెండు జిల్లాలకు వైస్ చైర్మన్లు ఖరారు కరీంనగర్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా గన్నేరువరం, శంకరపట్నం జెడ్పీటీసీలు రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలలో ఒకరు నియమితులవుతారని పార్టీలో ప్రచారం జరిగింది. చివరికి శుక్రవారం అధిష్టానం సైదాపూర్ జెడ్పీటీసీ పేరాల గోపాల్‌రావు పేరును ఖరారు చేసింది. రాజన్న సిరిసిల్ల వైస్ చైర్మన్‌గా ఇల్లంతకుంట జెడ్పీటీసీ సిద్దం వేణు ఖరారైంది. పెద్దపల్లి వైస్ చైర్పర్సన్ విషయంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కాల్వశ్రీరాంపూర్ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డికి మద్దతుగా నిలిచారు. సీనియర్ జెడ్పీటీసీ, మహిళా నాయకురాలు పాలకుర్తి నుంచి గెలిచిన కందుల సంధ్యారాణి పోటీ పడుతున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి వైస్ చైర్పర్సన్ పంచాయితీని కూడా పరిష్కరించే పనిలో పడ్డారు. -
నేడు జెడ్పీచైర్మన్ ఎన్నిక
ఆదిలాబాద్‌అర్బన్: జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడు (జెడ్పీచైర్మన్), ఉపాధ్యక్షుడు (వైస్‌చైర్మన్) పదవులకు శనివారం ఎన్నిక జరగనుంది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 9 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. కలెక్టర్ పర్యవేక్షణలో జరిగే ఈ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కాగా, ముందుగా మైనార్టీ వర్గానికి చెందిన ఇద్దరిని కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకుంటారు. అనంతరం చైర్పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నిక చేపడుతారు. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి వంద మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. పరిషత్ చుట్టూ పక్కల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నిక ప్రక్రియ ఇలా.. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియలో భాగంగా శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటల వరకు కోఆప్షన్ సభ్యుల పోటీకి నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లను పరిశీలించి, ఒంటి గంట వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశమిస్తారు. ఒకవేళ ఒక అభ్యర్థే పోటీపడితే వారినే ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు. పోటీ ఉంటే ఎన్నిక నిర్వహించి గెలుపొందిన వారిని ప్రకటిస్తారు. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. తద్వారా మధ్యాహ్నం 3 గంటల సమయంలో చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక చేపడుతారు. ఈ ప్రక్రియకు కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీలందరూ హాజరుకానున్నారు. ఎవరికో చైర్మన్ గిరి.. జిల్లాలో 17 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ తొమ్మిది జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ 5, కాంగ్రెస్ 5 చొప్పున జెడ్పీటీసీ స్థానాలు దక్కించుకున్నాయి. అయితే టీఆర్ఎస్ పార్టీ గెలిచిన స్థానాలు మేజిక్ ఫిగర్‌కు కరెక్ట్‌గా సరిపోవడంతో ఎవరిని జెడ్పీ అధ్యక్ష పీఠం ఎక్కిస్తారనేది ఉత్కంఠగా మారింది. ఏ ఒక్క సభ్యుడిని పట్టించుకోకున్నా.. ఇబ్బందులు తలెత్తే అవకాశాలుండడంతో అందరిని కలుపుకొని పోయే దిశగా ఆ పార్టీ అడుగులు వేసేందుకే ఇంత వరకు చైర్మన్ అభ్యర్థిని ప్రకటించలేదని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే టీఆర్ఎస్ తరఫున నేరడిగొండ జెడ్పీటీసీగా గెలుపొందిన అనిల్ జాదవ్, నార్నూర్ జెడ్పీటీసీగా గెలుపొందిన రాథోడ్ జనార్దన్‌ల పేర్లు అధ్యక్ష పదవి రేసులో ప్రధానంగా వినిపిస్తుండగా.. భీంపూర్ జెడ్పీటీసీగా గెలుపొందిన సుధాకర్ పేరు కూడా పరిశీలనలోకి వస్తున్నట్లు సమాచారం. అయితే అనుభవం, సీనియార్టీని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థి ఎంపిక చేపడితే నేరడిగొండ, నార్నూర్ జెడ్పీటీసీలుగా గెలుపొందిన వారిద్దరిలో ఎవరో ఒకరు చైర్మన్ కానున్నారు. -
చెట్టాపట్టాల్!
సాక్షి, ఆదిలాబాద్: సిద్ధాంతాల పరంగా ఆ రెండు పార్టీలు పూర్తిగా వ్యతిరేకం.. అయితేనేం పరిస్థితులకు అనుగుణంగా అవి ఏకమయ్యాయి. టీఆర్ఎస్కు వ్యతి రేకంగా కలిసి పనిచేస్తున్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌ల కొత్త రాజకీయంతో ఆదిలాబాద్ ప రిషత్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ కొత్త సమీకరణ లు గులాబీ పార్టీని నిలువరించేలా చేశాయి. రెండు ఎంపీపీ స్థానాలను టీఆర్ఎస్కు దక్కకుండా చూశాయి. మరో ఎంపీ పీ స్వతం త్ర అభ్యర్థికి దక్కడంలో కీలక పాత్ర వహించాయి. ఈ మార్పు ఇప్పుడు ఆదిలాబాద్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. నేడు జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగనుండగా ఈ కలయిక టీఆర్ఎస్లో గుబులు రేపుతోంది. విప్ జారీ.. నేడు జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగనుండగా కాంగ్రెస్, బీజేపీల కలయిక టీఆర్ఎస్ను షాక్‌కు గురి చేస్తోంది. ఆదిలాబాద్ జెడ్పీలో 17 స్థానాలు ఉండగా, టీఆర్ఎస్ 9, బీజేపీ 5, కాంగ్రెస్ 3 గెలుచుకున్న విషయం తెలిసిందే.. మెజార్టీ 9 మంది సభ్యులను టీఆర్ఎస్ గెలిచినా జెడ్పీపీఠం దక్కించుకోవడంలో ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేశాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావులు జెడ్పీ పీఠం దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. బీజేపీ నుంచి ఇటీవల ఎంపీగా గెలిచిన సోయం బాపురావు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ జెడ్పీ పీఠం టీఆర్ఎస్కు దక్కకుండా కాంగ్రెస్ మద్దతుతోనైనా నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఇటీవల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన రాథోడ్ రమేశ్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండేలు కలిసి టీఆర్ఎస్కు పీఠం దక్కకుండా బీజేపీతో జత కలిసి తాజా రాజకీయాలు తమకు అనువుగా మలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం జెడ్పీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఆయా పార్టీల వారీగా ఇప్పటికే సభ్యులకు విప్ జారీ చేశారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా సభ్యులు నడుచుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న టీఆర్ఎస్ సభ్యులకు, మాజీ ఎమ్మెల్యే యెండ్ల లక్ష్మీనారాయణ బీజేపీ సభ్యులకు, జిల్లా అధ్యక్షుడు భార్గవ్‌దేశ్ పాండే కాంగ్రెస్ సభ్యులకు విప్‌ను జారీ చేసే అధికారాన్ని పార్టీలు కట్టబెట్టాయి. దీనికి సంబంధించి ఈ ముగ్గురు జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్‌కు పార్టీ పత్రాలను శుక్రవారం అందజేశారు. దీంతో సభ్యులకు ఆయా పార్టీల వారీగా విప్ జారీ చేశారు. నేడు జరిగే ప్రాదేశిక ఎన్నికల్లో సభ్యులు పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన పక్షంలో వారి సభ్యత్వం రద్దు చేసేందుకు ఈ విప్ అధికారం పార్టీ అధిష్టానం కల్పించింది. దీంతో ఈ ఎన్నికలు తాజా రాజకీయాలను వేడెక్కించాయి. టీఆర్ఎస్ 10కే పరిమితం.. మండల పరిషత్ అధ్యక్ష స్థానాలను అధికంగా కైవసం చేసుకోవాలన్న టీఆర్ఎస్ ఆశలకు గండి పడింది. ఆదిలాబాద్, బేల, భీంపూర్, బోథ్, గాదిగూడ, జైనథ్, నార్నూర్, నేరడిగొండ, తాంసి, ఉట్నూర్‌లలో ఆ పార్టీ మెజార్టీ సాధించడంతో ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకోవడం సులువైంది. అయితే శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆయా మండలాల్లో ఇతర పార్టీల్లోని సభ్యులను జత చేసుకోవడం ద్వారా 10 కంటే ఎక్కువ ఎంపీపీ స్థానాలు సాధించగలుగుతుందని అంచనా వేసినా అవన్నీ కల్లలైపోయాయి. తలమడుగులో కాంగ్రెస్‌కు మెజార్టీ ఉండడంతో ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకుంది. బజార్హత్నూర్, ఇంద్రవెల్లిల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బజార్హత్నూర్లో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 8 ఉండగా బీజేపీ 4, టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 1 గెలుపొందాయి. బీజేపీకి ఒక సభ్యుడి మద్దతు అవసరం ఉండగా కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో అక్కడ బీజేపీకి ఎంపీపీ పీఠం దక్కింది. ఉపాధ్యక్ష పదవిని కాంగ్రెస్ ఇవ్వడం ద్వారా ఈ రెండు పార్టీల కలయిక సాధ్యమైంది. ఇక ఇంద్రవెల్లిలో 11 ఎంపీటీసీ స్థానాలుండగా టీఆర్ఎస్ 4, బీజేపీ 4, స్వతంత్రులు ఇద్దరు, కాంగ్రెస్ ఒకరు గెలుపొందారు. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీకి మరో ఇద్దరు సభ్యులు మద్దతు ఇచ్చిన పక్షంలో ఆయా పార్టీల్లో ఎవరికైనా పీఠం దక్కేది. అయితే ఒక స్వతంత్ర, ఒక కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీకి మద్దతు ఇవ్వడంతో ఇంద్రవెల్లి ఎంపీపీ కూడా బీజేపీకే దక్కింది. ఇక్కడ కూడా మద్దతిచ్చిన కాంగ్రెస్ ఎంపీటీసీకి ఉపాధ్యక్ష పదవికి దక్కింది. ఈ విధంగా పొత్తుధర్మం కొనసాగిస్తూ జెడ్పీ చైర్మన్ ఎన్నికకు ముందుకు కదులుతున్నారు. ఇక ఇచ్చోడలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ 13 ఎంపీటీసీ స్థానాలకు ఐదు స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొంది పీఠం కైవసం చేసుకుంటుందని అందరు అనుకున్నారు. ప్రధానంగా ఆ పార్టీకి కేవలం మరో ఇద్దరి మద్దతు అవసరం ఉండగా, అనూహ్యంగా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా ప్రీతం రెడ్డికి బీజేపీ, కాంగ్రెస్ సపోర్ట్ చేయడం గమనార్హం. టీఆర్ఎస్లో 5 గురు ఎంపీటీసీలు గెలవగా ఇద్దరు విప్‌ను దిక్కరించి స్వతంత్ర అభ్యర్థికి మద్దతు పలకడం గమనార్హం. తద్వారా ఇచ్చోడ వంటి మేజర్ మండలంలో టీఆర్ఎస్ను కాంగ్రెస్, బీజేపీలు తమ రాజకీయ ఎత్తుగడలతో నిలువరించడం గమనార్హం. అలాగే గుడిహత్నూర్, మావలలో ఎంపీపీ ఎన్నికలు కోరం లేక వాయిదా పడ్డాయి. గుడిహత్నూర్‌లో సభ్యులు సమాయానికి రాకపోవడంతో ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మండలంలో మొత్తం 9 స్థానాలు ఉండగా టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3, బీజేపీ 2 గెలుచుకున్న విషయం విధితమే. అలాగే మావలలో 3 స్థానాలు ఉండగా..ఒక సభ్యుడు గౌర్హాజరు కావడంతో ఎన్నిక వాయిదా పడింది. ఇక్కడ టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్ 1 స్థానం గెలుచుకున్నాయి. జంప్ దేనికి సంకేతం.. టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఇద్దరు ఎంపీటీసీలు పార్టీ విప్‌ను దిక్కరించి ఒక స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ఇచ్చోడలో ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ నియమాలను దిక్కరిస్తే సహించలేని టీఆర్ఎస్కు ఈ జంప్ ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా శనివారం జెడ్పీలో పార్టీ పరంగా విప్ జారీ చేసినా ఎన్నిక పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది. ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ ఎస్టీ (జనరల్) రిజర్వు ఉండగా, ఈ పార్టీ నుంచి 9 మంది సభ్యుల్లో ముగ్గురు ఎస్టీ జెడ్పీటీసీలు ఉన్నారు. నేరడిగొండ, నార్నూర్, భీంపూర్ జెడ్పీటీసీలు అనిల్ జాదవ్, రాథోడ్ జనార్దన్, కుమ్ర సుధాకర్‌లు గెలుపొందారు. వీరిలో నుంచి ఎవరికి జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దింపుతారనేది ఇప్పు డు ప్రాధాన్యత సంతరించుకుంది. అనిల్ జాదవ్, రాథోడ్ జనార్దన్‌లు లంబాడా సామాజికవర్గం కాగా, కుమ్ర సుధాకర్ ఆదివాసీ సామాజిక వర్గానికి చెందినవారు. జిల్లాలో ఇటీవల సోయం బాపురావు ఎంపీగా గెలుపొందడంతో బీజేపీ ప్రభంజనం పెరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎత్తుగడలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. జెడ్పీలో నేడు జరగబోయే ఎన్నికలో ఏకగీవ్రంగా జరుగుతుందా, లేని పక్షంలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి అభ్యర్థిని రంగంలోకి దించుతాయా? అనేది ఆసక్తికరమే.. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరుంటారనే దానిపై అంచనాలతో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రాదేశిక ఎన్నికల చివరి ఘట్టం చైర్మన్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. -
17 ఎంపీపీ పిఠాలు టీఆర్ఎస్కే..
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని రెండు ఎంపీపీ స్థానాలు మినహా అన్నింటిని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అన్ని మండలాల్లోనూ గులాబీ పార్టీ తన హవాను కొనసాగించింది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జరిగిన ఎంపీపీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 17 మండలాల్లో మెజార్టీ ప్రాతిపదికన ఓటింగ్ నిర్వహించి ఎంపీపీ అభ్యర్థులను ఎన్నుకోగా, ఎంపీటీసీ స్థానాలు సమానంగా వచ్చిన రెండు మండలాల్లో మాత్రమే లాటరీ పద్ధతి ద్వారా ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో సంబంధిత అధికారుల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి. ఎలాగైనా మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలన్న పట్టుదలతో టీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యవహరించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పెంట్లవెల్లిలో ఒకరినొకరు తోసుకున్నారు. నాగర్‌కర్నూల్ మండలానికి సంబంధించి కోర్టు పరిధిలో కేసు ఉండడంతో ఎన్నిక వాయిదా పడింది. మొత్తంగా మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యులు ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 17ఎంపీపీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం జిల్లాలోని 20 మండలాల్లో 212 ఎంపీటీసీ స్థానాలుంటే గోప్లాపూర్, గంట్రావుపల్లి ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, గగ్గలపల్లి ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో మొత్తం 209 ఎంపీటీసీ స్థానాలకు మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో 135 స్థానాల్లో టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థులు విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 4 స్థానాల్లో, సీపీఐ 2స్థానాల్లో, ఇండిపెండెంట్లు 16 స్థానాల్లో విజయం సా«ధించారు. ఏకగ్రీవం అయిన రెండు ఎంపీటీసీ స్థానాలు కూడా టీఆర్ఎస్ అభ్యర్థులే గెలవడంతో ఆ పార్టీ 137 స్థానాల్లో విజయం సాధించింది. అయితే శుక్రవారం నాగర్‌కర్నూల్ మండల పరిషత్ స్థానానికి మినహా 19 మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు నిర్వహించారు.ఇందులో అధికార పార్టీ 17, కాంగ్రెస్ రెండు స్థానాలు దక్కించుకున్నాయి. వైస్ ఎంపీపీల విషయానికి వస్తే టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 4, ఇండిపెండెంట్లు 2 స్థానాలను దక్కించుకున్నారు. కో ఆప్షన్‌కు సంబంధించి 17 టీఆర్ఎస్, రెండు కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. లింగాల, ఉప్పునుంతల మండలంలో లాటరీ పద్ధతిలో ఎంపీపీ ఎంపిక జరిగింది. లింగాలలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్లు దక్కాయి. ఉప్పునుంతలలో ఎంపీపీ, కో ఆప్షన్ టీఆర్ఎస్ పార్టీ, వైస్ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీకి దక్కాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి, హర్షవర్ధన్‌రెడ్డి వర్గాల మధ్య నువ్వా నేనా అన్న తరహాలో ఎన్నికలు జరిగాయి. పెంట్లవెల్లిలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసలు రంగప్రవేశం చేసి లాఠీచార్జీతో ఇరు వర్గాలను చెదరగొట్టారు.ఇరు వర్గాలు టీఆర్ఎస్ పార్టీ చెప్పుకున్నప్పటికీ కోడేరు, పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి మండలాల్లో జూపల్లి వర్గం ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోగా, కొల్లాపూర్‌లో హర్షవర్ధన్‌రెడ్డి వర్గం దక్కించుకుంది. బిజినపల్లి మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీకి 10ఎంపీటీసీలు, కాంగ్రెస్‌కు 8, ఒకటి సీపీఐ, ఒకచోట ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఎంపీపీ స్థానం ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో నేరుగా ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి రంగంలోకి దిగి కాంగ్రెస్ ఎంపీటీసీని తమవైపు తిప్పుకొని అతనికి వైస్ ఎంపీపీ ఇచ్చి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్నారు. -
విలీనంతో వీక్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఒకప్పుడు జిల్లాను శాసించిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ప్రాతినిధ్యం కరువైంది. కాంగ్రెస్‌కు ఆశాకిరణాలుగా భావించిన ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డిలు పార్టీని వీడి కారెక్కడం హాట్ టాపిక్‌గా మారింది. సీఎల్పీని అధికార టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి గురువారం వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం సమర్పించిన వారి జాబితాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండటం చర్చనీయాంశమైంది. వీరి విజ్ఞప్తిని స్పీకర్ ఆమోదించారు. ఇకపై వీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు. మొన్నటి శాసనసభ ఎన్నికల తర్వాత మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్కు దగ్గరయ్యారు. సీఎం కేసీఆర్‌తో సైతం ఆమె భేటీ అయ్యారు. అయితే తన కుమారుడి రాజకీయ భవిష్యత్‌తో పాటు తనకు మంత్రి పదవి ఇస్తారన్న హామీ మేరకు ఆమె టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఆమెను అనుసరించారు. ఆ వెంటనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ కావడంతో ఆయన పార్టీ మారడంపై స్పష్టత వచ్చింది. హస్తం గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచిన వీరిద్దరూ అప్పటి నుంచి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ వచ్చారు. టీఆర్ఎస్ నాయకులతో సత్సంబంధాలు కొనసాగించడంతోపాటు లోక్‌సభ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి కృషిచేశారు. మరోపక్క ఏడాది కిందట టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురై కాంగ్రెస్ గూటికి చేరిన వికారాబాద్ డీసీసీ అధ్యక్షులు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి కూడా తిరిగి సొంత గూటికి చేరారు. అనూహ్యంగా సీఎల్పీని విలీనం చేయాలని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యేల్లో ఈయన ఒకరు కావడం రాజకీయంగా పెనుదుమారం రేపింది. కాగా, సాంకేతికంగా ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే. అయితే సీఎల్పీ విలీనానికి స్పీకర్ ఆమోదం తెలపడంతో అధికారికంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా పరిగణిస్తారు. ఆత్మస్థైర్యం నింపితేనే.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జిల్లాలో కష్టాల్లో చిక్కుకుంది. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ జాబితాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం ఉన్నారు. ఆ తర్వాత తమ నియోజకవర్గాల అభివృద్ధి పేరిట ఎమ్మెల్యేలు సైతం కారెక్కారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది. అయినా పంచాయతీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ రీతిలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా నెగ్గారు. ఆ తర్వాత చేవెళ్ల లోక్‌సభ స్థానం చేజారినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే అధిక సంఖ్యలో ఓట్లు రాబట్టింది. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ ఉనికి చాటుకుంది. 257 ఎంపీటీసీల్లో 73 స్థానాలను, 21 జెడ్పీటీసీలకుగాను.. నాలుగింటిని హస్తగతం చేసుకుంది. ఈ ఫలితాలను విశ్లేషిస్తే నాయకులు, ఎమ్మెల్యేలు పార్టీలు మారినా ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు చెక్కుచెదరలేదని తెలుస్తోంది. అయితే, టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనం, జిల్లాకు చెందిన ముగ్గురు కీలక నేతలు అధికారికంగా కారెక్కడంతో పార్టీ బలహీనపడినట్టే. ఈ పరిణామంతో పార్టీ శ్రేణులు అంతర్మథనంలో పడ్డారు. -
నేడే ఎంపీపీల ఎన్నిక
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మండల అధ్యక్షుల ఎన్నికకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక శుక్రవారం ఆయా మండలాల్లో జరగనుంది. ఇప్పటికే మండల ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ)కు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను అధికార టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 31 మండలాల్లో 349 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా, టీఆర్ఎస్ అత్యధికంగా 191 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 134 స్థానాలకు పరిమితమైంది. అయితే, మండల అధ్యక్ష పదవుల విషయానికి వస్తే.. టీఆర్ఎస్ ఖాతాల్లో 18 మండలాలు చేరనున్నాయి. మరో ఆరు మండలాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొలువు దీరనున్నారు. ఇంకో ఏడు మండలాల్లో మాత్రం ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో ఈ మండలాల్లో స్వతంత్రులు, ఇతర పార్టీలకు చెందిన ఎంపీటీసీ సభ్యుల పాత్ర కీలకం కానుంది. జిల్లాలో 31 మండలాల్లో ఎంపీపీ పదవుల కోసం ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక ల్లో గెలిచిన మొత్తం సభ్యుల్లో పార్టీలు నిర్ణయించిన 62మంది మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా శుక్రవారం ఎన్నిక కానున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యాంపుల్లో ఉన్న వారంతా ఉదయం 10 గంటల వరకు నేరుగా ఎంపీడీఓ కార్యాలయాలకు చేరుకుంటారు. సభ్యులు చేతులు ఎత్తే పద్ధతి ద్వారా ఎంపీపీని ఎన్నుకోనున్నారు. ముందుగా కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. ఆ తర్వాత ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక జరుగుతుంది. ఎన్నిక జరిగే కార్యాలయాలకు వంద మీటర్ల దూరం వరకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేíశారు. ఇక, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కో మండలంలో ఒక్కో విధంగా అటు అధికార టీఆర్ఎస్, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ ఆయా పార్టీలతో పొత్తులకు వెళ్లాయి. అయితే.. టీఆర్ఎస్ ఏ పార్టీ సహకారం లేకుండానే ఏకంగా 18 మండలాల్లో అధ్యక్ష పీఠాలను కైవసం చేసుకునే మెజారిటీని సాధించింది. ఆరు మండలాల్లో కాంగ్రెస్‌కు ఇదే స్థితి ఉంది. మిగిలిన ఏడు మండలాలకు సంబంధించి టీఆర్ఎస్ ఖాతాలో చేరే మండలాలే ఎక్కువగా ఉంటాయని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఆ.. ఏడు చోట్ల ఉత్కంఠ! ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాని పెద్దవూర, వేములపల్లి, తిప్పర్తి, చండూరు, చిట్యాల , నకిరేకల్, కేతేపల్లి మండలాల్లో ఏ పార్టీకి చెందిన వారు అధ్యక్షులు అవుతారో..? విధిలేని పరిస్థితిలో మద్దతు తెలిపే వారే ఏకంగా పదవిని దక్కించుకుంటారో అన్న చర్చ జరుగుతోంది. వేములపల్లి మండలంలో 7 ఎంపీటీసీ స్థానాలను ఉన్నాయి. ఇక్కడ ఎంపీపీ పదవిని దక్కించుకోవాలంటే నాలుగు ఎంపీటీసీ సభ్యుల బలం ఉండాలి. కానీ, టీఆర్ఎస్ తరఫున ముగ్గురు సభ్యులు మాత్రమే విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ఒకరు విజయం సాధించారు. మరో స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. టీఆర్ఎస్ అధ్యక్ష స్థానాన్ని దక్కించుకోవాలంటే ఇండిపెండెంట్ ఒక్కరు మద్దతిస్తే చాలు. అదే కాంగ్రెస్ కైతే.. సీపీఎంతో పాటు, ఇండిపెండెంట్.. అంటే ఇద్దరి మద్దతు అవసరం ఉంది. పెద్దవూర మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు సమానంగా చెరో 5 స్థానాల్లో గెలిచాయి. మరో స్థానంలో ఇండిపెండెంట్ గెలిచారు. ఇప్పుడు ఈ రెండు పార్టీల్లో ఎవరు అధ్యక్షుడు కావాలన్నా, ఆ ఇండిపెండెంట్ మద్దతు తప్పని సరి. తిప్పర్తి మండంలోనూ ఇదే సీన్. ఇక్కడ 9 ఎంపీటీసీ స్థానాలుంటే టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు సమానంగా చెరో 4 చోట్ల గెలిచాయి. ఒక ఇండిపెండెంట్ విజయం సాధించారు. ఆ ఇండిపెండెంట్ మద్దతు ఎవరికి దక్కింతే ఆ పార్టీకి మండల అధ్యక్ష పదవి వరించే అవకాశం ఉంది. చండూరు మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఆరు స్థానాలు గెలిచిన పార్టీకి మండల అధ్యక్ష పదవి దక్కుతుంది. కానీ, కాంగ్రెస్ 5 స్థానాలను గెలుచుకున్నా.. మరో సభ్యుడి కొరత ఏర్పడింది. ఇక్కడ టీఆర్ఎస్ 4 ఎంపీటీసీ స్థానాలను గెలచుకుంది. కాగా, సీపీఐ, బీజేపీలు చెరో స్థానంలో గెలిచాయి. ఈ రెండు పార్టీల్లో ఒకరు మద్దతిస్తే కాంగ్రెస్‌కు మండల అధ్యక్ష పదవి దక్కుతుంది. అదే టీఆర్ఎస్కు అవకాశం రావాలంటే.. సీపీఐ, బీజేపీ రెండూ మద్దతివ్వాల్సి ఉంటుంది. నకిరేకల్ నియోజకవర్గంలోనే అత్యధికంగా మూడు మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంది. చిట్యాల మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు గాను.. ఏడు స్థానాలు వచ్చిన పార్టీకి మండలం దక్కేది. కానీ, టీఆర్ఎస్ 6 స్థానాల దగ్గరే నిలిచిపోయింది. మరొక్క సభ్యుడి మద్ధతు లభిస్తే చాలు. కాగా, ఈ మండలంలో కాంగ్రెస్ కేవలం 2 స్థానాలు గెలుచుకుంది. సీపీఎం ఒక చోట గెలిచింది. మరో ముగ్గురు స్వతంత్రులు గెలిచారు. కాంగ్రెస్, సీపీఎం, స్వంతంత్రులు ముగ్గురు కలిసినా అవకాశ దక్కే చాన్సులేదు. దీంతో ఒక సభ్యుడిని తమ వైపు తిప్పుకోగలితే చిట్యాల టీఆర్ఎస్ సొంతం అవుతుంది. గెలిచిన ముగ్గురు స్వతంత్రుల్లో టీఆర్ఎస్ రెబల్స్ ఉన్నారని, వారి మద్ధతు తమ పార్టీకే ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నకిరేకల్‌లో 9 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఏ పార్టీకైనా ఐదు స్థానాలు గెలిస్తే మండల అధ్యక్ష పదవి దక్కుతుంది. కానీ, టీఆర్ఎస్ 4 స్థానాల దగ్గరే నిలిచిపోయింది. 3చోట్ల కాంగ్రెస్ గెలిస్తే.. స్వతంత్రులు మరో ముగ్గురు గెలిచారు. ఇప్పుడు వారే కీలకంగా మారారు. వీరిలో కూడా టీఆర్ఎస్ రెబల్స్ ఉన్నారని చెబుతున్నందున.. ఇక్కడా టీఆర్ఎస్కే అవకాశం ఉందంటున్నారు. కేతేపల్లి మండలంలో 11 స్థానాలకు గాను ఆరు సీట్లు గెలుచుకుంటే.. ఎంపీపీ పదవి దక్కుతుంది. కానీ, టీఆర్ఎస్కు కేవలం ఐదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్ నాలుగు చోట్ల , మరో ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. టీఆర్ఎస్కు ఒక్కరు మద్ధతిస్తే సరిపోతుంది. ఇక్కడ కాంగ్రెస్‌కు అవకాశం దక్కాలంటే ఇండిపెండెంట్లు ఇద్దరూ మద్దతివ్వాలి. మొత్తంగా ఈ ఏడు చోట్లా ఒక్క చండూరు మినహా మిగిలిన ఆరు చోట్ల అధికార పార్టీకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. -
భగ్గుమన్న రాజకీయ కక్షలు
మహబూబ్‌నగర్ క్రైం: ప్రశాంతంగా ఉండే పాలమూరులో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి.. స్థానిక ఎన్నికలు అంటేనే ప్రధానంగా వర్గపోరు.. గ్రామాల్లో రెండు వర్గాలకు మధ్య పాతకక్షలను మనసులో పెట్టుకొని ఇలాంటి ఎన్నికల సమయాల్లో దాడులకు పాల్పడుతుంటారు. పల్లెలో ఎప్పుడూ కూడా ఎన్నికలు వ్యక్తిగతంగా.. కుటుంబాల మధ్య నడుస్తుంటాయి. ఈ క్రమంలో ఏళ్ల నుంచి పడని కుటుంబాలు ఉంటే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. ఇందులో ప్రాణాలు సైతం కోల్పోతుంటారు. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు మంగళవారం ప్రకటించిన తర్వాత పలు గ్రామాల్లో విజేతలు ర్యాలీలు చేపడుతున్న క్రమంలో ఇరువర్గాల మధ్య దాడులు జరగడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ర్యాలీల్లో రాజుకున్న నిప్పు దేవరకద్ర మండలం డోకూర్లో బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి గెలిచిన ఆనందంలో ర్యాలీ చేస్తున్న క్రమంలో మరో పార్టీకి చెందిన కార్యకర్తలు బీజేపీ కార్యకర్త ప్రేమ్‌కుమార్‌ను కత్తులతో దాడి చేయడంతో మృతి చెందాడు. అలాగే మహబూబ్‌నగర్ మండలంలోని రామచంద్రపూర్‌లో ఎంపీటీసీగా స్వతంత్ర అభ్యర్థి గెలుపొందిన సందర్భంగా ర్యాలీ చేపట్టారు. ఈ సమయంలో ఓ కిరాణదుకాణం దగ్గర ఉన్న అశోక్‌చారి అనే యువకుడిపై కట్టెలు, రాళ్లతో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. ఆ సంఘర్షణలో అనసూయ అనే మహిళపై కూడా దాడి చేయడంతో మృతిచెందిందని కుటుంబ సభ్యులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మద్దూరు మండలం రెనివట్ల ఎంపీటీసీ కారుపై దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలతో ఉమ్మడి పాలమూరు జిల్లా ఉలిక్కిపడింది. ఇటు పోలీసులతోపాటు అటు రాజకీయ నేతలను కలవరపెట్టింది. పోలీసులు దృష్టి పెట్టాలి భూ వివాదాలు, అదనపు కట్నం, ప్రేమ వివాహాల విషయం చాలా వరకు ముందే గ్రామ పోలీస్ అధికారులు, ఫిర్యాదుల రూపంలో పోలీసులకు తెలుస్తూనే ఉన్నాయి. కానీ చిన్న విషయాలుగా భావిస్తూ పోలీసులు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. బాధితులు, రక్షణ లేదనుకునే వారు పోలీసులను ఆశ్రయించినప్పు డు మీరే పరిష్కరించుకోవాలని సూచిస్తూ వదిలేస్తున్నారు. బెదిరింపులకు గురిచేస్తున్న వారిని ఠాణాకు పిలిపించి హె చ్చరించడం.. వారి కదలికలపై నిఘా వేసి ఉంచి తే పరిస్థితి చేయిదాటేది కాదు. గతంలో కేసులు నమోదైన వారు, రౌడీషీటర్లపై నిఘా ఉంచినట్లే గ్రామాల్లో విచ్చలవిడిగా వ్యవహరించే వారు, ఆరోపణలున్న వ్యక్తులపైనా దృష్టిపెడితే ఈ హత్యకాండలకు అడ్డుకట్ట వేసే వీలుంటుంది. పథకం ప్రకారమే.. ఇటీవల చోటుచేసుకున్న హత్యల్లో క్షణికావేశంలో చోటుచేసుకున్నవి తక్కువే. పక్కా హత్యలు చేసినవే ఎక్కువ. సాధారణంగా ఎదుటి వారిని భయబ్రాంతులకు గురి చేసేందుకు మూకుమ్మడిగా దాడులు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రాణాలు పోతాయి. కానీ ఇటీవల హత్యలు చేసిన వారు కిరాయి హంతకుల్లా ప్రణాళిక ప్రకారం దాడులు చేసి క్రూరమైన రీతిలో ప్రాణాలు తీశారు. బాధిత కుటుంబాలకు బెదిరింపులు మరోదిక్కు హత్యలు చోటుచేసుకున్న తర్వాత హంతకులు చెలరేగిపోతున్నారు. బాధిత కుటుంబ సభ్యలను బెదిరించి రాజీ చేసుకుంటున్నారు. స్థానికంగా పైరవీలకు పాల్పడుతున్న నాయకులు, కొందరు దళారులు పోయిన వ్యక్తి ఎలాగూ పోయాడు.. వారు ఇచ్చేది తీసుకొని రాజీ చేసుకోండి.. లేకుంటే మీకే ప్రమాదం అంటూ బాధిత కుటుంబాలను రాజీకి ఒప్పిస్తున్నారు. పోలీ సులు హత్య కేసులు త్వరగా ఛేదించి.. బాధి త కుటుంబాలకు అండగా నిలిచి నిందితులకు శిక్షలు పడేలా చేస్తే మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకుండా చూడవచ్చు. పంతం నెగ్గడమే ముఖ్యం.. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆస్తుల పంపకం, లావాదేవీల్లో తేడాలు కూర్చొని మా ట్లాడుకొని పరిష్కరించే వీలున్నవే కానీ ఆ దిశ గా చేస్తున్న వారు తక్కువవుతున్నారు. వివాదా లు పరిష్కరించేందుకు పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదు. ప్రతీసారి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ ఘర్ష ణలకు దిగుతున్నారు. ఈ క్రమంలో మధ్యవర్తులుగా ఉన్న వారు, నమ్మి చర్చలకు కూర్చున్న వారు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాదిలో చోటుచేసుకున్న హత్యలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. హత్యలు చేస్తే చట్టానికి చిక్కుతామని తెలిసినా.. కఠిన శిక్షలు పడతాయనే అవగాహన ఉన్నా వారిలోనూ భయం కనిపించడం లేదు. తమ మాట నెగ్గాలనే మొండితనం, చట్టాలపై ఉన్న చిన్నచూపు ఇందుకు కారణం. జిల్లాలో అసెంబ్లీ, పంచాయతీ, లోక్‌సభ ఎన్నికలను పోలీసులు చాలా ప్రశాంతంగా నిర్వహించారు. అదే తరహాలో స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని అవసరం ప్రణాళికలు వేసుకొని విజయవంతంగా ముగించారు. కానీ, ఓట్ల లెక్కింపు తర్వాత గ్రామాల్లో జరిగే ర్యాలీలపై ప్రత్యేక దృష్టి.. అవసరమైన నిఘా ఏర్పాటు చేయకపోవడంతో హత్యలు, దాడులకు దారితీసింది. ఈ క్రమంలోనే డోకూర్, రామచంద్రపూర్ గ్రామాల్లో జరిగిన ఘటనలు ఒక్కసారిగా పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారిపోయింది. -
మెజారిటీ జెడ్పీటీసీలు ఉన్నా..
జెడ్పీ చైర్మన్ స్థానం దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే తొమ్మిది జెడ్పీటీసీ స్థానాలను అధికంగా టీఆర్ఎస్ గెలుచుకుంది. రెండేసి స్థానాలు పొందిన కాంగ్రెస్, బీజేపీలు మ్యాజిక్ ఫిగర్‌కు దరిదాపుల్లో కూడా లేవు. అయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీఆర్ఎస్ తన జెడ్పీటీసీ సభ్యులను శిబిరానికి తరలించింది. జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల విషయంలో శుక్రవారం రాత్రి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అధినేత కేసీఆర్ సూచించిన వారికి ఈ పదవులు దక్కే అవకాశాలున్నాయి. శనివారం ఉదయం జెడ్పీలో జరిగే ప్రత్యేక సమావేశానికి జెడ్పీటీసీలు క్యాంపు నుంచి నేరుగా వచ్చి హాజరవుతారు. చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. మరోవైపు ఎంపీపీ పదవుల కోసం పెద్ద ఎత్తున ముడుపుల రాజకీయానికి తెరలేచింది. స్వతంత్రుల మద్దతు కీలకంగా మారిన చోట రూ.లక్షల్లో నజరానాలతో పాటు, వైస్ ఎంపీపీ పదవిని కొందరు డిమాండ్ చేస్తుండటం గమనార్హం. ఎంపీపీ పదవుల కోసం అధికార పార్టీ టీఆర్ఎస్లోనే పోటా పోటీ నెలకొనడం ఆసక్తి కరంగా మారింది. మండల పరిషత్ చైర్మన్ల ఎన్నిక శుక్రవారం నిర్వహించనున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్కు పూర్తి మెజారిటీ వచ్చినా ఆ పార్టీ క్యాంపును నిర్వహిస్తోంది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా జెడ్పీటీసీలందరినీ శిబిరానికి తరలించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కేర్ ఆస్పత్రి సమీపంలోని ఓ ప్రైవేటు వసతిగృహానికి తరలించారు. పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మంగళవారం రాత్రికే హైదరాబాద్ రావాలని జెడ్పీటీసీలందరికి ఆ పార్టీ నుంచి ఆదేశాలందాయి. చాలా మట్టుకు జెడ్పీటీసీలు అదేరోజు రాత్రి క్యాంపునకు వెళ్లగా, కొందరు బుధవారం చేరుకున్నారు. 27 జెడ్పీటీసీ స్థానాలకు గాను, 23 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం విదితమే. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే తొమ్మిది జెడ్పీటీసీ స్థానాలను అధికంగా గెలుచుకుంది. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు రెండేసి జెడ్పీటీసీలను దక్కించుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసినా మ్యాజిక్ ఫిగర్‌కు దరిదాపుల్లో లేకపోయినప్పటికీ., టీఆర్ఎస్ పార్టీ ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా జెడ్పీటీసీలను క్యాంపునకు తరలించడం చర్చనీయాంశంగా మారింది. అధినేత సూచించిన వారికే.. జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల విషయంలో శుక్రవారం రాత్రి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అధినేత కేసీఆర్ సూచించిన వారికి ఈ పదవులు దక్కే అవకాశాలున్నాయి. దీంతో చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుంది.? వైస్‌చైర్మన్‌గా ఎవరిని ఎన్నుకుంటారనేదానిపై ఇప్పటికే ఆ పార్టీ ము ఖ్యనేతలకు సంకేతాలున్నాయి. ఈ విషయమై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్పీకర్ పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలతో సమావేశం కానున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల విషయంలో అధిష్టానం నిర్ణయానికి స భ్యులందరూ కట్టుబడి ఉండాలని ఇప్పటికే జె డ్పీటీసీలందరినీ ఆదేశించారు. కాగా ఈ పదవుల కోసం గెలుపొందిన జెడ్పీటీసీలు ఎవరికి వారే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆయా ని యోజకవర్గ ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుంటున్నారు. చైర్మన్ రేసులో నలుగురి పేర్లు ప్రముఖంగావినిపిస్తుండగా,వైస్ చైర్మన్ పదవి కోసం మోస్రా జెడ్పీటీసీ భాస్కర్‌రెడ్డి స్పీకర్ పోచారం ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. నేరుగా జెడ్పీ సమావేశానికే.. హైదరాబాద్ క్యాంపులో ఉన్న జెడ్పీటీసీలందరినీ నేరుగా జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశానికి తీసుకురానున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునేందుకు శనివారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జెడ్పీ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన విషయం విదితమే. ఇప్పటికే జెడ్పీటీసీలందరికీ ఎన్నికల నోటీసులు అందజేశారు. దీంతో జెడ్పీటీసీ సభ్యులందరినీ నేరుగా ఆరోజు ఉదయం ఈ సమావేశానికి ప్రత్యేక బస్సుల్లో తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రేసులో ముగ్గురు..
సాక్షి, కొత్తగూడెం: పరిషత్ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత జిల్లాలో ఆసక్తికర వాతావరణం నెలకొంది. జిల్లా ప్రజాపరిషత్ విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ 21 జెడ్పీటీసీలకు గాను 16 గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యత సాధించింది. జిల్లా పరిషత్ చైర్మన్ విషయంలో ఎన్నికలకు ముందే స్పష్టత వచ్చింది. టేకులపల్లి నుంచి జెడ్పీటీసీగా విజయం సాధించిన కోరం కనకయ్య పేరును ఇప్పటికే టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. ఇక కనకయ్య ఆ పీఠం ఎక్కడం లాంఛనమే. అయితే జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్మన్ విషయంలో మాత్రం తీవ్ర ఉత్కంఠ, ఆసక్తి నెలకొన్నాయి. ఇందుకు కొంతమేర పోటీ ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి గెలిచిన జెడ్పీటీసీ సభ్యులను జిల్లా ఇన్చార్జి(జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ కోసం)గా ఉన్న ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దకు బుధవారం తీసుకెళ్లారు. అయితే పినపాక నియోజకవర్గంలో మొత్తం 7 జెడ్పీటీసీలకు గాను టీఆర్ఎస్ 6 స్థానాల్లో గెలుపొందింది. గుండాల జెడ్పీటీసీని న్యూడెమోక్రసీ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్కు చెందిన ఆరుగురు సభ్యులను పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం రాత్రే హైదరాబాద్ తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్ పీఠం దక్కించుకునేవారెవరనే విషయమై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముందంజలో కంచర్ల... చుంచుపల్లి నుంచి జెడ్పీటీసీగా గెలిచిన కంచర్ల చంద్రశేఖర్‌రావు వైస్ చైర్మన్ పీఠం రేసులో ముందంజలో ఉన్నారు. రాష్ట్ర విభజనకు ముందే రెండుసార్లు టీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. ఈ నేపథ్యంలో కంచర్లకు నేరుగా కేసీఆర్‌తోనే సంబంధాలు ఉన్నాయి. దీంతో సహజంగానే ఈ పదవి కోసం రేసులో ఉన్నారు. కంచర్లకు అవకాశం దక్కనుందని కొత్తగూడెం నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులతో దమ్మపేట నుంచి జెడ్పీటీసీగా గెలుపొందిన పైడి వెంకటేశ్వరరావు రేసులోకి వచ్చారు. ఆది నుంచి తుమ్మలకు ముఖ్య అనుచరుడిగా ఉన్న పైడి.. తనకు అవకాశం దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నారు. అదేవిధంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్కు ప్రాతినిథ్యం వహించే ఎమ్మెల్యే లేకపోవడంతో ఇక్కడి నుంచి వైస్ చైర్మన్ ఉంటే పార్టీకి మరింత మేలు కలుగుతుందని పలువురు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. తుమ్మల సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక మణుగూరు నుంచి జెడ్పీటీసీగా విజయం సాధించిన పోశం నర్సింహారావు సైతం వైస్ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. ఆయనకు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మద్దతు ఉంది. రేగా వ్యూహంతో నియోజకవర్గంలో గుండాల మినహా మిగిలిన ఆరు చోట్ల టీఆర్ఎస్ జెడ్పీటీసీలు భారీ మెజారిటీతో గెలుపొందారు. పైగా రేగాకు టీఆర్ఎస్ అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉంది. ఈ నేపథ్యంలో పోశం ప్రయత్నాలు సైతం గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. జెడ్పీ వైస్ చైర్మన్ పీఠం కోసం త్రిముఖ పోటీ ఉండడంతో జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. కొన్ని మండల పరిషత్‌లలో అస్పష్టత.. జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం విషయమై కచ్చితమైన స్పష్టత ఉండగా, వైస్ చైర్మన్ విషయమై ఉత్కంఠ కలిగిస్తోంది. మరోవైపు కొన్ని మండల ప్రజాపరిషత్‌ల విషయంలోనూ అస్పష్టత నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించక తప్పడం లేదు. చర్ల మండలంలో కాంగ్రెస్, సీపీఎం కూటమికి, దుమ్ముగూడెంలో సీపీఎం, సీపీఐ కూటమికి మెజారిటీ ఉంది. ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో మాత్రం టీఆర్ఎస్కు సంపూర్ణ మెజారిటీ ఉంది. అశ్వారావుపేట, దమ్మపేట, చండ్రుగొండ మండలాల్లో టీఆర్ఎస్కు పూర్తి మెజారిటీ ఉంది. అన్నపురెడ్డిపల్లి మండలంలో 6 ఎంపీటీసీలకు గాను టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు చెరో మూడు దక్కాయి. ఇక ములకలపల్లి మండలంలో ఏ పార్టీకీ తగినన్ని సీట్లు రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాల్లో టీఆర్ఎస్కు సంపూర్ణ మెజారిటీ దక్కింది. బూర్గంపాడు మండలంలో ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగలేదు. గుండాల మండలంలో న్యూడెమోక్రసీకి మెజారిటీ సీట్లు వచ్చాయి. ఆళ్లపల్లి మండలంలో టీఆర్ఎస్కు రెండు, కాంగ్రెస్‌కు ఒకటి, సీపీఐకి ఒకటి వచ్చాయి. జూలూరుపాడు, పాల్వంచ మండలాల్లో టీఆర్ఎస్కు సంపూర్ణ మెజారిటీ ఉంది. చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో టీఆర్ఎస్కు కేవలం ఒక్క ఎంపీటీసీ అవసరం ఉంది. ఈ మండలాల్లో ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. సుజాతనగర్ మండలంలో మాత్రం రాజకీయం రసవత్తరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా మండలాల్లో ఇప్పటికే క్యాంపులు నిర్వహిస్తున్నారు. -
ఉత్కంఠ రేపిన.. నార్కట్‌పల్లి
సాక్షిప్రతినిధి, నల్లగొండ : నార్కట్‌పల్లి జెడ్పీటీసీ ఫలితం తీవ్ర ఉత్కంఠ రేపింది. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ఫలితం దోబూచులాడగా.. చివరకు టీఆర్ఎస్ అభ్యర్థి బండా నరేందర్ రెడ్డి 11 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. ఓట్లను తిరిగి లెక్కించాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో బండా నరేందర్ రెడ్డికి 16,722 ఓట్లు పోల్‌కాగా, కోమటిరెడ్డి మోహన్‌రెడ్డికి .. 16,711 ఓట్లు వచ్చాయి. దీంతో 11 ఓట్ల మెజారిటీతో బండా విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. టీఆర్ఎస్ తమ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా బండా నరేందర్‌రెడ్డిని నిర్ణయించింది. బహిరంగంగా ప్రకటించకున్నా.. పార్టీ శ్రేణులకు ఈ సమాచారం ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలందరికీ తమ చైర్మన్ అభ్యర్థి బండా నరేందర్ రెడ్డి అని వివరించింది. దీంతో ఈస్థానంలో గెలుపు కోసం జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ప్రచా రం చేశారు. నామినేషన్ దాఖలు రోజే సభ నిర్వహించారు. హోంమంత్రి మహమూద్ అలీ సైతం మండల కేంద్రంలో పర్యటించి వెళ్లారు. మొత్తం గా టీఆర్ఎస్ ఈ స్థానాన్ని కీలకంగా భా వించింది. అదే సమయంలో కాంగ్రెస్‌నుంచి కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి పోటీకి దిగారు. ఆయనను జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా టీపీసీసీ ముందుగానే ప్రకటిం చింది. దీంతో ఈ స్థానంలో ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ రేపింది. మరో వైపు టీఆర్ఎస్ ముందు జాగ్రత్తగా.. మిర్యాలగూడ నుంచి మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయం సింహారెడ్డిని పోటీకి పెట్టింది. నార్కట్‌పల్లిలో అనుకోనిది ఏదైనా జరిగి ప్రతి కూల ఫలితం వస్తే.. తిప్పనకు అవకాశం ఇస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ కారణంగానే జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా టీఆర్ఎస్ అధికారికంగా ఎవరి పేరును బహిరంగంగా ప్రకటించలేదని చెబుతున్నారు. ఇప్పుడు ఇటు నార్కట్‌పల్లి, అటు మిర్యాలగూడ రెండు చోట్లా టీఆర్ఎస్ గెలిచింది. బండా ఎన్నిక లాంఛనమేనా..? నార్కట్‌పల్లి నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించిన బండా నరేందర్ రెడ్డిని జెడ్పీ చైర్మన్‌గా ఎన్నుకోవడం లాంఛనమేనని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బహిరంగంగా ఆయన పేరును చైర్మన్ పదవికి ప్రకటించక పోయినా.. ముందే నిర్ణయం జరిగిపోయిందని చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్లో కొనసాగుతున్న ఆయన అధినేత కేసీఆర్‌కు విధేయుడిగా ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్కు సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా పనిచేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ... ఇలా, ప్రతీ ఎన్నికల సందర్భంలో ఆయన టికెట్ ఆశించడం, భంగపడడం ఆనవాయితీగా జరిగేది. చివరకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అవకాశం ఇచ్చారు. ఈ లోగా జెడ్పీ ఎన్నికలు ఖరారు కావడంతో జెడ్పీ చైర్మన్ అవకాశం ఇవ్వడం కోసమే నామినేటెడ్ పోస్టుకు రాజీనామా చేయించారని పేర్కొంటున్నారు. 31 జెడ్పీటీసీ స్థానాలున్న నల్లగొండ జిల్లా పరిషత్‌లో తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకంగా 24 స్థానాలు గెలుచుకుంది. దీంతో తొలిసారి నల్లగొండ జెడ్పీపై గులాబీ జెండా ఎగరనుంది. బండా నరేందర్ రెడ్డి పేరును ప్రకటిస్తారని పార్టీ వర్గాలు అంటున్నా.. మరోవైపు తనకూ అవకాశం వస్తుందని తిప్పన విజయసింహారెడ్డి ఆశాభావంతో ఉన్నారని చెబుతున్నారు. సంక్షేమ పథకాలే నన్ను గెలిపించాయి ‘‘నార్కట్‌పల్లిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు ఎంపీ, ఎమ్మెల్యేలు. వారి కుటుంబ సభ్యులు వారు డబ్బులు ఖర్చు చేసి నన్ను ఓడించేందుకు శత విధాలుగా ప్రయత్నించారు. వాటన్నింటినీ ఎదురీది విజయం సాధించానంటే కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే గెలిపించాయి. నార్కట్‌పల్లి ప్రజలు వారి డబ్బులు లెక్క చేయకుండా నన్ను ఆశీర్వదించి గెలిపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 జెడ్పీ చైర్మన్స్థానాలు టీఆర్ఎస్సే కైవసం చేసుకుంటుందని ముందుకు చెప్పిన విధంగానే విజయం సాధించాం. ’’ – బండా నరేందర్ రెడ్డి -
ఓడి.. గెలిచారు!
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.. ఇందులో కొంత మంది భారీ మెజారిటీతో గెలుపొందగా.. మరికొందరు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. ఈ క్రమంలోనే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పలువురు అభ్యర్థులు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.. ఇక్కడ సానుభూతో.. మరే ఇతర కారణం చెతనో వారు గెలుపు తీరాలకు చేరుకున్నారు. విశేషమేమిటంటే.. ఐదు నెలల వ్యవధిలోనే ఓటర్ల తీర్పు మారడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నాగర్‌కర్నూల్: నియోజకవర్గంలో సర్పంచ్‌గా పోటీ చేసి ఓటమిపాలైన పలువురు అభ్యర్థులు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపొంది ఔరా అనిపించారు. మండలంలోని పెద్దముద్దునూరు గ్రామానికి చెందిన చిక్కొండ శ్రీశైలం సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయారు. అయితే మండలం జెడ్పీటీసీ బీసీ జనరల్ స్థానానికి కేటాయించడంతో జెడ్పీటీసీగా టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అలాగే తాడూరు మండల కేంద్రానికి చెందిన మల్లయ్య సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఎంపీటీసీలో జనరల్ మహిళకు రిజర్వేషన్ రావడంతో తన భార్య రేణుకను పోటీలో ఉంచగా 1,100 ఓట్ల మెజారిటీతో గెలిచింది. బిజినేపల్లి మండలం పాలెంకు చెందిన శ్రీనివాస్‌గౌడ్ సర్పంచ్ ఎన్నికల్లో తన భార్య సుమలతను బరిలో నిలపగా ఓటమిపాలైంది. ప్రస్తుతం శ్రీనివాస్‌గౌడ్ ఎంపీటీసీగా పాలెం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఎంపీటీసీలుగా నలుగురు.. ఉప్పునుంతల (అచ్చంపేట): మండలంలో నలుగురు అభ్యర్థులు గత సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని చవిచూసి తిరిగి ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఉప్పునుంతల సర్పంచ్‌గా ఓడిపోయిన అరుణ ప్రస్తుతం ఉప్పునుంతల–1 స్థానం నుంచి ఎంపీటీసీగా గెలుపొందారు. అలాగే ఉప్పునుంతల–2 నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన వెంకటేష్ గత సర్పంచ్ ఎన్నికల్లో దేవదారికుంటతండా సర్పంచ్‌గా పోటీచేసి ఓడిపోయారు. ఫిరట్వానిపల్లి ఎంపీటీసీగా ప్రస్తుతం గెలుపొందిన మల్లేష్ భార్య గత సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయింది. జప్తీసదగోడు ఎంపీటీసీ గెలుపొందిన ఇటిక్యాల కవిత భర్త తిర్పతిరెడ్డి గత సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయారు. బల్మూరు మండలం రామాజిపల్లిలో సర్పంచ్‌గా ఓడిపోయిన శాంతమ్మ ప్రస్తుతం ఎంపీటీసీగా మండలంలోనే 785 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. సర్పంచ్‌గా ఓడి.. జెడ్పీటీసీగా.. కొల్లాపూర్: నియోజకవర్గంలో పలువురు అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చవి చూసి, ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపొందారు. పెంట్లవెల్లి జెడ్పీటీసీగా గెలుపొందిన చిట్టెమ్మ సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిచెందారు. అలాగే పెద్దకొత్తపల్లి మండల జెడ్పీటీసీగా గెలుపొందిన గౌరమ్మ కూడా గత సర్పంచ్ ఎన్నికల్లో మారెడుమాన్‌దిన్నె గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయారు. మల్లేశ్వరం సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన ఈశ్వరమ్మ ఇప్పుడు అదే గ్రామ ఎంపీటీసీగా గెలిచింది. చెన్నపురావుపల్లి సర్పంచ్‌గా పోటీచేసి ఓడిపోయిన రామచంద్రయ్య ప్రస్తుతం ఎంపీటీసీగా గెలుపొందారు. లచ్చనాయక్‌తండా సర్పంచ్‌గా ఓడిన నిరంజన్‌నాయక్ తనయుడు ఇప్పుడు పాండునాయక్ నార్లాపూర్ ఎంపీటీసీగా గెలిచారు. చంద్రకల్ సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన సీపీఐ నాయకులు బాల్‌నర్సింహ భార్య ఇందిరమ్మ ఇప్పుడు ఎంపీటీసీగా గెలిచారు. మాచినేనిపల్లి సర్పంచ్ సుధారాణి సింగోటం ఎంపీటీసీగా గెలిచారు. ఆమె కొల్లాపూర్ ఎంపీపీ పదవి చేపట్టబోతున్నారు. ఆమె ఎంపీపీగా గెలవడంతో త్వరలోనే సర్పంచ్ పదవికి రాజీనామా చేయనున్నారు. వెల్దండ: మండలంలోని అజిలాపూర్‌లో లక్ష్మమ్మ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎంపీటీసీగా అవకాశం రావడంతో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అలాగే వెల్దండకు చెందిన విజేందర్‌రెడ్డి సర్పంచ్‌గా ఓడిపోగా.. ఎంపీటీసీ జనరల్ మహిళ రిజర్వేషన్ కావడంతో ఆయన భార్య ఉమ పోటీ చేసి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. బొల్లంపల్లిలో సర్పంచ్‌గా వెంకట్‌రెడ్డి భార్య ఓటమి చెందారు. వెంకట్‌రెడ్డి బొల్లంపల్లి కాంగ్రెస్ ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపొందగా.. నగారగడ్డతండా సర్పంచ్ జైపాల్‌నాయక్ పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. చెదురుపల్లి ఎంపీటీసీగా టీఆర్ఎస్ నుంచి జైపాల్‌నాయక్ భార్య విజయ ను పోటీలో ఉంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. 441 ఓట్ల మెజారిటీతో.. ఊర్కొండ (కల్వకుర్తి): మండలంలోని మాధారం గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్‌రెడ్డి గత ఎన్నికలలో సర్పంచ్‌గా పోటీచేసి, తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నిఖిల్‌రెడ్డిపై 299 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు. అయితే మే నెలలో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో భాగంగా మాధారం జనరల్‌కు కేటాయించడంతో, పార్టీ తిరిగి అరుణ్‌కుమార్‌రెడ్డిని ఎంపీటీసీ అభ్యర్ధిగా ప్రకటించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన అల్వాల్రెడ్డిపై 441 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కల్వకుర్తి రూరల్: మండలంలోని తాండ్రకు చెందిన ఎల్లమ్మ గత సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసింది. ఓటమికి భయపడకుండా ఎంపీటీసీగా పోటీ చేసి ఘన విజయం సాధించింది. దీంతో సర్పంచ్‌గా ఓడిపోయినా ఎంపీటీసీగా గెలవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
ఎంపీటీసీగా ఎంసీఏ విద్యార్థి అనూష
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉన్నత విద్య అభ్యసిస్తూనే గ్రామ రాజకీయాల్లో కీలకమైన ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎంసీఏ విద్యార్థి పులి అనూష ఘన విజయం సాధించారు. మహిళలకు రిజర్వ్ అయిన ఈ స్థానం నుంచి జరిగిన ముఖాముఖి పోటీలో టీఆర్ఎస్ అభ్యర్థి పడాల శ్రీజపై అనూష 72 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాలుగునెలలక్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ పోటీచేసిన అనూష ఓటమి పాలు కాగా, ఈసారి ఎంపీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయిన అనూషకు గ్రామస్తులు బాసటగా నిలిచారు. మాజీ ఎంపీటీసీ పులి వెంకటేశం కూతురైన అనూష కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఎంసీఏ తృతీయ సంవత్సరం చదువుతోంది. పిన్న వయసు 23 సంవత్సరాలలోనే గ్రామ ఎంపీటీసీగా, అది కూడా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తంచేస్తున్నారు. తమ కళాశాల విద్యార్థిని అనూష ఇండిపెండెంట్‌గా పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించడం పట్ల కళాశాల యాజమాన్యం, విద్యార్థులు హర్షం వ్యక్తంచేశారు. -
గుంపుతో ‘క్యాంపు’!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల పదవుల ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రాదేశిక ఎన్నికల ఫలితాల ప్రకటనకు ముందే ప్రధాన పార్టీలన్నింటా క్యాంపు రాజకీయాల బెడద మొదలైంది. ఫలితాలు వెలువడ్డాక.. గెలిచిన సభ్యులను ఎలా కాపాడుకోవాలి? ప్రత్యర్థులను ఎలా చిత్తు చేయాలి? చేతులెత్తే పద్ధతిన జరిగే జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్ష పదవులనెలా కైవశం చేసుకోవాలి.. మెజారిటీ బలాన్ని నిరూపించుకునేందుకు ఎవరికి వల వేయాలి? ఏమేం ఎర వేయాలి? అందరి నోటా ఇదే చర్చ జరుగుతోంది. నేటి సాయంత్రానికల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 71 జెడ్పీటీసీ, 780 ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. అనంతరం మండలాల్లో.. గ్రామాల్లో కొలువుదీరే విజేతలెవరో తేలిపోనుంది. అలాగే ఈనెల 7న ఎంపీపీ, 8న జెడ్పీ చైర్మన్ల ఎంపికకు ముహూర్తమూ ఖరారైంది. దీంతో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జెడ్పీ చైర్మన్ గిరీలతో పాటు ఎంపీపీ పీఠాలు ఎవరు కైవసం చేసుకుంటారో అనే చర్చ ఇప్పట్నుంచే మొదలైంది. క్యాంపునకు తరలించే యోచన ప్రాదేశిక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు చేజారకుండా వారిని క్యాంపులకు తరలించే యోచనలో పార్టీలున్నాయి. సాధారణంగా అన్ని చోట్ల ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీ అక్కడి ఎంపీపీ.. జెడ్పీ చైర్మన్, చైర్పర్సన్ పీఠాన్ని కైవశం చేసుకునే అవకాశముంది. కానీ అనిశ్చిత బలబలాలతో హంగ్ లాంటి పరిస్థితి ఉత్పన్నమైతే.. చైర్మన్ ఎన్నిక ఉత్కంఠభరితమే. ఒకటీ రెండు ఓట్లు తారుమారైతే.. ఎవరైనా లోపాయకారీగా ప్రత్యర్థి పార్టీలకు మొగ్గు చూపితే.. ఎన్నిక జరిగే సమయానికి ఎవరైనా గైర్హాజరైనా.. ఫలితం తారుమారయ్యే పరిస్థితి నెలకొంటుంది. గెలిచే మేజిక్ ఫిగర్‌కు ఒక ఓటు అటు ఇటయినా.. ఫలితం చేజారిపోవటం ఖాయం. అందుకే ప్రధాన పార్టీలతోపాటు చైర్మన్ గిరీ రేసులో ఉన్న అభ్యర్థులకు రాబోయే ఎన్నిక సవాలుగా మారుతుంది. పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికలు కావటంతో విప్ జారీ చేసే అవకాశం లేకపోలేదు. అందుకే తమకున్న బలగాన్ని చైర్మన్ ఎన్నిక జరిగే వరకు భద్రంగా కాపాడుకునేందుకు ప్రధాన పార్టీలు, అభ్యర్థులు ఇప్పట్నుంచే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. తమ సభ్యులతో పాటు అవసరమైన ఓట్ల మేరకు మిగతా వారితో బేరసారాలాడి ఎన్నిక నాటి వరకు ఎక్కడికైనా తరలించే క్యాంపు రాజకీయాలపై దృషి సారించాయి. ఫలితాలు వెలువడిన వెంటనే బేరసారాలు చేసుకుని రహస్యంగా శిబిరాలకు తరలించేందుకు నాయకులు మొగ్గు చూపుతున్నారు. మండలాల్లో ఈ క్యాంపు రాజకీయాలు మరింత జోరుగా సాగే అవకాశముంది. అన్నిచోట్ల ఎంపీటీసీలుగా గెలిచే సభ్యులకు ఎంతో కొంత ముట్టజెప్పి ఎంపీపీ పదవులను తమ వశం చేసుకునేందుకు అన్ని పార్టీల నాయకులు కాచుక్కూచున్నారు. అందుకే ఫలితాలు వెలువడిన వెంటనే ఎంపీటీసీ సభ్యులను విహారయాత్రల పేరుతో క్యాంపులకు తీసుకెళ్లే ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. పార్టీ ఆఫీసుల్లో సమావేశాల పేరిట గెలిచిన ఎంపీటీసీ సభ్యులందరినీ ఇతర ప్రాంతాలకు తరలించాలని ఒక ప్రధాన పార్టీ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సొంత పార్టీ సభ్యులు క్యాంపుల దారి పట్టకుండా ఉండేందుకు విప్ జారీ చేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. పదవిని అందుకోవాలని ఎంపీపీ రేసులో ఉన్న అభ్యర్థులు తమ శక్తియుక్తులతోపాటు డబ్బులు కుమ్మరించేందుకు సిద్ధపడగా.. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు సైతం ఎక్కువ ఎంపీపీ స్థానాలు తమ ఖాతాలో వేసుకోవాలని ఎత్తుగడలు వేస్తుండటంతో క్యాంపులు ఎన్ని రూట్లు మారుతాయోననే చర్చ జరుగుతోంది. రంగంలో ఇన్‌చార్జ్‌లు ప్రాదేశిక ఎన్నికల ఫలితాల తర్వాత గెలుపొందిన అభ్యర్థులు చేజారకుండా ఉండేందుకు అన్ని పార్టీలు శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఇన్‌చార్జీగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు నియమించారు. అలాగే జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని, నాగర్‌కర్నూల్ జిల్లాకు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిని నియమించారు. ఇటు కాంగ్రెస్ సైతం మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డిని, నాగర్‌కర్నూల్ జిల్లాకు మల్లు రవిని, వనపర్తి జిల్లాకు మాజీ మంత్రి చిన్నారెడ్డిని, జోగుళాంబ గద్వాలకు మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను నియమించింది. ఇక బీజేపీ నుంచి గెలుపొందిన అభ్యర్థులు క్యాంపులకు తరలివెళ్లకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆ పార్టీ నాయకులు డి.కె.అరుణ, మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయి పరిణామాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. -
ఎక్కడ.. ఎలా?!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) విజయఢంకా మోగించింది. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పసునూరు దయాకర్, మాలోతు కవిత విజయం సాధించిన విషయం విదితమే. అయితే, గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, తాజా లోక్‌సభ ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను బేరీజు వేసేందుకు ఆ పార్టీ అధిష్టానం పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ గత ఎన్నికలతో పోలిస్తే ‘ఎక్కడ తగ్గాం.. ఎక్కడా పెరిగాం’ అన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. కొంత తగ్గిన మెజార్టీ వరంగల్ లోక్‌సభ పరిధిలో మొత్తం 16,66,085 ఓట్లకు గాను 10,61,672 ఓట్లు పోల్ కాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరు దయాకర్ 3,50,298 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదే విధంగా మహబూబాబాద్ లోక్‌సభ స్థానం నుంచి మొత్తం 14,24,385 ఓట్లకు గాను 9,83,708 ఓట్లు పోల్ కాగా 1,46,663 ఓట్ల మెజార్టీతో మాలోతు కవిత విజయం సాధించారు. ఇలా రెండు లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగినా... 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి టీఆర్ఎస్ అభ్యర్థులకు మెజార్టీ తగ్గింది. తెలంగాణ వ్యాప్తంగా ఎంపీ ఎన్నికల ఫలితాలపై శుక్రవారం సమీక్ష జరిపిన గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలైన ఓట్లు, మెజార్టీపై ఆరా తీసినట్లు తెలిసింది. నాలుగు చోట్ల పైకి.. ఎనిమిది చోట్ల కిందకు... వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. భద్రాచలం, పినపాక, ఇల్లందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిశీలిస్తే.. ఈసారి పరకాల, వరంగల్ తూర్పు, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓట్లు పెరిగాయి. ఇక వరంగల్ పశ్చిమ, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో మాత్రం తగ్గాయి. పరకాలలో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డికి 59,384 ఓట్లు వస్తే.. ఈసారి ఆ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థికి 87,567 ఓట్లు నమోదయ్యాయి. భూపాలపల్లిలో గతంలో టీఆర్ఎస్కు 53,567 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 91,628 వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో అనూహ్యంగా మెజార్టీ పెరిగింది. ములుగులో 2018 ఎన్నికల్లో 66,300 ఓట్లు రాగా, ఈసారి 71,518 పార్లమెంట్ అభ్యర్థికి వచ్చాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి 98,612 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 94,327 ఓట్లు పోలయ్యాయి. పాలకుర్తికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 1,17,694 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 92,437, జనగామలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 91,592 ఓట్లు రాగా.. ఇప్పుడు 68,380, డోర్నకల్‌లో అసెంబ్లీ పోలింగ్‌లో 85,467, లోక్‌సభకు 78,986, మహబూబాబాద్‌లో అసెంబ్లీకి 85,397, లోక్‌సభకు 84,031, వరంగల్ పశ్చిమలో అసెంబ్లీకి 81,006, లోక్‌సభలో 62,669, వర్దన్నపేటలో అసెంబ్లీ ఎన్నికల్లో 1,31,252 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 97,526 ఓట్లు నమోదయ్యాయి. అయితే, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను పోలిస్తే 12 శాతం పోలింగ్ తక్కువ నమోదు కావడమే మెజార్టీ తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. కానీ మరింత సమన్వయంతో పని చేస్తే ఆ ఎనిమిది సెగ్మెంట్లలోనూ వెనుకబడిపోయే పరిస్థితి ఉండేది కాదన్న అంచనాకు అధినేత వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. ‘ఓరుగల్లు’పై గులాబీ జెండా. ఒకప్పుడు కాంగ్రెస్.. ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా ఉన్న వరంగల్, మహబూబాబాద్‌పై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురేసింది. హన్మకొండ.. ఆ తర్వాత 2009 పునర్విభజనలో ఏర్పడిన వరంగల్‌గా ఏర్పడిన పార్లమెంట్ నియోజకవర్గానికి 1952 నుంచి 2015 వరకు మూడు ఉప ఎన్నికలు కలుపుకుని మొత్తం 19 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏడు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు కాంగ్రెస్(ఐ) అభ్యర్థులు విజయం సాధించారు. ఇక టీడీపీ ఐదు, టీఆర్ఎస్ మూడు, టీపీఎస్, పీడీఎఫ్ పార్టీలు ఒక్కోసారి గెలుపొందాయి. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో ధరావత్ రవీంద్రనాయక్ గెలుపొందారు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నికలో టీడీపీ, 2009లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఎన్నికలో టీఆర్ఎస్ ఈ నియోజకవర్గం నుంచి కడియం శ్రీహరి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కావడంతో 2015 వచ్చిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ విజయం సాధించగా.. తాజా ఎన్నికల్లోనూ ఆయనే మరోమారు విజయం సాధించారు. ఇక ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్, టీడీపీ కాంగ్రెస్, టీడీపీలకు కంచుకోటల్లా ఉన్న మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఏ మాత్రం ప్రభావం చూపకపోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం ద్విసభ్య నియోజకర్గంగా కొనసాగింది. ఈ సమయంలో 1957, 1962లో సార్వత్రిక ఎన్నికలు, 1965లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ మూడు సమయాల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే విజయం వరించింది. ఆ తర్వాత ఈ స్థానం రద్దు కాగా.. 2009లో మళ్లీ ఏర్పడింది. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ విజయం సాధించారు. ఇక 2014లో మహబూబాబాద్(ఎస్టీ)లో టీఆర్ఎస్ పక్షాన ప్రొఫెసర్ సీతారాం నాయక్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లోను టీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్, టీడీపీ ప్రాభవం కోల్పోయినట్లయింది. -
మోదం.. ఖేదం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. నియోజకవర్గాలు, పోలింగ్ బూత్‌లలో వచ్చి న ఓట్ల ఆధారంగా పోస్టుమార్టం నిర్వహిస్తున్నాయి. గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాలు మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీకి మోదం కలిగించగా.. కాంగ్రెస్ పార్టీకి ఖేదం మిగిల్చాయి. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగించి.. పార్టీ టికెట్‌పై పోటీ చేసిన ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ ఘనవిజయం సాధించి ఆరు నెలలైనా గడవకముందే జిల్లాలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం చవిచూడాల్సిన పరిస్థితి నెలకొందనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిసి పోటీ చేశాయి. ఇందులో కాంగ్రెస్.. మధిర, పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పోటీ చేయగా.. భాగస్వామ్య పక్షమైన సీపీఐ వైరాలో.. తెలుగుదేశం పార్టీ ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పోటీ చేశాయి. వీటిలో వైరా, ఖమ్మం మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీకి చెందిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. రాష్ట్రమంతటా టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతున్న సమయంలో జిల్లాలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడంతో జిల్లాలో కాంగ్రెస్‌కు రాజకీయంగా తిరుగు లేదనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు దూరమైనా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తల అండదండలు, సంప్రదాయ ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ విజయానికి కృషి చేసినా ఫలితం మాత్రం పార్టీ ఊహించిన దానికి భిన్నంగా వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, మహాకూటమి మిత్రపక్షాల అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కన్నా అత్యంత తక్కువగా రావడమే కాకుండా.. ప్రతి నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్కు మెజార్టీ రావడానికి గల కారణాలపై కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరి నియోజకవర్గాల వారీగా పరిస్థితిని సమీక్షించే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీ విజయానికి ఏ నియోజకవర్గంలో.. ఏ స్థాయిలో కృషి జరిగింది.. ఆయా ప్రాంతాల్లో ఓట్ల శాతం తగ్గడానికి గల కారణాలపై కాంగ్రెస్ నేతలు ఆరా తీసే పనిలో పడ్డారు. ఏడింట్లో మెజార్టీ రాదాయె.. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ మెజార్టీ సాధించలేకపోయింది. అయితే అన్ని నియోజకవర్గాల్లో మాత్రం రెండో స్థానాన్ని మాత్రం కైవసం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన పాలేరు, మిత్రపక్షమైన టీడీపీ గెలుపొందిన సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో సైతం టీఆర్ఎస్ మెజార్టీ సాధించడం, మధిర నియోజకవర్గంలోనూ ఆ పార్టీయే మెజార్టీ సాధించింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన కొత్తగూడెం నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌ది రెండో స్థానమే అయింది. ఇక వైరా నియోజకవర్గంలో టీఆర్ఎస్కు మెజార్టీ వచ్చినా.. మిగితా నియోజకవర్గాలతో పోలిస్తే స్వల్పమే కావడం కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చింది. పార్టీ కోసం పరిశ్రమించే కార్యకర్తలున్నా కొన్నిచోట్ల వారిని పూర్తిస్థాయిలో పార్టీకి పనిచేసే విధంగా నాయకులు చేయలేకపోయారని, నాయకుల చుట్టూ రాజకీయాలు తిరగడం వల్ల పార్టీకి కొంత నష్టం జరిగిందని ఖమ్మం కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి రేణుకా చౌదరి శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. తన ఓటమికి గల కారణాలపై అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నామని, పోలింగ్ కేంద్రాలవారీగా వివరాలు వచ్చాక లోపం ఎక్కడ జరిగింది? పార్టీ గెలుపునకు అడ్డు పడింది ఎవరో తెలుస్తుందని.. దాని ఆధారంగా పార్టీ హైకమాండ్‌కు నివేదిక ఇస్తామన్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీకి అనూహ్య రీతిలో పెరిగిన మెజార్టీతో ఆ పార్టీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ జిల్లాలో టీఆర్ఎస్ మరింత పుంజుకుంటుందనడానికి నిదర్శనమని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో పరాజయం పాలు కావడంతో ఆ పార్టీలో తీవ్ర నైరాశ్యం అలుముకుంది. -
కౌంట్ డౌన్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గడువు దగ్గరపడుతున్న కొద్దీ ఆయా పార్టీల నేతల్లో గుబులు రేకెత్తిస్తోంది. ఓట్ల లెక్కింపునకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో మరోసారి సర్వే అంచనాలు దగ్గర పెట్టుకుని ఫలితాలపై విశ్లేషిస్తున్నారు. ప్రతిష్టాత్మక చేవెళ్ల లోక్‌సభలో గెలుపుపై మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు గంపెడాశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ, విపక్ష కాంగ్రెస్ గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క కాషాయదళం కూడా విజయంపై గట్టి నమ్మకంతో ఉంది. ఓట్ల లెక్కింపు సమయం సమీపిస్తుండడంతో పార్టీలు, అభ్యర్థులు నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కలు వేసుకుంటున్నారు. చేవెళ్ల స్థానానికి పోలింగ్ శాతం మరీ తక్కువగా నమోదైన విషయం తెలిసిందే. 55 శాతం మించకపోవడంతో ఆ ప్రభావం ఏ పార్టీపైన పడుతుందోనని ప్రధాన పార్టీల నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ముగ్గురిలోనూ గెలుపు ధీమా చేవెళ్ల లోక్‌సభకు 23 మంది పోటీ చేశారు. ఇందులో ప్రధాన, చిన్నాచితక పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులూ బరిలో నిలిచారు. అధికార పార్టీ తరఫున పోటీ చేసిన పారిశ్రామికవేత్త రంజిత్ రెడ్డి విజయంపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ లోక్‌సభ ఎన్నిక ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన.. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నిక ఒకరకంగా ఆయన రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. జిల్లాకు చెందిన నేతలను కాదని స్థానికేతరుడునైన రంజిత్‌రెడ్డికి సీఎం కేసీఆర్ అవకాశమిచ్చారు. ఈయన గెలుపు బాధ్యతలను మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి పార్టీ అప్పగించింది. ఒకరకంగా మహేందర్‌రెడ్డి రాజకీయ పరపతి.. రంజిత్‌రెడ్డి విజయంపై ఆధారపడి ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఆయన మంత్రి పదవి రేసులో ఉన్నట్లే. రంజిత్‌రెడ్డి గెలిస్తే పార్టీలో మహేందర్‌రెడ్డి స్థానం పదిలమే. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. మూడు నాలుగు నియోజకవర్గాలు.. కొండాకు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తాండూరు, చేవెళ్ల, వికారాబాద్ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌కు అధికంగా ఓట్లు దక్కే వీలుందని నేతలు భావిస్తున్నారు. మిగతా పార్టీల్లో కంటే ఈయన అభ్యర్థిత్వం ముందే ఖరారు కావడం వల్ల పకడ్బందీ ప్రణాళికతో ప్రజాక్షేత్రంలో దిగారు. ఎక్కువ మంది ఓటర్లను కలుసుకునే సమయం దక్కింది. అలాగే బీజేపీ అభ్యర్థి బెక్కరి జనార్దన్‌రెడ్డి గెలుపు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మహేశ్వరం నియోజకవర్గంలో ఈ పార్టీకి మంచి పట్టుంది. దీనికి తోడు పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ, శంషాబాద్‌కు ఆ పార్టీ చీఫ్ అమిత్‌షా రావడం మరింత కలిసి వస్తోందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మొత్తం మీద ఏ అభ్యర్థి.. ఏ మేరకు ఓటర్లకు దగ్గరయ్యారన్నది 23న తేలనుంది. ఎమ్మెల్యేల్లో ఆందోళన చేవెళ్ల లోక్‌సభ ఫలితాలు అందరిలో ఉత్కంఠను రేపుతుండగా.. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో మాత్రం టెన్షన్‌ను పుట్టిస్తున్నాయి. ఈ ఫలితాలు ఒకరకంగా తమ రాజకీయ భవిష్యత్‌ను నిర్దేశిస్తాయని భావిస్తుండడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. శాసనసభ నియోజకవర్గాల్లో మెజార్టీ సాధిస్తేనే.. సదరు ఎమ్మెల్యేలపై సీఎం దృష్టిలో సదాభిప్రాయం ఉంటుంది. ఒకవేళ ఆయా సెగ్మెంట్లలో మెజార్టీ తగ్గితే గులాబీ దళపతికి తాము ఏం సమాధానం చెప్పుకోవాలోనని కలవరపడుతున్నారు. ముఖ్యంగా వికారాబాద్, చేవెళ్ల, మహేశ్వరం, శేరిలింగంపల్లి తదితర నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు ఆశించిన స్థాయిలో ఓట్లు దక్కలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైనట్లు వినికిడి. ప్రధానంగా మహేశ్వరంలో కాంగ్రెస్ తరఫున గెలిచి టీఆర్ఎస్కు దగ్గరైన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు ఈ ఫలితాలు కీలకంగా మారనున్నాయి. ఎన్నికల సమయంలో ‘మన పార్టీ అభ్యర్థిని గెలిపించుకురండి’ అని వీరికి సీఎం చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గ ఓటర్లు ఎటు వైపు ఉంటారోనని సర్వత్రా ఆసక్తి రేపుతోంది. -
కొండా వర్సెస్ పట్నం
మరో బిగ్ ఫైట్‌కు ఉమ్మడి జిల్లా వేదిక కానుంది. హోరాహోరీగా లోక్‌సభ ఎన్నికలు జరిగిన నెల రోజులకే ఇద్దరు ఉద్ధండులు అమీతుమీ తేల్చుకునేందుకు రంగం సిద్ధమైంది. కొంతకాలంగా ఒకరిపై ఒకరు అంతర్గతంగా కారాలుమిరియాలు నూరుతున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి.. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తలపడనున్నారు. సాక్షి, రంగారెడ్డి: జిల్లాస్థానిక కోటాలో ఈనెల 31న జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా పట్నం మహేందర్‌రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ఆదివారం ఖరారు చేసింది. మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బరిలో దిగనున్నారు. మహేందర్ రెడ్డితో ఢీ అంటే ఢీ అనేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొదటి నుంచి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు నెలకొనడంతో.. పట్నంపై పైచేయి సాధించేందుకు కొండా కదన కుతూహలాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తాజా పరిణామంతో జిల్లా రాజకీయ యవనికపై మరింత ఉత్కంఠ నెలకొంది. ఆది నుంచి వైరమే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాజకీయ అరంగేట్రం చేసిన కొండా.. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున చేవెళ్ల లోక్‌సభకు పోటీ చేసి గెలుపొందారు. ఇదే సమయంలో అప్పటి వరకు టీడీపీలో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పట్నం చేరికపై కొండా అయిష్టంగానే ఉన్నారు. 2014 జనరల్ ఎన్నికల్లో తాండూరు అసెంబ్లీసెగ్మెంట్ నుంచి గెలుపొందిన పట్నం కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఈనేపథ్యంలో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు షురూ మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు పొడచూపడం మొదలయ్యాయి. దీనికితోడు నియోజకవర్గంలో తనను మహేందర్ రెడ్డి తిరగనివ్వడం లేదని, తన అనుచరులను వేధింపులకు గురిచేస్తున్నారని అంతర్గతంగా కొండా సీరియస్ కావడానికి ప్రధాన కారణమైంది. ఈ వైరం కాస్త ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే గతేడాది నవంబర్‌లో కారుకు గుడ్‌బై చెప్పిన విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తర్వాత గత డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసిన పట్నం.. అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కొండా ప్రధాన అనుచరుడు పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో ఆయన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. కొండానే ఎందుకు? ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు నలుగురి పేర్లు పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. వీరు బరిలో దిగేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నిక ఓటర్లయిన ఉమ్మడి జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతోపాటు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లను ప్రభావితం చేయడం కష్టం. అలాగే టీఆర్ఎస్ ఓటర్ల సంఖ్యా బలం అధికంగా ఉండటంతో.. తమకు ఓటమి తప్పదని వారు భావిస్తున్నారు. పైగా క్యాంపుల నిర్వహణ డబ్బులతో ముడిపడి ఉన్న వ్యవహారం. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న నేతలు పోటీ చేసేందుకు సాహసించడం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పట్నం మహేందర్‌రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి ఎవరూ ముందుకు రాకపోవడం, తన రాజకీయ శత్రువుగా భావిస్తున్న మహేందర్ రెడ్డి అధికార పార్టీ తరఫున బరిలో ఉండడంతో కొండా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పార్టీలో పట్టు ఉండటంతోపాటు ఆర్థికంగా బలంగా ఉన్న ఆయన.. అధికార పార్టీ క్యాంపు రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతారని పార్టీ కూడా విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికకు ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచే వీలుంది. ఒకవేళ విశ్వేశ్వర్‌రెడ్డి కాకపోతే ఆయన సతీమణి సంగీతారెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. -
ముగిసిన ప్రచారం
నిజామాబాద్‌అర్బన్: ప్రచార పర్వానికి తెర పడింది. ఓట్ల కోసం ప్రలోభాల వేట మొదలైంది. ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత ఆర్మూర్ డివిజన్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మంగళవారం నాటి పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడో విడత ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. హోరాహోరీ పోరులో గట్టెక్కేందుకు అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు మద్యం, మాంసం, నగదు ఎర వేస్తున్నారు. పది రోజులుగా ఎడతెరిపి లేకుండా ప్రచారం చేసిన అభ్యర్థులు ఓట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మూగబోయిన మైక్‌లు ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో పరిషత్ ఎన్నికలు జరుగనున్నాయి. ఆర్మూర్, బాల్కొండ, మెండోరా, ముప్కాల్, భీమ్‌గల్, జక్రాన్‌పల్లి, కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల, నందిపేట, వేల్పూరు మండలాల్లోని 11 జెడ్పీటీసీ, 124 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇందులో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. 11 జెడ్పీటీసీ స్థానాలకు గాను 40 మంది పోటీలో ఉండగా, 117 ఎంపీటీసీ స్థానాల్లో 372 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత పది రోజులుగా అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తించారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఆదివారం సాయంత్రం ప్రచారానికి తెరపడింది. ప్రచార పర్వం ముగియడంతో అభ్యర్థులు తదుపరి ‘కార్యాచరణ’పై దృష్టి సారించారు. ఏర్పాట్లు పూర్తి ఈ నెల 14తో పరిషత్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ నెల 27న కౌంటింగ్ నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తుది విడత పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఆయా మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులను, ఎన్నికల సామగ్రిని తీసుకొని పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లనున్నారు. మరోవైపు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 1500 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొననున్నారు. ప్రలోభాల పర్వం.. ప్రచారం ముగియడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు అవస్థలు పడుతున్నారు. విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ నజరానాలు అందజేస్తున్నారు. మాంసం, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రలోభాలకు తెర లేపారు. ఆర్మూర్ మండలంలో జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురు, నందిపేటలో ఆరుగురు, బాల్కొండలో ఆరుగురు, ముప్కాల్‌లో ముగ్గురు, జక్రాన్‌పల్లి నలుగురు, ఏర్గట్లలో ఇద్దరు, మోర్తాడ్‌లో ముగ్గురు, భీమ్‌గల్‌లో ముగ్గురు, మెండోరలో ముగ్గురు చొప్పున జెడ్పీటీసీ స్థానాలకు పోటీపడుతున్నారు. హోరాహోరీ పోటీ ఉండడంతో అభ్యర్థులు గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఓటెత్తారు
సాక్షి, మెదక్ : మలి విడత ప్రాదేశిక ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలు నర్సాపూర్, కౌడిపల్లి, చిలప్‌చెడ్, శివ్వంపేట, వెల్దుర్తి, కొల్చారంలో శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ శాతం 80.85గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 3.11 శాతం, తొలి విడత మండల, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలతో పోలిస్తే 3.07 శాతం అధికంగా నమోదైనట్లు స్పష్టమవుతోంది. ఈ నెల 14న తుది విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. అదేరోజు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. పురుషులదే పైచేయి రెండో విడతలో మొత్తం ఆరు జెడ్పీటీసీ స్థానాలకు 22 మంది బరిలో ఉన్నారు. శివ్వంపేట మండలం చండి ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం కాగా.. మిగిలిన 59 స్థానాలకు 205 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 337 పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి విడత ఎన్నికల్లో మహిళలు ఓటెత్తి పైచేయి సాధించగా.. రెండో విడతలో పురుషులు పైచేయి సాధించారు. మలి విడత ఎన్నికల్లో పురుషులు 76,718, మహిళలు 79,505, ఇతరులు ఇద్దరు.. మొత్తం 1,56,225 మంది ఓటెయ్యాల్సి ఉంది. ఇందులో 1,26,306 మంది మాత్రమే ఓటేశారు. ఓటేసిన వారిలో పురుషులు 63,519, మహిళలు 62,787 మంది ఉన్నారు. ఫస్ట్ నర్సాపూర్.. లాస్ట్ కొల్చారం రెండో విడతలో ఎన్నికలు జరిగిన మండలాల్లో పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే నర్సాపూర్‌లో అత్యధికంగా నమోదైంది. 95.39 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. శివ్వంపేట మండలం 83.00, కౌడిపల్లి 81.28, చిలప్‌చెడ్ 80.90, వెల్దుర్తి 78.44 శాతంతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 76.19 శాతంతో కొల్చారం చివరి స్థానంలో నిలిచింది. రెండు గంటలకోసారి వెల్లడి ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. పోలింగ్ శాతాన్ని అధికారులు రెండు గంటలకోసారి వెల్లడించారు. ఉదయం తొమ్మిది గంటలకు 27.96.. 11 గంటలకు 52.56.. ఒంటి గంటకు 68.00.. మూడు గంటలకు 74.67.. పోలింగ్ ముగిసే ఐదు గంటల వరకు 80.85 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎంపీ, తొలివిడత ప్రాదేశిక పోలింగ్ కంటే అధికం తొలివిడత ప్రాదేశిక ఎన్నికల్లో 77.78 శాతం పోలింగ్ నమోదు కాగా.. మలి విడతలో 80.85 శాతం నమోదైంది. ఈ లెక్కన 3.07 శాతం అధికంగా పోలింగ్ నమోదైనట్లు స్పష్టమవుతోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో 77.74 శాతం పోలింగ్ నమోదు కాగా.. రెండో విడత ప్రాదేశిక ఎన్నికల్లో 80.85 శాతం నమోదైంది. 3.11 శాతం అధికంగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. పెద్దగొట్టిముక్లలో స్వల్ప ఘర్షణ శివ్వంపేట మండలంలోని పెద్దగొట్టిముక్కల పోలింగ్ కేంద్రం వద్ద కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్లో స్వతంత్రంగా పోటీచేస్తున్న రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు అలర్ట్ అయి చెదరగొట్టారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. స్ట్రాంగ్ రూంలకు బ్యాలెట్ బాక్సుల తరలింపు పోలింగ్ అనంతరం పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య వాహనాల్లో బ్యాలెట్ బాక్సులను నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని కౌడిపల్లి మండలం తునికికి తరలించారు. మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో వాటిని భద్రపరిచారు. స్ట్రాంగ్ రూం వద్ద నిరంతర గస్తీ ఉండేలా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంది. అధికారులు, ప్రజాప్రతినిధుల పరిశీలన రెండో విడతలో పోలింగ్ సరళిని అధికారులు నిశితంగా పర్యవేక్షించారు. పలు పోలింగ్ సెంటర్లను సందర్శించారు. శివ్వంపేటలోని పలు పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు వాకాటి కరుణ, వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ధర్మారెడ్డి పరిశీలించారు. వెల్దుర్తి మండల పరిధిలోని పలు పోలింగ్ సెంటర్లను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సందర్శించి పోలింగ్ తీరును తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దంపతులు కౌడిపల్లిలో, మాజీమంత్రి సునీతారెడ్డి గోమారంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. 14న తుదివిడత పోరు తొలి, మలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఈ నెల 14న జిల్లాలోని ఎనిమిది మండలాల (తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, మెదక్) పరిధిలో తుది విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27న ఓట్లు లెక్కించి.. అదే రోజున ఫలితాలు వెల్లడించనున్నారు. -
82.56% శాతం పోలింగ్
మిర్యాలగూడ : మిర్యాలగూడ డివిజన్లో శుక్రవారం ప్రాదేశిక ఎన్నికల మలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకో లేదు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఎండ వేడిమికి ఓటర్లు ఉదయమే ఎక్కువ మంది క్యూలో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు డివిజన్లో మొత్తం 82.56 శాతం పోలింగ్ నమోదైంది. మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలో పది మండలాల్లో 109 ఎంపీటీసీలకు గాను నాలుగు ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 105 ఎంపీటీసీ స్థానాలకు గాను 363 మంది అభ్యర్థులు, పది జెడ్పీటీసీ స్థానాలకు 51మంది మొత్తం 414 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పది మండలాల్లో పురుషులు 1,49, 020 మంది, మహిళలు 1,51,331 మంది, ఇతరులు ఆరుగురు, మొత్తం 3,00,357 మంది ఓటర్లు ఉండగా 2,47,988 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా మాడుగులపల్లిలో పోలింగ్ డివిజన్లో అత్యధికంగా మాడుగులపల్లి మండలంలో పోలింగ్‌శాతం నమోదైంది. మొత్తం డివిజన్లో 82.56 శాతం పోలింగ్ కాగా అత్యధికంగా మాడుగులపల్లి మండలంలో 88.47 శాతం, అతి తక్కువగా అనుముల మండలంలో 79.01 శాతం పోలింగ్ నమోదైంది. భారీ బందోబస్తు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. డివిజన్లోని పది మండలాల్లో 1551 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ రంగనా«థ్ మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలం శెట్టిపాలెం, అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని పోలింగ్ స్టేషన్లను, అనుముల మండలం కొత్తపల్లి పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. ఎన్నికల పరిశీలకులు చంపాలాల్ నిడమనూరు మండలంలోని నారమ్మగూడెం పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. ఎండ వేడిమి వల్ల ఉదయమే ఎక్కువ పోలింగ్ వేసవిలో ఎండ వేడిమి వల్ల ఉదయం వేళలోనే ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావడం వల్ల మద్యాహ్నం 1 గంట వరకే డివిజన్లో 63.24 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 44 డిగ్రీల ఎండ వేడిమిలో కూడా ఓటర్లు బారులుదీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రెండో విడత ‘ప్రాదేశిక’ పోరు
ప్రాదేశిక పోరులో భాగంగా మలి విడత ప్రచారానికి బుధవారం సాయంత్రం 5 గంటలతో తెరపడింది. ఈ దఫాలో జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్, వెల్దుర్తి, శివ్వంపేట, కౌడిపల్లి, చిలిప్‌చెడ్, కొల్చారం మండలాల పరిధిలో శుక్రవారం పోలింగ్ జరగనుంది. చివరి రోజు ఆయా పార్టీల అభ్యర్థులు పోటాపోటీ ప్రచారంతో హోరెత్తించారు. ఎన్నికలకు ఒక రోజు మాత్రమే మిగిలి ఉండడంతో రాత్రి వేళ గ్రామాల్లో ప్రలోభాల పర్వం తారస్థాయికి చేరింది. పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. మరోపక్క అధికారులు పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. సాక్షి, మెదక్ : రెండో విడత ప్రాదేశిక పోరులో ఆరు జెడ్పీటీసీ స్థానాలకు 22 మంది పోటీలో ఉన్నారు. నర్సాపూర్ జెడ్పీటీసీ పదవికి ముగ్గురు (టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ), వెల్దుర్తిలో నలుగురు (టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం), శివ్వంపేటలో ఐదుగురు (టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, స్వతంత్ర), కౌడిపల్లిలో ముగ్గురు (టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ), చిలిప్‌చెడ్‌లో ముగ్గురు (టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ), కొల్చారంలో నలుగురు (టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ) పోటీ పడుతున్నారు. అదేవిధంగా, 60 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా.. శివంపేట మండలంలోని చండి ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమైంది. దీంతో మిగిలిన 59 ఎంపీటీసీ స్థానాలకు 209 మంది పోటీలో ఉన్నారు. ఈ లెక్కన ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు తీవ్ర పోటీ నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు చెమటోడుస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా చివరి రోజు పోటాపోటీగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దీంతోపాటు మద్యం, ఇతర తాయిలాలతో ఓటర్లను ప్రభావితం చేసేలా రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. చివరి రోజు నేతల జోరు టీఆర్ఎస్లో అభ్యర్థులకు మద్దతుగా చివరి రోజు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కొల్చారం మండల కేంద్రంతో పాటు ఎనగళ్ల, పైకర, రంగంపేట, సంగాయిపేట, చిన్నఘనపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి సునీతారెడ్డి శివ్వంపేట మండలం పొద్దగొట్టిముక్కుల గ్రామంలో ప్రచారం చేపట్టి టీఆర్ఎస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నర్సంపేట మండలం కాజీపేట ఎంపీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్ ప్రచారం నిర్వహించి తనను గెలిపించాలని అభ్యర్థించారు. అదేవిధంగా ఆయన పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు తమ అభ్యర్థులకు మద్దతుగా కొల్చారం మండలంలోని సంగాయిపేట్, చిన్నఘనపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మద్యం.. డబ్బులు.. పోలింగ్‌కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో అభ్యర్థులు బుధవారం సాయంత్రం నేతలతో మంతనాల్లో మునిగినట్లు తెలుస్తోంది. తీవ్ర పోటీ నెలకొనడంతో ఎక్కడెక్కడ.. ఏయే పంచాయతీలు.. ఏయే వార్డులు తమకు అనుకూలంగా ఉన్నాయి.. ఏవి అనుకూలంగా లేవు.. ఏం చేయాలి వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రలోభ పర్వానికి తెరలేచినట్లు సమాచారం. కొన్నిచోట్ల ఇంటింటికీ మద్యం బాటిళ్లతోపాటు డబ్బులు పంపిణీ చేసేలా అభ్యర్థులు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇందుకోసం పలువురిని కేటాయించినట్లు తెలిసింది. -
ఎమ్మెల్సీ నగారా
సాక్షి, వికారాబాద్: ప్రాదేశిక సమరం పూర్తి కాకముందే మరో ఎన్నికకు నగరా మోగింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మంగళవారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఒక స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం నరేందర్‌రెడ్డి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ సీటు ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు మే 14వ తేదీలోగా నామినేషన్ దాఖలు చేయాలి. మే 17న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మే 31వ తేదీన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరుగుతాయి. జూన్ 3వ తేదీన ఉప ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఉప ఎన్నికలు జరిగే ఎమ్మెల్సీ స్థానంలో గెలిచిన అభ్యర్థి జనవరి 2, 2022 వరకు పదవిలో కొనసాగుతారు. స్థానిక సంస్థల కోటాలో ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. డిసెంబర్ 28, 2015లో వీటికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు పోటీ చేయగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన శంబీపూర్ రాజు, పట్నం నరేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నరేందర్‌రెడ్డి కొడంగల్నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈ స్థానానికి ఎలక్షన్ నిర్వహించనున్నారు. ఈఉప ఎనికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 771 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం జూలై 2 వరకు ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్లు వేస్తారు. కొత్తగా ఎన్నికకాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఓటింగ్ అవకాశం ఉండదని అధికారవర్గాల సమాచారం. టీఆర్ఎస్ నుంచి మహేందర్‌రెడ్డి.. స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచిమాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేసే అభ్యర్థి ఎంపికపై సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది. రాబోయే రెండు, మూడు రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడి, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించనున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం అధికారికంగా పట్నం మహేందర్‌రెడ్డి పేరు ప్రకటించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆపార్టీ నాయకులుచెబుతున్నారు. జిల్లాలో మెజార్టీ జెడ్పీటీసీ,ఎంపీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారని, తప్పకుండాటీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల అసెంబ్లీఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమిపాలైన మహేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా గెలుపొందితే జిల్లా రాజకీయాలపై ఆయన పట్టు మరింత పెరగనుంది. కాంగ్రెస్‌లో ఆశావహులు ఎక్కువే.. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయటంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై కోర్టును ఆశ్రయించే అవకాశంపై చర్చిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీటికెట్ కోసం కాంగ్రెస్‌లోనూ ఆశావహులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఇటీవల అసెంబ్లీఎన్నికల్లో ఓటమిపాలైన పలువురు నాయకులుఈ టికెట్ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లాకు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్,మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డితోపాటురంగారెడ్డి జిల్లాకు చెందిన కేఎల్ఆర్,రవియాదవ్ తదితరులు టికెట్ రేసులోఉన్నట్లు వినికిడి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి ఎంపికపై త్వరలోనిర్ణయం తీసుకుంటామని రోహిత్‌రెడ్డి తెలిపారు. -
ఇక ‘మాజీ’లే..
సాక్షి, ఆదిలాబాద్: ప్రస్తుత జెడ్పీటీసీలు, ఎంపీపీలకు ఈ ప్రాదేశిక ఎన్నికలు అచ్చిరాలేదు. తాజా మాజీలు ఇక పూర్తిగా మాజీలుగా మారనున్నారు. ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి మూడు విడతల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. జిల్లాలో ముఖచిత్రం ప్రస్పుటమైంది. ప్రస్తుతం పదవుల్లో ఉన్న వారిలో అత్యధికులు మళ్లీ పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. దీనికి రిజర్వేషన్ల మార్పు ఒకటి కారణం కాగా, మారిన రాజకీయ పరిస్థితులు కూడా ప్రభావం చూపాయి. గత ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లా పరంగా పరిశీలిస్తే.. 13 మండలాలు ఉండగా అందులో ఒక బేల జెడ్పీటీసీ మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. మిగతా అన్నిచోట్ల అటు జెడ్పీటీసీ, ఇటు ఎంపీపీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆదిలాబాద్ జెడ్పీటీసీగా ఉన్న ఇజ్జగిరి అశోక్ ఈసారి అసలు ఎన్నికల బరిలోనే లేరు. ప్రధానంగా ఆయన నివాసం దస్నాపూర్ కాగా అది ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనం కావడంతో నైసర్గిక స్వరూపం మారింది. దీంతో ఆయన జెడ్పీటీసీగా పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలవాలని యోచిస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీపీగా ఉన్న నైతం లక్ష్మీశుక్లాల్ కూడా ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. ఎంపీపీ స్థానం జనరల్ రిజర్వ్ అయింది. వాన్వట్ నుంచి గతంలో ఎంపీటీసీగా గెలిచిన ఆమె ఈసారి ఆ స్థానం జనరల్(మహిళ)కు ఇవ్వడంతో పోటీ అధికంగా ఉంది. దీంతో ఆమె కూడా పోటీ చేయడం లేదు. ఈ మండలంలో ఇటు జెడ్పీటీసీ అటు ఎంపీపీ ఇరువురు మాజీలు కానున్నారు. బేల జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాక్లే రాందాస్ ఉండగా, ప్రస్తుతం బేల జెడ్పీటీసీ జనరల్(మహిళ) రిజర్వ్ కావడంతో ఆయన భార్య నాక్లే సవితను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దించారు. బేల ఎంపీపీగా ఉన్న రఘుకుల్రెడ్డికి ఈసారి రిజర్వేషన్లు అనుకూలించలేదు. గతంలో ఆయన పోటీచేసిన సాంగిడి ఎంపీటీసీ స్థానం ఎస్టీ(జేనరల్) కావడంతో ఆయన అసలు పోటీలోనే దిగలేకపోయారు. ఇక ఎంపీపీ జనరల్ మహిళ రిజర్వ్ కావడంతో ఆయనకు ఏది అనుకూలంగా లేకపోయింది. దీంతో పోటీకే దూరమయ్యారు. జైనథ్ జెడ్పీటీసీ పెందూర్ ఆశారాణి ఉండగా, ప్రస్తుతం జనరల్(మహిళ) రిజర్వ్ అయినా టీఆర్ఎస్ పార్టీ పరంగా ఆమెకు అవకాశం దక్కలేదు. దీంతో పోటీకి దూరమయ్యారు. ఎంపీపీ తల్లెల శోభ చంద్రయ్య ఉండగా, ఆమె ఎంపీటీసీగా పోటీ చేసిన బాలాపూర్ బీసీ(జనరల్) రిజర్వ్ కావడం, పోటీ అధికంగా ఉండడంతో ఆమె బరిలో నిలవలేదు. కాగా ఎంపీపీ స్థానం ఈసారి బీసీ(జనరల్) కేటాయించడం, టీఆర్ఎస్లో ఎంపీపీ స్థానం విషయంలో మరోపేరు ప్రచారంలో ఉండడంతో తల్లెల శోభకు అనుకూలించలేదు. నార్నూర్ జెడ్పీటీసీగా ఉన్న రూపావతి జ్ఞానోబాపుష్కర్కు రిజర్వేషన్ అనుకూలించలేదు. నార్నూర్ జెడ్పీటీసీ ఈసారి ఎస్టీ(జనరల్) రిజర్వ్ కావడంతో బీసీ అయిన ఆమె పోటీకి దూరమయ్యారు. కిందటిసారి నార్నూర్ జెడ్పీటీసీగా గెలిచిన ఆమె ఓ దశలో ఉమ్మడి ఆదిలాబాద్ చైర్‌పర్సన్‌గా పేరు పోటీకి వచ్చింది. అయితే ఆమెకు ఆ అవకాశం దక్కలేదు. ఈసారి రిజర్వేషన్ కలిసిరాకపోవడంతో ఆమె మాజీ కానున్నారు. నార్నూర్ ఎంపీపీ రాథోడ్ గోవింద్‌నాయక్ గతంలో ఎంపీటీసీగా పోటీ చేసిన పర్సువాడ ప్రస్తుతం కొత్త మండలం గాదిగూడలో ఉంది. గాదిగూడలో రిజర్వేషన్ ఎస్టీ(మహిళ) వచ్చినప్పటికి టీఆర్ఎస్ నుంచి అవకాశం రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఆయన భార్య రాథోడ్ నీలాబాయిని రంగంలోకి దించారు. జెడ్పీటీసీ, ఎంపీపీ మాజీలు కానున్నారు. ఇంద్రవెల్లి జెడ్పీటీసీ దేవుపూజే సంగీతకు రిజర్వేషన్ అనుకూలించలేదు. ప్రస్తుత రిజర్వేషన్ ఎస్టీ(మహిళ) రావడంతో ఆమె పోటీలో నిలబడలేదు. ఇంద్రవెల్లి ఎంపీపీ జాదవ్ మీరాబాయి కేస్లాపూర్ ఎంపీటీసీ స్థానం నుంచి గతంలో గెలిచారు. అయితే ఈసారి కేస్లాపూర్ ఎంపీటీసీ స్థానం జనరల్ కేటాయించడంతో ఆమె భర్త జాదవ్ ప్రకాష్ బరిలో నిలిచారు. ఉట్నూర్ జెడ్పీటీసీ జగ్జీవన్‌కు రిజర్వేషన్ అనుకూలించలేదు. ప్రస్తుతం జెడ్పీటీసీ ఎస్టీ(మహిళ) రిజర్వ్ కావడంతో ఆయనకు కలిసిరాలేదు. టీఆర్ఎస్ నుంచి గెలిచిన విమల ఎంపీపీ అయినా ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఆమె ఉట్నూర్ జెడ్పీటీసీ డమ్మి అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేశారు. ఇక్కడి నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా చారులత రాథోడ్ పోటీ చేస్తుండటం, ఆమెను జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో విమలకు ఈ ఎన్నికలు కలిసిరాలేదు. బోథ్ జెడ్పీటీసీ బండారు సాయమ్మకు ఈ ఎన్నికల్లో పార్టీ అనుకూలంగా లేదు. బోథ్ జెడ్పీటీసీ స్థానం జనరల్(మహిళ) రిజర్వ్ కావడంతో ఆమె నామినేషన్ వేసినా టీఆర్ఎస్ నుంచి బీ–ఫాం ఇవ్వలేదు. ఎంపీపీ గంగుల లక్ష్మి ఎంపీటీసీ స్థానం బోథ్ కాగా, ఈసారి రిజర్వేషన్ జనరల్(మహిళ) వచ్చినా ఆమెకు పార్టీ పరంగా టిక్కెట్ ఇవ్వలేదు. బజార్హత్నూర్ జెడ్పీటీసీ మునీశ్వర్ నారాయణ ఈసారి ఎన్నికల్లో నిలబడలేదు. బజార్హత్నూర్ జెడ్పీటీసీ జనరల్ అయినా ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. బజార్హత్నూర్ ఎంపీపీగా ఇది వరకు టెంబీ ఎంపీటీసీ రాంరెడ్డి ఉండగా, ఆయన గతంలోనే మృతి చెందారు. ఆ తర్వాత పిప్రి ఎంపీటీసీగా ఉన్న రాంరెడ్డి సతీమణి శ్రీమతి ఎంపీపీగా కొనసాగారు. టెంబీ ఎంపీటీసీ స్థానం జనరల్(మహిళ) అయినా ఆమె బరిలో నిలవలేదు. పిప్రి ఎంపీటీసీ స్థానం ఎస్సీ రిజర్వ్ అయింది. గుడిహత్నూర్ జెడ్పీటీసీ కేశవ్గిత్తేకు ఈసారి రిజర్వేషన్ అనుకూలంగా ఉన్నా ఆయన టీఆర్ఎస్ నుంచి బరిలో నిలవలేదు. తన సమీప బంధువు కరాడ్ బ్రహ్మానందంకు టిక్కెట్ లభించింది. దీంతో కేశవ్‌గిత్తే ఇక మాజీ కా>నున్నారు. ఎంపీపీగా ఉన్న సత్యరాజ్ ఎంపీటీసీ స్థానం గుడిహత్నూర్–1 కాగా జనరల్(మహిళ) రిజర్వ్ అయింది. దీంతో ఆయన బరిలో నిలవలేదు. ఈ మండలంలో జెడ్పీటీసీ, ఎంపీపీ ఇద్దరు పోటీలో లేరు. నేరడిగొండ జెడ్పీటీసీగా సయ్యద్ యాస్మిన్ ప్రస్తుతం వ్యవహరిస్తుండగా ఆమెకు రిజర్వేషన్ అనుకూలించలేదు. ఎస్టీ(జనరల్) రిజర్వ్ కావడంతో ఆమె బరిలో నిలవలేదు. అయితే పార్టీలోనే కొనసాగుతూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎంపీపీ బర్దావల్ సునీత ఎంపీటీసీ స్థానం కొర్టికల్ కాగా ప్రస్తుతం ఆ స్థానం లింగట్లగా మారింది. ఎస్టీ(మహిళ) రావడంతో బీసీ అయిన ఆమెకు ఈ రిజర్వేషన్ అనుకూలించలేదు. ఈ మండలంలోనూ జెడ్పీటీసీ, ఎంపీపీ ఇద్దరు మాజీలు కానున్నారు. తాంసి జెడ్పీటీసీగా పులి శ్రీలత నారాయణ వ్యవహరిస్తుండగా, ఈసారి రిజర్వేషన్ జనరల్ రావడంతో టీఆర్ఎస్ నుంచి పోటీ తీవ్రంగా ఉండడంతో తాటిపెల్లి రాజుకు టిక్కెట్ ఇచ్చారు. ఎంపీపీ మంజుల శ్రీధర్‌రెడ్డి ఉండగా, ఎంపీటీసీ స్థానం బండల్‌నాగాపూర్ ఈసారి కూడా జనరల్(మహిళ) రిజర్వేషన్ రావడం, ఇటు ఎంపీపీ జనరల్(మహిళ) రిజర్వేషన్ ఉండడంతో ఆమె మరోసారి అధికార పార్టీ నుంచి బరిలోకి దిగారు. తలమడుగు జెడ్పీటీసీ జక్కుల గంగమ్మ ఈసారి బరిలో నిలవలేదు. ఈ జెడ్పీటీసీ స్థానం జనరల్ రిజర్వ్ కావడం, పోటీ అధికంగా ఉండడంతో ఆమెకు టీఆర్ఎస్ నుంచి అవకాశం దక్కలేదు. ఎంపీపీ రాము ఎంపీటీసీ స్థానం ఝరి కాగా, ఈసారి ఎస్టీ(జనరల్) రిజర్వ్ అయింది. అయితే రాము టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల బరిలో దిగలేదు. ఇచ్చోడ జెడ్పీటీసీ సోన్కాంబ్లే రేణుక కాగా ఈసారి రిజర్వేషన్ జనరల్(మహిళ) రావడం, అధికార పార్టీ నుంచి పోటీ అధికంగా ఉండడంతో ఆమె బరిలో నిలవలేదు. ఎంపీపీ అమీనాబి ఎంపీటీసీ స్థానం గుండాల కాగా ఇక్కడ రిజర్వేషన్ జనరల్ వచ్చినా ఆమె బరిలో నిలవలేదు. -
జోష్ లేకపాయె!
ప్రాదేశిక ఎన్నికల సమయం సమీపిస్తున్నా.. ఉమ్మడి పాలమూరు జిల్లా బీజేపీ, కాంగ్రెస్‌లో జోష్ కన్పించడం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల నుంచి పోటీకి దిగిన ఇరు పార్టీలు ప్రచారంలో వెనకబడ్డాయి. ఇప్పటికే అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల తర్వాత కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్, బీజేపీ కనీసం ఈ ఎన్నికల్లోనైనా కారును ఢీ కొంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసినా ఇంత వరకు జాతీయ పార్టీలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కొందరు మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నారు. తొలి, రెండో విడతల్లో ఎన్నికలు జరిగే మండలాల్లో చాలా చోట్ల ప్రచారపర్వం అంతంత మాత్రంగానే కనబడుతోంది. దీంతో ఎన్నికల ఫలితాలపై ఆయా పార్టీల క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఈసారి కూడా ఆశించిన మేరకు ఫలితాలు రాకపోతే రానున్న రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్‌పై ఆయా పార్టీలకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు బెంగపట్టుకుంది. ఈ నెల 6న నాగర్‌కర్నూల్ జిల్లాలో బిజినేపల్లి, కోడేరు, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, తిమ్మాజిపేట జెడ్పీటీసీ స్థానాల్లో ప్రాదేశిక ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట, జడ్చర్ల, భూత్పూర్, గండేడ్, మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్ జెడ్పీటీసీ స్థానాల్లో, వనపర్తి జిల్లా పరిధిలోని వనపర్తి, ఖిల్లాఘనపూర్, గోపాల్పేట, రేవెల్లి, జెడ్పీటీసీ స్థానాలకు, జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, ధరూర్, కేటీదొడ్డి, గట్టు జెడ్పీటీసీ స్ధానాలు, నారాయణపేట జిల్లా కోస్గి, మద్దూర్ జెడ్పీటీసీ స్ధానాల్లో తొలివిడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 10న.. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట, అడ్డాకుల, దేవరకద్ర, చిన్నచింతకుంట, కోయిలకొండ, మహబూబ్‌నగర్, హన్వాడలో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్, మాగనూరు, కృష్ణ, నర్వ, ఊట్కూర్ జెడ్పీటీసీ స్ధానాలు, గద్వాల జిల్లా అయిజ, మల్దకల్, వడ్డేపల్లి, రాజోలి జెడ్పీటీసీ స్థానాలు, నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ, ఊర్కొండ, కల్వకుర్తి, తాడూరు, తెలకపల్లి జెడ్పీటీసీ స్థానాలు, వనపర్తి జిల్లా పెద్దమందడి, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు, అమరచింత జెడ్పీటీసీ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఆయా స్థానాల్లో ప్రచారవేగాన్ని పెంచారు. తొలి విడత ఎన్నికలు జరిగే జెడ్పీటీసీ స్థానాలతో పాటు వాటి పరిధిలో ఉన్న ఎంపీటీసీ స్థానాల్లోనూ గులాబీ శ్రేణులు గెలుపే ధ్యేయంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు సర్పంచులందరూ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉండడం.. ఆ పార్టీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యేలందరూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పలు చోట్ల మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయా పార్టీల నుంచి బడానాయకులెవరూ వారికి మద్దతుగా పూర్తిస్థాయిలో ప్రచారంలో పాల్గొంటున్న దాఖలాలు కనబడడం లేదు. కాంగ్రెస్‌లో అయోమయం.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికను కాంగ్రెస్ అధిష్టానం ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులకే అప్పగించింది. ఇప్పటికే మండలస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి అభ్యర్థుల కసరత్తు పూర్తి చేసిన డీసీసీ అధ్యక్షుడు అభ్యర్థులను ఎంపిక చేశారు. దాదాపు అందరికీ బీ–ఫారాలు అందజేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో అధికార పార్టీని ఢీ కొట్టేంత నాయకత్వం ఆయా మండలాల్లో లేకపోవడంతో ఆ పార్టీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు గెలుపుపై దిగులు పడుతున్నారు. అందుబాటులో ఉన్న మండలస్థాయి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదీలా ఉంటే ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా అనిరుధ్‌రెడ్డి సోదరుడు దుష్యంత్‌రెడ్డిని ప్రకటించిన కాంగ్రెస్ మిగతా నాలుగు చైర్మన్లను ఖరారు చేయలేదు. కమలం వికసించేనా ? ఉమ్మడి జిల్లాలో అంతంత మాత్రమే ప్రభావం ఉన్న బీజేపీ ప్రాదేశిక ఎన్నికల్లో ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుంది? లోక్‌సభ ఎన్నికలకు ముందు కాషాయ కండువా కప్పుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డీకే అరుణ ఎంత మంది అభ్యర్థులను గెలిపించుకుంటారో అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం డీకే అరుణ నాయకత్వంలో కేవలం గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మాత్రమే బీజేపీ నాయకులు ప్రచారం కొంత మేరకు జరుగుతోంది. ఇదిలా ఉంటే జిల్లా పరిషత్ చైర్మన్ల అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎన్నికల్లో ఎన్ని స్థానాలు వస్తాయో చూసి అందులో బలమైన నాయకుడిని జెడ్పీ చైర్మన్‌గా ప్రకటించాలని ఆ పార్టీ భావిస్తోంది. -
రెబల్.. గుబులు!
అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు రెబల్ అభ్యర్థులు గుబులు పుట్టిస్తున్నారు. ఒక్కో ప్రాదేశిక స్థానానికి ఒకే పార్టీ తరఫున ఐదారుగురు అభ్యర్థులు బరిలో నిలుస్తుండటంతో ఆ రెండు ప్రధాన పార్టీల నేతలు అయోమయంలో పడ్డారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలిదశగా ఏడు మండలాల పరిధిలోని 96 ఎంపీటీసీ, ఏడు జె డ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించిన అధికారులు పరిశీలన ప్రక్రియ కూడా పూర్తిచేశారు. ఈనెల 28న ఉపసంహరణ ఘట్టం కూడా ముగియనుంది. అయితే ఇందుకు మరో రోజు మాత్రమే మిగిలింది. కాగా, ఒక్కో స్థానానికి ఒకే పార్టీ తరఫున పోటీపడుతున్న నాయకులను బుజ్జగించడం నేతలకు కష్టంగా మారింది. ముఖ్యంగా ఎంపీటీసీలకు ఎన్నడూ లేని విధంగా పోటీ ఏర్పడింది. రెబల్ అభ్యర్థులను బుజ్జగించేందుకు టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల ఒకరిద్దరు వెనకడుగు వేస్తున్నా.. కొందరు మాత్రం తప్పనిసరిగా బరిలో ఉంటామని తేల్చిచెబుతున్నారు. పార్టీ ‘బీ’ ఫారం ఇవ్వకున్నా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటామని హెచ్చరికలు సైతం జారీచేస్తున్నారు. ఇటువంటి వారికి సర్దిచెప్పడానికి పార్టీ నేతల తలబొప్పి కడుతోంది. ఆయా పార్టీల నుంచి వలసలు జరగడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్, అటు టీడీపీ నుంచి అధిక సంఖ్యలో ద్వితీయ శ్రేణి, చిన్న నాయకులు, కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. గులాబీ కండువా కప్పుకున్న వారికి భవిష్యత్‌లో తగిన ప్రాధాన్యం ఇస్తామని చాలామందిని టీఆర్ఎస్లోకి లాగారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రాదేశిక స్థానాలకు టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య చాంతాడంతా అయ్యింది. దీనికితోడు పార్టీ పరంగా క్రియాశీలకంగా మెలగని నేతలూ రేసులో ఉన్నారు. ఆర్థికంగా పరిపుష్టిగా ఉండటంతో తమకే ‘బీ’ ఇవ్వాలంటున్నారు. మరికొందరు తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేశామని, దీనికి గుర్తింపుగా టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా ఎవరికి వారు టికెట్లు ఆశించి అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఇటువంటి వారిని బుజ్జగించడం గులాబీ నేతలకు అగ్ని పరీక్షగా మారింది. అభ్యర్థులను ఖరారు చేసే బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్యేలకే రెబల్స్ బెడద లేకుండా చూడాలని పార్టీ నాయకత్వం నిర్దేశించింది. దీంతో ఎమ్మెల్యేలంతా బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఒకే రోజు గడువు ఉండటంతో శక్తిమేరకు ప్రయత్నిస్తూనే అవసరం ఉన్న చోట తాయిలాలు, హామీలు గుప్పిస్తున్నారు. కొందరికి డబ్బు ఆశ చూపి పక్కకు తప్పిస్తుండగా.. మరికొందరికి వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు. అయినా కొందరు నేతలు పట్టువీడకపోతుండటంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. జిల్లా మంత్రి చామకూర మల్లారెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి రంగంలోకి దిగి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా పెద్దగా ఫలితం ఉండటం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పదవుల ఎర టీఆర్ఎస్లో మాదిరిగానే కాంగ్రెస్‌కూ రెబల్ అభ్యర్థులు తలనొప్పిగా మారారు. అసలే వలసలతో పార్టీ ఖాళీ అవుతున్న వేళ స్థానిక సంస్థలను ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకుంది. ఎలాగైనా పూర్వవైభవాన్ని ప్రదర్శించాలని వ్యూహాలు రచిస్తోంది. ఇటువంటి సమయంలో రెబల్ అభ్యర్థుల తీరుతో పార్టీ సతమతమవుతోంది. కొన్ని చోట్ల నాయకులకు పార్టీ జిల్లా పెద్దలు నచ్చజెప్పి బరి నుంచి వైదొలగేలా చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల మాత్రం అభ్యర్థులు బెట్టువీడడం లేదు. పార్టీ సంస్థాగతంగా, వచ్చే ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని భరోసా కల్పిస్తున్నారు. చివరకు నేతల మాటలకు కట్టుబడి ఉంటారా.. లేదా అనేది ఈనెల 28న తేలనుంది. ఎంపీటీసీలకిలా... ఏడు మండలాల్లోని మొత్తం 96 స్థానాలకు టీఆర్ఎస్ తరఫున 234 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా చేవెళ్లలో బరిలో నిలిచారు. ఈ మండలంలో మొత్తం 17 ఎంపీటీసీలు ఉండగా టీఆర్ఎస్ పార్టీ తరఫున 46 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మిగిలిన మండలాల్లోనూ ఇంచుమించు ఇదే స్థాయిలో పోటీ నెలకొంది. అత్యల్పంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని 10 స్థానాలకు 24 మంది బీఫారం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే తరహాలో పోటీ కనిపిస్తోంది. అత్యధికంగా షాబాద్ మండలంలోని 15 ఎంపీటీసీలకు 36 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అత్యల్పంగా ఇబ్రహీంపట్నంలోని 10 స్థానాలకు 21 నామినేషన్లు రిటర్నింగ్ అధికారులకు అందాయి. జెడ్పీటీసీల్లోనూ.. ఎంపీటీసీలతో పోల్చుకుంటే జెడ్పీటీసీలకు పోటీ బాగానే ఉంది. కొన్ని స్థానాలకు రెండు మూడు నామినేషన్లు దాఖలుకాగా.. మరికొన్ని మండలాల్లో ఈ సంఖ్య ఆరు వరకు ఉండటం గమనార్హం. టీఆర్ఎస్ తరఫున మొయినాబాద్ జెడ్పీటీసీకి ఆరుగురు పోటీపడుతున్నారు.ఆ తర్వాతి స్థానంలో ఇబ్రహీంపట్నం నిలిచింది. ఇక్కడ ఐదుగురు రేసులో ఉన్నాయి. షాబాద్‌కు మాత్రం ఈ పార్టీ నుంచి ఒక్క నామినేషన్ మాత్రమే అందింది. ఇక కాంగ్రెస్ తరఫున అబ్దుల్లాపూర్‌మెట్ స్థానానికి విపరీతంగా పోటీ కనిపిస్తోంది. ఇక్కడ ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మంచాల, షాబాద్, మొయినాబాద్ స్థానాలకు నలుగురు చొప్పున వరుసలో నిలిచారు. -
పెద్దల సభకు నేతల సన్నద్ధం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దల సభలో ఖాళీ కాబోతున్న రెండుఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు చెందిన పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబ«ంధించిన రెండు నియోజకవర్గాలకు సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న శాసనమండలి ఛైర్మన్ కె.స్వామిగౌడ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సం ఘం ఆదేశాల మేరకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయగా.. తొలిరోజు నామినేషన్లు దాఖలు కాలేదు. నామినేషన్ల ప్రక్రియ మార్చి 5వ తేదీ వరకు కొనసాగనుంది. నాలుగు పాత జిల్లాల్లోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల పట్టభద్ర, ఉపాధ్యాయ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా పాతూరి సుధాకర్‌రెడ్డి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. పీఆర్టీయూ తరఫున ఆయన పోటీ చేయనున్నారు. శాసనమండలిలో ప్రస్తుతం విప్‌గా ఉన్న ఆయన టీఆర్ఎస్ నేతగానే వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రికి విశ్వాసపాత్రుడిగా ఉన్న సుధాకర్‌రెడ్డిని మరోసారి గెలిపించాలని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి, విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు కోరారు. కాంగ్రెస్, బీజేపీ బలపరిచే ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే పట్టభద్రులను ఓటర్లుగా చేర్పించడంలో సఫలమైన నాయకులు.. ఇప్పుడు పార్టీల మద్దతుతో పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. పెద్దల సభ అయినా.. రాజకీయ పార్టీ మద్దతు లేకుండా గెలిచే పరిస్థితి లేకపోవడంతో పలువురు నేతలు ఆయా పార్టీల నుంచి అధికారిక అభ్యర్థిత్వం కోసం హైదరాబాద్‌లో మకాం వేశారు. స్వామిగౌడ్‌ను కాదంటేనే టీఆర్ఎస్ ఆశావహులకు టీఆర్ఎస్ తరఫున ఆరేళ్ల క్రితం ఈ నియోజకవర్గం నుంచి స్వామిగౌడ్ విజయం సాధించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన మండలి చైర్మన్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన పదవీకాలం ముగుస్తున్నప్పటికీ.. ఆయన సేవలను మరోసారి వినియోగించుకోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా మరోసారి ఇదే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆయనకు అవకాశం ఇస్తారా? లేక ప్రత్యామ్నాయ ఆలోచన ఏమైనా ఉందా..? అనే విషయంలో టీఆర్ఎస్ వర్గాలకు కూడా స్పష్టత లేదు. స్వామిగౌడ్ పదవీకాలం ముగుస్తుందని తేలడంతోనే పలువురు నాయకులు, ఉద్యమ నేతలు తెరపైకి వచ్చి తమ వంతు ప్రయత్నాల్లో మునిగిపోయారు. కరీంనగర్ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ కొంతకాలంగా పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన ఆయన ఎమ్మెల్సీ సీటు విషయంలో ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల కావడంతోనే అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు కరీంనగర్‌కే చెందిన ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం వీరంతా హైదరాబాద్‌లో మకాం వేశారు. సీన్లోకి రవాణా శాఖ అధికారి చంద్రశేఖర్‌గౌడ్ తెలంగాణ ఉద్యమం నుంచి గ్రూప్–1 అధికారుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న మామిళ్ల చంద్రశేఖర్‌గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ ఇన్చార్జి డీటీసీగా వ్యవహరిస్తున్న ఆయన నిజామాబాద్‌కు చెందిన వ్యక్తి కావడం గమనార్హం. తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న తనకు పోటీ చేసే అవకాశం కల్పిస్తారని ధీమాతో ఉన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో తనవంతు ప్రయత్నాల్లో మునిగిపోయారు. కాంగ్రెస్ నుంచి జీవన్‌రెడ్డి దాదాపు ఖరారు కరీంనగర్ జిల్లాలోని అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన తాటిపర్తి జీవన్‌రెడ్డి గత ఎన్నికల్లో జగిత్యాల నుంచి అనూహ్యంగా ఓడిపోయారు. ఈసారి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. 1.90లక్షల ఓటర్లు ఉన్న ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో 79వేల మంది కరీంనగర్ ఉమ్మడి జిల్లానుంచే ఉండడం తనకు కలిసి వచ్చే అంశమని చెబుతున్నారు. జిల్లాకు చేసిన సేవలను గుర్తు చేసుకునే పట్టభద్రులు ప్రతిఒక్కరూ తనకే ఓటేస్తారని ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అధికారికంగా ఆదేశాలు రాగానే ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ నుంచి సుగుణాకర్‌రావుతోపాటు మరో ఇద్దరు బీజేపీ నుంచి పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్‌రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీలో సీనియర్ నాయకుడైన సుగుణాకర్‌రావుతోపాటు కామారెడ్డికి చెందిన ఏబీవీపీ నేత రంజిత్ మోహన్, కరీంనగర్‌కు చెందిన కొట్టె మురళీకృష్ణ సైతం తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రెండుసార్లు కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సుగుణాకర్‌రావు పార్టీకి అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం ఆయన పేరునే ఖరారు చేసే అవకాశం ఉంది. వీరు కాకుండా స్వతంత్ర అభ్యర్థులుగా మరికొందరు పెద్దల సభకు పోటీ పడనున్నారు. మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంది. కరీంనగర్‌లోనే నామినేషన్లు శాసనమండలి ఎన్నికలకు సంబంధించి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వ్యవహరించనున్నారు. నాలుగు జిల్లాల్లోని 42 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్లు పాల్గొనే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కరీంనగర్ కలెక్టరేట్లోనే నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. -
గులాబీ జోరు
సాక్షి, మెదక్: పల్లెల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. రెండు విడతల్లో మెజార్టీ పంచాయతీలు గెలుపొందిన టీఆర్ఎస్ మూడవ విడతలోనూ అత్యధిక పంచాయతీలను కైవసం చేసుకుంది. జిల్లాలో బుధవారం మూడవ విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 133 పంచాయతీలు, 1031 వార్డుల్లో ఎన్నికలు జరగగా 90.28 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట, తూప్రాన్, నార్సింగి, చేగుంట, మనోహరాబాద్ మండలాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. ఎనిమిది మండలాల్లో మొత్తం 1,53, 354 మంది ఓటర్లు ఉండగా 1,38, 445 మంది ఓటు వేశారు. వారిలో పురుషులు 67182 మంది ఉండగా, మహిళలు 71,263 మంది ఓట్లు వేశారు. కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందన దీప్తి మెదక్ మండలంలోని మాచవరంలో ఓటు వేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తన స్వగ్రామం కోనాపూర్‌లో ఓటు వేశారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత ఎన్నికల సిబ్బంది ఓట్ల లెక్కింపు చేపట్టారు. రాత్రి 8.30 గంటల వరకు ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. మూడవ విడతలో 133 పంచాయతీల్లో 505 మంది అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలిచారు. మూడవ విడతలో ఎన్నికలు జరిగిన 133 పంచాయతీలకుగాను 108 చోట్ల టీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. అలాగే 15 పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. పంచాయతీ ఎన్నికల్లో మొదటి సారిగా చేగుంట మండలంలోని గొల్లపల్లి, జక్రంతండా, చిట్టోజిపల్లిలో బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థులు ఏడుగురు విజయం సాధించారు. కాగా ఈ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. జిల్లాలో టీడీపీ నాయకులు ఉన్నప్పటికీ ఆ పార్టీ నుంచి ఒక్క సర్పంచ్ అభ్యర్థిని కూడా బరిలో దింపలేకపోయారు. దీంతో పల్లెల్లో టీడీపీ జాడ లేకుండా పోయింది. మూడు విడతల్లోనూ టీఆర్ఎస్ హవా.. జిల్లాలో మూడు విడతల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ పంచాయతీల్లో విజయం సాధించింది. జిల్లాలో మొత్తం 469 పంచాయతీలకుగాను 84 పంచాయతీల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు ఏకగ్రీవ సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. 385 పంచాయతీలకు ఈ నెల 21, 25, 30 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. 385 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 358 పంచాయతీల్లో టీఆర్ఎస్, 73 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. అలాగే మూడు పంచాయతీల్లో బీజేపీ, 35 పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మొదట విడతగా 122 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 82 టీఆర్ఎస్, 28 కాంగ్రెస్, 12 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. రెండవ విడతలో 130 పంచాయతీలకు ఎన్నికలు జరగగా 84 పంచాయతీల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు, 30 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు, 16 పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. బుధవారం మూడవ విడత 133 పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా 108 పంచాయతీల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు, 15 పంచాయతీల్లో కాంగ్రెస్, మూడు పంచాయతీల్లో బీజేపీ, ఏడు పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ మెజార్టీ పంచాయతీల్లో గెలుపొందడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. మూడవ విడత ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు గ్రామాల్లో విజయోతవ్స ర్యాలీలు నిర్వహించారు. మెదక్ మండల జెడ్పీటీసీ సభ్యురాలు లావణ్యరెడ్డి స్వగ్రామం బాలానగర్‌లో కాంగ్రెస్ మద్దతుదారు వికాస్ 23 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ మద్దతుదారు గోపాల్‌పై గెలుపొందారు. మాచవరంలో కాంగ్రెస్ మద్దతుదారు సంధ్యారాణి 165 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ బలపర్చిన రాధికపై విజయం సాధించారు. మంబోజిపల్లి గ్రామంలో టీఆర్ఎస్ మద్దతుదారు ప్రభాకర్ నాలుగు ఓట్ల స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నిజాంపేట మండలం చల్మెడలో నర్సింహారెడ్డి 500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నార్లపూర్ పంచాయతీలో కాంగ్రెస్ జిల్లా నేత అమరసేనారెడ్డి టీఆర్ఎస్ మద్దతుదారుపై విజయం సాధించారు. చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్‌లో మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి పంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కామారంలో బీజేపీ మద్దతుదారు రాజిరెడ్డి ఓటమిపాలయ్యారు. తూప్రాన్ కోనాయిపల్లి(పిబి) గ్రామ పంచాయతీలో స్వతంత్ర అభ్యర్థి కంకణాల పాండు, టీఆర్ఎస్ మద్దతుదారు విఠల్‌కు 143 చొప్పున సరిసమానం ఓట్లు వచ్చాయి. దీంతో టాస్ వేయగా స్వతంత్ర అభ్యర్థి పాండు గెలుపొందారు. ఆదర్శ గ్రామం మల్కాపూర్‌లో ఆరుగురు పోటీ చేయగా టీఆర్ఎస్ మద్దతుదారు మన్నె మహాదేవి గెలుపొందారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లేశం గెలుపొందారు. ముప్పిరెడ్డిపల్లిలో టీఆర్ఎస్ మద్దతుదారు ప్రభావతి గెలుపొందారు. మనోహరాబాద్‌లో టీఆర్ఎస్ మద్దతుదారు చిట్కుల్ మహిపాల్‌రెడ్డి విజయం సాధించారు. -
టీఆర్ఎస్, కాంగ్రెస్ బాహాబాహీ
రఘునాథపల్లి: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలు బాహబాíహీకి దిగాయి. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ వార్డు అభ్యర్థి సోదరుడు టీఆర్ఎస్ వార్డు అభ్యర్థితో వాగ్వివాదానికి దిగడంతో తోపులాట, ఘర్షణకు దారి తీసింది. పోలింగ్ జరుగుతోన్న సమయంలో టీఆర్ఎస్ బలపర్చిన 8వ వార్డు అభ్యర్థి ఇమ్మడిశెట్టి శివరాం పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నాడని అదే వార్డు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి రంగు రాజు సోదరుడు శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో వారిరువురి మధ్య మాటమాట పెరిగి పోలింగ్ కేంద్రంలోనే పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసులు వారిద్దరిని బయటకు పంపించారు. విషయం తెలియడంతో ఇరు పార్టీల శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి. జాతీయ ర«హదారిపై ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. రాళ్లతో పరస్పరం దాడి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. పోలీస్ సిబ్బంది తక్కువగా ఉండడంతో ఆందోళనకారులను నిలువరించలేక పోయారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వాహనాన్ని కాంగ్రెస్ వర్గాలు అడ్డుకున్నాయి. వియ్ వాంట్ జస్టిస్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే వాహనం డోరు లాగేందుకు ప్రయత్నించగా ఆయన అంగరక్షకులు వారిని అడ్డుకున్నారు. టీఆర్ఎస్ మండల ఇన్చార్జి మారుజోడు రాంబాబు, మాజీ ఎంపీపీ కుమార్‌గౌడ్‌లు ఆందోళనకారులకు సర్దిచెప్పారు. ఎమ్మెల్యే వాహనానికి అడ్డుగా ఉన్నవారిని పోలీసులు పక్కకు జరిపి రాజయ్యను జనగామ వైపు పంపించారు. బయటకు వచ్చాక తనపై శివరాంతోపాటు అతడి అన్నలు తనపై దాడి చేశారని శ్రీనివాస్ ఆరోపిస్తుండగా.. ప్రచారం చేయకున్నా ఉద్దేశ పూర్వకంగా వాగ్వివాదానికి దిగారని శివరాం పేర్కొన్నారు. -
భూపతిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఆర్ భూపతిరెడ్డిపై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఆయన్ను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేస్తూ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ బుధవారం నిర్ణయం ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా గెలిచిన భూపతిరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం విదితమే. దీనిపై టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ చేసిన మండలి చైర్మన్ బుధవారం నిర్ణయం ప్రకటించారు. జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 2015లో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఎమ్మెల్సీ పదవిపై సస్పెన్షన్ వేటు పడింది. తీర్మానం.. భూపతిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఏడాది క్రితం తీర్మానం చేశారు. 2017 డిసెంబర్ 13న హైదరాబాద్‌లో మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై చేసిన తీర్మానాన్ని పార్టీ జిల్లా ఇన్చార్జి తుల ఉమ ద్వారా సీఎం కేసీఆర్‌కు నివేదించారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న భూపతిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరి.. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం విదితమే. తాజాగా ఆయన ఎమ్మెల్సీ పదవిపై సస్పెన్షన్ వేటు పడటం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
ఓటరు ఎటువైపు?!
దాదాపు రెండు నెలలుగా హోరెత్తుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం బుధవారం సాయంత్రంతో ముగిసింది. శుక్రవారం జరగబోయే పోలింగ్‌కు ఎన్నికల యంత్రాంగం సర్వ సన్నద్ధమైంది. తెలంగాణతోపాటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రాష్ట్రం రాజస్తాన్ పోలింగ్ తెలంగాణతోపాటే జరగబోతోంది. ఇతర రాష్ట్రాల మాటెలా ఉన్నా తెలంగాణలో తొలిసారి జరగబోతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పక్షం అంతిమ విజేతగా నిలుస్తుందన్న అంశంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల సంఘం నవంబర్ 11న తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసినా అంతకు నెల రోజుల ముందే టీఆర్ఎస్ తన అభ్యర్థుల్ని ఖరారు చేసుకుని ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టింది. ప్రతి పార్టీ ఈ ఎన్నికలను చావో రేవో అన్నట్టు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు రాష్ట్రా నికొచ్చి సభలూ, సమావేశాల్లో మాట్లాడారు. బీజేపీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మొదలుకొని కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నాయ కులు వివిధ జిల్లాల్లో జరిగిన సభలూ, సమావేశాల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ తరఫున ముఖ్య మంత్రి కె. చంద్రశేఖరరావు అన్నీ తానే అయి దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ఎప్పటికప్పుడు పార్టీ వ్యూహానికి పదునుపెడుతూ పార్టీ శ్రేణులను ఉరికించారు. పార్టీ కీలక నేతలు తారకరామారావు, హరీశ్‌రావులు సైతం పలు నియోజక వర్గాల బాధ్యతలను తీసుకుని ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని సంకల్పించుకున్న కాంగ్రెస్...అందుకోసం తన చిరకాల ప్రత్యర్థి అయిన తెలుగుదేశంతో పొత్తుకు సైతం సిద్ధపడి సీపీఐని, తెలంగాణ జన సమితి(టీజేఎస్) లను కూడా కలుపుకొని ప్రజా కూటమి పేరుతో ఎన్నికల బరిలో నిల్చుంది. ఏం చేసైనా అధికారం అందుకుని తీరాలని తహతహలాడిన కాంగ్రెస్ పార్టీ అందుకు తగినట్టుగా సకాలంలో అభ్యర్థుల్ని మాత్రం ఖరారు చేసుకోలేకపోయింది. తమ పార్టీలోనూ, కూటమిలోనూ కూడా చివరి నిమిషం వరకూ గందరగోళాన్ని మిగిల్చింది. మిత్రపక్షాలకు కేటాయించిన కొన్ని స్థానాల్లో తన అభ్యర్థులకు బీ ఫారాలిచ్చింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు తేదీ అయిన నవంబర్ 22కు కూడా తేల్చ కపోవడంతో నాలుగైదుచోట్ల కూటమిలోని పక్షాలే పరస్పరం తలపడే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో నాలుగున్నరేళ్లుగా వివిధ అంశాలపై ఒంటరిగా పోరాడుతున్న కాంగ్రెస్ చివరి నిమి షంలో స్వీయ సామర్థ్యంపై నమ్మకం లేకనో, మీడియాలో కథనాలొస్తున్నట్టు భారీగా డబ్బు సమ కూరుస్తానన్న చంద్రబాబు ప్రలోభానికి లొంగిపోవడం వల్లనో... పొత్తుకు సిద్ధపడి రాజకీయంగా తప్పు చేసిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎంత ఆత్మ విశ్వాసంతో పనిచేసిందో ఎవరూ మరిచిపోరు. 2004లో కేవలం అధిష్టానం ఒత్తిడి వల్ల ఆయన టీఆర్ఎస్తో పొత్తుకు అంగీకరించారు. 2009లో ఒంటరిగా పోటీకి దిగినా విజయం ఖాయమని అధిష్టానానికి నచ్చజెప్పి ఒప్పించి దాన్ని నిజం చేసి చూపారు. కానీ రాహుల్‌గాంధీ మొదలుకొని స్థానిక నాయకత్వం వరకూ కాంగ్రెస్‌లో ఎవరూ ఇప్పుడు ఆ స్థాయి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించలేక ‘పూలమ్మినచోటే కట్టెలమ్మిన’ తరహాలో చంద్రబాబు ప్రతిపాదించిందే తడవుగా దాన్ని శిరసావ హించారు. పోనీ సిద్ధపడితే పడ్డారు...కాంగ్రెస్ సగర్వంగా చెప్పుకోవడానికి అవకాశమున్న అత్యంత ప్రతిష్టాత్మక నిర్ణయాలను తమ సమక్షంలోనే చంద్రబాబు సొంత ఖాతాలో వేసుకుంటుంటే అచేతనులుగా గుడ్లప్పగించి చూశారు. ఐటీ అంకురార్పణ, శంషాబాద్ అంతర్జాతీయ విమానా శ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు వంటివన్నీ ఆయన తన ఘనతగా చెప్పుకుంటుంటే ‘కాద’ని చెప్పడానికి వారికి నోరు పెగల్లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌కు అంతో ఇంతో ప్రతిష్ట మిగిలిందంటే అది వైఎస్ పుణ్యమే. కానీ ఆయన్ను స్మరించుకోలేని దుస్థితికి కాంగ్రెస్ నాయకులు దిగజారారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్ని స్థానాలొచ్చినా అది తనవల్లే సాధ్యమైందని ముందూ మునుపూ దబాయించడా నికి చంద్రబాబుకు చేజేతులా అవకాశమిచ్చారు. నిజానికి తెలంగాణలో తెలుగుదేశం ప్రాభవం ముగిసి చాన్నాళ్లయింది. ఆ పార్టీలో పలుకుబడి ఉన్న నేతలు, కార్యకర్తల్లో అత్యధికులు టీఆర్ఎస్కు వలసపోయారు. ఇప్పుడున్నది నామ మాత్రావశిష్టమైన టీడీపీ మాత్రమే. చంద్రబాబు తన బ్రాండ్ మకిలిని కూటమిలోని ఇతర పక్షాలకు కూడా అంటించారు. మరి 48 గంటల్లో పోలింగ్ జరగబోతున్నదనగా తెలంగాణలోని వివిధ జిల్లాలు మొదలుకొని రాజధానిలోని కూకట్పల్లి వరకూ పట్టుబడుతున్న కరెన్సీ మూటలు, బంగారం నిల్వలు తెలంగాణ ప్రజల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఇందులో కరెన్సీ విలువ రూ. 129 కోట్లుకాగా, బంగారం విలువ రూ. 8 కోట్లని వార్తలొస్తున్నాయి. ఇవిగాక లక్షలాది రూపాయల మద్యం ఏరులై పారుతోంది. పట్టుబడిన డబ్బు, బంగారం నిల్వల్లో అధిక భాగం కూటమి అభ్యర్థులదే కావడం, ఇదంతా ఆంధ్రప్రదేశ్ నుంచే తరలి వచ్చిందని కథనాలు రావడం తెలంగాణ ప్రజల్ని మాత్రమే కాదు...అక్కడివారిని సైతం కలవరపరుస్తాయి. ఇంతవరకూ రూ. 129 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నామని బుధ వారం రాత్రి పోలీసులు చేసిన ప్రకటన వెల్లడించిందంటే నాయకులు ఎంతకు దిగజారారో అర్ధమ వుతుంది. తెలంగాణ ప్రజలు రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్నవారు. వివేకమూ, విజ్ఞతా గల వారు. ధన, కనక, మద్య ప్రవాహాలతో ఏమార్చాలని చూసిన పార్టీలకూ, నేతలకూ తమ ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్పగలరని గత చరిత్ర చెబుతోంది. ఈ నెల 11న వెలువడే ఫలితాల్లో మరో సారి అదే ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తుందని ఆశిద్దాం. -
లేదు అలుపు.. వరుస గెలుపు..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: క్రికెట్ ఆటలో హ్యాట్రిక్ పదాన్ని ఎక్కువగా వింటూ ఉంటాం. మూడు వరుస బంతుల్లో వికెట్లు తీసిన బౌలర్, మూడు బౌండరీలు దాటిన బ్యాట్స్‌మెన్ ఉత్సాహం నేరుగా చూడాల్సిందే.. కానీ మాటల్లో వర్ణించలేం. అదే తరహాలో ఎన్నికల్లో మూడుసార్లు, అంతకంటే ఎక్కువసార్లు విజయం సాధించిన ఎమ్మెల్యేల ఆనందానికి అవధులు ఉండవు. ఇదే సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో వరుస ఓటమి, వరుస విజయాలు సాధించిన నేతలు చాలామంది ఉన్నారు. హ్యాట్రిక్ చేసిన వారు ఉన్నారు. హ్యాట్రిక్ చేసి డబుల్ హ్యాట్రిక్ కోసం తహతహలాడుతున్న వారు ఉన్నారు. వరుస ఓటములను లెక్క చేయకుండా బరిలో దిగిన వారు ఉన్నారు. టికెట్ కోసం ఆశించి భంగపడటం, ఒకవేళ టికెట్ వచ్చినా ఓటమి చెందడం.. ఈ అనుభవాలు రాజకీయ పార్టీల నేతలకు మరపురానివే. గెలుపు ఓటములు దైవాధీనం.. ప్రజల్లో ఉండటమే ప్రధానం అనుకుని తరచూ ఎన్నికల్లో పోటీ చేసే నేతలది కూడ జిల్లాలో రికార్డే. డిసెంబర్ 7న జరిగే పోలింగ్ కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల నుంచి పోటీచేసే ఐదారుగురు మినహా అందరూ అభ్యర్థులు ఓటర్లకు సుపరిచితులే. ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచిన కొందరు నేతల గత వివరాలను పరిశీలిస్తే.. హ్యాట్రిక్వీరులు... డబుల్ హ్యాట్రిక్ రేసు ఈటల రాజేందర్.. 2004లో కమలాపూర్‌లో ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడినుంచే 2008 ఉప ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ఆ తర్వాత అనూహ్యంగా హుజురాబాద్ నియోజకవర్గానికి రాజకీయ మకాం మార్చిన ఈయన 2009, 2010 (ఉప ఎన్నిక), 2014లో వరుస విజయాలతో సత్తాచాటారు. తాజాగా ఈ ఎన్నికల్లో బరిలో నిలిచి డబుల్ హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారు. తాజామాజీ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఏడోసారి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఒకసారి ఓడిన ఈయన వరుస విజయాలే సాధించారు. రద్దైన మేడారం నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ తరఫున 1994లో తొలిసారి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత 2004లో రామగుండం టీఆర్ఎస్ అభ్యర్థిగా మారి ఎమ్మెల్యేగా తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత 2008 ఉపఎన్నికలో విజేతగా నిలిచారు. తరువాత ధర్మపురి నియోజకవర్గానికి మారిన ఆయన 2009, 2010 (ఉప ఎన్నిక), 2014లో వరుస విజయాలతో దూసుకెళ్లారు. ఈ ఏడాది మళ్లీ పోటీలో ఉన్నారు. డబుల్ హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. వేములవాడ తాజామాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతోపాటు మంత్రి కేటీఆర్ 2009, 2010 (ఉప ఎన్నిక), 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. హ్యాట్రిక్‌తో సరి.. ఈ సారి గెలుపే లక్ష్యం.. కోరుట్ల మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు 2009లో కోరుట్ల నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. 2009, 2010 (ఉప ఎన్నిక), 2014లో గెలిచిన ఈయన.. రద్దైన మెట్పల్లి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఈసారి ఐదో ప్రయత్నంగా పోటీకి సై అంటున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హ్యాట్రిక్‌తో కూడా సరి పెట్టుకున్నారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2014లో ఓటమి చెందిన ఆయన... ఈ ఎన్నికల్లో ఐదోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. 1999లో పెద్దపల్లి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన గుజ్జుల రామకృష్ణారెడ్డి తర్వాత నాలుగుసార్లు ఓటమి చెంది.. ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పెద్దపల్లి నుంచి పోటీ చేయనున్న ఈయన 1999లో ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత 2004లో 2009లో ఓటమి చెందారు. 2014లో రామగుండం నుంచి పోటీ చేసినా ఓటమి తప్పలేదు. ఈసారి మళ్లీ పెద్దపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగానే బరిలో నిలిచారు. గెలుపోటములు ఇలా.. 2004లో మంథని నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోమారపు సత్యనారాయణ రెండోస్థానంలో నిలిచారు. తరువాత రామగుండం నియోజకవర్గం నుంచి 2009, 2014లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. నాలుగోసారి ఈ ఎన్నికల్లో ఆయన పోటీ పడుతున్నారు. 2009లో టీడీపీ నుంచి కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన గంగుల కమలాకర్ 2014లో టీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి పోటీలో నిలిచి హాట్రిక్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. వీరిని మినహాయిస్తే రెండోసారి పోటీలో ఉన్నవారు 10మంది వరకు ఉన్నారు. ఇందులో రసమయి బాలకిషన్, దాసరి మనోహర్‌రెడ్డి గత ఎన్నికల్లో గెలిచారు. ఇక కరీంనగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొన్నం ప్రభాకర్ రెండోసారి శాసనసభకు పోటీ చేస్తున్నారు. 2004లో కరీంనగర్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన 23,012 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. మూడోసారి పోటీలో ఉన్నవారు 9 మంది ఉన్నారు. ఇందులో చింతకుంట విజయరమణారావు, బొడిగె శోభ, ఆరెపల్లి మోహన్, పుట్ట మధు ఎమ్మెల్యేలుగా గెలిచినవారే. బొడిగె శోభ గతంలో కమలాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందగా.. చొప్పదండి నుంచి 2014లో టీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మేడారం నుంచి ఒకసారి.. ధర్మపురి నుంచి గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓటమి చెందిన అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్ ఈ ఎన్నికల్లో అదష్టాన్ని పరీక్షించుకోబోతున్నా రు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక్క సీటును కోల్పోయిన టీఆర్ఎస్.. ఈసారి మళ్లీ అదే అభ్యర్థి సంజయ్‌కుమార్‌ను జగిత్యాల నుంచి బరిలోకి దిం పింది. అలాగే మొదటి సారిగా ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా చాలామందే ఉన్నారు. విలక్షణ నేత జీవన్‌రెడ్డి పదోసారి విలక్షణ రాజకీయవేత్తగా పేరున్న జగిత్యాల తాజామాజీ ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి పదోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. 1983 నుంచి జగిత్యాల నియోజకవర్గంలో జరిగిన ప్రతి శాసనసభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిన నేతగా ఆయన గుర్తింపు పొందారు. సుమారు 35 ఏళ్లుగా రాజకీయాల్లో తన ప్రాధాన్యం చూపిస్తున్నారు. టీడీపీ నుంచి మొదటగా ఆయన 1983లో పోటీ చేసి గెలిచారు. తర్వాత వరుసగా జరిగిన ప్రతి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. 1983, 1989, 1996 (ఉపఎన్నిక), 1999, 2004, 2014లో విజయం సాధించారు. 1985, 1994, 2009 ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. వరుసగా గతంలో జరిగిన తొమ్మిది ఎన్నికల్లో నామినేషన్ వేసి పోటీకి సిద్ధమైన నాయకుడిగా రాష్ట్రస్థాయిలో రికార్డు ఉంది. ఈసారి కూడా ఆయన జగిత్యాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. -
‘రూరల్’ పోరు రసవత్తరం
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మూడు పార్టీల అభ్యర్థులు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఎన్నికల ప్రచారంలో.. నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి పనులను టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ వివరిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టనున్న సంక్షేమ పథకాలను ఆపార్టీ అభ్యర్థి డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఆనంద్ రెడ్డి కేంద్రంలో మోదీ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ.. తనను గెలిపిస్తే నిస్వార్థంగా సేవలందిస్తానని హామీ ఇస్తున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పోరు రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ భూపతిరెడ్డి, బీజేపీ అభ్యర్థి కేశ్‌పల్లి గడ్డం ఆనందర్‌రెడ్డి మధ్య పోరు జోరుగా సాగుతోంది. మూడు పార్టీల అభ్యర్థులు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ఈ ముగ్గురు అభ్యరులు గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను బాజిరెడ్డి వివరిస్తున్నారు. అలాగే మరోమారు అధికారంలోకి వచ్చాక తమ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అమలు చేయనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. పెన్షను లబ్ధిదారులు, రైతులు, మైనార్టీలు అన్ని వర్గాల ప్రజల తమను మరోమారు ఆశీర్వదించాలని కోరుతున్నారు. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి.. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక చేపట్టనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి చెబుతున్నారు. రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ, రూ.రెండు వేల పింఛన్ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్రంలోని మోదీ సర్కారు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి సంక్షేమ పథకాలను బీజేపీ అభ్యర్థి కేశ్‌పల్లి గడ్డం ఆనంద్‌రెడ్డి ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే తన తండ్రి కేశ్‌పల్లి గంగారెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేగా జిల్లా కోసం చేసిన నిస్వార్థ సేవలు, అభివృద్ధి పనులను ఆనందర్‌రెడ్డి ప్రస్తావిస్తున్నారు. తనకు అవకాశం కల్పిస్తే తన తండ్రిబాటలో నడిచి ప్రజలకు సేవలందిస్తామని చెబుతున్నారు. ఈ మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుండటంతో రూరల్ రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. పోటా పోటీగా ప్రచారం.. ముగ్గురు ప్రధాన అభ్యర్థుల మధ్య ప్రచారం జోరందుకుంది. నెల రోజుల ముందు నుంచే టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి ప్రచారాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని గ్రామగ్రామాన్ని చుట్టి వచ్చారు. ప్రధాన సామాజికవర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు. ఇప్పుడు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. తన అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి ప్రచారాన్ని వేగవంతం చేశారు. అంతకుముందే నియోజకవర్గంలో తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీజేపీ అభ్యర్థి ఆనంద్‌రెడ్డి ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు దీటుగా ఆనంద్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల కుటుంబసభ్యులు కూడా ప్రచార రంగంలోకి దిగడంతో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. -
బీజేపీతోనే సమగ్రాభివృద్ధి
భారతీయ జనతా పార్టీతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. హాలియాలో శుక్రవారం బీజేపీ సాగర్ అభ్యర్థి కంకణాల నివేదితారెడ్డిని గెలిపించాలని కోరుతూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పక్కనే నాగార్జునసాగర్ రిజర్వాయర్ ఉన్నా స్థానికంగా తాగునీటి సమస్య ఉండడం దారుణమన్నారు. కాంగ్రెస్, టీడీపీల పాలన చూశారని ఈసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. త్రిపురారం (నాగార్జునసాగర్) : బీజేపీతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. శుక్రవారం హాలియాలో దేవరకొండ ప్రధాన రహదారి సమీపంలో శివాజీ మైదానంలో బీజేపీ సాగర్ అభ్యర్థి కంకణాల నివేదితాశ్రీధర్రెడ్డికి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా రాజ్‌నాథ్‌సింగ్ హాజరై మాట్లాడారు. సోదర సోదరీ మణులకు స్వాగతం.. తెలంగాణ అమర వీరులకు జోహార్లు అంటూ ఆయన తెలుగులో ప్రసంగించడంతో సభకు హాజరైన ప్రజలంతా కేకలు, చప్పట్లతో హోరెత్తించారు. భారీ నీటి ప్రాజెక్టు ఉన్న సాగర్‌లో తాగునీటి సమస్య ఉండడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టూరిజం కేంద్రంగా పేరుపొందిన నాగార్జునసాగర్‌లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం బా«ధాకరమన్నారు. ప్రతిష్టాత్మకమైన నాగార్జునసాగర్ అంటే దేశంలో ఎంతో పేరుందని.. ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హాస్టల్స్, ఆస్పత్రి సౌకర్యాలు లేకపోవడం శోచనీయమన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పేదల కోసం ప్రారంభించిన ఆయుష్మాన్‌భవ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పారు. రూ.5 లక్షల విలువైన ఉచిత వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి పేద వాడికి గూడు కల్పించాలనే లక్ష్యంతో నరేంద్రమోదీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌యోజన పథకం కింద పేద వారికి ఇళ్ల కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఇస్తున్నా.. తెలంగాణలో మాత్రం ఈ పథకం అమలు కావడం లేదని విమర్శించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ, వృద్ధులకు రూ.2వేల పింఛన్, డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్ ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్, టీడీపీల పాలన చూశారని ఓ సారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. సాగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కంకణాల నివేదితాశ్రీధర్రెడ్డిని గెలిపించాలని కోరారు. విజయం సాధిస్తే తాను విజయోత్సవ కార్యక్రమానికి హాజరవుతానన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బరిలో ఉన్న కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ వయస్సు పైబడిన వారేనని, తనను గెలిపిస్తే అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తానని కంకణాల నివేదితాశ్రీధర్రెడ్డి ప్రజలను కోరారు. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. నియోజకవర్గంలో తాగు, సాగునీరు, విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉపాధి కల్పన లభించాలంటే బీజేపీ కమలం గుర్తుకు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను శాలువా, గజమాలతో సన్మానించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కంకణాల శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటనారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మిట్టపల్లి శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ మనాది రవీందర్‌యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు చెన్ను వెంకటనారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శి వాసుదేవుల జితేందర్‌రెడ్డి, పోగుల నాగార్జున్‌రెడ్డి, చలమల వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
అమీ.. తుమీ...!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ముందస్తు ఎన్నికల సంగ్రామానికి వారం రోజుల గడువే ఉండడంతో అన్ని రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ వాతావారణం నెలకొంది. ఈ ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. అభ్యర్థులు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు గల అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. ఇతర పార్టీల నాయకులను ఆకర్షించే కార్యక్రమం ఇప్పటికే పూర్తికాగా, ఇప్పుడు ప్రధానంగా ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో ఇమేజ్ ఉన్న పార్టీ నేతలను, ఇతర నాయకులను నియోజకవర్గాలకు ఆహ్వానించి సభలు, సమావేశాలతో ఓటర్లను ప్రభావితం చేసే పనిలో పడ్డారు. నియోజకవర్గాల్లో బూత్‌ల వారీగా పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసిన అభ్యర్థులు వారికి ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నారు. బస్తీలు, గ్రామాల నాయకులు డబ్బులు, మద్యం పంచేందుకు సమాయాత్తమవుతున్నారు. ఆయా పార్టీల అగ్రనేతలు కేసీఆర్, అమిత్‌షా, మాయావతి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి తదితరులు ఇప్పటికే ఎన్నికల ప్రచారం నిర్వహించిపోగా, ప్రచారానికి మిగిలిన ఐదు రోజుల్లో హేమాహేమీలు రంగంలోకి దిగే అవకాశం ఉంది. శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి , విజయశాంతి, గద్దర్, కోదండరాం తూర్పు జిల్లాల్లో పర్యటించనున్నారు. సీఎం సభలతో టీఆర్ఎస్లో కొత్త ఉత్సాహం విజయమే లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సుడిగాలి పర్యటనలు జరుపుతుండడంతో టీఆర్ఎస్ అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వివిధ కారణాలతో తొలుత బలహీనంగా కనిపించిన నియోజకవర్గాల్లో సైతం ఇప్పు డు పరిస్థితులు మారడం గమనార్హం. ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాలల్లో సీఎం పర్యటనల తరువాత ఆ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడినట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్‌లలో బీజేపీ బలమైన అభ్యర్థులు ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి టీఆర్ఎస్కు లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. గురువారం ముఖ్యమంత్రి పాల్గొన్న సభలన్నీ విజయవంతం కాగా, అభ్యర్థుల్లో ఉత్సాహం పెరిగినట్లయింది. స్థానిక అంశాలను ప్రస్తావిస్తూనే కాంగ్రెస్, టీడీపీ వల్ల ప్రజలకు నష్టం జరిగే తీరును వివరించి ఆకట్టుకున్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి చేసిన కృషిని వివరించి వారిని ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ నేతల చూపు పీసీసీ వైపు టీఆర్ఎస్కు బెల్లంపల్లి మినహా తొమ్మిది స్థానాల్లో ప్రధాన పోటీదారులుగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం సాగిస్తున్నప్పటికీ, స్టార్ క్యాంపెయినర్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రెండుసార్లు ఉమ్మడి జిల్లాను చుట్టిరాగా, కాంగ్రెస్ తరుపున ఆ పరిస్థితి లేదు. అభ్యర్థుల ఎంపికకు ముందు రాహుల్‌గాంధీ భైంసాలో నిర్వహించిన సభ, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, ఆదిలాబాద్‌లలో భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి సభలు మాత్రమే జరిగాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, విజయశాంతి, మందకృష్ణ మాదిగ, గద్దర్ శుక్రవారం మంచిర్యాల, చెన్నూ రు, బెల్లంపల్లితో పాటు పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. వీరి పర్యటన తరువాత కాంగ్రెస్‌లో కూడా కొత్త ఉత్సాహం వెల్లివిరిసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు ధీమాతో ఉన్నాయి. మంచిర్యాలలో సభను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేంసాగర్‌రావు భారీ ఏర్పాట్లు చేశారు. ఐదు స్థానాల్లో గట్టి పోటీ ఇస్తున్న బీజేపీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బెల్లంపల్లి మినహా ప్రధాన పార్టీల మధ్యనే పోరు నెలకొంది. బీజేపీ బలంగా ఉన్న స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎవరు ఎవరిని ఓడిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. పశ్చిమ జిల్లాలో బీజేపీ ప్రభావం ఆదిలాబాద్, ముథోల్, నిర్మల్‌లో ఎక్కువగా ఉండగా, తూర్పు ప్రాంతంలో బెల్లంపల్లి, మంచిర్యాలలో కనిపిస్తోంది. బెల్లంపల్లి మినహా నాలుగు స్థానాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు నెలకొనే పరిస్థితులున్నాయి. బెల్లంపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య, గడ్డం వినోద్ (బీఎస్పీ), గుండ మల్లేష్ (సీపీఐ), కొయ్యల ఏమాజీ (బీజేపీ) మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది. మిగతా ఐదుచోట్ల బీజేపీ బరిలో ఉన్నా ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉంది. కాగా బీజేపీ చీఫ్ అమిత్‌షా నిర్మ ల్, ఆదిలాబాద్‌లలో ప్రచారసభలు నిర్వహించి ఆ పార్టీ అభ్యర్థులకు మనోధైర్యం ఇచ్చారు. మరో విడత స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం ఉంటుందని ఆపార్టీ అభ్యర్థులు ఆశతో ఉన్నారు. మాయావతి ప్రభావంతో ఏనుగు ఎక్కుతారా..? ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీఎస్పీ రాష్ట్రంలో గత ఐదు ఎన్నికల నుంచి పోటీ చేస్తున్నా, 2014లో నిర్మల్, సిర్పూరు గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది. గెలిచిన అభ్యర్థులు తరువాత టీఆర్ఎస్లో చేరినప్పటికీ, ఆ పార్టీకి ఆదిలాబాద్‌లో ఇమేజ్ కొంత మేర ఉందనేది వాస్తవం. అదే స్ఫూర్తితో ఈసారి బీఎస్పీ నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి అభ్యర్థులు రంగంలోకి దిగారు. అంగబలం, అర్థబలం కలిగిన మాజీ మంత్రి గడ్డం వినోద్ ఇప్పుడు ఆ పార్టీకి ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. బెల్లంపల్లిలో మహాకూటమి నుంచి సీపీఐ పోటీ చేస్తుంది. కాంగ్రెస్ బరిలో లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు, టీఆర్ఎస్ అసంతృప్తి వాదులు వినోద్‌కు బాహాటంగా మద్దతిస్తున్నాయి. దాంతో పోటీ టీఆర్ఎస్, బీఎస్పీ మధ్యనే అన్నట్లుగా సాగుతోంది. చెన్నూరులో బీఎస్పీ అభ్యర్థిగా ప్రొఫెసర్ సుజాత పోటీ చేస్తున్నారు. వామపక్ష భావాలు గల సుజాత ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు ఏమేర పోటీ ఇస్తుందో వేచిచూడాలి. గత ఎన్నికల్లో గెలిచిన సిర్పూరులో టీఆర్ఎస్ అభ్యర్థి కోనప్ప బంధువు రావి శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. మంచిర్యాలలో బేర సత్యనారాయణ విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. వీరంతా పోటీలో కనిపిస్తున్నప్పటికీ, గెలుపు గుర్రంగా గడ్డం వినోద్ మాత్రమే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్మల్, మంచిర్యాలలో మాయావతి ప్రచార సభలు నిర్వహించడం కొంత మేరకు కలిసి వస్తుందని ఆ పార్టీ అభ్యర్థులు భావిస్తున్నారు. ముథోల్‌లో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండడంతో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రామారావు పటేల్‌కు ఇబ్బందిగా మారింది. చెన్నూరులో బీఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి బోడ జనార్ధన్ ప్రభావం ఎంతో తెలియని పరిస్థితి. ఇండిపెండెంట్లు పెద్దగా ప్రభావం చూపడం లేదు. -
వారసులకు.. నో చాన్స్!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా ఓటర్లు ఇప్పటి దాకా వారసులకు జై కొట్టనే లేదు. ఆయా నియోజకవర్గాల నుంచి పలువురు సీనియర్ నేతలు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ప్రాతినిధ్యం వహించినా, వారి వారసులకు మాత్రం ఎలాంటి అవకాశాలు రాలేదు. కొందరు నేతల తనయులు ఎన్నికల బరిలోకి దిగాలని ప్రయత్నించినా, కనీసం పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పన్నెండు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి దాకా ఎమ్మెల్యేలుగా పనిచేసిన నేతల తనయులకు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం కేవలం ఇద్దరికి మాత్రమే దక్కింది. వారు కూడా కేవలం ఒకే ఒక్క గెలుపునకు పరిమితమై పోయారు. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి 1962, 1967, 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన వరుస విజయాలు సాధించిన తిప్పన చిన కృష్ణారెడ్డి తనయుడు తిప్పన విజయ సింహారెడ్డి 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఒకే ఒకసారి విజయం సాధించారు. ఆ తర్వాత 1994 ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కినా గెలవలేక పోయారు. ఇదే తరహాలో మునుగోడు నియోజకవర్గం నుంచి సీపీఐ తరఫున ఉజ్జిని నారాయణరావు 1985, 1989, 1994 ఎన్నికల్లో వరసగా విజయాలు సాధించారు. ఆయన తనయుడు ఉజ్జిని యాదగిరిరావు 2009 ఎన్నికల్లో మునుగోడు నుంచి గెలిచారు. ఆ మరుసటి ఎన్నికల్లో ఆయన రెండోసారి పోటీ చేసే అవకాశమే దక్కలేదు. ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో ఇక, ఏ నేత తనయుడు కానీ, కూతురు కానీ తండ్రుల రాజకీయ వారసత్వాన్ని అందుకుని చట్టసభలకు వెళ్లలేక పోయారు. అవకాశాలు దక్కని వారసులు జిల్లాలో సీనియర్ నేతల వారసులు కొందరు ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్సాహపడిన వారే. కానీ వారికి పోటీ చేసే అవకాశమే దక్కలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి రెండు పర్యాయాలుగా ఎన్నికల బరిలోకి దిగాలని ప్రయత్నించారు. ప్రధానంగా ఈసారి మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీకి దిగాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరి నిమిషం దాకా ఢిల్లీలో ఏఐసీసీ నేతల వద్ద పావులు కదిపారు. కుటుంబానికి ఒకటే టికెట్ అన్న నిబంధన నేపథ్యంలో ఆయనకు టికెట్ దక్కలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2014 ఎన్నికల్లో టికెట్ ఆశించిన రఘువీర్ రెడ్డి అప్పుడు దక్కక పోవడంతో ఆశగా దాదాపు ఐదేళ్లు ఎదురు చూశారు. చివరకు ఆయనకు 2018 ఎన్నికలు సైతం చేదు జ్ఞాపకాన్ని మిగిల్చాయి. మిర్యాలగూడ నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి ఎమ్మెల్యే అయిన ఎన్.భాస్కర్‌రావు, టీఆర్ఎస్లో చేరడం, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగడం జరిగిపోయాయి. దీంతో ఈ సారి ఇక్కడినుంచి టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. మరో సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తమ్‌రెడ్డి గత ఎన్నికల సమయంలోనే భువనగిరి టికెట్ ఆశించారు. చివరి నిమిషం దాకా ప్రయత్నించి విఫలమయ్యారు. ఈసారి కూడా సూర్యాపేట నుంచి దామోదర్ రెడ్డికే టికెట్ లభించింది. దీంతో సర్వోత్తమ్ ఎన్నికల అరంగేట్రం వాయిదా పడిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోమాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి తనయుడు సందీప్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసినా, ఎన్నికల గోదాలోకి దిగే అవకాశమే దక్కలేదు. జిల్లాల విభజన జరిగాక ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి టీడీపీని వీడి టీఆర్ఎస్ గూటికి చేరడంతో ఆయన తన తల్లి వెంటే గులాబీ కండువా కప్పుకున్నారు. వాస్తవానికి భువనగిరి నుంచి మాధవరెడ్డి నాలుగు పర్యాయాలు, ఉమా మాధవరెడ్డి మూడు సార్లు మొత్తంగా ఎలిమినేటి కుటుంబం ఏడు సార్లు ప్రాతినిధ్యం వహించింది. 1985 నుంచి 2009 వరకు ఈ నియోజకవర్గం ఈ కుటుంబం చేతిలోనే ఉండింది. 2014లో మాత్రమే ఇక్కడినుంచి టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇంత పట్టున్న నియోజకవర్గం నుంచి ఎలిమినేటి వారసుడికి మాత్రం అవకాశం దక్కలేదు. మునుగోడు నియోజకవర్గంపై ప్రత్యేక ముద్ర వేసిన కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి దామోదర్ రెడ్డి కుటుంబం నుంచి కూడా ఎవరూ చట్ట సభలకు వెళ్లలేక పోయారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుటుంబం నుంచి ఆయన తనయుడు, కూతురు రాజకీయాల్లో ఉన్నా.. ఎన్నికలకు మాత్రం వారికి కలిసిరాలేదు. గోవర్ధన్‌రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కక పోవడంతో ఆమె రెబల్‌గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఈసారి కూడా చివరి నిమిషం దాకా టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఇక, గోవర్ధన్‌రెడ్డి తనయుడు పాల్వాయి శ్రవణ్ రెడ్డి ఈ సారి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇలా, జిల్లా వ్యాప్తంగా పలువురు సీనియర్ నేతలు ఎవరూ ఎన్నికల రంగంపై లేకుండా అయ్యారు. -
కీలక నేతలపై గురి
సాక్షి ప్రతినిధి, వరంగల్ : అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు గెలుపు వ్యూహాల అమలుపై నజర్ వేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు కొందరు విపక్షంలోని ద్వితీయ శ్రేణికి చెందిన ‘కీలక’ నేతల మీద గురిపెట్టారు. ఇదే సమయంలో ఇంకొందరు పోటీలో ఉన్న అభ్యర్థులు చీల్చే ఓట్ల మీద దృష్టి సారించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 స్థానా లకు గాను 172 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రతిచోటా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరితో పాటు బీఎల్ఎఫ్, స్వతంత్రులు కూడా పోటీలో ఉన్నారు. ప్రస్తుతం అందరి దృష్టి వీరు ఏ మేరకు ఓట్లు సాధిస్తారు? ఎవరి ఓట్లు చీల్చుతారు? అనే దానిపైనే చర్చ కొనసాగుతోంది. పోటీలో ఉన్నప్పటికీ స్వతంత్రులను తమ వైపునకు తిప్పుకుని ఓట్లు పొందేందుకు యత్నిస్తున్నారు. వారు ప్రచారంలో పాల్గొనేలా నేతలు మంతనాలు జరుపుతున్నారు. స్వతంత్రుల ఓట్లు కీలకం కొన్ని నియోజకవర్గాల్లో ద్విముఖ.. మరికొన్ని చోట్ల త్రిముఖ పోటీ నెలకొంది. ‘త్రిముఖ’ పోరు ఉన్న చోట బీజేపీ, బీఎల్ఎఫ్, ఇతరులు సాధించే ఓట్ల మీదనే ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ‘త్రిముఖ’ పోటీ నెలకొన్న చోట బీఎల్ఎఫ్, స్వతంత్రులు సాధించే ఓట్లు కీలకంగా మారనున్నాయి. డోర్నకల్, మహబూబాబాద్‌లలో చతుర్ముఖ పోటీ.. భూపాలపల్లి, పరకాలలో త్రిముఖ పోటీ.. మిగిలిన చోట్ల రెండు ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందని తెలుస్తోంది. బీజేపీతో కూటమిలో ఆందోళన ఒంటరిగా 12 స్థానాల్లో బరిలోకి దిగిన బీజేపీ ఈసారి ఎలాగైనా పాగా వేయాలనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అగ్రనేతలు సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడ తమ ఓట్లను చీల్చుతారోననే ఆందోళనతో ఉన్నారు. అయితే బీజేపీ ఎక్కువగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే అవకాశం ఉండడంతో అటు టీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఆ వ్యతిరేక ఓట్లు ఎటుపోతాయోననే దిగులు కూటమి అభ్యర్థుల్లో నెలకొంది. జంప్ అభ్యర్థుల ప్రభావం.. మహబూబాబాద్, స్టేషన్ ఘన్పూర్, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల్లో టికెట్ ఆశించి భంగపడిన కొందరు నేతలు ఇతర పార్టీ నుంచి పోటీలో దిగారు. సామాజికవర్గ పరంగా బలంగా ఉండడం, ప్రధాన పార్టీ ఓట్లు చీల్చే అవకాశం నేపథ్యంలో ఇక్కడ చతుర్ముఖ పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం ఉంది. నేతల ప్రచారాలపై ఆశలు.. ఇక అగ్రనేతల ప్రచారాలపైనే అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే నిర్వహించిన సభలు, సమావేశాలు రోడ్‌షోల ప్రభావం ఇక ముందు మరింతగా కనిపించే వీలుంది. అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ పార్టీ పెద్దల్ని ప్రచారానికి రప్పించేలా ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే జిల్లాలోని పాలకుర్తి, జనగామ, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో ఆశీర్వాద సభలు నిర్వహించారు. మరోసారి కేసీఆర్ జిల్లాకు రానున్నారు. మరో వైపు జిల్లాలో రాహుల్‌గాంధీ సభను నిర్వహించే దిశగా కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా తేదీలు ఖరారయ్యే వీలుంది. ఇక బీజేపీ నాయకులు నేతలు కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ఆయా నియోజకవర్గాల్లో సభలకు హాజరుకానున్నారు. -
టికెట్ రాని ఆశావహుల చర్చోపచర్చలు
ఇన్నాళ్లూ పార్టీకి సేవలు అందించారు. టికెట్ వస్తుందని కోటి ఆశలతో ఎదురుచూశారు. తీరొక్క ప్రయత్నాలు చేశారు. తమకు పరిచయం ఉన్న నేతల ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. తీరా జాబితాలో పేరు లేకపోవడంతో ఇప్పుడు తర్జన భర్జన పడుతున్నారు. ఒకవైపు నామినేషన్ వేసేందుకు గడువు దగ్గరపడుతుండడంతో ఏం చేద్దాం.. ఎట్ల చేద్దాం.. అంటూ కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన నేతలంతా పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలతో చర్చిస్తున్నారు. కొందరైతే రెబెల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సమయం ముంచుకొస్తుండగా.. జిల్లాలో రాజకీయం రంగులు మారుతోంది. టికెట్ ఆశించి భంగపడిన నేతలంతా మరోదారి చూసుకునేందుకు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించుకునే పనిలో నిమగ్నమయ్యారు. వైరా నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన రాములునాయక్ వైరాలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నేతలు.. అభిమానులతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి టీఆర్ఎస్ తరఫున పోటీచేస్తున్నఅభ్యర్థి మదన్‌లాల్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ అసంతృప్తివాదులు సైతం హాజరుకావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రాములునాయక్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల బరిలో ఉంచాలని ఏకాభిప్రాయానికి వచ్చిన సమావేశం.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడమా? ఏదైనా జాతీయ పార్టీ గుర్తుతో బరిలో నిలవడమా? అనే అంశంపై చర్చించారు. బీఎస్పీ నుంచి పోటీ చేయడం వల్ల జాతీయ పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లు ఉంటుందని, ప్రజలకు తెలిసిన గుర్తు ఏనుగు కేటాయించే అవకాశం లభించడంతో విజయావకాశాలు మరింత మెరుగుపడతాయని సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి మదన్‌లాల్‌ను వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ శ్రేణులు కొందరు తాము రాములునాయక్‌కు పూర్తిస్థాయి అండదండలు అందిస్తామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. వైరాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో రాములునాయక్‌కు వ్యతిరేకంగా ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగేది లేదని.. ఆయన గెలుపునకు కృషి చేయాలని ప్రమాణం చేసినట్లు కూడా తెలుస్తోంది. దీంతో రాములునాయక్ ఈనెల 19వ తేదీన వైరా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీఎస్పీ నుంచి టికెట్ తెచ్చుకోవడమా? స్వతంత్రుడిగా కొనసాగడమా? అనే అంశంపై ఒకటి, రెండు రోజుల్లో ఒక నిర్ణయానికి రావాలని సమావేశం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. వైరా నియోజకవర్గంలోని కాంగ్రెస్ సీనియర్ నేతలు పలువురు, టీఆర్ఎస్ అసంతృప్తివాదులు కొందరు హాజరుకావడంతో సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఖమ్మంలోనూ.. ఖమ్మం నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థి గా రంగంలోకి దిగిన టీడీపీ నేత నామా నాగేశ్వరరావు.. కాంగ్రెస్ నుంచి తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి దిగుతారని ప్రచారం జరిగిన మానుకొండ రాధాకిషోర్‌ను ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. తనకు సహకరించాల్సిందిగా కోరగా.. పార్టీ శ్రేణులు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరితో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పినట్లు సమాచారం. ఇక రాధాకిషోర్, అలాగే మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు ఈనెల 19న నామినేషన్ వేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పోట్లసైతం తన అనుచరవర్గంతో సమావేశమై ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాత్రం కూటమిలో అసంతృప్తులు.. తిరుగుబాట్లు టీ కప్పులో తుపాను వంటివని, అన్నీ త్వరలోనే సర్దుకుంటాయని.. ఇందుకు కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తుందని శుక్రవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భరోసా వ్యక్తం చేశారు. ఇక సత్తుపల్లి ప్రజాకూటమి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య శనివారం నామినేషన్ వేయనున్నారు. అలాగే వైరా నుంచి కాంగ్రెస్‌నేత రాములునాయక్‌ను స్వతంత్ర అభ్యర్థి లేదా బీఎస్పీ తరఫున బరిలోకి దించేందు కు జరుగుతున్న ముమ్మర ప్రయత్నాలపై నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కొంత అలజడి రేపింది. రాములునాయక్‌కు మద్దతు ప్రకటించే నేతలను సముదాయించేందుకు టీఆర్ఎస్ అభ్యర్థి మదన్‌లాల్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా సమావేశమై స్వతంత్ర అభ్యర్థిగా ఒకరిని రంగంలోకి దించాలనే అంశంపై ప్రజాకూటమిలో భాగస్వామ్య పక్షమైన సీపీఐ సైతం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న కాంగ్రెస్ నేతలు తమ పార్టీకి సహకరించేలా చూడాలని సీపీఐ నేతలు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మరోవైపు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా కందాళ ఉపేందర్‌రెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. వైరాలో రాములునాయక్‌కు మద్దతుగా ప్రమాణం చేస్తున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ అసమ్మతి నాయకులు -
చేరితే ఓ రేటు.. మద్దతు ఇస్తే మరో రేటు
సాక్షి, వరంగల్ రూరల్ : ముందస్తు ఎన్నికల్లో భాగంగా వలసలకు గిరాకీ పెరిగింది. ఇందులో భాగంగానే పలువురు నాయకులు, గ్రామ పెద్దలు, కుల సంఘ నాయకులను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు కార్యచరణ ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. వారి స్థోమతను బట్టి వేల నుంచి లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు గ్రామాల్లో చర్చ జరుగుతుంది. గ్రామాల్లో కీలకంగా వ్యవహరించే వారికి తమ వైపునకు తిప్పుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచే బేరసారాలు జరుపుతున్నారు. నియోజకవర్గంలో తమ బలబలాలను నిరూపించుకునేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పరకాల, నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో పోటాపోటీ చేరికలు జరుగుతున్నాయి. దీంతో నయానో బయానో చెల్లించుకుని తమ ఉనికిని చాటుకునేందుకు ప్రధాన పార్టీలకు చెందిన ప్రత్యర్థులు పోటీపడుతున్నారు. చేరితే ఓ రేటు.. మద్దతు ఇస్తే మరో రేటు అందులో భాగంగానే గ్రామ పెద్దలు, కుల సంఘ నాయకులు ప్రత్యర్థి పార్టీలకు చెందిన శ్రేణులకు రాయభారం జరిపి అనంతరం జిల్లా కేంద్రంలో చేరికలు, మద్దతు తెలిపే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పార్టీలో చేరితే ఒక రేటు, మద్దతు ఇస్తే మరోరేటు ఇచ్చే విధంగా మాట్లాడుతన్నారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. డబ్బులు, తాయిలాలు, బహుమతులను కొంతమందికి ఇస్తుండగా మరికొంత మందికి రాననున్న రోజుల్లో సర్పంచ్, ఎంపీటీసీల వంటి ప్రజా ప్రతినిధి వంటి అవకాశాలతో పాటు పలు రాయకీయ పదవులను ఆశ చూపుతున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి కుడా రాయభారం పస్తుందని రానున్న రోజుల్లో ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో తెలి యని పరస్థితి ఉన్నదని చెబుతున్నారు. ఏది ఏమైనా గ్రామాల్లో నాయకులకు గిరాకీ ఏర్పడిందని కొందరు చెబుతుండగా, నాయకులు అభ్యర్థుల వెంట తిరిగిన వారిని చూసి ఓట్లు వేసే రోజులు లేవని మరికొందరు చెప్పుకోవడం గమనార్హం. పోటాపోటీగా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో పోటాపోటీగా చేరికలు కోనసాగుతున్నాయి. కొంత పలుకుబడి ఉన్న నాయకుడు పార్టీ మారకుండా ఉండేందుకు తరచూ పలకరిస్తున్నారు. పార్టీ మారకుండా ఉండాలంటే కొందరు నాయకులు డబ్బులను సైతం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రచారం ఖర్చు కంటే నాయకులను కాపాడుకునేందుకే ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. బరిలో నిలుస్తున్న నేతలు జంప్ జీలనీలతో తలలు పట్టుకుంటున్నారు. -
ఎన్నికల వేళ మాటల యుద్ధం
సాక్షి, మెదక్: అసలే ఎండలు మండిపోతున్నాయి. దీనికితోడు రాజకీయ వేడి రాజుకుంటోంది. మరోపక్క సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్టులు పొలిటికల్ హీట్‌ను మరింత పెంచుతున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం కాక పుట్టిస్తోంటే.. ప్రజల్లో అవే చర్చనీయాంశాలవుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే మెతుకుసీమ ‘నువ్వా.. నేనా?’ అంటూ నాయకులు విసురుకుంటున్న సవాళ్లతో కుతకుతలాడుతోంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమ వార్ మొదలైంది. ఎన్నికల ప్రచారాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు పోటాపోటీగా ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. అంతటితో ఆగకుండా సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు వాట్సాప్, ట్విట్టర్, ఫేష్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నారు. టీఆర్ఎస్ నాయకులు వీటికి ధీటుగా స్పందిస్తూ ఎన్నికల పోరుకు సై అంటున్నారు. దీంతో నియోజకవర్గాల్లో ఎన్నికల వేడి రగులుకుంటోంది. ప్రారంభించిన సునీతారెడ్డి ప్రచారం శాసనసభ రద్దు మొదలు జిల్లాలో రాజకీయ వాతావరణం చోటు చేసుకుంది. రద్దు చేసిన వెనువెంటనే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. మెదక్, నర్సాపూర్ స్థానాలను సిట్టింగ్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలకు టీఆర్ఎస్ అధిష్టానం కట్టబెట్టింది. దీంతో ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల ప్రచారం ఇప్పటికే ప్రారంభించారు. దీనికితోడు కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులను చేర్చుకుంటున్నారు. ఇటీవల నర్సాపూర్‌లో మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రచార సభను నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించలేదు. నర్సాపూర్ నుంచి టికెట్ రావటం ఖాయం కావటంతో మాజీ మంత్రి సునీతారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మెదక్ నియోకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ ఆశావహులు మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, బట్టి జగపతి, సుప్రభాతరావు, తిరుపతిరెడ్డి, చంద్రపాల్ తదితరులు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. నర్సాపూర్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సవాళ్లు... నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఇటీవల నర్సాపూర్‌లో జరిగిన ప్రచారసభలో మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి సునీతారెడ్డి టార్గెట్ చేస్తూ పలు ఆరోపణలకు దిగారు. సునీతారెడ్డి మంత్రిగా పనిచేసిన కాలంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని, నీటిపారుదలశాఖా మంత్రిగా ఉంటూ ఒక్క చెరువులో çకూడా పూడికతీయించలేదంటూ ఆమెపై దాడికి దిగారు. కాగా మంత్రి సునీతారెడ్డి రెండు రోజులుగా ఎన్నికల ప్రచారం, పత్రికాముఖంగా టీఆర్ఎస్కు సవాలు విసిరారు. తాను మంత్రిగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని దమ్ముంటే టీఆర్ఎస్ నేతలు బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. మంత్రి సవాల్‌పై టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు సైతం పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నారు. మెదక్‌లో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మెదక్ నియోజకవర్గలో సైతం టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తలపడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు ఆరోపణలకు దిగడంతోపాటు ఇటీవల హవేళిఘనపూర్ మండలంలో పలు గ్రామాల్లో ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై టీఆర్ఎస్ మండిపడుతూనే కాంగ్రెస్ వైఖరిని ప్రజల్లో తూర్పారబట్టే ప్రయత్నం చేస్తోంది. మంగళవారం పాపన్నపేట మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి పలు ఆరోపణలు చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని, బతుకమ్మ.. బోనాలకు పరిమితమైదంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై పద్మాదేవేందర్‌రెడ్డి బుధవారం రామాయంపేటలో స్పందించారు. కాంగ్రెస్ నేతలు బతుకమ్మ, తెలంగాణ సంస్కృతిని కించపరిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తాను చేపట్టిన అభివృద్ధి ప్రజలకు తెలుసని.. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా.. మెదక్ ప్రజలు ఆపార్టీనిపై తిరగబటం ఖాయమన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వేదికగా టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు తలపడుతూ ఒకరిపార్టీపై మరొకరు బురదజల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
‘అ’సమ్మతి
ప్రధాన పార్టీల్లో అసమ్మతి సెగలు క్రమంగా చల్లారుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన సమయంలో భగ్గుమ న్న అసమ్మతి నేతలు.. రోజులు గడుస్తున్న కొద్దీ మెత్తబడుతున్నారు. ఆయా పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగి బుజ్జగించడంతో పునరాలోచనలో పడుతున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ముందస్తు ఎన్నికల నిర్వహణకు ముందుకు వచ్చి అసెంబ్లీని రద్దు చేసిన టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ని తొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. అధినేత కేసీఆర్ టికెట్ ఖరారు చేసిన వెంటనే ఎల్లారెడ్డి, బాల్కొండ నియోజకవర్గాల్లో అసమ్మతి తెరపైకి వచ్చింది. మిగిలిన చోట్ల మాత్రం అంతర్గతంగా రగులుకుంటోంది. ఎల్లారెడ్డిలో.. ఎల్లారెడ్డి స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిని తిరిగి అభ్యర్థిగా ప్రకటించడంపై ఆ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ అసమ్మతిరాగం ఆలపించారు. అప్రమత్తమైన రవీందర్‌రెడ్డి జనార్దన్‌గౌడ్‌ను కలిసి ఎన్నికల్లో సహకరించాలని కోరగా.. ఆశించిన స్పందన కరువైంది. దీంతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్ పిలిపించుకుని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి రవీందర్‌రెడ్డి గెలుపునకు పూర్తి సహకారం అందించాలని మంత్రి కేటీఆర్ చెప్పడంతో జనార్దన్‌గౌడ్ అంగీకరించినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బాల్కొండలో.. బాల్కొండ నియోజకవర్గంలో తెరపైకి వచ్చిన అసమ్మతి సెగలు మాత్రం ఇంకా చల్లారలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని టీఆర్ఎస్ ఖరారు చేయడంతో ఆ నియోజకవర్గంలోని ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునిల్‌రెడ్డి అసమ్మతి గళం వినిపించారు. తన అనుచరులతో వేల్పూర్ మండలంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అనుచరుడైన సునిల్‌రెడ్డి ఈసారి బీఎస్పీ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఈ అసమ్మతి నేత బరిలో ఉంటే పరోక్షంగా ప్రశాంత్‌రెడ్డికి ప్రయోజనం చేకూరే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉండే కాస్త వ్యతిరేక ఓట్లు చీలిపోయి, పరోక్షంగా టీఆర్ఎస్కు మేలు జరుగుతుందనే భావన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌లోనూ.. కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారికంగా అభ్యర్థిత్వాలను ఖరారు చేయలేదు. కానీ బోధన్, కామారెడ్డి నియోజకవర్గాల అభ్యర్థులుగా మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ దాదాపు ఖరారైనట్లే. ఆర్మూర్‌లో ప్రచారం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఆకుల లలితకు అధినాయకత్వం దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖరారైన ఈ మూడు స్థానాల్లో రెండుచోట్ల అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. కామారెడ్డిలో ఆ పార్టీ పీసీసీ కార్యదర్శి నల్లవెల్లి అశోక్ అసమ్మతి రాగం వినిపించారు. తన పేరును కూడా పరిశీలించాలని పీసీసీ అధినాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ అసమ్మతి నేతను బుజ్జగించేందుకు షబ్బీర్‌అలీ అశోక్‌తో మాట్లాడారు. విభేదాలను పక్కన బెట్టి ఎన్నికల్లో సహకరించాలని కోరారు. ఆర్మూర్ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి బరిలో నిలుస్తారని అందరూ భావిస్తున్న తరుణంలో మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి కారెక్కడంతో ఇక్కడ ఎమ్మెల్సీ ఆకుల లలితకు అవకాశం కలిసొచ్చింది. టీపీసీసీ అధినాయకత్వం కూడా ఆకుల లలితకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఆకుల లలిత అభ్యర్థిత్వాన్ని ప్రకటించే అవకాశాలుండడంతో ఇక్కడ అసమ్మతి సెగలు రాజుకున్నాయి. సురేశ్‌రెడ్డి అనుచరుడిగా పనిచేసిన మార చంద్రమోహన్ అసమ్మతి రాగం అందుకున్నారు. అలాగే కాంగ్రెస్‌లో చేరిన రాజారాం యాదవ్ సైతం అసమ్మతిని తెలియజేశారు. ఆర్మూర్‌లో ఈ నాయకుల మధ్య సమన్వయం కుదిర్చే అంశంపై కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టి సారించింది. ఈ బాధ్యతలను మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డికి అప్పగించే అవకాశాలున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మొత్తం మీద టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అసమ్మతి నేతలను బుజ్జగించడం ఇప్పటికే ఓ కొలిక్కి వస్తుండగా, ఎన్నికల సమయం నాటికి అసమ్మతి సెగలు పూర్తిగా చల్లారుతాయని ఆయా పార్టీల వర్గాలు భావిస్తున్నాయి. -
సర్వేలతో హైరానా!
మీ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. మళ్లీ గెలుస్తాడా..? కాంగ్రెస్ నేతలపై మీ అభిప్రాయం చెప్పండి.. అంటూ సర్వే బృందాలు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో తిరుగుతున్నాయి. సర్వేలు జరుగుతున్నట్లు ఆయా పార్టీల నేతలకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుండడంతో ప్రజల మనసులో తమపై అభిప్రాయం ఎలా ఉందోనని హైరానా పడుతున్నారు. సాక్షి, యాదాద్రి : ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు సర్వేలపై ఎక్కువ మక్కువ చూపుతున్నాయి. అభ్యర్థులు, ఆశావహులు సైతం సోషల్ మీడియాలో వస్తున్న సర్వేలను పోల్చుకుంటూనే ఎవరికి వారు తమతమ నియోజకవర్గాల్లో వ్యక్తిగత సర్వేలు చేయించుకుంటున్నారు. జిల్లాలో భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో టీఆ ర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎల్‌ఎఫ్‌తోపాటు మరి కొన్ని పార్టీలు బరిలో నిల్వబోతున్నాయి. ఈ నేపథ్యంలో తమ గెలుపు అవకాశాలు ఎలా ఉంటా యోనని తెలుసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సర్వేలు చేయిస్తున్నాయి. పార్టీ పనితీరు, పోటీల్లో ఉండే అభ్యర్థుల పనితీరుపై సర్వేలు నిర్వహిస్తున్నాయి. టీఆర్ఎస్ మరోసారి సర్వే.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాలోని సిట్టింగ్లం దరికీ టికెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. టికెట్లు కేటాయించిన అభ్యర్థులపై మరోసారి సర్వేకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక ఏజెన్సీతోపాటు ప్రభు త్వ నిఘా సంస్థల ద్వారా సర్వే చేపట్టారు. గ్రామాల్లో అధికార పార్టీ అభ్యర్థులపై ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలు ప్రధానంగా తీసుకుంటున్నారు. ప్రతిపక్షాలనుంచి పోటీలో ఉండే అభ్యర్థులు ఎవరు, వారి వల్ల జయాపజయాలపై ఉండే ప్రభావాన్ని సర్వేలో ప్రధానంగా చర్చిస్తున్నారు. పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు, పార్టీ, అభ్యర్థి వ్యతిరేకల ప్రభావం ఎలా ఉంటుంది తిరుగుబా టు అభ్యర్థులు ఎక్కడైనా ఉన్నారా, వారి ప్రభావం ఏ మేరకు ఉంటుందనే అంశాలపై సర్వే కొనసాగుతోంది. సీఎం తాజా పరిస్థితులపై చేపట్టిన ఈసర్వే అభ్యర్థుల్లో కొంత గుబులు రేకెత్తిస్తుంది. హస్తం నేతల్లోనూ ఆందోళన మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. డీసీసీ, టీపీసీసీ ద్వా రా ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అయితే వీరిపై షార్ట్ సర్వే నిర్వహిస్తున్నారు. ఏ అభ్యర్థిని రంగంలో దించితే గెలుపు సాధ్యమవుతుంది, ఆశావహుల్లో ప్రజల్లో ఉన్న పలుకుబడి, ఆదరణ వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. గతంలోనే కాంగ్రెస్ పార్టీ రెండు, మూడు సర్వేలు చేయించింది. తా జాగా మరో సర్వే చేస్తోంది. ఈసర్వేను అభ్యర్థుల ఎంపికకు కొంత ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది. దీంతో టికెట్ ఆశిస్తున్న నేతల్లో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. టీపీసీసీ నుంచి ఢిల్లీ దాకా ఆశావహులు టికెట్ల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆశావహుల వ్యక్తిగత సర్వేలు టీఆర్ఎస్, కాంగ్రెస్ అధినాయకత్వం చేయిస్తున్న సర్వేలతో పాటు ఆశావహులు, అభ్యర్థులు కూడా తమతమ నియోజకవర్గాల్లో వ్యక్తిగత సర్వేలు చేయించుకుంటున్నారు. సర్వేల ఫలితాలను పోల్చి చూసుకుంటున్న ఆశావహుల్లో టెన్షన్ కొనసాగుతోంది. ఏది ఏమైనా జిల్లాలో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న అభ్యర్థులతోపాటు ప్రధాన ప్రతిపక్షాల నుంచి పోటీ చేసే ఆశావహుల వరకు సర్వే అంటే ఆసక్తి చూపుతున్నారు. సర్వే కోసం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తూ తమ బలం, బలహీనతలతోపాటు ఎదుటి పార్టీల బలబలాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
మా దారి మాదే..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గతంలో బంగారు తెలంగాణ నిర్మాణం పేరుతో విపక్ష పార్టీలకు చెందిన నేతలందరూ భారీ గా టీఆర్ఎస్లో చేరారు. అయితే, నాలుగున్నర ఏళ్ల పాలనలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ పట్ల చూపిన వివక్ష, ప్రాధాన్యత తగ్గింపు తదితర కారణాలతో లోలోన రగిలిపోయా రు. తాజాగా మళ్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో వారే పోటీకి దిగుతుండడంతో అసంతృప్త నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పలువురు అభ్యర్థుల విషయంలో స్థానికంగా అసంతృప్తి వ్యక్తమవుతున్నా.. వారి మార్పుపై అధిష్టానం ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో తమ దారి తమదే అంటూ ద్వితీయశ్రేణి నేతలు, ముఖ్యనేతలుగా చెలామణి అయిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పేసి వెళ్లిపోతున్నారు. ఎన్నికల వేళ ఇలా జరుగుతుండడం టీఆర్ఎస్లోని పలువురు ముఖ్యనేతలకు మింగుడు పడడం లేదు. ఆపరేషన్ ఆకర్షన ఉమ్మడి పాలమూరు జిల్లాలో విపక్ష పార్టీలను బలహీనం చేసేందుకు టీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేసింది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు గాను టీఆర్ఎస్ ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ సునామీ సృష్టించినా.. పాలమూరులో ఆశించినంతగా ఫలితం దక్కలేదు. అనంతరం అధికారంలోకి వచ్చాక ఆపరేషన్ ఆకర్షనకు శ్రీకారం చుట్టింది. రాజకీయ పునరేకీరణ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, టీడీపీ నుంచి గెలుపొందిన ఎస్.రాజేందర్‌రెడ్డితో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం టీఆర్ఎస్లో చేరిపోయారు. అనంతరం ఎమ్మెల్యేలందరూ కూడా తమ నియోజకవర్గంలోని విపక్ష పార్టీలకు చెందిన నేతలకు విపరీతంగా గాలం వేశారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లందరినీ పార్టీలోకి చేర్చుకుని గులాబీ కండువాలు కప్పారు. పార్టీలకు గుడ్‌బై ఆపరేషన్ ఆకర్షన దాటికి పార్టీలో చేరిన నేతలకు అనధికాలంలోనే నిరుత్సాహానికి గురయ్యారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పనులు, ప్రాధాన్యత దక్కకపోవడంతో నియోజకవర్గాల్లో అసమ్మతి రాజేసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది. తాజాగా రాబోయే ఎన్నికల్లో కూడా సిట్టింగ్‌లనే అభ్యర్థులుగా ప్రకటించడం అసంతృప్తుల కడుపు మంటకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారే తమ దారి చూసుకొని పార్టీల కండువాలు మార్చేస్తున్నారు. నారాయణపేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి అతి స్వల్ప తేడాతో ఓటమి పాలైన కుంభం శివకుమార్.. పార్టీకి గుడ్‌బై చెప్పేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతో పాటు నియోజకవర్గంలోని ముఖ్యనేతలు చాలా వరకు శివకుమార్‌తో పాటు పార్టీ మారారు. అంతేకాదు గతంలో ఈ నియోజకవర్గంలో అసంతృప్త నేతలు ఏకంగా మాజీ ఎంపీటీసీ గౌని శ్రీనివాస్.. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిపై తిరుగుబాటు చేసి సెల్‌ఫోన్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఇలా అసంతృప్తనేతలందరూ ఎవరికి వారు తమ దారి చూసుకుంటున్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో కూడా అసమ్మతి వర్గం పార్టీని వీడుతోంది. తాజా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పట్ల కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందులో భాగంగా పలువురు స్వయంగా మంత్రి కేటీఆర్‌ను కలిసి బాలరాజుపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయినా మంత్రి కేటీఆర్ మాత్రం అభ్యర్థిని మార్చే ప్రసక్తే లేదని... అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దీంతో చేసేదేం వంగూరు ఎంపీటీసీ భాగ్యలక్ష్మీ శ్రీనివాస్, అనుచరులు టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. అలాగే లింగాల మండలానికి చెందిన శ్రీనివాసరావుకు కూడా ఇటీవల కాలంలో గువ్వలతో బెడిసికొట్టడంతో కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో కూడా అసెంబ్లీని రద్దు చేసిన మరుసటి రోజే ఒక జెడ్పీటీసీ, ఎంపీపీ పార్టీ మారడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలోని జెడ్పీటీసీ లక్ష్మీ, ఎంపీపీ క్రాంతి ఆంజనేయులు పార్టీలో తమకు ప్రాధాన్యం ఉండడం లేదని ఒక బహిరంగ లేఖ రాసి పార్టీ వీడి వెళ్లిపోయారు. అసంతృప్తి సెగలు ఎమ్మెల్యేలకే కాదు.. మంత్రులకు సైతం తగులుతున్నాయి. జిల్లాలో కీలక మంత్రిగా ఉంటూ గత 20 ఏళ్లుగా నిరంతరంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జూపల్లి కృష్ణారావుకు సైతం అసమ్మతి సెగలు తగులుతున్నాయి. కొద్ది కాలం క్రితం వీపనగండ్ల మండలానికి చెందిన ఎత్తం కృష్ణ, బాలస్వామి వంటి నేతలు టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. అలాగే కోడేరు మండలం కొండ్రావుపల్లికి చెందిన రాజేశ్ సైతం కాంగ్రెస్‌లో చేరారు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచే అభ్యర్థి విషయంలో స్పష్టత వస్తే సమీకరణాలలో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది. జిల్లాకు చెందిన మరో మంత్రి డా.సి.లక్ష్మారెడ్డికి సైతం చేదు అనుభవాలే ఎదురయ్యాయి. పర్వతాపూర్ మైసమ్మ ఆలయ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి పార్టీతో విభేదించి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అలాగే బాలానగర్ మండలానికి చెందిన హరిచందర్ పాటు నియోజకవర్గంలో చోటామోటా నాయకులు సైతం పార్టీని వీడి ఇతర పార్టీలో చేరారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండల జెడ్పీటీసీ సభ్యుడు ఎం.నారాయణమ్మ ఆమె కుమారుడు సురేందర్‌రెడ్డి టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపుకోసం తీవ్రంగా కృషి చేసినా... అనంతరం తమ పట్ల వివక్ష చూపారనే కారణంతో కొంత కాలం ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పేసి... తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ఆశలకు గండి వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు నుంచి దాదాపు క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్న టీఆర్ఎస్కు కొంత కాలంగా పార్టీలో చేసుకుంటున్న పరిణామాలు అసంతృప్తికి గురిచేస్తున్నాయి. పాలమూరులో మెజారిటీ స్థానాలను చేజిక్కించుకోవాలనే ఆలోచనతో ఉమ్మడి జిల్లా పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించారు. పెండింగ్ ప్రాజెక్టులను కొలిక్కి తీసుకురావడంతో కీలకమైన అంశాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఈ నేపథ్యంలో అత్యధిక స్థానాలు సాధించాలనే పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ ఆశలకు గండిపడుతున్నాయి. ఆధిపత్యపోరు, అసంతృప్తి తదితర కారణాల చేత ద్వితీయశ్రేణి నేతలు పార్టీలను వీడుతున్నారు. -
తెలంగాణ కోసం కాంగ్రెస్ చేసిందేమీ లేదు