చెట్టాపట్టాల్‌! | Telangana MPP Elections In Adilabad | Sakshi
Sakshi News home page

చెట్టాపట్టాల్‌!

Published Sat, Jun 8 2019 8:02 AM | Last Updated on Sat, Jun 8 2019 8:02 AM

Telangana MPP Elections In Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: సిద్ధాంతాల పరంగా ఆ రెండు పార్టీలు పూర్తిగా వ్యతిరేకం.. అయితేనేం పరిస్థితులకు అనుగుణంగా అవి ఏకమయ్యాయి. టీఆర్‌ఎస్‌కు వ్యతి రేకంగా కలిసి పనిచేస్తున్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌ల కొత్త రాజకీయంతో ఆదిలాబాద్‌ ప రిషత్‌ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ కొత్త సమీకరణ లు గులాబీ పార్టీని నిలువరించేలా చేశాయి. రెండు ఎంపీపీ స్థానాలను టీఆర్‌ఎస్‌కు దక్కకుండా చూశాయి. మరో ఎంపీ పీ స్వతం త్ర అభ్యర్థికి దక్కడంలో కీలక పాత్ర వహించాయి. ఈ మార్పు ఇప్పుడు ఆదిలాబాద్‌ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. నేడు జెడ్పీ చైర్మన్‌ ఎన్నిక జరగనుండగా ఈ కలయిక టీఆర్‌ఎస్‌లో గుబులు రేపుతోంది.

విప్‌ జారీ..
నేడు జిల్లా పరిషత్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక జరగనుండగా కాంగ్రెస్, బీజేపీల కలయిక టీఆర్‌ఎస్‌ను షాక్‌కు గురి చేస్తోంది. ఆదిలాబాద్‌ జెడ్పీలో 17 స్థానాలు ఉండగా, టీఆర్‌ఎస్‌ 9, బీజేపీ 5, కాంగ్రెస్‌ 3 గెలుచుకున్న విషయం తెలిసిందే.. మెజార్టీ 9 మంది సభ్యులను టీఆర్‌ఎస్‌ గెలిచినా జెడ్పీపీఠం దక్కించుకోవడంలో ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేశాయి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపురావులు జెడ్పీ పీఠం దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. బీజేపీ నుంచి ఇటీవల ఎంపీగా గెలిచిన సోయం బాపురావు, ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ జెడ్పీ పీఠం టీఆర్‌ఎస్‌కు దక్కకుండా కాంగ్రెస్‌ మద్దతుతోనైనా నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కాంగ్రెస్‌ నుంచి ఇటీవల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన రాథోడ్‌ రమేశ్, ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు భార్గవ్‌ దేశ్‌పాండేలు కలిసి టీఆర్‌ఎస్‌కు పీఠం దక్కకుండా బీజేపీతో జత కలిసి తాజా రాజకీయాలు తమకు అనువుగా మలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం జెడ్పీ చైర్మన్‌ ఎన్నికకు సంబంధించి ఆయా పార్టీల వారీగా ఇప్పటికే సభ్యులకు విప్‌ జారీ చేశారు.

పార్టీ ఆదేశాలకు అనుగుణంగా సభ్యులు నడుచుకోవాలని సూచించారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న టీఆర్‌ఎస్‌ సభ్యులకు, మాజీ ఎమ్మెల్యే యెండ్ల లక్ష్మీనారాయణ బీజేపీ సభ్యులకు, జిల్లా అధ్యక్షుడు భార్గవ్‌దేశ్‌ పాండే కాంగ్రెస్‌ సభ్యులకు విప్‌ను జారీ చేసే అధికారాన్ని పార్టీలు కట్టబెట్టాయి. దీనికి సంబంధించి ఈ ముగ్గురు జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌కు పార్టీ పత్రాలను శుక్రవారం అందజేశారు. దీంతో సభ్యులకు ఆయా పార్టీల వారీగా విప్‌ జారీ చేశారు. నేడు జరిగే ప్రాదేశిక ఎన్నికల్లో సభ్యులు పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన పక్షంలో వారి సభ్యత్వం రద్దు చేసేందుకు ఈ విప్‌ అధికారం పార్టీ అధిష్టానం కల్పించింది. దీంతో ఈ ఎన్నికలు తాజా రాజకీయాలను వేడెక్కించాయి.

టీఆర్‌ఎస్‌ 10కే పరిమితం..

  • మండల పరిషత్‌ అధ్యక్ష స్థానాలను అధికంగా కైవసం చేసుకోవాలన్న టీఆర్‌ఎస్‌ ఆశలకు గండి పడింది. ఆదిలాబాద్, బేల, భీంపూర్, బోథ్, గాదిగూడ, జైనథ్, నార్నూర్, నేరడిగొండ, తాంసి, ఉట్నూర్‌లలో ఆ పార్టీ మెజార్టీ సాధించడంతో ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకోవడం సులువైంది. అయితే శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఆయా మండలాల్లో ఇతర పార్టీల్లోని సభ్యులను జత చేసుకోవడం ద్వారా 10 కంటే ఎక్కువ ఎంపీపీ స్థానాలు సాధించగలుగుతుందని అంచనా వేసినా అవన్నీ కల్లలైపోయాయి.
  • తలమడుగులో కాంగ్రెస్‌కు మెజార్టీ ఉండడంతో ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకుంది.
  • బజార్‌హత్నూర్, ఇంద్రవెల్లిల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బజార్‌హత్నూర్‌లో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 8 ఉండగా బీజేపీ 4, టీఆర్‌ఎస్‌ 3, కాంగ్రెస్‌ 1 గెలుపొందాయి. బీజేపీకి ఒక సభ్యుడి మద్దతు అవసరం ఉండగా కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వడంతో అక్కడ బీజేపీకి ఎంపీపీ పీఠం దక్కింది. ఉపాధ్యక్ష పదవిని కాంగ్రెస్‌ ఇవ్వడం ద్వారా ఈ రెండు పార్టీల కలయిక సాధ్యమైంది.
  • ఇక ఇంద్రవెల్లిలో 11 ఎంపీటీసీ స్థానాలుండగా టీఆర్‌ఎస్‌ 4, బీజేపీ 4, స్వతంత్రులు ఇద్దరు, కాంగ్రెస్‌ ఒకరు గెలుపొందారు.  ఇక్కడ టీఆర్‌ఎస్, బీజేపీకి మరో ఇద్దరు సభ్యులు మద్దతు ఇచ్చిన పక్షంలో ఆయా పార్టీల్లో ఎవరికైనా పీఠం దక్కేది. అయితే ఒక స్వతంత్ర, ఒక కాంగ్రెస్‌ అభ్యర్థి బీజేపీకి మద్దతు ఇవ్వడంతో ఇంద్రవెల్లి ఎంపీపీ కూడా బీజేపీకే దక్కింది. ఇక్కడ కూడా మద్దతిచ్చిన కాంగ్రెస్‌ ఎంపీటీసీకి ఉపాధ్యక్ష పదవికి దక్కింది. ఈ విధంగా పొత్తుధర్మం కొనసాగిస్తూ జెడ్పీ చైర్మన్‌ ఎన్నికకు ముందుకు కదులుతున్నారు.
  • ఇక ఇచ్చోడలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ 13 ఎంపీటీసీ స్థానాలకు ఐదు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొంది పీఠం కైవసం చేసుకుంటుందని అందరు అనుకున్నారు. ప్రధానంగా ఆ పార్టీకి కేవలం మరో ఇద్దరి మద్దతు అవసరం ఉండగా, అనూహ్యంగా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా ప్రీతం రెడ్డికి బీజేపీ, కాంగ్రెస్‌ సపోర్ట్‌ చేయడం గమనార్హం.
     
  • టీఆర్‌ఎస్‌లో 5 గురు ఎంపీటీసీలు గెలవగా ఇద్దరు విప్‌ను దిక్కరించి స్వతంత్ర అభ్యర్థికి మద్దతు పలకడం గమనార్హం. తద్వారా ఇచ్చోడ వంటి మేజర్‌ మండలంలో టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్, బీజేపీలు తమ రాజకీయ ఎత్తుగడలతో నిలువరించడం గమనార్హం. అలాగే గుడిహత్నూర్, మావలలో ఎంపీపీ ఎన్నికలు కోరం లేక వాయిదా పడ్డాయి. గుడిహత్నూర్‌లో సభ్యులు సమాయానికి రాకపోవడంతో ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మండలంలో మొత్తం 9 స్థానాలు ఉండగా టీఆర్‌ఎస్‌ 4, కాంగ్రెస్‌ 3, బీజేపీ 2 గెలుచుకున్న విషయం విధితమే. అలాగే మావలలో 3 స్థానాలు ఉండగా..ఒక సభ్యుడు గౌర్హాజరు కావడంతో ఎన్నిక వాయిదా పడింది. ఇక్కడ టీఆర్‌ఎస్‌ 1, కాంగ్రెస్‌ 1, ఇండిపెండెంట్‌ 1 స్థానం గెలుచుకున్నాయి. 

జంప్‌ దేనికి సంకేతం..
టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలుపొందిన ఇద్దరు ఎంపీటీసీలు పార్టీ విప్‌ను దిక్కరించి ఒక స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ఇచ్చోడలో ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ నియమాలను దిక్కరిస్తే సహించలేని టీఆర్‌ఎస్‌కు ఈ జంప్‌ ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా శనివారం జెడ్పీలో పార్టీ పరంగా విప్‌ జారీ చేసినా ఎన్నిక పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది. ఆదిలాబాద్‌ జెడ్పీ చైర్మన్‌ ఎస్టీ (జనరల్‌) రిజర్వు ఉండగా, ఈ పార్టీ నుంచి 9 మంది సభ్యుల్లో ముగ్గురు ఎస్టీ జెడ్పీటీసీలు ఉన్నారు. నేరడిగొండ, నార్నూర్, భీంపూర్‌ జెడ్పీటీసీలు అనిల్‌ జాదవ్, రాథోడ్‌ జనార్దన్, కుమ్ర సుధాకర్‌లు గెలుపొందారు. వీరిలో నుంచి ఎవరికి జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థిగా బరిలోకి దింపుతారనేది ఇప్పు డు ప్రాధాన్యత సంతరించుకుంది.

అనిల్‌ జాదవ్, రాథోడ్‌ జనార్దన్‌లు లంబాడా సామాజికవర్గం కాగా, కుమ్ర సుధాకర్‌ ఆదివాసీ సామాజిక వర్గానికి చెందినవారు. జిల్లాలో ఇటీవల సోయం బాపురావు ఎంపీగా గెలుపొందడంతో బీజేపీ ప్రభంజనం పెరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఎత్తుగడలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. జెడ్పీలో నేడు జరగబోయే ఎన్నికలో ఏకగీవ్రంగా జరుగుతుందా, లేని పక్షంలో బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి అభ్యర్థిని రంగంలోకి దించుతాయా? అనేది ఆసక్తికరమే.. అయితే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరుంటారనే దానిపై అంచనాలతో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రాదేశిక ఎన్నికల చివరి ఘట్టం చైర్మన్‌ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement