MPP elections
-
నేడు ‘స్థానిక’ ఉప ఎన్నికలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలుచోట్ల గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో పరోక్ష పద్ధతిన ఎన్నిక జరిగే పలు పదవులకు గురువారం ఉప ఎన్నికలు జరగనున్నాయి. గతంలోనే ఎన్నికలు జరిగి రాజీనామా చేయడం, మరణించడం వంటి కారణాలతో ఖాళీ అయిన పదవులకు ఈ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మచిలీపట్నం నగరపాలక సంస్థలో రెండు డిప్యూటీ మేయర్ పదవులు, పెడన మున్సిపాలిటీలో చైర్పర్సన్, మాచర్ల మున్సిపాలిటీలో ఒకటి, ధర్మవరం మున్సిపాలిటీలో రెండు వైస్ చైర్మన్ పదవులకు, 13 మండలాల్లో నాలుగు ఎంపీపీ, ఏడు ఉపాధ్యక్ష, మూడు కో–ఆప్షన్ పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. 12 పంచాయతీల్లో 12 ఉప సర్పంచి పదవులకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ కోసం ఉదయం 11 గంటలకు ఆయా స్థానికసంస్థల ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికలు జరగనున్న స్థానిక సంస్థలు, పదవుల వివరాలు పట్టణ ప్రాంతాల్లో.. ► మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (కృష్ణా జిల్లా)– రెండు డిప్యూటీ మేయర్ పదవులు ► పెడన మున్సిపాలిటీ (కృష్ణా)– చైర్పర్సన్ ► మాచర్ల మున్సిపాలిటీ (పల్నాడు)– వైస్ చైర్మన్ ► ధర్మవరం (శ్రీసత్యసాయి)– రెండు వైస్ చైర్మన్ పదవులు . గ్రామీణ ప్రాంతాల్లో.. ► ఎంపీపీ ఎన్నికలు జరిగే మండలాలు (4): రామకుప్పం (చిత్తూరు జిల్లా), తొండంగి (కాకినాడ), వత్సవాయి (ఎన్టీఆర్), చేజర్ల (నెల్లూరు) ► ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే మండలాలు (7): రామకుప్పం, విజయాపురం(చిత్తూరు), రాపూరు (నెల్లూరు), గాలివీడు (అన్నమయ్య), పార్వతీపురం (పార్వతీపురం మన్యం), పెదకడబూరు (కర్నూలు), రాయదుర్గం (అనంతపురం) ► కో–ఆప్షన్ మెంబర్ ఎన్నిక జరిగే మండలాలు (3): చిత్తూరు (చిత్తూరు), బి.మఠం (వైఎస్సార్), రాజంపేట (అన్నమయ్య) ► ఉపసర్పంచి ఎన్నికలు జరిగే పంచాయతీలు (12): అనకాపల్లి, బాపట్ల, అన్నమయ్య జిల్లాల్లో రెండేసి పంచాయతీలు, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో ఒక్కొక్క పంచాయతీ -
ఐదు ఎంపీపీ స్థానాలు వైఎస్సార్సీపీకే..
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 5 చోట్ల ఎంపీపీ స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించగా.. ఐదు చోట్లా వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 15 మండలాల పరిధిలో 6 ఎంపీపీ, 11 ఉపాధ్యక్ష, మూడు కో–ఆప్షన్ సభ్యుల ఎంపికకు ఎన్నిక నిర్వహించారు. అయితే చిత్తూరు జిల్లా రామకుప్పం ఎంపీపీ ఎన్నికకు సభ్యులు ఎవ్వరూ హాజరు కాలేదు. దీంతో ఇక్కడ మరోసారి ఎన్నిక వాయిదా పడింది. 11 ఉపాధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉండగా 8 చోట్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. వీటిలో ఐదు స్థానాలను వైఎస్సార్సీపీ, రెండు టీడీపీ, ఒకటి జనసేన కైవసం చేసుకున్నాయి. గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎన్నికలో జనసేన, టీడీపీ ఉమ్మడిగా పాల్గొన్నాయి. పరస్పర మద్దతుతో చెరో ఉపాధ్యక్ష స్థానాన్ని చేజిక్కించుకున్నారు. అయితే ఈ ఇద్దరు అభ్యర్థులు సకాలంలో బీ–ఫామ్ సమర్పించలేదు. పల్నాడు జిల్లా నరసరావుపేట, అన్నమయ్య జిల్లా కలికిరి, చిత్తూరు జిల్లా రామకుప్పంలలో ఉపాధ్యక్ష ఎన్నికలు వాయిదా పడ్డాయి. కో–ఆప్షన్ ఎన్నికలు మూడు చోట్ల నిర్వహించారు. 41 పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా 13 చోట్ల వాయిదా పడ్డాయి. -
నారా లోకేశ్ దారుణాలు సృష్టిస్తున్నారు: ఆళ్ల రామకృష్ణారెడ్డి
సాక్షి, గుంటూరు: దుగ్గిరాల ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఒక్కరే ఉండటంతో ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి దానబోయిన సంతోష రూపవాణి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 9 స్థానాల్లో టీడీపీ, 8 స్థానాల్లో వైఎస్సార్సీపీ, ఒక స్థానంలో జనసేన విజయం సాధించింది. కాగా, బీసీ మహిళకు ఎంపీపీ స్థానం రిజర్వ్ చేసి ఉంది. అయితే, టీడీపీ నుంచి బీసీ మహిళ సభ్యురాలు లేకపోవడంతో వైఎస్సార్సీపీ మహిళా సభ్యులను ప్రలోపెట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా.. వైఎస్సార్సీపీ నుంచి ఇద్దరు మహిళలు ఎంపీటీసీలుగా గెలుపొందారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజాస్వామ్యంగా జరగాల్సిన ఎన్నికల్లో ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారు. మేము ఎక్కడా తప్పు చేయలేదు. గెలిచిన 8 మందితోనే మేము ముందుకు వెళ్తాం. టీడీపీలో మహిళా అభ్యర్థి లేకపోవడంతో పచ్చనేతలు వైఎస్సార్సీపీ నేతలను మభ్యపెడుతున్నారని తమ వైపు లాక్కోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే దుగ్గిరాలలో నారా లోకేశ్ దారుణాలు సృష్టిస్తున్నారు’’ అని విమర్శించారు. ఇది కూడా చదవండి: ఈనెల 7,8 తేదీల్లో ఏఎన్‌యూలో వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా -
దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికను ఆపండి
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న షేక్ జబీన్ కులధ్రువీకరణపై వారంలోపు నిర్ణయం ప్రకటించాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. అప్పటివరకు ఎంపీపీ ఎన్నిక నిర్వహించవద్దని ఎన్నికల కమిషన్‌తో పాటు ఇతర అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. తన కులధ్రువీకరణపై కలెక్టర్ వద్ద అప్పీల్ పెండింగ్‌లో ఉండగానే ఎంపీపీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారని, తనకు బీసీ–ఈ కులధ్రువీకరణ పత్రం ఇచ్చేంతవరకు దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికను నిలిపివేయాలని కోరుతూ టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు షేక్ జబీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ దేవానంద్ విచారణ జరిపారు. -
ఎంపీపీ పీఠంపై వలంటీర్.. వైస్ ఎంపీపీగా విద్యార్థిని
పశ్చిమగోదావరి: వలంటీర్లు కొందరు సర్పంచ్‌లయ్యారు.. మరికొందరు ఎంపీటీసీ సభ్యులయ్యారు. కానీ వలంటీర్‌గా సేవలందిస్తున్న ఓ గిరిజన మహిళ అతి చిన్న వయసులోనే ఎంపీపీగా ఎన్నికైంది. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం తెల్లంవారిగూడేనికి చెందిన 24 ఏళ్ల కారం శాంతి ఇంటర్ వరకూ చదువుకున్నారు. గృహిణిగా ఉన్న శాంతి ఆ తర్వాత వలంటీర్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో స్థానికులు ఆమెను దొరమామిడి–2 ఎంపీటీసీ అభ్యరి్థగా నిలబటెట్టి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుట్టాయగూడెం మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాల్లో 2 ఏకగ్రీవం కాగా, రెండింటిలో ఇది ఒకటి. మిగిలిన 13 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 11 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు కారం శాంతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. – బుట్టాయగూడెం అతి చిన్న వయసులో ఓ యువతి మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో శుక్రవారం నిర్వహించిన మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో.. ఇంకా విద్యార్థినిగా ఉండగానే ఆమె ఎన్నికవడం విశేషం. మండలంలోని బొమ్మిడి గ్రామం నుంచి ఎంపీటీసీగా ఎన్నికైన మేడవరపు విద్యాలక్ష్మి వయసు 22 ఏళ్లు. విజయవాడ సిద్ధార్థ ఫార్మసీ సైన్సెస్ కళాశాలలో ఫార్మా–డి కోర్సు ఐదో సంవత్సరం చదువుతోంది. ఆమె తల్లి మేడవరపు సుష్మ బొమ్మిడి మాజీ సర్పంచ్. తండ్రి కిరణ్ వైఎస్సార్సీపీ నేత. – ఉంగుటూరు చదవండి: ఆ సామాజికవర్గంలో ఆమె మొట్టమొదటి ఎంపీపీ -
ఆ సామాజికవర్గంలో ఆమె మొట్టమొదటి ఎంపీపీ
పాలకొండ రూరల్: రాష్ట్రంలోనే తొలిసారి రెల్లి సామాజికవర్గానికి చెందిన మహిళ ఎంపీపీగా ఎన్నికయ్యారు. సీఎం జగన్ సంకల్పం వల్లే ఇది సాధ్యమైందని ఆ సామాజికవర్గానికి చెందినవారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలానికి చెందిన బొమ్మాళి భాను భాసూరు సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొందారు. మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలుండగా.. 10 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో బొమ్మాళి భానును మండల పీఠం వరించింది. -
వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యం..
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్సార్సీపీ.. శుక్రవారం మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) అధ్యక్ష పదవులకు నిర్వహించిన ఎన్నికల్లోనూ పూర్తి ఆధిక్యత సాధించింది. రాష్ట్రంలోని 660 మండలాల్లోని 11 మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించలేదు. మిగతా 649 మండలాలకు శుక్రవారం ఎంపీపీ అధ్యక్ష పదవులకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో కోరం లేకపోవడం, నామినేషన్లు వేయకపోవడం వల్ల 15 మండలాల్లో ఎన్నికను వాయిదా వేశారు. ఎంపీపీ ఎన్నిక నిర్వహించిన 634 మండలాల్లో 621 ఎంపీపీ అధ్యక్ష పదవులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ ఐదు చోట్ల సొంతంగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు చోట్ల జనసేన మద్దతుతో మొత్తంగా ఏడు ఎంపీపీలకే పరిమితమైంది. జనసేన, సీపీఎం ఒక్కో ఎంపీపీ పదవిని దక్కించుకోగా.. నాలుగు చోట్ల స్వతంత్రులు ఆ పదవులను చేజిక్కించుకున్నారు. కాగా, 639 మండలాల్లో కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, 619 మండలాల్లో ఉపాధ్యక్ష ఎన్నికలు జరిగాయి. వాయిదా పడిన మండలాల్లో తిరిగి నేడు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎంపీపీ రెండో ఉపాధ్యక్ష పదవి! మండలాల్లోనూ రెండో ఉపాధ్యక్ష పదవిని కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి శుక్రవారం ప్రభుత్వానికి పంపినట్టు తెలిసింది. -
ఎంపీపీ ఎన్నికలు: కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు ముగిసిన నామినేషన్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మండల పరిషత్ అధ్యక్షుల (ఎంపీపీ) ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు ముగిశాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. అనంతరం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటకు కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. చేతులు ఎత్తే పద్దతిలో ఎంపీపీ, వైస్ ఎంపీపీలను ఎన్నుకుంటారు. ఇటీవల ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు విడుదల కాగా వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాలు గెలుపొంది రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎంపీపీ స్థానాలు కూడా భారీగా వైఎస్సార్సీపీ తన ఖాతాలో వేసుకోనుంది. చదవండి: ఏపీ: నేడు మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు -
ఏపీ వ్యాప్తంగా నేడు ఎంపీపీ ఎన్నిక
-
ఎంపీపీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన ఎన్నికల సంఘం
-
ఏపీ: నేడు మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మండల పరిషత్ అధ్యక్షుల (ఎంపీపీ) ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఎంపీపీతో పాటు ప్రతి మండలానికి ఒకరు చొప్పున కో ఆప్టెడ్ సభ్యునితో పాటు మండల ఉపాధ్యక్ష పదవులకు కూడా ఎన్నికలు జరుగుతాయి. మండల పరిధిలో ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారు చేతులు ఎత్తే విధానంలో ఈ ఎన్నికలను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి అన్ని చోట్ల ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. నిర్ణీత కోరం ప్రకారం.. మండల పరిధిలో కొత్తగా ఎన్నికైన మొత్తం ఎంపీటీసీ సభ్యుల్లో కనీసం సగం మంది హాజరైతేనే ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవితో పాటు కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాల్లోని 9,583 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన వారితో సహా కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ఆ సమావేశంలోనే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత కో ఆప్టెడ్ సభ్యుని ఎన్నిక నిర్వహిస్తారు. సాయంత్రం 3 గంటలకు మరొకసారి సమావేశం నిర్వహించి, తొలుత ఎంపీపీ పదవికి ఆ తర్వాత ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరుపుతారు. కాగా, ఉదయం 10 గంటల నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏదైనా సమస్య వస్తే ఇలా.. ► ఏదైనా కారణం వల్ల కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగని పక్షంలో ఆయా మండలాల్లో తదుపరి జరగాల్సిన ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికలను వాయిదా వేస్తారు. ఒకవేళ కో ఆప్టెడ్ ఎన్నిక పూర్తయి, ఎంపీపీ ఎన్నికకు ఆటంకం ఏర్పడితే, సంబంధిత మండలంలో ఆ తర్వాత జరగాల్సిన ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక వాయిదా పడుతుందని రాష్ట్ర కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ► శుక్రవారం జరగాల్సిన ఎన్నిక వాయిదా పడిన మండలాల్లో శనివారం ఎన్నిక నిర్వహించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రెండో రోజు కూడా వివిధ కారణాలతో కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక వాయిదా పడినప్పటికీ, సరిపడా కోరం ఉంటే ఎంపీపీ.. ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక నిర్వహించవచ్చని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఏపీ: ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీన ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికలు నిర్వహించనుండగా అదే రోజు కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నిక చేపట్టనున్నారు. మరుసటి రోజు 25వ తేదీన జెడ్పీ చైర్మన్, రెండు జెడ్పీ వైస్ చైర్మన్లకి ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు జెడ్పీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగనుంది. మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు ఇలా.. 20వ తేదీలోపు ఎంపీటీసీ సభ్యులందరికీ ప్రత్యేక సమావేశంపై నోటీసులు. 24న ఉదయం 10 లోపు మండల పరిషత్‌లో కో ఆప్షన్ సభ్యుడి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ, ఎన్నిక. మధ్యాహ్నం 1 గంట: కో ఆప్షన్ సభ్యుడి ప్రమాణ స్వీకారం 3 గంటలకు: ప్రత్యేక సమావేశంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎంపిక జెడ్పీ చైర్మన్ ఎన్నిక జెడ్పీటీసీలకు 21వ తేదీలోపు ప్రత్యేక సమావేశంపై నోటీసులు 25వ తేదీన ఉదయం పది గంటలలోపు ఇద్దరు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ఉదయం పది నుంచి ఒంటి గంట లోపు స్క్రూటినీ, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, ఎన్నిక మధ్యాహ్నం ఒంటి గంట: కోఆప్షన్ సభ్యుల ప్రమాణస్వీకారం 3 గంటలకు: జెడ్పీ చైర్ పర్సన్, రెండు వైఎస్ చైర్మన్లకు ఎన్నిక ఎంపీపీ ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్ నామినేట్ చేసిన గెజిటెడ్ అధికారి వ్యవహరించనున్నారు. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్న కలెక్టర్లు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు అనివార్య కారణాల నిర్వహించలేకపోతే మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించాలి. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికల సమావేశానికి ఎమ్మెల్యేలు ప్రత్యేక ఆహ్వానితులుగా అనుమతి. ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉండదు. -
ఉత్కంఠకు తెర
సాక్షి, యాదాద్రి : జిల్లా వ్యాప్తంగా ఉన్న 17 మండలాల్లో మండల పరిషత్ అ«ధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. టీఆర్ఎస్ 10 ఎంపీపీలను కైవసం చేసుకోగా ఏడు మండలాలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే క్యాంప్ రాజకీయాలకు తెరలేపిన టీఆర్ఎస్, కాంగ్రెస్.. సభ్యులతో బేరసారాలకు దిగాయి. పదవుల పందేరాలపై హామీలు, సామాజిక సమీకరణాల ప్రాతిపదికన ఇరు పార్టీలు ఎంపీపీ, వైఎస్ ఎంపీపీలను ఎంపిక చేశాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల్లో ఎంపీపీ అభ్యర్థుల ఎంపిక సందర్భంగా కొన్ని చోట్ల నాయకుల మధ్యన విబేధాలు తలెత్తాయి. అయితే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సమన్వయంతో అభ్యర్థులను ఎంపిక చేయగా కాంగ్రెస్ తమ అభ్యర్థుల మధ్య ఏకాభిప్రాయం కుదుర్చడానికి చాలానే శ్రమించాల్సి వచ్చింది. అయితే ఆద్యంతం ఆసక్తి రేకెత్తించిన తుర్కపల్లి, రాజాపేట స్థానా లను టీఆర్ఎస్, మోత్కూర్ ఎంపీపీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆసక్తి రేకెత్తించిన మోత్కూర్ ఎంపీపీ స్థానాన్ని కాంగ్రెస్ లాటరీ ద్వారా కైవసం చేసుకుంది. సంస్థాన్ నారాయణపురం, తుర్కపల్లి వైస్ ఎంపీపీల ఎన్నిక వాయిదాపడింది. క్యాంప్‌ల నుంచి నేరుగా సమావేశాలకు.. ఈనెల 4న ఎన్నికల ఫలితాలు వెలువడగానే కాంగ్రెస్, టీఆర్ఎస్లు తమ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను క్యాంప్‌లకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ ఎన్నిక కోసం క్యాంప్‌ల నుంచి నేరుగా మండల పరిషత్ కార్యాలయాలకు చేరుకున్నారు. క్యాంప్‌ల్లోనే అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ కొన్నిచోట్ల ఎంపిక సమయానికి ముందు వరకు వివాదాలు జరిగాయి. ఎంపీటీసీలను సమన్వయం చేయడానికి నాయకులు చాలా శ్రమించారు. కులాల వారీగా సమీకరణాలు చేస్తూ భవిష్యత్‌లో పార్టీకి నష్టం కలగకుండా ఉండేందుకు పార్టీ తరఫున రకరకాల బుజ్జగింపులు పెద్ద ఎత్తునే జరిగాయి. టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలు పైళ్ల శేఖరెడ్డి, గొంగిడిసునీతామహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున కోమటిరెడ్డి సోదరులు, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి బాధ్యతలను భుజాన వేసుకున్నారు. కోరం లేక వాయిదాపడ్డ తుర్కపల్లి వైస్ ఎంపీపీ ఎన్నిక తుర్కపల్లి వైస్ ఎంపీపీ ఎన్నిక కోరం లేక వాయిదాపడింది. 10 ఎంపీటీసీ స్థానాలు ఉన్న ఆ మండలంలో 5 కాంగ్రెస్, 4 టీఆర్ఎస్, ఒకరు ఇండిపెండెంట్ గెలిచారు. మెజార్టీ ఉన్న కాంగ్రెస్‌కే ఎంపీపీ దక్కుతుందని భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. కాంగ్రెస్ నుంచి గెలిచిన మాదాపూర్ ఎంపీటీసీ టీఆర్ఎస్ శిబిరంలో చేరడంతో వారి సంఖ్య బలం 6కు చేరింది. సమావేశానికి 9మంది టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇండిపెండెంట్ ఎంపీటీసీలు హాజరయ్యారు. ఎంపీపీ ఎన్నిక జరిగిన వెంటనే టీఆర్ఎస్ సభ్యులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. దీంతో సమావేశంలో నలుగురు ఎంపీటీసీలే మిగలడంతో వైస్ ఎంపీపీకి కోరం లేక ఎన్నిక శనివారానికి వాయిదా పడింది. నారాయణపురంలో మరో తీరు.. వైస్ ఎంపీపీ ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ ఎంపీటీసీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదాపడింది. 13మంది ఎంపీటీసీలు ఉన్న ఈమండలంలో ఎన్నికల ముందు టీఆర్ఎస్, సీపీఎంలు పొత్తు పెట్టుకున్నాయి. సీపీఎంకు వైస్ ఎంపీపీ ఇస్తానన్న ఒ ప్పందం ఉంది. అయితే త మకు 9మంది ఎంపీటీసీలు గెలిచి పూర్తి మెజార్టీ ఉన్నందున సీపీఎంకు వైఎస్ ఎంపీపీ ఎందుకు ఇవ్వాలని కొందరు టీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో వివాదం తలెత్తి వైస్ ఎంపీపీ శనివారానికి వాయిదాపడింది. లాటరీ పద్ధతిలో కాంగ్రెస్‌ను వరించిన ఎంపీపీ.. నలుగురు సభ్యులు ఉన్న మోత్కూర్ మండల పరిషత్ అధ్యక్ష పదవి లాటరీ పద్ధతిలో కాంగ్రెస్‌ను వరించింది. రెండు స్థానాల్లో టీఆర్ఎస్, రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందిన విషయం తెలిసిందే. అందరూ ఆసక్తిగా గమనిస్తున్న ఈ ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ పదవులు లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన దీటి సంధ్యారాణి, వైఎస్ ఎంపీపీ టీఆర్ఎస్కు చెందిన భూష్పాక లక్ష్మి గెలుపొందారు. ప్రజాప్రతినిధుల హాజరు ఎంపీపీ ఎన్నికల సందర్భంగా ప్రజాప్రతినిధులు సమావేశాలకు హాజరయ్యారు. మోత్కూర్ ఎంపీపీ ఎన్నికల సమావేశానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, యాదగిరిగుట్ట ఎంపీపీ సమావేశానికి ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి హాజరయ్యారు. బీబీనగర్, పోచంపల్లి ఎంపీపీ సమావేశాలకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, తుర్కపల్లి, రాజాపేట ఎంపీపీ సమావేశాలకు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిలు హాజరయ్యారు. -
‘పేట’లోనూ కారు జోరు
నారాయణపేట: జిల్లాలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఎన్నికల ప్రొసిడింగ్ అధికారుల పర్యవేక్షణలో మొదటగా కో ఆప్షన్ సభ్యుడి నామినేషన్ దాఖలు అనంతరం ఎన్నికైన వారి ఫలితాలను మధ్యాహ్నం ఒంటి గంటకు వెల్లడించారు. ఎంపీపీ ఎన్నికకు సంబంధించి నోటీస్ జారీ చేశారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలను నిర్వహించారు. జిల్లాలోని 11 మండలాల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన 8 మంది ఎంపీపీలు కాగా ఇద్దరు బీజేపీ ఎంపీపీలు, ఒకరు కాంగ్రెస్ ఎంపీపీలు అయ్యారు. అలాగే వైస్ ఎంపీపీలు టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 2, బీజేపీ నుంచి ఒకరు అయ్యారు. ఎమ్మెల్యేల ప్రత్యేక దృష్టి జిల్లాలోని మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎమ్మెల్యేలు చిట్టెం రాంమోహన్‌రెడ్డి, ఎస్.రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డిలు వారివారి నియోజకవర్గాలోని మండలాలకు వెళ్లి ఎంపీపీల ఎన్నికలపై దృష్టి సారించారు. ఎన్నిక సమయంలో వారి వారి పార్టీల అభ్యర్థుల కదలికలు, మద్దతులపై నిఘా ఉంచారు. పార్టీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తమ పార్టీల అభ్యర్థులు ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకునే విధంగా పకడ్బందీగా వ్యూహ రచనలు చేస్తూ సఫలీకృతులయ్యారు. మద్దూర్‌లో అధికార పార్టీకి చుక్కెదురు మద్దూర్ మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు గాను 10 ఎంపీటీసీలు అధికారపార్టీకి చెందిన వారు విజయం సాధించారు. మరో 9 మంది ఎంపీటీసీలు కాంగ్రెస్ ఎంపీటీసీలు గెలుపొందారు. సంపూర్ణ మెజార్టీ సాధించిన అధికార పార్టీ ఎంపీపీ కావాల్సి ఉండగా ఎంపీపీ ఎన్నిక సమయంలో హన్మనాయక్ తాండా ఎంపీటీసీ చిన్నమ్మ టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి ఈశ్వరమ్మకు చేయ్యి ఎత్తకుండా నిమ్మకుండిపోయారు. అలాగే టీఆర్ఎస్ బలపరిచిన వైస్ ఎంపీపీ ఏకే. రాజుకు సైతం చేయి ఎత్తకుండా అలాగే కూర్చుంది. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక సమయంలో చిన్నమ్మ చేయ్యెత్తకపోవడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీపీలుగా బలపరిచిన వారిలో సరిసమానమయ్యారు. దీంతో లక్కి డిప్ ద్వారా ఎన్నికను నిర్వహించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయలక్ష్మికి ఎంపీపీగా డీప్‌లో లక్కిగా బయటపడింది. అదృష్టమంటే ఇదేనేమో మరి. మొదటగా టీఆర్ఎస్ నుంచి మండల కో–ఆప్షన్ సభ్యుడిగా జిలానీని నాయకులు ప్రతిపాదించారు. అయితే అనుకున్న సమయానికి నామినేషన్ దాఖలు చేయకపోవడం, కాంగ్రెస్ ప్రతిపాదించిన ఇబ్రహీం దాఖలు చేయడంతో మండల కో–ఆప్షన్ ఎన్నిక ఏకగ్రీవమైయింది. వైస్ ఎంపీపీగా వెంకట్‌రెడ్డిని లక్కి డిప్ వరించినట్లయింది. అప్పటికే మద్దూర్ మండలంలో జెడ్పీటీసీ పదవిని అధికార పార్టీ కోల్పోయి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎంపీపీ అయినా టీఆర్ఎస్ వశమవుతుందనుకుంటే తీరా కాంగ్రెస్ పార్టీకి దక్కడంతో రాజకీయ యోగం అంటే ఇదేనేమో అంటూ చర్చానీయాంశంగా మారింది. ధన్వడలో స్వతంత్రులకే వరం ధన్వాడ మండలం ఎంపీపీ రిజర్వేషన్ ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. కాగా మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాలకు 4 బీజేపీ, 4 టీఆర్ఎస్, 3 స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థులను కలుపుకుపోయి టీఆర్ఎస్ ఎంపీపీని పదవిని దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. రాంకిష్టయ్యపల్లి ఎంపీటీసీ గంగాబాయి అధికారపార్టీ గాలం వేసితమ వైపు మళ్లించుకుంది. అయితే బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ రంగంలోకి దిగి తన పుట్టినగడ్డలో ఎలాగైనా బీజేపీ ఎంపీపీ పీఠమెక్కించాలని వ్యూహరచన చేస్తూ సఫలీకృతమైంది. నాలుగు స్థానాల్లో గెలిచిన ఎంపీటీసీలను బుజ్జగిస్తూ స్వతంత్రులుగా గెలిచిన కొండాపూర్ ఎంపీటీసీ రాజేందర్‌రెడ్డి, హన్మన్పల్లి ఎంపీటీసీ పద్మిబాయిని పార్టీలో చేర్చుకొని ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులను కట్టబేట్టేలా పావులు కదిపింది. ఎంపీపీగా పద్మిబాయి, వైస్ ఎంపీపీగా రాజేందర్‌రెడ్డిలు కావడంతో బీజేపీ పాగావేసింది. అనుకున్నదొకటి... అయ్యిందొకటి! మాగనూర్ మండలం ఎంపీపీ ఎస్సీ మహిళకు రిజర్వుఅయింది. మండలంలోని 7 ఎంపీటీసీ స్థానాల్లో బీజేపీ 2, టీఆర్ఎస్ 4, స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. అయితే గెలుపొందిన ఎంపీటీసీలో ఎస్సీ మహిళ లేకపోవడంతో అధికార పార్టీకి మొదట్లోనే చుక్కెదురైంది. ఎలాగైనా గెలిచిన బీజేపీ ఎంపీటీసీని తమవైపు మలుపుకొని ఎంపీపీని కైవసం చేసుకోవాలనుకుంది. అధికార పార్టీలో వైస్ ఎంపీపీ కోసం వర్కూర్ ఎంపీటీసీ తిప్పయ్య, మరొకరపు పోటీపడ్డారు. వారి మధ్య సయోద్య కుదరకపోవడంతో నిమ్మకుండిపోయారు. తీరా ఎంపీపీ ఎన్నిక సమయానికి సీన్ మారింది. టీఆర్ఎస్ నుంచి గెలిచిన తిప్పయ్య బీజేపీకి మద్దతు తెలుపుతూ ఎంపీపీ శ్యామలమ్మ అయ్యేందుకు చేతులేత్తారు. వైస్ ఎంపీపీ ఎన్నిక సమయంలో బీజేపీ 2, స్వతంత్ర అభ్యర్థి ఒకరూ మద్దతు తెలుపడంతో నలుగురు కావడంతో తిప్పయ్య వైస్ ఎంపీపీ అయ్యారు. ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి వచ్చిన ఏమైనా మార్పు వస్తుందనుకున్నారు. కాని తిప్పయ్య అనుకున్నదే చేశారు. బీజేపీ వ్యూహం ఫలించడంతో మాగనూర్ మండలంలో ఇద్దరు ఎంపీటీసీలు గెలిచిన ఎంపీపీ బీజేపీ వశమైంది. మక్తల్‌లో కాంగ్రెస్ వైస్ ఎంపీపీ మక్తల్ మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు చేరి 7 స్థానాల్లో ఎంపీటీసీలను గెలుపొందారు. సత్యవార్‌కు చెందిన ఎంపీటీసీ రామేశ్వరి ఒక్కరే కాంగ్రెస్ పార్టీని విజయం సాధించింది. ఎవరూ ఎంపీపీ కావాలన్నా ఆమె మద్దతు కావాల్సిందే. ఒక వైపు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నేత కొండయ్యలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. తమ పార్టీలోకి వస్తే ఎంపీపీ పదవిని ఇస్తామని ఆఫర్ చేశారు. మద్దతిస్తే వైస్ ఎంపీపీని కట్టబెడతామని వలవేశారు. అధికార పార్టీకి చెందిన మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ఇజ్జత్‌కే సవాల్‌గా పావులు కదిపారు. సత్యవార్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ రామేశ్వరమ్మ ఊట్కూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ ఎం.బాల్‌రెడ్డి మరదలు అని తెలుసుకున్నారు. వెంటనే బాల్‌రెడ్డిని రంగంలోకి దింపి వ్యూహరచన చేస్తూ తమ వైపు గాలం వేయించారు. అధికార పార్టీకి మద్దతునిస్తూ ఆమెను వైస్ ఎంపీపీని చేశారు. -
అదే హవా !
సాక్షి ప్రతినిధి, వరంగల్: మండల పరిషత్ అ«ధ్యక్షుల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) హవా కొనసాగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 71 మండలాలు ఉండగా.. రిజర్వేషన్ల వివాదం కారణంగా ములుగు జిల్లా మంగపేట మండలంలో ఎంపీటీసీ ఎన్నికలు జరగలేదు. ఇక 70 మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు జరగ్గా.. శుక్రవారం మూడు మండలాలు మినహా మిగతా చోట్ల మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. ఇందులో 57 మండల పరిషత్‌లపై టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురవేసింది. కాంగ్రెస్‌కు తొమ్మిది ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది ఎంపీపీ పీఠాలు కాంగ్రెస్‌కు దక్కగా, ఒకచోట ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(ఏఐఎఫ్బీ) పార్టీ అభ్యర్థి ఎన్నికయ్యారు. ఇక పలిమెల మండలంలో ఇద్దరు ఎంపీటీసీలే ఉన్న కారణంగా అక్కడ ఎన్నిక జరపలేదు. కాగా, మహదేవపూర్‌లో మెజార్టీ ఎంపీటీసీలు గైర్హాజరు కావడంతో ఎన్నిక వాయిదా వేశారు. అలాగే ఎంపీపీల ఎన్నికకు ముందు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. అయితే, తరిగొప్పుల మండలం కోఆప్షన్ పదవికి ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో అక్కడా ఎంపీపీ ఎన్నిక వాయిదా వేశారు. వరంగల్ అర్బన్, రూరల్‌లో క్లీన్ స్వీప్ మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ములుగు రెండు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మూడు కలిపి ఐదు ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఇక మహబూబాబాద్ జిల్లాలో రెండు, జనగామ, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్కో స్థానాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంది. ఇక వరంగల్ అర్బన్ జిల్లాల్లో మాత్రం టీఆర్ఎస్ మొత్తం స్థానాలను గెలుచుకుని క్లీన్‌స్వీప్ చేసింది. ఈ జిల్లాలో మొత్తం ఏడు మండల పరిషత్‌లకు ఎన్నికలు జరగ్గా.. ఏడు చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులే ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. వరంగల్ రూరల్ జిల్లాలో మొత్తం 16 మండలాలకు గాను 15 మండలాల్లో గులాబీ జెండా ఎగరగా.. గీసుకొండ ఎంపీపీగా కాంగ్రెస్ ఎంపీటీసీ ఎన్నికయ్యారు. జనగామ జిల్లాలో 12 ఎంపీపీలకు 10 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా, తరిగొప్పుల ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. రఘునాథపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి మేకల వీరలక్ష్మి ఎంపీపీగా ఎన్నికయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 11 ఎంపీపీలకు చిట్యాల, రేగొండ, టేకుమట్ల, భూపాలపల్లి, మొగుళ్లపల్లిల్లో టీఆర్ఎస్, మహాముత్తారం, కాటారం, మల్హర్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఘనపురంలో ఏఐఎఫ్బీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ జిల్లాలోని పలిమెల ఎంపీపీ ఎన్నిక రద్దు కాగా, మహదేవపూర్ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ములుగు జిల్లాలో ఎనిమిది మండల పరిషత్‌లకు ఆరు టీఆర్ఎస్ గెలుచుకోగా, కన్నాయగూడెం, వెంకటాపురం(కె)ల్లో కాంగ్రెస్ ఎంపీటీసీలు ఎంపీపీలు ఎన్నికయ్యారు. అలాగే, మహబూబాబాద్ జిల్లాలో 16 స్థానాలకు 14 టీఆర్ఎస్, 2 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. -
గులాబీ జోరు
మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక శుక్రవారం ముగిసింది. ఆయా మండల కేంద్రాల్లో ఎన్నికల అధికారులు చేతులెత్తే పద్ధతిన ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలో 20 ఎంపీపీ స్థానాలు ఉండగా అంతా అనుకున్నట్లే జరిగింది. టీఆర్ఎస్ 13 ప్రాదేశిక పీఠాలను కైవసం చేసుకుంది. మూడింట కాంగ్రెస్ (రేగోడ్, చిన్నశంకరంపేట, నర్సాపూర్), రెండు చోట్ల స్వతంత్రులు (తూప్రాన్, చేగుంట) ఎంపీపీ పదవులను చేజిక్కించుకున్నారు. మరో రెండు స్థానాల్లో ఎన్నిక వాయిదా పడింది. చిన్నశంకరంపేటలో వైస్ ఎంపీపీని ఎన్నుకోలేదు. ఆ సమయంలో సభ్యులు లేకపోవడంతో అధికారులు వాయిదా వేశారు. ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తూప్రాన్, నార్సింగిలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. నర్సాపూర్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్ బలం సమానంగా ఉండడంతో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యులను డ్రా పద్ధతిన ఎన్నుకున్నారు. మరోవైపు వెల్దుర్తి, నార్సింగిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాక్షి, మెదక్ : చిలప్‌చెడ్‌లో కో ఆప్షన్ సభ్యుడిని ఎన్నుకున్నప్పటికీ.. ఎంపీపీ ఎన్నిక సమయంలో ఎంపీటీసీ సభ్యులు హాజరుకాకపోవడంతో అధికారులు శని వారానికి వాయిదా వేశారు. ఎవరిని ఎన్నుకో వాలో సమన్వయం లేకపోవడంతో ఎంపీటీసీ సభ్యులు హాజరు కాలేదని తెలుస్తోంది. టేక్మాల్‌లో కోఆప్షన్ సభ్యుడిగా మజాహర్ నామినేషన్ వేయగా.. ఎంపీటీసీ సభ్యులెవరూ బలపర్చలేదు. దీంతో అధికారులు వాయిదా వేశారు. త్వరలో ఉన్నతాధికారులు దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. వెల్దుర్తి ఎంపీపీ ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఎంపీపీ పరిధిలో 12ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్ఎస్ నాలుగు, కాంగ్రెస్ ఐదు, స్వతంత్రులు ముగ్గురు గెలుపొందారు. టీఆర్ఎస్కు చెందిన వెల్దుర్తి–2 ఎంపీటీసీగా గెలిచిన మోహన్‌రెడ్డి మిగతా టీఆర్ఎస్ ఎంపీటీసీలు ముగ్గురు, స్వతంత్రులు ముగ్గురితో కలిసి క్యాంప్‌నకు వెళ్లారు. మోహన్‌రెడ్డిని ఎంపీపీగా ఎన్నుకోవాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సైతం సూచించారు. ఎన్నిక సమయంలో క్యాంప్ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు ఎంపీటీసీలు (మానెపల్లి, కొప్పులపల్లి, అచ్చంపేట) వాహనం దిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత వారు కాంగ్రెస్ ఎంపీటీసీలతో కలిసి చర్చించారు. టీఆర్ఎస్కు చెందిన మానెపల్లి ఎంపీటీసీ సభ్యురాలు స్వరూపను ఎంపీపీగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన వెల్దుర్తి–1 ఎంపీటీసీ సుధాకర్‌గౌడ్‌ను వైస్ ఎంపీపీగా ఎన్నుకున్నారు. తూప్రాన్‌లో గలాటా ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తూప్రాన్‌లో గలాటా చోటుచేసుకుంది. ఘనాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు గడ్డి స్వప్న గెలిచిన వెంటనే కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆమే ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైస్‌ఎంపీపీగా వెంకటయ్యపల్లి ఎంపీటీసీ సభ్యురాలు శరణ్య, కో ఆప్షన్ సభ్యుడిగా గుండ్రెటిపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మున్వర్ పాషా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో టీఆర్ఎస్కు చెందిన మల్కాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు పంజాల వెంకటమ్మ కొడుకు ఆంజనేయులు అక్కడికి చేరుకుని పేపర్లను చించి వేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ బాహాబాహీకి దిగడంతో అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. నార్సింగి.. సీన్ చేంజ్ ! అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి అన్నట్లు నార్సింగి ఎంపీపీ పీఠం ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నార్సింగి ఎంపీపీ పరిధిలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. టీఆర్ఎస్ రెండు, కాంగ్రెస్ ఒకటి, స్వతంత్రులు (టీఆర్ఎస్ రెబెల్స్) రెండు స్థానాల్లో గెలుపొందారు. టీఆర్ఎస్ అధిష్టానం నార్సింగి–2 ఎంపీటీసీ ఆకుల సుజాతను ఎంపీపీగా, వల్లూరు ఎంపీటీసీ చిందం సబితను వైస్ ఎంపీపీగా నిర్ణయించింది. ఎంపీపీ ఎన్నిక సమయంలో శుక్రవారం సీన్ రివర్సైంది. అనూహ్యంగా శేరిపల్లి నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన బండారు సంతోష.. టీఆర్ఎస్కు చెందిన వల్లూరు ఎంపీటీసీ చిందం సబితను అధ్యక్ష స్థానం కోసం ప్రతిపాదించారు. జప్తిశివనూర్ ఎంపీటీసీ మైలారం సుజాత కూడా సబితకు మద్దతు పలకడంతో ఆమె ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆకుల సుజాత వర్గీయులు ఆగ్రహానికి గురై ఎంపీటీసీ సంతోష భర్త గొండా స్వామిపై దాడికి దిగారు. పోలీసులు ఇరువురిని శాంతింపజేసి అక్కడి నుంచి పంపించి వేశారు. రిటర్న్ గిఫ్ట్! గత ప్రాదేశిక ఎన్నికల్లో ఆకుల సుజాత భర్త ఆకుల మల్లేశం గౌడ్ కాంగ్రెస్ తరఫున నార్సింగి–2 ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. ఈ సమయంలో కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఎంపీటీసీలుగా గెలుపొందారు. చేగుంట మండలంలో టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించి ముదం శ్రీనివాస్‌ను ఎంపీపీగా ప్రకటించి క్యాంప్‌నకు తరలించారు. ఇదే క్యాంప్‌లో ఉన్న ఉప్పరపల్లి ఎంపీటీసీ అల్లి రమను ఎన్నిక సమయంలో అనూహ్యంగా ఆకుల మల్లేశం గౌడ్ ఎంపీపీ పదవికి ప్రతిపాదించారు. అనుకోకుండా అల్లి రమ ఎంపీపీగా.. ఆకుల మల్లేశం గౌడ్ వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. తాజాగా ఇలాంటి పరిస్థితే మల్లేశం గౌడ్‌కు ఎదురై ఆమె భార్య సుజాతకు పదవి దక్కకుండా పోయిందని చర్చించుకుంటున్నారు. నర్సాపూర్ డ్రా.. నర్సాపూర్‌లో డ్రా పద్ధతిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ ఎంపీపీ పరిధిలో మొత్తం పది ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో ఐదు స్థానాలను గెలుచుకున్నాయి. అధికారులు మూడు పదవులకు డ్రా తీశారు. కాంగ్రెస్‌కు చెందిన అహ్మద్‌నగర్ ఎంపీటీసీ సభ్యురాలు జ్యోతిని ఎంపీపీ పదవి వరించింది. వైస్ ఎంపీపీగా టీఆర్ఎస్కు చెందిన చిన్నచింతకుంట ఎంపీటీసీసీ సభ్యుడు వెంకటనర్సింగరావు, కో ఆప్షన్ సభ్యుడిగా టీఆర్ఎస్కు చెందిన ఎండీ.అఫ్జల్ ఇమ్రాన్‌ను అదృష్టం వరించింది. రేగోడ్ అంతా కాంగ్రెస్మయమైంది. మొత్తం ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ నాలుగు, టీఆర్ఎస్ మూడింట్లో గెలుపొందాయి. ఎంపీపీగా కాంగ్రెస్‌కు చెందిన పుర్ర సరోజన ఎన్నికయ్యారు. ఈమె గజ్వాడ నుంచి ఎంపీటీసీ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైస్ ఎంపీపీగా కాంగ్రెస్‌కు చెందిన ఆర్ ఇటిక్యాల నుంచి ఎంపీటీసీగా గెలిచిన ఇలీటం వినీల ఏకగ్రీవమయ్యారు. చిన్నశంకరంపేట ఎంపీపీ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ ఎంపీపీ పరిధిలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ ఏడు.. టీఆర్ఎస్ నాలుగు.. స్వతంత్ర అభ్యర్థి ఒక్కరు గెలుపొందారు. కాంగ్రెస్‌కు ఆధిక్యం ఉండగా.. జంగరాయి ఎంపీటీసీ ఆవుల భాగ్యలక్ష్మిని ఎంపీపీగా ఎన్నకున్నారు. కోఆప్షన్ సభ్యుడిగా కంగ్రెస్‌కు చెందిన శిన్నశంకరంపేట వాసి దూదేకుల ఫరీద్ ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. -
మండల పరిషత్‌లపై గులాబీ జెండా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మండల పరిషత్‌లపై గులాబీ జెండా రెపరెపలాడింది. జిల్లాలో అత్యధిక ఎంపీపీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన 13 మంది ఎంపీటీసీలు మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌కు అబ్దుల్లాపూర్‌మెట్, కడ్తాల్, మంచాల ఎంపీపీలు దక్కగా.. బీజేపీ కందుకూరు, యాచారం స్థానాలను గెలుచుకుంది. ఒక స్థానాన్ని ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఏఐఎఫ్బీ) ఎగురేసుకుపోయింది. కోరం లేకపోవడంతో మరో రెండు చోట్ల ఎన్నిక వాయిదా పడింది. కాగా, ఎంపీపీ ఎన్నిక సందర్భంగా పలు చోట్ల నాటకీయ పరిణామాలు చేటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ ఎంపీటీసీలు.. కాంగ్రెస్‌కు, కాంగ్రెస్ వాళ్లు టీఆర్ఎస్కు ఓట్లేశారు. ఇంకొన్ని చోట్ల గురువారం రాత్రి వరకు శిబిరాల్లో ఉన్న ఎంపీటీసీలు.. తీరా ఎన్నికకు గైర్హాజరయ్యారు. మరికొందరు ఒక పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలిచి.. ఎంపీపీగా ఎన్నికకాగానే గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారు. కారు స్పీడు 11 నుంచి 13కు.. టీఆర్ఎస్ పార్టీ 20 ఎంపీపీ స్థానాల్లో పాగా వేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ సాధ్యపడలేదు. కాంగ్రెస్, బీజేపీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో టీఆర్ఎస్ స్థానాలు తగ్గాయి. ఒకటి రెండు మండలాల్లో టీఆర్ఎస్కు బలం ఉన్నప్పటికీ స్థానాలను దక్కించుకోవడంలో విఫలమైంది. ఆ అవకాశాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సద్వినియోగం చేసుకున్నాయి. అధికారికంగా టీఆర్ఎస్ 11 ఎంపీపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అయితే, కొత్తూరు ఎంపీపీగా గెలిచిన కాంగ్రెస్ ఎంపీటీసీ పిన్నింటి మధుసూదన్‌రెడ్డి.. అప్పటికప్పుడే కారెక్కారు. కొందుర్గు ఎంపీపీగా> విజయం సాధించిన స్వతంత్ర ఎంపీటీసీ పోతురాజు జంగయ్యకు టీఆర్ఎస్ బీ–ఫారం అందజేసింది. ఇలా వీరిద్దరు అనూహ్యంగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో అధికార పార్టీ ఎంపీపీల సంఖ్య 13కు చేరుకుంది. ఇక కోరం లేకపోవడంతో ఆమనగల్లు, మాడ్గుల ఎన్నికలను ప్రిసైడింగ్ అధికారులు వాయిదా వేశారు. ఈ రెండు మండలాల్లో టీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఎంపీపీ అభ్యర్థిపై సభ్యుల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. నేనంటే.. నేను అని ఎంపీటీసీలు పోటీపడటంతో ఎన్నిక ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. దీంతో ఎంపీటీసీలు ఎన్నికకు దూరంగా ఉండటంతో కనీసం కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కూడా జరగలేదు. ఎన్నికల సంఘం త్వరలో సూచించే తేదీన ఈ రెండు మండలాల్లో ఎన్నికలు జరుగుతాయని ప్రిసైడింగ్ అధికారులు పేర్కొన్నారు. ఉపాధ్యక్షుల్లో టీఆర్ఎస్కు తగ్గిన బలం.. మండల పరిషత్ ఉపాధ్యక్షుల ఎన్నికకు వచ్చేసరికి టీఆర్ఎస్ బలం తగ్గింది. ఆ పార్టీ ఎంపీటీసీలు 7 మండలాల్లో మాత్రమే వైస్ ప్రసిడెంట్లుగా ఎన్నికయారు. అనూహ్యంగా స్వతంత్రులు ఏడు స్థానాల్లో పాగా వేశారు. ఇక కాంగ్రెస్ మూడు స్థానాలతో సరిపెట్టుకోగా.. బీజేపీకి ఒక్కటి కూడా దక్కలేదు. ఏఐఎఫ్బీ పార్టీ తరఫున ఒకరు వైస్ ఎంపీపీ పదవిని దక్కించుకున్నారు. కోరం లేకపోవడం, అభ్యర్థులపై ఎంపీటీసీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆమనగల్లు, మాడ్గుల, నందిగామ, శంషాబాద్ మండలాల్లో ఉపాధ్యక్షుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆమనగల్లు, మాడ్గులలో తప్ప మిగిలిన 19 మండలాల్లోకోఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తయింది. -
గులాబీదే హవా..
సాక్షి, వరంగల్ రూరల్ : మండల ప్రాదేశిక అధ్యక్ష ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తిరుగులేని మెజార్టీని సొంతం చేసుకుంది. పోటీ లేకుండా మెజార్టీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాలను దక్కించుకుంది. జిల్లాలోని 16 మండలాల అధ్యక్ష స్థానాలుండగా 15 టీఆర్ఎస్ ఖాతాలోకే వెళ్లాయి. జిల్లాలో మూడు దశల్లో మే 6, 10, 14 తేదీల్లో ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. జిల్లాలో 178 ఎంపీటీసీ స్థానాలుండగా టీఆర్ఎస్ పార్టీకి 127, కాంగ్రెస్‌కు 44, ఇండిపెండెంట్లు ఏడుగురు గెలుపొందారు. ఆయా మండల కేంద్రాల్లో శుక్రవారం ఎంపీపీల ఎన్నికలు జరిగాయి. క్యాంపుల నుంచి నేరుగా మండల పరిషత్ కార్యాలయాలకు ఎంపీటీసీ సభ్యులు చేరుకున్నారు. మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. 16 మండల పరిషత్‌ల్లో 15 టీఆర్ఎస్ దక్కించుకుంది. జిల్లాలో గీసుకొండ ఒక్కటే కాంగ్రెస్‌కు దక్కింది. ఉద్రిక్తల నడుమ నర్సంపేట ఎంపీపీ ఎన్నిక నర్సంపేట మండల పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక ఉద్రిక్తల నడుమ జరిగింది. నర్సంపేట మండల పరిధిలో 11 ఎంపీటీసీ స్థానాలుండగా కాంగ్రెస్ పార్టీ 6, టీఆర్ఎస్ పార్టీ 5 స్థానాల్లో గెలుపొందారు. తన భార్యను కిడ్నాప్ చేశారని లక్నెపల్లి ఎంపీటీసీ రజిత భర్త బుచ్చయ్య నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రహస్యంగా సమావేశమయ్యారని పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. సమావేశ ప్రాంతానికి పోలీసులు చేరుకుని రజితను తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకవచ్చారు. రజితను బుచ్చయ్యకు అప్పగించారు. దీంతో వెంటనే అక్కడి నుంచి బయటకు వస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రోడ్డుపై ధర్నా చేశారు. ఒకే దగ్గరికి టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నేలకోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకరినొకరు తగవులాడుకున్నారు. కొట్లాటకు దారి తీస్తుండడతో పోలీసులు రంగప్రవేశం చేసి అందరిని చెదరకోట్టేందుకు లాఠీచార్జీ చేశారు. దీంతో ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు. రజిత తన భర్త బుచ్చయ్యతో కలిసి నర్సంపేట మండల పరిషత్ కార్యాలయంకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీటీసీలు హాజరుకాలేదు. హాజరైన కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు సైతం టీఆర్ఎస్కు మద్దతు తెలిపారు. ఉద్రిక్తల నడుమ ఎంపీపీ ఎన్నిక జరిగింది. నర్సంపేట ఎంపీపీగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన మోతే కమలమ్మ, ఉపాధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బాంజీపేట ఎంపీటీసీ మౌనికను ఎన్నుకున్నారు. నర్సంపేట ఎంపీపీ ఎన్నికను ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకుని టీఆర్ఎస్కే దక్కే విధంగా చక్రం తిప్పారు. -
నేడు జెడ్పీ చైర్మన్ ఎన్నిక
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. జెడ్పీలోని సమావేశ హాలులో చైర్మన్‌తో పాటు, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. చైర్మన్ పదవి మాక్లూర్ జెడ్పీటీసీ దాదాన్నగారి విఠల్‌రావుకు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఒక వేళ ఊహించని పరిణాలు జరిగితే తప్ప మార్పులేమీ ఉండకపోవచ్చనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా చైర్మన్ పదవి రేసులో జెడ్పీ వైస్ చైర్మన్ , ఇందల్వాయి జెడ్పీటీసీ సుమనా రవిరెడ్డితో పాటు, ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌ల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. విఠల్‌రావుకు ఈ పదవి దక్కితే వైస్ చైర్మన్ పదవి బీసీ జెడ్పీటీసీకి కేటాయించే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలోని 27 జెడ్పీటీసీ స్థానాలకు గాను 23 స్థానాలను గెలుచుకుని టీఆర్ఎస్ జెడ్పీలో స్పష్టమైన మెజారిటీ సాధించింది. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు రెండేసి జెడ్పీటీసీలకు పరిమితమయ్యాయి. ఈ రెండు పార్టీలు దరిదాపుల్లో లేవు. క్యాంపు నుంచి గెస్ట్‌హౌస్‌కు.. అక్కడి నుంచి సమావేశానికి.. పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ., టీఆర్ఎస్ పార్టీ ముందు జాగ్రత్తగా క్యాంపును నిర్వహిస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రత్యేక వసతిగృహానికి టీఆర్ఎస్ జెడ్పీటీసీలను మంగళవారం రాత్రే తరలించింది. అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ఇప్పటికే అ పార్టీ జెడ్పీటీసీలందరికి ఆదేశాలు జారీ చేశారు. కాగా చైర్మన్ ఎన్నిక కోసం జెడ్పీటీసీలందరిని శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి డిచ్పల్లి వద్ద హైవేపై ఉన్న ఓ ప్రైవేటు గెస్ట్‌హౌస్‌కు తరలించనున్నారు. అక్కడ అధిష్టానం నిర్ణయాన్ని జెడ్పీటీసీలకు అధికారికంగా ప్రకటించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఓటింగ్‌కు తీసుకెళ్లేలా గులాబీ పార్టీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మంత్రి వేముల ప్రశాంత్రెడి ఈ ఎన్నిక సమన్వయ బాధ్యతలు తీసుకున్నారు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులతో పాటు, కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు జిల్లా పరిషత్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సమావేశం హాలులో మధ్యాహ్నం ఒంటి గంటకు జెడ్పీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించిన విషయం విధితమే. ఈ మేరకు సమావేశం హాలులో ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. బారికేడ్లను కట్టారు. ఎన్నిక మొత్తం వీడియో చిత్రీకరణ ఉంటుంది. అలాగే వెబ్‌క్యాస్టింగ్ ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అధికారిగా కలెక్టర్.. ఈ ఎన్నికకు ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు వ్యవహరించనున్నారు. కోఆప్షన్ సభ్యుల పదవులకు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశం ప్రారంభమవుతుంది. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు ఒకరి పేరును ఒక జెడ్పీటీసీ ప్రతిపాదించాల్సి ఉండగా, మరొకరు బలపరచాలి. పదవులకు చేతులెత్తే విధానం ద్వారా ఎన్నిక ఉంటుంది. గంట ముందు విప్‌జారీ.. జెడ్పీ ప్రత్యేక సమావేశం ప్రారంభానికి ఒక గంట ముందు అన్ని పార్టీలు విప్‌ను జారీ చేయాల్సి ఉంటుంది. ఆయా పార్టీల సభ్యులు విప్‌కు వ్యతిరేకంగా ఓటింగ్‌లో పాల్గొంటే వారి ఓటు చెల్లినప్పటికీ, వారి పదవిని కోల్పోతారు. ఈ మేరకు ముందు జాగ్రత్తగా అన్ని పార్టీలు విప్‌ను జారీ చేయనున్నాయి. ఈ ఎన్నిక సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక సమావేశానికి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక ఆహ్వాన సభ్యులుగా సమావేశానికి హాజరు అయ్యేందుకు వీలుంటుంది. -
గులాబీ ఆధిపత్యం!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో 31 మండలాల్లో 349 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా, టీఆర్ఎస్ అత్యధికంగా 191 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 134 స్థానాలకు పరిమితమైంది. ఈ మేరకు ఎంపీపీ, వైస్‌ఎంపీపీ ఎన్నికకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యాంపుల్లో ఉన్న వారంతా శుక్రవారం ఉదయం 10 గంటలకు వరకు నేరుగా ఎంపీడీఓ కార్యాలయాలకు చేరుకున్నారు. సభ్యులు చేతులు ఎత్తే పద్ధతి ద్వారా ఎంపీపీలను ఎన్నుకున్నారు. అంతకుముందు కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించారు. నల్లగొండ నియోజకవర్గంలో మూడు మండల పరిషత్‌లకు శుక్రవారం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరిగాయి. నల్లగొండ మండల పరిçషత్ అధ్యక్ష పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. పూర్తి స్థాయి మెజారిటీ ఉండడంతో ఎంపీపీతో పాటు వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు టీఆర్ఎస్ సభ్యులు హాజరు కాలేదు. కనగల్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడంలో అధ్యక్ష, ఉపాధ్యక్షలతో పాటు కోఆప్షన్ పదవులు టీఆర్ఎస్ వశమయ్యాయి. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక సమయంలో హాజరై ఆ తర్వాత వెళ్లిపోయారు. తిప్పర్తి మండల పరిషత్ అధ్యక్ష పీఠాన్ని కూడా టీఆర్ఎస్ దక్కించుకుంది. మొత్తం 9 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా అందులో నాలుగు టీఆర్ఎస్, మరో 4 కాంగ్రెస్ గెలుచుకున్నాయి. మరొకరు ఇండిపెండెంట్‌గా విజయసాధించి కీలకంగా మారారు. ఇండింపెండెంట్ అభ్యర్థి నాగులవంచి విజయలక్ష్మీని టీఆర్ఎస్లోకి తీసుకొస్తే ఎంపీపీ పదవి ఇస్తానని స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి హామీ ఇవ్వడంతో ఆమె టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఆమెను మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్‌తో పాటు కోఆప్షన్ పదవులు టీఆర్ఎస్కు దక్కాయి. కాంగ్రెస్ సభ్యులు సమావేశానికి హాజరుకాలేదు. మిర్యాలగూడ మిర్యాలగూడ నియోజకవర్గంలోని మిర్యాలగూడ, దామరచర్ల, అడవిదేవులపల్లి ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక సజావుగా సాగింది. వేములపల్లి ఎంపీపీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒక స్వతంత్ర అభ్యర్థి, ఒక సీపీఎం అభ్యర్థి మద్దతు తెలపడడంతో వేములపల్లి ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్టల సునిత ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా కొంత డ్రామా నెలకొంది. వేములపల్లి వైస్ ఎంపీపీ పదవికి టీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యులు శెట్టిపాలానికి చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యుడు పల్లా వీరయ్యను ప్రతిపాదించారు. తన ఓటు తను వేసుకుంటే ఎంపీపీ అయ్యే వాడే కానీ ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం సీపీఎం ఎంపీటీసీ పాదూరి గోవర్ధనికి మద్దతు తెలిపడంతో వైస్ ఎంపీపీగా గోవర్ధని ఎన్నికైంది. త్రిపురారం(నాగార్జునసాగర్): నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంíపీపీ, కోఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. నియోజకవర్గంలోని అనుముల, తిరుమలగిరి, గుర్రంపోడు, నిడమనూరు, పెద్దవూర మండలాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఐదు ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకోగా త్రిపురారం మండలంలో ఎంపీపీ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. పెద్దవూర మండలంలో 11 ఎంపీటీసీలున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు చెరి సమానంగా 5 ఎంపీటీసీ స్థానాలను గెలవగా, మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అయితే ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేశారు. అయితే పెద్దగూడెం ఎంపీటీసీగా గెలిచిన స్వతంత్ర అభ్యర్థి చెన్ను అనురాధ టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపింది. దీంతో నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చెన్ను అనురాధను ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించి ఆమెతో నామినేషన్ వేయించారు. దీంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. అనుముల ఎంపీపీ అభ్యర్థిగా అధికార పార్టీకి చెందిన పేర్ల సుమతిపురుషోత్తం ఒక్కరే నామినేషన్ వేయగా, ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. వైస్ ఎంపీపీ ఎన్నికలో అధికార పార్టీకి చెందిన కొత్తపల్లి ఎంపీటీసీ చేయి లేపకపోవడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు చేరి సమానంగా మూడేసి ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ నుంచి రావుల రాంబాబు కాంగ్రెస్‌నుంచి మాలె అరుణ బరిలో ఉన్నారు. సమాన ఓట్లు వచ్చిన నేపథ్యంలో డ్రా వేయగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాలె అరుణను వైస్ ఎంపీపీ పదవి వరించింది. దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాలకుగాను చందంపేట, నేరెడుగొమ్ము మండలాల్లో కోరం లేకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. నేరెడుగొమ్ము మండల కేంద్రంలో కోఆప్షన్ స్థానానికి నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఎన్నిక వాయిదాపడింది. దేవరకొండ, పీఏపల్లి, డిండి మండలాల్లో అధికార టీఆర్ఎస్ ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకోగా కొండమల్లేపల్లి, చింతపల్లి ఎంíపీపీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దేవరకొండ మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు 8 స్థానాలను అధికార టీఆర్ఎస్ గెలిచినప్పటికి కోఆప్షన్ స్థానాన్ని సాధించలేకపోయింది. మూడు స్థానాలను గెలిచిన కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు ఉదయం 10 గంటలలోపు కోఆప్షన్ అభ్యర్థిగా శంషొద్దీన్‌తో నామినేషన్ దాఖలు చేయించారు. కాంగ్రెస్‌కు చెందిన ఒకరే నామినేషన్ దాఖలు చేయడంతో శంషొద్దీన్ను కోఆప్షన్ సభ్యుడిగా ప్రకటించారు. పీఏపల్లి మండలంలో వైస్‌ఎంపీపీ ఎన్నిక వాయిదాపడింది. నకిరేకల్ : నకిరేకల్ నియోజకవర్గంలో ఎంపీపీల ఎన్నిక ఆసక్తి రేపింది. నకిరేకల్ మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలకు టీఆర్ఎస్ నాలుగు, కాంగ్రెస్ మూడు, ఇండిపెండెంట్లు రెండు స్థానాలు గెలచుకున్నారు. టీఆర్ఎస్ పార్టీలో బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్, దాసరి వీరార్జున్‌రెడ్డి వేర్వేరుగా ఎంపీపీ పదవి కోసం పోటీ పడ్డారు. బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ అనుచరులంతా స్థానిక శాసన మండలి ఇన్చార్జ్ చైర్మన్ నేతి విద్యాసాగర్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సారథ్యంలో క్యాంప్ నుంచి వారి కాన్వాయ్‌లోనే ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. వారి సమక్షంలోనే ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగింది. టీఆర్ఎస్నుంచి ఎంపీపీ అభ్యర్థిగా మంగళపల్లి ఎంపీటీసీ బచ్చుపల్లి శ్రీదేవి గంగధర్‌ను ప్రతిపాదించారు. ఇదే టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీపీ అభ్యర్థిగా గోరెంకలపల్లి టీఆర్ఎస్ ఎంపీటీసీ దాసరి వీరార్జున్రెడ్డిని కూడా తాటికల్ ఎంపీటీసీ గాదగోని శ్రీలత ప్రతిపాదించారు. దాసరి వీరార్జున్‌రెడ్డి తనకు మెజారిటీ లేకపోవడంతో తన అనుచర వర్గమైన మరొక ముగ్గురు ఎంపీటీసీలతో కలిసి వెళ్లిపోయారు. దీంతో ఎంపీపీగా బచ్చుపల్లి శ్రీదేవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. కేతేపల్లి మండల పరిషత్ ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ ఎన్నిక వాయిదా పడింది. చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూరు, శాలిగౌరారం ఎంపీపీలు టీఆర్ఎస్ వశమయ్యాయి. మునుగోడు : మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, మునుగోడు , మర్రిగూడ, నాంపల్లి మండలాలో ఎంపీపీ ఎన్నిక ప్రశాంతం జరిగింది. మునుగోడు, నాంపల్లి ఎంపీపీ స్థానాలు టీఆర్ఎస్ వశం కాగా, చండూరు, మర్రిగూడ మండలాలు కాంగ్రెస్ దక్కించుకుంది. చండూరు మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు కాంగ్రెస్, సీపీఐలు పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ 5, సీపీఐ 1, టీఆర్ఎస్ 4, బీజేపీ 1స్థానం గెలుచుకున్నాయి. సీపీఐ మద్దతుతో ఎంపీపీగా కాంగ్రెస్‌కు చెందిన పల్లె కళ్యాణి విజయం సాధించారు. -
నేడే ‘జెడ్పీ’ పట్టాభిషేకం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గులాబీ జెండాల రెపరెపల మధ్య జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుల పట్టాభిషేకం శనివారం జరగనుంది. ప్రత్యర్థి పార్టీల ఉనికి సైతం కనిపించని రీతిలో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున జెడ్పీటీసీలుగా గెలిచిన నేతలు జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నారు. ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని నాలుగు జిల్లాలకు చైర్పర్సన్/చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు జెడ్పీటీసీలను ఎన్నుకోనున్నారు. అంతకుముందే ఉదయం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికతో జిల్లా పరిషత్‌లలో పాలక మండళ్ల ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది. కాగా, ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ జిల్లా పరిషత్‌కు 15 మంది జెడ్పీటీసీలు టీఆర్ఎస్ నుంచే ఎన్నికవడంతో ఇక్కడ ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. పెద్దపల్లిలో 13 సభ్యులకు గాను ఇద్దరు కాంగ్రెస్ నుంచి ఎన్నికవగా, 11 మంది సభ్యులతో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కో సభ్యుడు ఎన్నిక కాగా, మిగతా సీట్లలో టీఆర్ఎస్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో జెడ్పీ అధ్యక్షుల ఎన్నిక లాంఛనమే. మూడు జిల్లాల్లో స్పష్టత– జగిత్యాల తప్ప టీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌గా పుట్ట మధును స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికలకు ముందు రాజన్న సిరిసిల్ల జిల్లా చైర్‌పర్సన్‌గా న్యాలకొండ అరుణ పేరును కేటీఆర్ ఓకే చేశారు. ఇక కరీంనగర్ చైర్‌పర్సన్‌గా ఇల్లందకుంట జెడ్పీటీసీ కనుమండ్ల విజయను మంత్రి ఈటల రాజేందర్ తెరపైకి తెచ్చారు. ఈ మూడు జిల్లాలకు చైర్పర్సన్లకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కాగా, జగిత్యాల జిల్లాపైనే తొలి నుంచి పీఠముడే కొనసాగుతోంది. తొలుత బుగ్గారం జెడ్పీటీసీ బాదినేని రాజేందర్‌కు చైర్మన్ పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపించాయి. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చినట్టుగా భావిస్తున్న లీకుల్లో కోరుట్ల జెడ్పీటీసీ దాసెట్టి లావణ్య పేరు తెరపైకి వచ్చింది. శుక్రవారం సీను మారింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్‌కుమార్ రంగంలోకి దిగారు. జగిత్యాల రూరల్ జెడ్పీటీసీ దావ వసంతకు చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వాలని పావులు కదుపుతున్నారు. దీంతో రాత్రి వరకు జగిత్యాలపై పీఠముడి వీడలేదు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల పంచాయితీని తెంపే పనిలో పడ్డారు. రాత్రి వేళ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలతో మంతనాలు జరిపి, అధిష్టానం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. రెండు జిల్లాలకు వైస్ చైర్మన్లు ఖరారు కరీంనగర్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా గన్నేరువరం, శంకరపట్నం జెడ్పీటీసీలు రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలలో ఒకరు నియమితులవుతారని పార్టీలో ప్రచారం జరిగింది. చివరికి శుక్రవారం అధిష్టానం సైదాపూర్ జెడ్పీటీసీ పేరాల గోపాల్‌రావు పేరును ఖరారు చేసింది. రాజన్న సిరిసిల్ల వైస్ చైర్మన్‌గా ఇల్లంతకుంట జెడ్పీటీసీ సిద్దం వేణు ఖరారైంది. పెద్దపల్లి వైస్ చైర్పర్సన్ విషయంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కాల్వశ్రీరాంపూర్ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డికి మద్దతుగా నిలిచారు. సీనియర్ జెడ్పీటీసీ, మహిళా నాయకురాలు పాలకుర్తి నుంచి గెలిచిన కందుల సంధ్యారాణి పోటీ పడుతున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి వైస్ చైర్పర్సన్ పంచాయితీని కూడా పరిష్కరించే పనిలో పడ్డారు. -
గులాబీ గుబాళింపు
కరీంనగర్: జిల్లాలోని 15 మండల పరిషత్ అధ్యక్షుల పీఠాలతోపాటు ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. శుక్రవారం ఉదయం జిల్లా వ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లో మొదటగా కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 మండలాల్లో జెడ్పీటీసీలను పూర్తిస్థాయిలో గెలుచుకోని సత్తా చాటుకున్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ ఎన్నికల్లోనూ 15 మండలాల్లో విజయం సాధించి మరో రికార్డును సొంతం చేసుకుంది. 11 మండలాల్లో ఎవరి మద్దతు లేకుండా పూర్తిస్థాయిలో అధికారం చేపట్టేందుకు సంఖ్య బలం టీఆర్ఎస్ పార్టీ సాధించగా.. ఎన్నిక ఏకపక్షంగానే పూర్తయింది. మిగతా నాలుగు మండలాలైన చిగురుమామిడి, చొప్పదండి, రామడుగు, సైదాపూర్‌లలో స్వతంత్రులు, ఇతర పార్టీల మద్దతుతో మండల పీఠాలను వశం చేసుకుంది. జిల్లాలోని మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులతోపాటు కో ఆప్షన్ సభ్యుల స్థానాలను కైవసం చేసుకుని ప్రతిపక్ష పార్టీలను కంగుతినిపించింది. ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరుగకుండా ఎంపీపీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సజావుగా ముగిసింది. హుజూరాబాద్, కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లోని మండలాలతోపాటు హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లో ఉదయం కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు పూర్తి కావడంతో విజయోత్సవ ర్యాలీలతో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. -
నేడు జెడ్పీచైర్మన్ ఎన్నిక
ఆదిలాబాద్‌అర్బన్: జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడు (జెడ్పీచైర్మన్), ఉపాధ్యక్షుడు (వైస్‌చైర్మన్) పదవులకు శనివారం ఎన్నిక జరగనుంది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 9 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. కలెక్టర్ పర్యవేక్షణలో జరిగే ఈ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కాగా, ముందుగా మైనార్టీ వర్గానికి చెందిన ఇద్దరిని కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకుంటారు. అనంతరం చైర్పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నిక చేపడుతారు. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి వంద మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. పరిషత్ చుట్టూ పక్కల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నిక ప్రక్రియ ఇలా.. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియలో భాగంగా శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటల వరకు కోఆప్షన్ సభ్యుల పోటీకి నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లను పరిశీలించి, ఒంటి గంట వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశమిస్తారు. ఒకవేళ ఒక అభ్యర్థే పోటీపడితే వారినే ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు. పోటీ ఉంటే ఎన్నిక నిర్వహించి గెలుపొందిన వారిని ప్రకటిస్తారు. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. తద్వారా మధ్యాహ్నం 3 గంటల సమయంలో చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక చేపడుతారు. ఈ ప్రక్రియకు కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీలందరూ హాజరుకానున్నారు. ఎవరికో చైర్మన్ గిరి.. జిల్లాలో 17 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ తొమ్మిది జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ 5, కాంగ్రెస్ 5 చొప్పున జెడ్పీటీసీ స్థానాలు దక్కించుకున్నాయి. అయితే టీఆర్ఎస్ పార్టీ గెలిచిన స్థానాలు మేజిక్ ఫిగర్‌కు కరెక్ట్‌గా సరిపోవడంతో ఎవరిని జెడ్పీ అధ్యక్ష పీఠం ఎక్కిస్తారనేది ఉత్కంఠగా మారింది. ఏ ఒక్క సభ్యుడిని పట్టించుకోకున్నా.. ఇబ్బందులు తలెత్తే అవకాశాలుండడంతో అందరిని కలుపుకొని పోయే దిశగా ఆ పార్టీ అడుగులు వేసేందుకే ఇంత వరకు చైర్మన్ అభ్యర్థిని ప్రకటించలేదని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే టీఆర్ఎస్ తరఫున నేరడిగొండ జెడ్పీటీసీగా గెలుపొందిన అనిల్ జాదవ్, నార్నూర్ జెడ్పీటీసీగా గెలుపొందిన రాథోడ్ జనార్దన్‌ల పేర్లు అధ్యక్ష పదవి రేసులో ప్రధానంగా వినిపిస్తుండగా.. భీంపూర్ జెడ్పీటీసీగా గెలుపొందిన సుధాకర్ పేరు కూడా పరిశీలనలోకి వస్తున్నట్లు సమాచారం. అయితే అనుభవం, సీనియార్టీని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థి ఎంపిక చేపడితే నేరడిగొండ, నార్నూర్ జెడ్పీటీసీలుగా గెలుపొందిన వారిద్దరిలో ఎవరో ఒకరు చైర్మన్ కానున్నారు. -
చెట్టాపట్టాల్!
సాక్షి, ఆదిలాబాద్: సిద్ధాంతాల పరంగా ఆ రెండు పార్టీలు పూర్తిగా వ్యతిరేకం.. అయితేనేం పరిస్థితులకు అనుగుణంగా అవి ఏకమయ్యాయి. టీఆర్ఎస్కు వ్యతి రేకంగా కలిసి పనిచేస్తున్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌ల కొత్త రాజకీయంతో ఆదిలాబాద్ ప రిషత్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ కొత్త సమీకరణ లు గులాబీ పార్టీని నిలువరించేలా చేశాయి. రెండు ఎంపీపీ స్థానాలను టీఆర్ఎస్కు దక్కకుండా చూశాయి. మరో ఎంపీ పీ స్వతం త్ర అభ్యర్థికి దక్కడంలో కీలక పాత్ర వహించాయి. ఈ మార్పు ఇప్పుడు ఆదిలాబాద్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. నేడు జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగనుండగా ఈ కలయిక టీఆర్ఎస్లో గుబులు రేపుతోంది. విప్ జారీ.. నేడు జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగనుండగా కాంగ్రెస్, బీజేపీల కలయిక టీఆర్ఎస్ను షాక్‌కు గురి చేస్తోంది. ఆదిలాబాద్ జెడ్పీలో 17 స్థానాలు ఉండగా, టీఆర్ఎస్ 9, బీజేపీ 5, కాంగ్రెస్ 3 గెలుచుకున్న విషయం తెలిసిందే.. మెజార్టీ 9 మంది సభ్యులను టీఆర్ఎస్ గెలిచినా జెడ్పీపీఠం దక్కించుకోవడంలో ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేశాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావులు జెడ్పీ పీఠం దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. బీజేపీ నుంచి ఇటీవల ఎంపీగా గెలిచిన సోయం బాపురావు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ జెడ్పీ పీఠం టీఆర్ఎస్కు దక్కకుండా కాంగ్రెస్ మద్దతుతోనైనా నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఇటీవల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన రాథోడ్ రమేశ్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండేలు కలిసి టీఆర్ఎస్కు పీఠం దక్కకుండా బీజేపీతో జత కలిసి తాజా రాజకీయాలు తమకు అనువుగా మలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం జెడ్పీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఆయా పార్టీల వారీగా ఇప్పటికే సభ్యులకు విప్ జారీ చేశారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా సభ్యులు నడుచుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న టీఆర్ఎస్ సభ్యులకు, మాజీ ఎమ్మెల్యే యెండ్ల లక్ష్మీనారాయణ బీజేపీ సభ్యులకు, జిల్లా అధ్యక్షుడు భార్గవ్‌దేశ్ పాండే కాంగ్రెస్ సభ్యులకు విప్‌ను జారీ చేసే అధికారాన్ని పార్టీలు కట్టబెట్టాయి. దీనికి సంబంధించి ఈ ముగ్గురు జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్‌కు పార్టీ పత్రాలను శుక్రవారం అందజేశారు. దీంతో సభ్యులకు ఆయా పార్టీల వారీగా విప్ జారీ చేశారు. నేడు జరిగే ప్రాదేశిక ఎన్నికల్లో సభ్యులు పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన పక్షంలో వారి సభ్యత్వం రద్దు చేసేందుకు ఈ విప్ అధికారం పార్టీ అధిష్టానం కల్పించింది. దీంతో ఈ ఎన్నికలు తాజా రాజకీయాలను వేడెక్కించాయి. టీఆర్ఎస్ 10కే పరిమితం.. మండల పరిషత్ అధ్యక్ష స్థానాలను అధికంగా కైవసం చేసుకోవాలన్న టీఆర్ఎస్ ఆశలకు గండి పడింది. ఆదిలాబాద్, బేల, భీంపూర్, బోథ్, గాదిగూడ, జైనథ్, నార్నూర్, నేరడిగొండ, తాంసి, ఉట్నూర్‌లలో ఆ పార్టీ మెజార్టీ సాధించడంతో ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకోవడం సులువైంది. అయితే శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆయా మండలాల్లో ఇతర పార్టీల్లోని సభ్యులను జత చేసుకోవడం ద్వారా 10 కంటే ఎక్కువ ఎంపీపీ స్థానాలు సాధించగలుగుతుందని అంచనా వేసినా అవన్నీ కల్లలైపోయాయి. తలమడుగులో కాంగ్రెస్‌కు మెజార్టీ ఉండడంతో ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకుంది. బజార్హత్నూర్, ఇంద్రవెల్లిల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బజార్హత్నూర్లో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 8 ఉండగా బీజేపీ 4, టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 1 గెలుపొందాయి. బీజేపీకి ఒక సభ్యుడి మద్దతు అవసరం ఉండగా కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో అక్కడ బీజేపీకి ఎంపీపీ పీఠం దక్కింది. ఉపాధ్యక్ష పదవిని కాంగ్రెస్ ఇవ్వడం ద్వారా ఈ రెండు పార్టీల కలయిక సాధ్యమైంది. ఇక ఇంద్రవెల్లిలో 11 ఎంపీటీసీ స్థానాలుండగా టీఆర్ఎస్ 4, బీజేపీ 4, స్వతంత్రులు ఇద్దరు, కాంగ్రెస్ ఒకరు గెలుపొందారు. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీకి మరో ఇద్దరు సభ్యులు మద్దతు ఇచ్చిన పక్షంలో ఆయా పార్టీల్లో ఎవరికైనా పీఠం దక్కేది. అయితే ఒక స్వతంత్ర, ఒక కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీకి మద్దతు ఇవ్వడంతో ఇంద్రవెల్లి ఎంపీపీ కూడా బీజేపీకే దక్కింది. ఇక్కడ కూడా మద్దతిచ్చిన కాంగ్రెస్ ఎంపీటీసీకి ఉపాధ్యక్ష పదవికి దక్కింది. ఈ విధంగా పొత్తుధర్మం కొనసాగిస్తూ జెడ్పీ చైర్మన్ ఎన్నికకు ముందుకు కదులుతున్నారు. ఇక ఇచ్చోడలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ 13 ఎంపీటీసీ స్థానాలకు ఐదు స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొంది పీఠం కైవసం చేసుకుంటుందని అందరు అనుకున్నారు. ప్రధానంగా ఆ పార్టీకి కేవలం మరో ఇద్దరి మద్దతు అవసరం ఉండగా, అనూహ్యంగా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా ప్రీతం రెడ్డికి బీజేపీ, కాంగ్రెస్ సపోర్ట్ చేయడం గమనార్హం. టీఆర్ఎస్లో 5 గురు ఎంపీటీసీలు గెలవగా ఇద్దరు విప్‌ను దిక్కరించి స్వతంత్ర అభ్యర్థికి మద్దతు పలకడం గమనార్హం. తద్వారా ఇచ్చోడ వంటి మేజర్ మండలంలో టీఆర్ఎస్ను కాంగ్రెస్, బీజేపీలు తమ రాజకీయ ఎత్తుగడలతో నిలువరించడం గమనార్హం. అలాగే గుడిహత్నూర్, మావలలో ఎంపీపీ ఎన్నికలు కోరం లేక వాయిదా పడ్డాయి. గుడిహత్నూర్‌లో సభ్యులు సమాయానికి రాకపోవడంతో ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మండలంలో మొత్తం 9 స్థానాలు ఉండగా టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3, బీజేపీ 2 గెలుచుకున్న విషయం విధితమే. అలాగే మావలలో 3 స్థానాలు ఉండగా..ఒక సభ్యుడు గౌర్హాజరు కావడంతో ఎన్నిక వాయిదా పడింది. ఇక్కడ టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్ 1 స్థానం గెలుచుకున్నాయి. జంప్ దేనికి సంకేతం.. టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఇద్దరు ఎంపీటీసీలు పార్టీ విప్‌ను దిక్కరించి ఒక స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ఇచ్చోడలో ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ నియమాలను దిక్కరిస్తే సహించలేని టీఆర్ఎస్కు ఈ జంప్ ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా శనివారం జెడ్పీలో పార్టీ పరంగా విప్ జారీ చేసినా ఎన్నిక పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది. ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ ఎస్టీ (జనరల్) రిజర్వు ఉండగా, ఈ పార్టీ నుంచి 9 మంది సభ్యుల్లో ముగ్గురు ఎస్టీ జెడ్పీటీసీలు ఉన్నారు. నేరడిగొండ, నార్నూర్, భీంపూర్ జెడ్పీటీసీలు అనిల్ జాదవ్, రాథోడ్ జనార్దన్, కుమ్ర సుధాకర్‌లు గెలుపొందారు. వీరిలో నుంచి ఎవరికి జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దింపుతారనేది ఇప్పు డు ప్రాధాన్యత సంతరించుకుంది. అనిల్ జాదవ్, రాథోడ్ జనార్దన్‌లు లంబాడా సామాజికవర్గం కాగా, కుమ్ర సుధాకర్ ఆదివాసీ సామాజిక వర్గానికి చెందినవారు. జిల్లాలో ఇటీవల సోయం బాపురావు ఎంపీగా గెలుపొందడంతో బీజేపీ ప్రభంజనం పెరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎత్తుగడలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. జెడ్పీలో నేడు జరగబోయే ఎన్నికలో ఏకగీవ్రంగా జరుగుతుందా, లేని పక్షంలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి అభ్యర్థిని రంగంలోకి దించుతాయా? అనేది ఆసక్తికరమే.. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరుంటారనే దానిపై అంచనాలతో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రాదేశిక ఎన్నికల చివరి ఘట్టం చైర్మన్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. -
తెరపైకి కొత్త పేరు
నాగరకర్నూల్: కందనూలు జిల్లా ఏర్పడిన తరువాత మొదటిసారిగా జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనుండడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపొందిన జెడ్పీటీసీ సభ్యులు శనివారం జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. ఇందుకోసం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 20 మండలాలు ఉండగా ఇందులో 17 మంది టీఆర్ఎస్పార్టీకి చెందిన జెడ్పీటీసీలు గెలవగా, ముగ్గురు కాంగ్రెస్‌కు జెడ్పీటీసీలు విజయం సాధించారు. జిల్లాలోని తాడూరు, వంగూరు, అమ్రాబాద్ మండలాలు మినహా మిగిలిన స్థానాల్లో టీఆర్ఎస్ నెగ్గింది. శనివారం జరిగే జెడ్పీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి ఎన్నిక లాంఛనమే. జెడ్పీచైర్మన్‌గా పద్మావతి జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు పోతుగంటి భరత్ ప్రసాద్ జెడ్పీచైర్మన్ అభ్యర్థిగా దాదాపు ఖరారు చేసినా.. అనూహ్యంగా తెరపైకి మరో కొత్తపేరు తీసుకొచ్చారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని తెలకపల్లికి చెందిన పద్మావతి పేరును శుక్రవారం రాత్రి అధిష్టానం ఖరారు చేసి, బీ–ఫాం అందజేసింది. ఖరారు చేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన బాలాజీసింగ్‌కు జెడ్పీ వైస్‌చైర్మన్‌గా అవకాశం కల్పిచేందుకు అధిష్టానం హామీ ఇచ్చింది. ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజుతో పాటు ఎంపీ రాములు అచ్చంపేటకు చెందిన వారే కావడంతో పాటు బాలాజీసింగ్ అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ నుంచి జెడ్పీటీసీగా విజయం సాధించారు. దీంతో ఎంపీ, జెడ్పీ చైర్మన్, జెడ్పీ వైస్ చైర్మన్ అన్ని పోస్టులు అచ్చంపేట నియోజకవర్గానికి ఎలా ఇస్తారని కొందరు నాయకులు పార్టీ పెద్దల ముందు ఉంచారు. దీంతో తెలకపల్లి జెడ్పీటీసీగా టీఆర్ఎస్ తరుఫున గెలిచిన పద్మావతికి జెడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించాలని కోరారు. శుక్రవారం సాయంత్రం మంత్రి నిరంజన్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ రాములు, తదితరులు హైదరాబాద్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఇద్దరు ఎమ్మెల్యేలు మరీ పట్టబట్టి పద్మావతి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. అధికారుల ఏర్పాట్లు పూర్తి.. జిల్లా జెడ్పీచైర్మన్ ఎంపిక కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ ఈ.శ్రీధర్ దగ్గరుండి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని డిజిటల్ క్లాస్‌రూంలో ఏర్పాట్లు చేయించారు. ఉదయం 9గంటలకు ప్రక్రియ ప్రారంభం కానుండగా మొదటి కో–ఆప్షన్ సభ్యులకు సంబంధించి 10గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అనంతరం పరిశీలన, ఉప సంహరణ అనంతరం ఒంటిగంట వరకు కో–ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. 3 గంటలకు జిల్లా జెడ్పీచైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యుల పేర్లను వెల్లడించనున్నారు. -
17 ఎంపీపీ పిఠాలు టీఆర్ఎస్కే..
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని రెండు ఎంపీపీ స్థానాలు మినహా అన్నింటిని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అన్ని మండలాల్లోనూ గులాబీ పార్టీ తన హవాను కొనసాగించింది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జరిగిన ఎంపీపీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 17 మండలాల్లో మెజార్టీ ప్రాతిపదికన ఓటింగ్ నిర్వహించి ఎంపీపీ అభ్యర్థులను ఎన్నుకోగా, ఎంపీటీసీ స్థానాలు సమానంగా వచ్చిన రెండు మండలాల్లో మాత్రమే లాటరీ పద్ధతి ద్వారా ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో సంబంధిత అధికారుల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి. ఎలాగైనా మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలన్న పట్టుదలతో టీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యవహరించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పెంట్లవెల్లిలో ఒకరినొకరు తోసుకున్నారు. నాగర్‌కర్నూల్ మండలానికి సంబంధించి కోర్టు పరిధిలో కేసు ఉండడంతో ఎన్నిక వాయిదా పడింది. మొత్తంగా మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యులు ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 17ఎంపీపీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం జిల్లాలోని 20 మండలాల్లో 212 ఎంపీటీసీ స్థానాలుంటే గోప్లాపూర్, గంట్రావుపల్లి ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, గగ్గలపల్లి ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో మొత్తం 209 ఎంపీటీసీ స్థానాలకు మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో 135 స్థానాల్లో టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థులు విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 4 స్థానాల్లో, సీపీఐ 2స్థానాల్లో, ఇండిపెండెంట్లు 16 స్థానాల్లో విజయం సా«ధించారు. ఏకగ్రీవం అయిన రెండు ఎంపీటీసీ స్థానాలు కూడా టీఆర్ఎస్ అభ్యర్థులే గెలవడంతో ఆ పార్టీ 137 స్థానాల్లో విజయం సాధించింది. అయితే శుక్రవారం నాగర్‌కర్నూల్ మండల పరిషత్ స్థానానికి మినహా 19 మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు నిర్వహించారు.ఇందులో అధికార పార్టీ 17, కాంగ్రెస్ రెండు స్థానాలు దక్కించుకున్నాయి. వైస్ ఎంపీపీల విషయానికి వస్తే టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 4, ఇండిపెండెంట్లు 2 స్థానాలను దక్కించుకున్నారు. కో ఆప్షన్‌కు సంబంధించి 17 టీఆర్ఎస్, రెండు కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. లింగాల, ఉప్పునుంతల మండలంలో లాటరీ పద్ధతిలో ఎంపీపీ ఎంపిక జరిగింది. లింగాలలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్లు దక్కాయి. ఉప్పునుంతలలో ఎంపీపీ, కో ఆప్షన్ టీఆర్ఎస్ పార్టీ, వైస్ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీకి దక్కాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి, హర్షవర్ధన్‌రెడ్డి వర్గాల మధ్య నువ్వా నేనా అన్న తరహాలో ఎన్నికలు జరిగాయి. పెంట్లవెల్లిలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసలు రంగప్రవేశం చేసి లాఠీచార్జీతో ఇరు వర్గాలను చెదరగొట్టారు.ఇరు వర్గాలు టీఆర్ఎస్ పార్టీ చెప్పుకున్నప్పటికీ కోడేరు, పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి మండలాల్లో జూపల్లి వర్గం ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోగా, కొల్లాపూర్‌లో హర్షవర్ధన్‌రెడ్డి వర్గం దక్కించుకుంది. బిజినపల్లి మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీకి 10ఎంపీటీసీలు, కాంగ్రెస్‌కు 8, ఒకటి సీపీఐ, ఒకచోట ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఎంపీపీ స్థానం ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో నేరుగా ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి రంగంలోకి దిగి కాంగ్రెస్ ఎంపీటీసీని తమవైపు తిప్పుకొని అతనికి వైస్ ఎంపీపీ ఇచ్చి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్నారు. -
‘గులాబీ’కే పీఠాలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కారు జోరుమీదుంది. పరిషత్ ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. 20 మండల పరిషత్‌లకుగాను.. 17 మండలాధీశుల పదవులను కైవసం చేసుకుంది. సంఖ్యాపరంగా టీఆర్ఎస్కే బలం ఉన్నా.. ఎంపీపీ పదవిపై నెలకొన్న పోటీ వల్ల ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ సమావేశానికి హాజరుకాకపోవడంతో కూసుమంచి ఎంపీపీ ఎన్నిక కోరం లేక వాయిదాపడింది. దాదాపు జిల్లా చరిత్రలోనే మొదటిసారిగా మండల పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. 2014 ఎన్నికల్లో అనేక ఎంపీపీ పదవులను గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి ఒక్క ఎంపీపీ పదవిని సైతం చేజిక్కించుకోలేదు. అయితే బోనకల్, ఏన్కూరులో ఆ పార్టీ బలపరిచిన సీపీఎం, టీడీపీ అభ్యర్థులు ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ మాత్రం మెజార్టీ మండలాల్లో అప్రతిహతంగా తన విజయాన్ని కొనసాగించింది. కూసుమంచిలో ఎంపీపీ పదవిని టీఆర్ఎస్కు చెందిన బాలాజీనాయక్‌కు ఇవ్వాలని కోరుతూ ఆయన మద్దతుదారులు కూసుమంచిలోని ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ పదవికి శ్రీనునాయక్, బాలాజీనాయక్ పోటీ పడుతుండడంతో ఇద్దరూ ఒక అవగాహనకు వచ్చి.. ఎన్నికకు మార్గం సుగమం చేయాలని వారికి ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి సూచించారు. దీంతో పదవీ కాలాన్ని చెరి సగం పంచుకోవాలని భావించినా.. ముందు ఎవరు పదవి చేపట్టాలనే అంశంపై సందిగ్ధత నెలకొనడంతో ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ సమావేశానికి సకాలంలో చేరుకోలేదు. దీంతో ఎన్నికను శనివారానికి వాయిదా వేశారు. ఇక చింతకాని మండలంలో ఎంపీపీ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ మండలంలో టీఆర్ఎస్, సీపీఎంలు మిత్రపక్షం గా వ్యవహరించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేశాయి. జెడ్పీటీసీ టీఆర్ఎస్కు, ఎంపీపీ సీపీఎంకు ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది. జెడ్పీటీసీని టీఆర్ఎస్ గెలుచుకుంది. ఎంపీపీ పదవిని టీఆర్ఎస్ మద్దతుతో సీపీఎం గెలుచుకునే అవకాశం ఉంది. అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎంపీటీసీ పూర్ణయ్య పార్టీ విప్‌ను ధిక్కరించి ఎంపీపీ పదవికి నామినేషన్ వేయడంతో ఆయనకు కాంగ్రెస్, సీపీఐలకు చెందిన ఎంపీటీసీలు మద్దతు ప్రకటించారు. దీంతో అనూహ్య రీతిలో పూర్ణయ్య ఎంపీపీగా విజయం సాధించారు. అయితే పూర్ణయ్య పార్టీ విప్‌ను ధిక్కరించారంటూ పార్టీ మండల నాయకులు ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. ఇక కారేపల్లి ఎంపీపీ పదవి కోసం టీఆర్ఎస్లో తీవ్ర పోటీ నెలకొంది. ఈ పదవి కోసం ముగ్గురు ఎంపీటీసీలు పోటీ పడ్డారు. టీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యురాలు మాలోతు శకుంతల, భాగ్యనగర్‌తండా నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన ఈశ్వరీనందరాజ్తోపాటు గుంపెళ్లగూడెం ఎంపీటీసీ ధరావత్ అచ్చమ్మ ఎంపీపీ పదవి కోసం పోటీ పడ్డారు. అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి శకుంతలను ఎంపిక చేసినట్లు మిగిలిన ఇద్దరికి నాయకులు నచ్చజెప్పడంతో ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగింది. ప్రశాంతంగా ఉపాధ్యక్ష, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక.. ఇక జిల్లాలో ఉపాధ్యక్ష, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. బోనకల్, ఏన్కూరులలో మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకోగా.. ముదిగొండ ఉపాధ్యక్ష పదవిని సీపీఎం దక్కించుకుంది. వైరా ఉపాధ్యక్షురాలిగా ఎంపీటీసీగా టీఆర్ఎస్ రెబల్‌గా పోటీ చేసిన లక్ష్మీనరసమ్మ విజయం సాధించింది. మండల పరిషత్ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించిన అధికారులు మధ్యాహ్నం మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ కైవసం చేసుకున్న జెడ్పీటీసీలైన తిరుమలాయపాలెం, కామేపల్లిలో సైతం టీఆర్ఎస్ అభ్యర్థులే ఎంపీపీలుగా గెలుపొందారు. బోనకల్లో మాత్రం కాంగ్రెస్, సీపీఎం కూటమికి ఎంపీపీ పదవి దక్కింది. ఇక కారేపల్లి మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవిని టీఆర్ఎస్ తరఫున ఇమ్మడి రమాదేవికి ఇచ్చేందుకు నిర్ణయించగా.. అప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చిన 8 మంది ఎంపీటీసీలు రావూరి శ్రీనివాసరావుకే వైస్ ఎంపీపీ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో కారేపల్లికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు, స్థానిక వార్డు సభ్యుడు గంగరబోయిన సత్యం పెట్రోల్ బాటిల్‌ను తీసుకొచ్చి.. రావూరికి వైస్ ఎంపీపీ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోల్ మీద పోసుకోబోగా.. కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఎంపీటీసీ సభ్యుల నిర్ణయం మేరకు రావూరి శ్రీనివాసరావుకు వైస్ ఎంపీపీ పదవిని కేటాయించారు. -
ఎంపీపీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
మెదక్ రూరల్: మండల ప్రజా పరిషత్ అధ్యక్ష ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఎంపీపీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారులు, ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరోక్ష ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలని సూచించారు. సమావేశ మందిరంలో ఎంపీటీసీలుగా ఎంపికైన వారు ఒకవైపు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లాంటి ప్రత్యేక ఆహ్వానితులు కూర్చునేందుకు మరోవైపు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎన్నికల రోజున ముందుగా కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం నామినేషన్లను స్వీకరించడం జరుగుతుం దన్నారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు తర్వాత అభ్యర్థి ఎన్నికను అధికారికంగా ప్రకటించాలన్నారు. కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక జరిగేందుకు సరైన కోరం లేనట్లయితే సరిపడా సభ్యులు వచ్చేంత వరకు అధికారులు వేచి చూడాలన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అనుమానాలకు చోటివ్వకుండా పారదర్శకంగా పరోక్ష ఎన్నికలను నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ లక్ష్మీబాయి, డీపీఓ హనోక్‌తో పాటు ప్రిసైడింగ్ అధికారులు, ఎంపీడీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారు!
అచ్చంపేట: వరుస ఎన్నికలతో మరోసారి పల్లెలు సందడిగా మారనున్నాయి. లోక్‌సభతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ వరకు ఎన్నికల కోలాహలం ఉండడంతో రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయారు. ఇక అధికారులు ఓటర్లు, మున్సిపల్ వార్డులు, పరిషత్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఒక్కో తంతు పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు మమ్మురమైంది. ఇప్పటికే ఎంపీపీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లా ప్రజా పరిషత్‌ల పరిధిలోని 71మండల ప్రజాపరిషత్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో ఒక మండలం ఏజెన్సీ ఏరియాలో ఉంది. మిగిలిన 70మండలాల్లో 50శాతం అంటే 35మండలాల ఎంపీపీ స్థానాలను జనరల్‌కు కేటాయించారు. మిగిలిన వాటిలో ఏడు ఎస్టీలకు, 14 ఎస్సీలకు, 14 బీసీలకు రిజర్వ్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేటగిరిలో అన్ని స్థానాల్లో 50 శాతం మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వారి జనాభా ప్రాతిపదికన, బీసీ రిజర్వేషన్లు ఓటర్ల ప్రకారం నిర్ణయించారు. గతంలో ఇలా.. గతంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జెడ్పీటీసీలు జిల్లా పరిషత్‌లో నామినేషన్లు వేయగా, ఎంపీటీసీలు ఆయా మండలాల్లో సమర్పించేవారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వాటిని సవరించి జెడ్పీటీసీలు మండల కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు. అదేవిధంగా మూడు ఎంపీటీసీ నియోజకవర్గాలకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమించి నామినేషన్లు స్వీకరించే విధంగా నిర్ణయించారు. దీంతో ఇటు జెడ్పీటీసీ, అటు ఎంపీటీసీ అభ్యర్థులకు ఇబ్బందులు తొలగనున్నాయి. ఉమ్మడి జిల్లా ఉన్న సమయంలో జిల్లాలో దూర ప్రాంతాల నుంచి జిల్లాకేంద్రానికే వచ్చి నామినేషన్ల పత్రాలు సమర్పించే విషయంలో ఇబ్బందులు తలెత్తేవి. ఇప్పుడు ఎన్నికల సంఘం వెసులుబాటు కలిగించడంతో ఊరట కలగనుంది. 600–700మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం 600 మంది నుంచి 700 మంది ఓటర్ల వరకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు ఓటరు జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం తిరిగి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టింది. ఈ ఎన్నికల్లో చాలా ఓట్లు గల్లంతు కావడంతో వాటిని తిరిగి చేర్పించేందుకు ఓటర్ల నమోదు ముసాయిదా నిర్వహించారు. ఓటర్లు కూడా పెద్ద ఎత్తున నమోదు చేసుకున్నారు. అసెంబ్లీ ఓటర్లతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో దాదాపు 2లక్షల ఓటర్లు కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. తుది జాబితాను ఫిబ్రవరి 22వ తేదీన ప్రకటించారు. ఈ జాబితాను ఆధారంగా చేసుకునే ఈ పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్లను విభజించనున్నారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాకు కసరత్తు మొదలుపెట్టారు. ఇటీవల నూతనంగా తయారు చేసిన ఓటర్ల జాబితాను కలెక్టర్ ద్వారా తీసుకున్నారు. దాని ఆధారంగానే గ్రామాల వారీగా ఆయా వార్డుల జాబితాను తయారు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వీటి ఆధారంగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నారు. అనంతరం ఎంపీటీసీల నియోజకవర్గాల వారీగా తయారు చేసి ఈ నెల 27న తుది జాబితాను ప్రకటించనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో కొత్తగా పదర, చారకొండ, పెంటవెల్లి, ఊర్కొండ, వనపర్తి జిల్లాలో చిన్నంబావి, మదనాపురం, శ్రీరంగాపూర్, జోగుళాంబ జిల్లాలో కేటీ దొడ్డి, రాజోళి, ఉండవెల్లి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో మరికల్, మూసాపేట, రాజాపూర్, కృష్ణా మండలాలు ఏర్పడ్డాయి. పాత మండల పరిషత్‌లో ఉన్న ఈ మండలాల్లో కొత్త పరిషత్‌లు ఏర్పాటు కానున్నాయి. అలాగే ఏ జిల్లాకు ఆ జిల్లా జెడ్పీటీసీలతో కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పాటు కానుంది. మొత్తం ఉమ్మడి జిల్లాలో కలిపి ప్రస్తుతం 71 జెడ్పీటీసీ, 804 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. -
‘స్థానిక’ రిజర్వేషన్ల ఖరారు నేడే
సాక్షి, నల్లగొండ : స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 5వ తేదీలోగా రిజర్వేషన్లను ఖరారు చేసి నివేదికలు పంపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన జిల్లా పరిషత్‌లతోపాటు మండలాలను నోటిఫైడ్ చేస్తూ గెజిట్‌ను కూడా విడుదల చేసింది. దీంతో జిల్లా పరిషత్ అధికారులు రిజర్వేషన్ ప్రక్రియను ముమ్మరం చేశారు. మంగళవారం సాయంత్రంలోగా రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసి అందించాల్సి ఉంది. గ్రామపంచాయతీ ఓటర్ల జాబితా ఆధారంగా.. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల కోసం తయారు చేసిన ఓటర్ల జాబితా ఆధారంగా స్థానిక సం స్థల ఎన్నికలు నిర్వహించాలని మొదట నిర్ణయించింది. ఆ మేరకు వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపొందించాలని గ్రామ పంచాయతీలకు అప్పగించారు. ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున త్వరితగతిన ఎన్నికలు నిర్వహించేందుకు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహించాలని ప్రస్తుతం నిర్ణయించింది. దీంతో ఆ ఓటర్ల జాబితా ప్రకా రమే రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. నేడు రిజర్వేషన్లు ఖరారు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను కలెక్టర్, ఆర్డీఓల ఆధ్వర్యంలో ఎంపీడీఓలు పూర్తి చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ 5వ తేదీలోగా రిజర్వేషన్ తయారు చేసి నివేదికలు పంపించాలని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రిజర్వేషన్ ప్రక్రియను ఆయా కలెక్టర్లు, ఆర్డీఓల ఆధ్వర్యంలో ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం వరకు ప్రక్రియ ముగియనుంది. వెంటనే అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే జిల్లా ఎంపీపీల రిజర్వేషన్ కోటా ఖరారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ ఆయా జిల్లాలకు కేటాయించిన ఎంపీపీల రిజర్వేషన్లను ప్రకటించారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో మొత్తం 71 మండలాలు ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తం ఎస్సీలకు 12 ఎంపీపీ స్థానాలు, ఎస్టీలకు 10, బీసీలకు 13, అన్ రిజర్వ్డ్ కింద 36 ఎంపీపీ స్థానాలను రిజర్వ్ చేశారు. ఈ జాబితాను ఇప్పటికే ఆయా కలెక్టర్లకు పంపించారు. జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లకు ఫైనల్ అథారిటీ కలెక్టర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లు ఇప్పటికే ఆయా జిల్లాకు కేటాయించిన ఎంపీపీ రిజర్వేషన్లను ఏయే మండలాలకు కేటాయించాలనేది మంగళవారం నిర్ణయిస్తారు. అదే విధంగా జెడ్పీటీసీ రిజర్వేషన్‌కు సంబంధించి కూడా రిజర్వేషన్ ఖరారు చేయనున్నారు. జి ల్లా యూనిట్‌గా తీసుకొని జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ చేయనున్నారు. ఎంపీటీసీల రిజర్వేషన్ బాధ్యత ఆర్డీఓలకు... ఎంపీటీసీలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ ఆర్డీఓల ఆధ్వర్యంలో చేయనున్నారు. ఆయా డివిజన్లలోని మండల ప్రాదేశిక నియోజకవర్గాల్లో రిజర్వేషన్ ఎంపీడీఓలు చేడతారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ జనాభా ఆధారంగా చేస్తుండగా, బీసీ రిజర్వేషన్ మాత్రం ఓటర్ల జాబితా ఆధారంగా చేపట్టనున్నారు. జెడ్పీ అధ్యక్షుడు, ఎంపీపీలు రాష్ట్ర యూనిట్‌గా.. జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఎంపీపీల రిజర్వేషన్లు రాష్ట్ర యూనిట్‌గా తీసుకొని చేయనున్నారు. ఇప్పటికే ఎంపీపీల కోటా ఏ జిల్లాకు ఎవరెవరికి ఎన్ని స్థానాలనేది ప్రకటించారు. జిల్లా పరిషత్ అ«ధ్యక్షుల రిజర్వేషన్ మాత్రం ప్రకటించలేదు. తేలిన ఉమ్మడి జిల్లా ఎంపీపీల రిజర్వేషన్ కోటా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 71 మండలాలు ఉన్నాయి. అందులో నల్లగొండ జిల్లాలో 31 మండలాలు ఉండగా అందులో ఎస్సీలకు 5, ఎస్టీలకు 6, బీసీలకు 4, జనరల్ కేటగిరీలో 16 కేటాయించారు. సూర్యాపేట జిల్లాలో 21 మండలాలకు ఎస్సీ 4, ఎస్టీ 3, బీసీ 4, జనరల్ 12 కేటాయించారు. అదే విధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలకు ఎస్సీ 3, ఎస్టీ 1, బీసీ 5, జనరల్ 8 స్థానాలుగా జిల్లా కోటాను నిర్ణయించారు. -
ఓటర్ల జాబితాలు సిద్ధం చేయండి
సాక్షి, హైదరాబాద్: మండల, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలైంది. వచ్చే జూలై 3,4 తేదీల్లో ప్రస్తుత ఎంపీపీ, జెడ్పీపీపీల కాలపరిమితి ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ గడువు ముగియగానే కొత్త పాలకవర్గాలను ఎన్నుకునేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు, వార్డులవారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా త్వరలోనే ఎస్ఈసీ నోటిఫికేషన్ వెలువరించనుంది. ఈ నెల 22న ప్రకటించనున్న (2019 జనవరి 1 నాటి) అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాకు అనుగుణంగా ఈ జాబితాలను జిల్లా పంచాయతీ అధికారులు (డీపీఓ) సిద్ధం చేయాలని ఎస్ఈసీ సూచించింది. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని డీపీవోలను ఆదేశించింది. ఓటర్ల జాబితాల తయారీకి చర్యలు వేగవంతం చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌కి ఎస్ఈసీ సూచించింది. ఈ జాబితాలకు అనుగుణంగా మండల ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు), జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా సీఈవోలు తయారు చేయాల్సి ఉంటుంది. గురువారం ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు (హైదరాబాద్ మినహా), జిల్లా ఎన్నికల అధికారులకు లేఖ లు పంపించారు. గ్రామ పంచాయతీల్లోని వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించి, ప్రచురించడానికి ప్రాధాన్యత ఏర్పడిన నేపథ్యంలో ప్రతి గ్రామపంచాయతీకి ఒక అధికారిని నియమించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. గ్రామ పంచాయతీలో ఓటర్ల జాబితాను తయారుచేసేందుకు పంచాయతీ కార్యదర్శి కేడర్ అధికారిని డిజిగ్నేట్ చేయాలని జిల్లా కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించింది. ఓటర్ల జాబితాల తయారీకి అనుసరించాల్సిన మార్గదర్శకాలు పాటిం చాలని సూచించింది. పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాలు, గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాలను సరిచూసుకునే కార్యక్రమాన్ని ముందుగానే పూర్తిచేసుకోవాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు సూచించింది. -
నేడు గోపాలపురం MPP ఎన్నిక
-
రసకందాయం.. ‘పట్నం’ రాజకీయం
- 7న ఎంపీపీ ఎన్నికకు ఎట్టకేలకు రంగం సిద్ధం - శిబిరాల్లో మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు - అధికార పార్టీ కైవసం కానున్న పీఠం? ఇబ్రహీంపట్నం: స్థానిక మండల ప్రజా పరిషత్ కొత్త అధ్యక్షుడి ఎన్నికకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారయ్యింది. ఈ నెల 7న ఎంపీపీని ఎన్నుకునేందుకు రంగం సిద్ధమయ్యింది. జూలై 16న వెంకట్రామిరెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో కొత్త ఎంపీపీ ఎన్నిక అనివార్యమయ్యింది. కాగా.. వెంకట్రామిరెడ్డి రాజీనామా చేయడానికి ఒక రోజు ముందు నుంచే నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకున్నాయి. మెజారిటీ ఎంపీటీసీ సభ్యులంతా అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీటీసీ సభ్యుడి శిబిరంలో సేదతీరుతున్నారు. పదిహేనురోజులుగా దాదాపు 8 మంది సభ్యులు రహస్య శిబిరాల్లోనే ఉంటున్నారు. ఎన్నెన్ని మలుపులో.. పట్నం రాజకీయాల్లో పదిహేను రోజుల వ్యవధిలోనే కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎంపీపీ పదవికి వెంకట్రామిరెడ్డి సెలవు పెట్టడంతో మండల ఉపాధ్యక్షుడు కొత్త అశోక్‌గౌడ్ ఇన్చార్జి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వెంకట్రామిరెడ్డి తిరిగి పదవి చేపట్టారు. ఆ వెనువెంటనే పదవికి రాజీనామా చేశారు. ఎంపీపీ పదవికి వెంకట్రామిరెడ్డి రాజీనామా చేస్తారనే నిర్ధారణకు వచ్చిన తడవే.. మెజారిటీ ఎంపీటీసీ సభ్యులంతా అజ్ఞాతంలోకి వెళ్లడంతో స్థానికంగా సంచలనం రేకెత్తించింది. టీఆర్ఎస్ ఖాతాలోకి..? ఎంపీపీ పదవిపై గంపెడాశలతో ఉన్న కప్పాపహాడ్ ఎంపీటీసీ సభ్యుడు మర్రి నిరంజన్‌రెడ్డి ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 14 మంది ఎంపీటీ సభ్యులుండగా.. పార్టీలకతీతంగా ఇప్పటికే ఎనమండుగురు నిరంజన్‌రెడ్డి అధీనంలో ఉన్నట్లు సమాచారం. ఎంపీటీసీ సభ్యులు గౌని ఆండాళు, అశోక్‌గౌడ్, వెంకట్రామిరెడ్డి మినహా మిగతా వారంతా ఇప్పటికే నిరంజన్‌రెడ్డికి మద్దతుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతా సస్పెన్స్.. పట్నం’ ఎంపీపీ పదవిపై చివరి క్షణంలో ఏదైనా జరగవచ్చనే ఊహాగానాలు వస్తున్నా యి. ఇప్పటి వరకు ఆర్ధిక పరమైన అంశాల చుట్టే తిరుగుతున్న క్రమంలో చివరి క్షణం వర కు మెజారిట సభ్యులు ఎవరికి మద్దతు ప్రకటిస్తారోననే విషయం అంతు చిక్కడంలేదు. పదవిని దక్కించుకునేందుకు ప్రస్తుత ఇన్చార్జి ఎంపీపీ కొత్త అశోక్‌గౌడ్, కప్పాపహాడ్ ఎంపీటీసీ సభ్యుడు మర్రి నిరంజన్‌రెడ్డి తమదైన శైలిలో రాజకీయ పాచికలు వేస్తున్నారు. -
చెరో ఎంపీపీ కుర్చీ
చిత్తూరు (అర్బన్): జిల్లాలో నిలిచిపోయిన మూడు ఎంపీపీ స్థానాల ఎన్నికలు ఆదివారం జరగాల్సి ఉండగా, రెండు చోట్ల మాత్రం ఎన్నికలు జరిగాయి. మరోచోట సభ్యులెవరూ రాకపోవడంతో సోమవారానికి ఎన్నిక వాయిదా పడింది. ఈ నెల నాలుగో తేదీ జిల్లాలోని 65 మండలాల్లో ఎంపీపీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎర్రావారిపాళెం, నిమ్మనపల్లె, కేవీబీ పురం మండలాల్లో కోరం లేకపోవడంతో మండలాధ్యక్ష ఎన్నికలు ఈ నెల 5వ తేదీకి వాయిదాపడ్డాయి. ఆ రోజు మెజారిటీ సభ్యులు లేకపోవడంతో ఎన్నికలు వాయిదా వేశారు. తాజాగా ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. ఎర్రావారిపాళెం ఎంపీపీ స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, నిమ్మనపల్లె ఎంపీపీ స్థానాన్ని టీడీపీ కైవశం చేసుకున్నాయి. కేవీబీ పురంలో కోరం లేకపోవడంతో ఎంపీపీ ఎన్నిక సోమవారానికి వాయిదా పడింది. ఎర్రావారిపాళెం మండలంలో మొత్తం 8 ఎంపీటీసీ సెగ్మెంట్లు ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 3, కాంగ్రెస్ 3, టీడీపీ రెండు స్థానాలను కైవశం చేసుకున్నాయి. దీంతో స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో ఇక్కడ మరో పార్టీ అభ్యర్థి మద్దతు తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో మండలంలోని ఉదయమాణిక్యం సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన చెంగమ్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు పలికారు. దీంతో పీ రేవతి (వైఎస్సార్ కాంగ్రెస్) మండలాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.నిమ్మనపల్లె మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్నప్పటికీ టీడీపీ కుయుక్తులు పన్ని ఎంపీపీ స్థానాన్ని తన్నుకుపోయింది. ఇక్కడున్న 9 సెగ్మెంట్లకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 5, టీడీపీకి 4 స్థానాలు వచ్చాయి. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిమ్మనపల్లె సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీ సభ్యుడుగా గెలుపొందిన ఈ చంద్రశేఖర్ టీడీపీ ప్రలోభాలకు గురిచేయడంతో ఆ పార్టీకి మద్దతు పలికారు. దీంతో పారిజాతం (టీడీపీ) మండలాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. కేవీబీ పురంలోని 12 స్థానాలకు గాను టీడీపీ 10, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలను కైవశం చేసుకున్నాయి. ఇక్కడ ఎంపీపీ పదవిని ఎస్టీ మహిళకు రిజర్వ్ చేశారు. దీంతో టీడీపీకి చుక్కెదురైంది. టీడీపీలో ఎస్టీ మహిళ ఎంపీటీసీ సభ్యురాలిగా గెలవకపోవడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్టీ మహిళ గెలుపొందడంతో ఆమెకే ఈ స్థానం అనుకున్నారు. అయితే ఇక్కడ కోటమంగాపురం సెగ్మెంట్ నుంచి టీడీపీ తరఫున గెలుపొందిన లోకనాథం రాజీనామా చేయడంతో ఈ స్థానం నుంచి ఎస్టీ మహిళను పోటీ చేయించేందుకు తెలుగు తమ్ముళ్లు ఆరాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆది వారం జరిగిన ఎంపీపీ ఎన్నికకు వైఎస్సార్ సీపీ నుంచి ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఎస్టీ మహిళను ఒకరు ప్రతిపాదించినా, బలపరిచేవారు లేకపోవడంతో ఈ ఎన్నిక సోమవారానికి వాయిదా పడింది. -
తెలంగాణ ఎంపీపీ ఎన్నికల విజేతలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన ఎంపీపీ ఎన్నికలు ఆదివారం జరిగాయి. వరంగల్, కరీంనగర్ ,రంగారెడ్డి, నల్లగొండ,నిజామాబాద్ తదితర జిల్లాల్లోని పలు మండలాల్లో అధ్యక్ష పీఠాలు ఖరారయ్యాయి. వరంగల్ జిల్లాలోని వెంకటాపురం, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, నల్లబెల్లి మండలాలకు ఎన్నికలు జరగ్గా, హన్మకొండ, మహబూబాబాద్ ఎంపీపీల ఎన్నిక వాయిదాపడింది. కోరం లేక వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. తెలంగాణలోని ఎంపీపీ అభ్యర్థులుగా ఎన్నికైన వివరాలు ఇలా ఉన్నాయి.. నల్లగొండ జిల్లా ఆత్మకూరు(ఎస్) ఎంపీపీగా కె.లక్ష్మి(టీఆర్ఎస్) మునగాల ఎంపీపీగా ఎన్.ప్రమీల (కాంగ్రెస్) వరంగల్ జిల్లా వెంకటాపురం ఎంపీపీగా మేకల పద్మ(కాంగ్రెస్) జనగామ ఎంపీపీగా బి.యాదగిరి (టీఆర్ఎస్ రెబల్ ) స్టేషన్ ఘన్పూర్ ఎంపీపీగా జగన్మోహన్రెడ్డి (టీఆర్ఎస్) రంగారెడ్డి జిల్లా కులకచర్ల ఎంపీపీగా జి.అరుణమ్మ (టీఆర్ఎస్) కరీంనగర్ జిల్లా మహముత్తారం ఎంపీపీగా భాగ్య (టీఆర్ఎస్) ముత్తారం ఎంపీపీగా ఎ.చంద్రమౌళి (టీఆర్ఎస్) -
యాడికిలో ఉద్రిక్తత
తాడిపత్రి : అనంతపురం జిల్లా యాడికి మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలిని టీడీపీ నేతలు ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకుని ఎంపీపీ పీఠం కైవసం చేసుకోవడమే ఇందుకు కారణమైంది. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్సీపీకి 9, తెలుగుదేశం పార్టీకి 7 స్థానాలు దక్కించుకున్నాయి. వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా.. ఈ పార్టీకి చెందిన మూడో నంబర్ ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మికాంతమ్మ ప్రలోభాలకు గురై టీడీపీకి మద్దతు తెలిపింది. దీంతో ఎంపీటీసీ స్థానాలు రెండు పార్టీలకూ సమానం అయ్యాయి. అధికారులు లాటరీ తీయగా అందులో ఎంపీపీ పదవి టీడీపీని వరించింది. ఎన్నికల అనంతరం బయట ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపైకి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పరోక్షంగా టీడీపీ కార్యకర్తలను ఉసిగొలిపి రాళ్లతో దాడి చేయించారు. దీంతో వారిని ఎదుర్కొనేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు కూడా రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు లాఠీచార్జ చేయడంతోపాటు బాష్ప వాయు గోళాలు ప్రయోగించారు. రాళ్లదాడిలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బొంబాయి రమేష్‌నాయుడు, కార్యకర్త మధురాజు, టీడీపీ కార్యకర్తలు వెంకట్రామిరెడ్డి, నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో పోలీసులు కూడా స్వల్పంగా గాయపడ్డారు. పామిడి సీఐ అశోక్‌రెడ్డి, ఎస్ఐ రామక్రిష్ణారెడ్డి, సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఎంపీపీ ఎన్నికలు.. వైఎస్ఆర్ సీపీ నెగ్గిన మండలాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తాచాటింది. నెల్లూరు జిల్లాలో అత్యధిక ఎంపీపీలను కైవసం చేసుకుంది. కొన్ని జిల్లాల్లో అధికార టీడీపీతో నువ్వా నేనా అన్నట్టు తలపడగా.. మరికొన్ని జిల్లాల్లో టీడీపీ ముందంజలో నిలిచింది. కాగా టీడీపీ నేతలు చాలా చోట్ల దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అందిన సమాచారం మేరకు వైఎస్ఆర్ సీపీ నెగ్గిన మండలాలు.. అనంతపురం: వజ్రకరూరు ఎంపీపీ- వెంకటమ్మ, కూడేరు ఎంపీపీ-మహేశ్వరి, ఎల్లనూరు ఎంపీపీ- మునిప్రసాద్, బుక్కరాయసముద్రం ఎంపీపీ- ఆదిలక్ష్మి, రాయదుర్గం ఎంపీపీ- భారతి, గాండ్లపెంట ఎంపీపీ-పద్మజ, నల్లమాడ ఎంపీపీ-బ్రహ్మానందరెడ్డి, బత్తలపల్లి ఎంపీపీ- కోటి సూర్యప్రకాశ్‌బాబు, ముదిగుబ్బ ఎంపీపీ-మాలతి, తలుపు ఎంపీపీ- సుబ్బలక్ష్మి వైఎస్ఆర్ కడప: రాయచోటి నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లి, రామాపురం, చిన్నమండెం, రాయచోటి, తంబేపల్లి, గాలివీడు ఎంపీపీలు వైఎస్ఆర్ సీపీ కైవసం లక్కిరెడ్డిపల్లి ఎంపీపీగా వైఎస్ఆర్ అభ్యర్థి ఎ.రెడ్డయ్య ఎన్నిక గుంటూరు: చేబ్రోలు ఎంపీపీగా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి షేక్ ఖాదర్‌బాషా ఎన్నిక కర్లపాలెం ఎంపీపీగా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి ఎం.వెంకటరత్నం ఎన్నిక చిత్తూరు: చిత్తూరు ఎంపీపీగా మునికృష్ణయ్య ఎన్నిక మదనపల్లె ఎంపీపీగా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి సుజణ ఎన్నిక కృష్ణా: ఉయ్యూరు ఎంపీపీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి తుమ్మూరు గంగారత్నభవాని ఎన్నిక గుడివాడ ఎంపీపీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి వరలక్ష్మి ఎన్నిక జిల్లాల వారీ సమాచారం: నెల్లూరు: 46 వైఎస్ఆర్ సీపీ-29, కొండాపురం, సూళ్లూరుపేట ఎన్నిక రేపటికి వాయిదా కర్నూలు: వైఎస్ఆర్ సీపీ-24, కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా శ్రీకాకుళం: వైఎస్ఆర్సీపీ-12, విజయనగరం: వైఎస్ఆర్సీపీ-6 గంటాడ ఎంపీపీ ఎన్నిక వాయిదా చిత్తూరు: వైఎస్ఆర్ సీపీ-23 ఎర్రవారిపాళ్యం ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా -
ఎంపీపీ ఎన్నికలు.. ఆంధ్రప్రదేశ్ ఫలితాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎంపీపీల ఎన్నికల్లో కాంగ్రెస్ బోణీ కొట్టలేకపోయింది. కాంగ్రెస్ ఒక్క ఎంపీపీని కూడా గెల్చుకోలేకపోయింది. కాగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని జైసమైక్యాంధ్ర పార్టీ మాత్రం రెండు ఎంపీపీలను సొంతం చేసుకున్నారు. ఇక అధికార తెలుగుదేశం పార్టీ జోరు సాగింది. కొన్ని జిల్లాల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడంద. ఎన్నికల సందర్భంగా చాలా చోట్ల టీడీపీ కార్యాకర్తలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. జిల్లాల వారీగా ఫలితాలు.. అనంతపురం: మొత్తం ఎంపీపీలు 63 టీడీపీ-53, వైఎస్ఆర్ సీపీ -10 కర్నూలు: 52 వైఎస్ఆర్ సీపీ-24, టీడీపీ-27, స్వతంత్ర-1 కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా శ్రీకాకుళం: 38 వైఎస్ఆర్సీపీ-12, టీడీపీ-26! విజయనగరం: 34 టీడీపీ-27, వైఎస్ఆర్సీపీ-6 గంటాడ ఎంపీపీ ఎన్నిక వాయిదా చిత్తూరు: 65 వైఎస్ఆర్ సీపీ-23, టీడీపీ-36, జేఎస్పీ -2, స్వతంత్ర-3 ఎర్రవారిపాళ్యం ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా నెల్లూరు: 46 వైఎస్ఆర్ సీపీ-29, టీడీపీ-15 కొండాపురం, సూళ్లూరుపేట ఎన్నిక రేపటికి వాయిదా -
ఎంపీపీ ఎన్నికలు.. తెలంగాణలో కారు జోరు
హైదరాబాద్: తెలంగాణలో ఎంపీపీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ జోరు కొనసాగింది. చాలా జిల్లాల్లో అత్యధిక ఎంపీపీలను కైవసం చేసుకుంది. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఎక్కువ ఎంపీపీలను గెల్చుకుంది. తెలంగాణలో జిల్లాల వారీగా ఫలితాల వివరాలు.. మెదక్: మొత్తం మండలాలు 46 టీఆర్ఎస్ -26 కాంగ్రెస్-16, టీడీపీ-2, స్వతంత్రులు-1 సదాశివపేట ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా ఆదిలాబాద్: 52 టీఆర్ఎస్-42, టీడీపీ-5, కాంగ్రెస్-3, స్వతంత్రులు-1 ఇచ్చోడ ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా కరీంనగర్: 57 టీఆర్ఎస్-41, కాంగ్రెస్-11, బీజేపీ-2, సీపీఐCPI-1 మహముత్తారం, మంథనిముత్తారం ఎన్నిక రేపటికి వాయిదా నల్గొండ: 59 కాంగ్రెస్-29, టీఆర్ఎస్-12, టీడీపీ-6, సీపీఎం-2, బీజేపీ-1, స్వతంత్ర-1 మునుగోడు, చిట్యాల, యాదగిరిగుట్ట, భువనగిరి, ఆత్మకూరు(s), మునగాల ఎంపీపీల ఎన్నిక రేపటికి వాయిదా నిజామాబాద్: 36 టీఆర్ఎస్-24, కాంగ్రెస్-9, స్వతంత్ర-1 బిక్నూరు ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా ఆదిలాబాద్: 52 టీఆర్ఎస్-42, టీడీపీ-5, కాంగ్రెస్-3, స్వతంత్ర-1 ఇచ్చోడ ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా -
జంపింగ్ జపాంగ్
ఇబ్రహీంపట్నం రూరల్: ఎంపీపీ ఎన్నిక కోసం ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన మరుక్షణమే క్యాంప్‌లకు సిద్ధమైన నేతలకు ఎంపీటీసీలు చుక్కలు చూపిస్తున్నారు. ఇన్నాళ్లు తమతో కలిసివున్న ఎంపీటీసీలు చేజారుతుండటంతో పీఠంపై కన్నేసిన ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిషత్ అధ్యక్ష పీఠంపై కన్నేసిన పార్టీలు ఎంపీటీసీలకు భారీ నజరానాలు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో టీడీపీ 5, కాంగ్రెస్, రెబల్స్ కలుపుకుని 6 స్థానాలను గెలుచుకున్నాయి. బీజేపీ 2, సీపీఎం 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఫలితాలు వెలువడింది మొదలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు శిబిరాలు నిర్వహించి ఎంపీటీసీలను దేశ నలుమూలలా విహారయాత్రలకు తిప్పారు. ఎవరూ చేయి జారిపోకుండా తాజాగా రూ.లక్షల్లో బేరసారాలకు దిగుతున్నట్లు తెలిసింది. మధ్యవర్తుల సాయంతో ఎరవేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మధ్యవర్తికి రూ.15లక్షలు, ఎంపీటీసీకి రూ.40లక్షలు ఆఫర్ చేసినట్లు వినికిడి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఒక ఎంపీటీసీ టీడీపీ శిబిరానికి చేరువైనట్లు తెలిసింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీటీసీని ఎలా లాక్కొంటారని ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీటీసీలు శుక్రవారం రాత్రి నగరంలోని బీఎన్‌రెడ్డి నగర్లో ఉండే ఓ టీడీపీ నేత ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఊహించని పరిణామంతో ఖంగుతిన్న టీడీపీ నాయకులు ఎదురుదాడికి సిద్ధమయ్యారు. పరిస్థితి కొట్టుకునేదాకా వెళ్లింది. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోయిన ఎంపీటీసీని రాబట్టుకునే పనిలో కాంగ్రెస్ ఉండగా.. ఆచూకీ తెలియకుండా టీడీపీ జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. సదరు కాంగ్రెస్ ఎంపీటీసీని ఓటింగ్‌కు హాజరవకుండా చేసి గట్టెక్కేందుకు టీడీపీ ఎత్తుగడ వేస్తుండగా.. ఉన్నవారికి తోడు బీజేపీ, సీపీఎం ఎంపీటీలను తమవైపు తిప్పుకుని ఎలాగైనా ఎంపీపీ పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. -
‘హంగ్’ ఆసక్తికరం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఎంపీపీ ఎన్నికలకు నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనున్న నేపథ్యంలో ‘మండల’ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. ము ఖ్యంగా హంగ్ ఫలితాలొచ్చిన మండలాల్లో మారుతున్న సమీకరణాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రా ని పలు మండల పరిషత్ పీఠాలను ఎగురేసుకు వెళ్లేం దుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి రావడంతో ఎక్కువ ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు మార్గం సుగమమవుతోంది. మరికొన్ని మండలాల్లో కాంగ్రెస్ కూడా ఈ పదవులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. నజరానాలతో ఎర జిల్లాలో 52 మండల పరిషత్‌లకు 25 మండల పరిషత్‌లలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఈ మండలాల ఎంపీపీ పీఠాలు దక్కించుకోవాలంటే స్వతంత్రులు, ఇతర పార్టీల ఎంపీటీసీ సభ్యుల మద్దతు తప్పనిసరి. దీంతో ఈ పీఠాలు ఆశించిన నేతలు తమకు అవసరమైన మద్దతు కూడ గట్టేందుకు తంటాలు పడుతున్నారు. తమకు మద్దతిచ్చిన సభ్యులకు పెద్ద మొత్తంలో నగదుతోపాటు, మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవిని ఇస్తామంటూ ఎరవేస్తున్నారు. మరోవైపు హంగ్ ఫలితాలొచ్చిన ఈ మండలాల్లో ఎంపీటీసీల క్యాంపులు ఇంకా కొనసాగుతున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని ఆయా మండలాల్లో నెలకొన్న పరిస్థితులను పరిశీలిస్తే.. బేల మండల పరిషత్ పీఠం దక్కాలంటే ఆరుగురు ఎంపీటీసీల మద్దతు ఉండాలి. కానీ ఏ పార్టీకి ఈ మె జార్టీ రాలేదు. టీఆర్ఎస్, బీజేపీలు నాలుగేసి ఎంపీటీసీ స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ రెండు, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి ఎంపీపీ పీఠాన్ని ద క్కించుకునేందుకు పావులు కదుపుతుండగా, స్వతం త్ర ఎంపీటీసీతోపాటు మరో సభ్యుడి మద్దతుతో చైర్మన్ స్థానం కోసం టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇచ్చోడలో 15 ఎంపీటీసీ స్థానాలకు మూడు స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ స్వతంత్ర ఎంపీటీీసీతోపాటు మరో సభ్యుని మద్దతుతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. బజార్హత్నూర్ మండలంలో కూడా రెండు స్థానాల కే పరిమితమైన టీఆర్ఎస్ టీడీపీ సభ్యుల మద్దతుతో ఎంపీపీ స్థానాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. బోథ్ ఎంపీపీ స్థానానికి టీఆర్ఎస్లోనే ఇద్దరు ఎంపీటీసీలు పోటీ పడుతున్నారు. ఇతర పార్టీ సభ్యుల మద్దతుతో ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బేరసారాలు నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాలుగు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ కూడా ఎంపీపీ పీఠంపై దృష్టి సారించింది. ఆసిఫాబాద్ ఎంపీపీ స్థానంపై రసవత్తరమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ఆరేసీ ఎంపీటీసీ స్థానాలు గె లుచుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు టీడీపీ, సీపీఐ ఎంపీటీసీల మద్దతు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో టీడీపీకి చెందిన ఓ ఎంపీటీసీ టీఆర్ఎస్ వైపు వెళ్లినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. వాంకిడి మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలను గె లుచుకున్న టీడీపీ మరో సభ్యుని మద్దతుతో ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు క్యాంపు రాజకీయా లు నడుపుతోంది. ఎంపీపీ పీఠం దక్కించుకోవాలం టే ఇంకో సభ్యుని మద్దతు తప్పనిసరి అవుతోంది. నిర్మల్‌లో 15 ఎంపీటీసీ స్థానాల్లో ఆరు స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకోగా, నాలుగు స్థానాల్లో బీఎస్పీ ఎంపీటీసీలు విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఇంద్రకరణ్‌రెడ్డి టీఆర్ఎస్ లో చేరనుండడంతో ఈ ఎంపీపీ స్థానం టీఆర్ఎస్కు గాని, బీఎస్పీకి కానీ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ కీలకం కానుండటం విశేషం. సారంగాపూర్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. లోకేశ్వరం మండలం ప్రాదేశిక ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. పది ఎంపీటీసీ స్థానాల్లో ఐదు చొప్పున టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు గెలుచుకున్నాయి. అయితే కాంగ్రెస్ ఎంపీటీసీ ఒకరు మద్దతుతో ఈ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. దండేపల్లిలో 14 ఎంపీటీసీ స్థానాలకు ఏడు ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్ మరో స్వతంత్ర ఎంపీటీసీ మద్దతుతో పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. బెల్లంపల్లిలో ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకు నాలుగు చొప్పున కాంగ్రెస్, టీఆర్ఎస్లు కైవసం చేసుకోగా, ఎంపీపీ స్థానం మాత్రం టీఆర్ఎస్కు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్లోనే రెండు శిబిరాలు కొనసాగుతుండడం గమనార్హం. మందమర్రిలో 14 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అత్యధికంగా సీపీఐ ఐదు స్థానాలను గెలుచుకోగా, కాం గ్రెస్ మూడు, టీఆర్ఎస్, టీడీపీ ఒక్కొక్కటి చొప్పున విజయం సాధించారు. ఇక్కడ నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. అయితే సీపీఐ, కాంగ్రెస్‌కు కాని ఎంపీపీ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. కాగజ్‌నగర్‌లో 15 ఎంపీటీసీ స్థానాలుండగా ఆరుచోట్ల కాంగ్రెస్, ఐదుచోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. బీజేపీ, టీడీపీ సభ్యులతో టీఆర్ఎస్ క్యాంప్ నిర్వహిస్తోంది. ఉట్నూర్‌లో 18 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ తొమ్మిది గెలుచుకోగా, ఎంఐఎం, ఇండిపెండెంట్ సభ్యుల మద్దతు టీఆర్ఎస్కు ఉంది. కాని టీఆర్ఎస్లోనే ఎంపీపీ స్థానం కోసం ఐదుగురు ఎంపీటీసీలు పోటీ పడుతుండటం రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది.