‘పేట’లోనూ కారు జోరు  | TRS Full Josh In MPP Elections Mahabubnagar | Sakshi
Sakshi News home page

‘పేట’లోనూ కారు జోరు 

Published Sat, Jun 8 2019 1:27 PM | Last Updated on Sat, Jun 8 2019 1:27 PM

TRS Full Josh In MPP Elections Mahabubnagar - Sakshi

నారాయణపేట: జిల్లాలో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఎన్నికల ప్రొసిడింగ్‌ అధికారుల పర్యవేక్షణలో మొదటగా కో ఆప్షన్‌ సభ్యుడి నామినేషన్‌ దాఖలు అనంతరం ఎన్నికైన వారి ఫలితాలను మధ్యాహ్నం ఒంటి గంటకు వెల్లడించారు. ఎంపీపీ ఎన్నికకు సంబంధించి నోటీస్‌ జారీ చేశారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలను నిర్వహించారు. జిల్లాలోని 11 మండలాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన  8 మంది ఎంపీపీలు కాగా ఇద్దరు బీజేపీ ఎంపీపీలు, ఒకరు కాంగ్రెస్‌ ఎంపీపీలు అయ్యారు. అలాగే వైస్‌ ఎంపీపీలు టీఆర్‌ఎస్‌ 8, కాంగ్రెస్‌ 2, బీజేపీ నుంచి ఒకరు  అయ్యారు.
 
ఎమ్మెల్యేల ప్రత్యేక దృష్టి 
జిల్లాలోని మక్తల్, నారాయణపేట, కొడంగల్‌ ఎమ్మెల్యేలు చిట్టెం రాంమోహన్‌రెడ్డి, ఎస్‌.రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డిలు వారివారి నియోజకవర్గాలోని మండలాలకు వెళ్లి ఎంపీపీల ఎన్నికలపై దృష్టి సారించారు. ఎన్నిక సమయంలో వారి వారి పార్టీల అభ్యర్థుల కదలికలు, మద్దతులపై నిఘా ఉంచారు. పార్టీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తమ పార్టీల అభ్యర్థులు ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకునే విధంగా పకడ్బందీగా వ్యూహ రచనలు చేస్తూ సఫలీకృతులయ్యారు.

మద్దూర్‌లో అధికార పార్టీకి చుక్కెదురు 
మద్దూర్‌ మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు గాను 10 ఎంపీటీసీలు అధికారపార్టీకి చెందిన వారు విజయం సాధించారు. మరో 9 మంది ఎంపీటీసీలు కాంగ్రెస్‌ ఎంపీటీసీలు గెలుపొందారు. సంపూర్ణ మెజార్టీ సాధించిన అధికార పార్టీ ఎంపీపీ కావాల్సి ఉండగా ఎంపీపీ ఎన్నిక సమయంలో హన్మనాయక్‌ తాండా ఎంపీటీసీ చిన్నమ్మ టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థి ఈశ్వరమ్మకు చేయ్యి ఎత్తకుండా నిమ్మకుండిపోయారు. అలాగే టీఆర్‌ఎస్‌ బలపరిచిన వైస్‌ ఎంపీపీ ఏకే. రాజుకు సైతం చేయి ఎత్తకుండా అలాగే కూర్చుంది. ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక సమయంలో చిన్నమ్మ చేయ్యెత్తకపోవడంతో  టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ఎంపీపీలుగా బలపరిచిన వారిలో సరిసమానమయ్యారు.

దీంతో లక్కి డిప్‌ ద్వారా ఎన్నికను నిర్వహించారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన విజయలక్ష్మికి ఎంపీపీగా డీప్‌లో లక్కిగా బయటపడింది. అదృష్టమంటే ఇదేనేమో మరి. మొదటగా టీఆర్‌ఎస్‌ నుంచి మండల కో–ఆప్షన్‌ సభ్యుడిగా జిలానీని నాయకులు ప్రతిపాదించారు. అయితే అనుకున్న సమయానికి నామినేషన్‌ దాఖలు చేయకపోవడం, కాంగ్రెస్‌ ప్రతిపాదించిన ఇబ్రహీం దాఖలు చేయడంతో మండల కో–ఆప్షన్‌ ఎన్నిక ఏకగ్రీవమైయింది. వైస్‌ ఎంపీపీగా వెంకట్‌రెడ్డిని లక్కి డిప్‌ వరించినట్లయింది. అప్పటికే మద్దూర్‌ మండలంలో జెడ్పీటీసీ పదవిని అధికార పార్టీ కోల్పోయి కాంగ్రెస్‌ పార్టీ విజయం  సాధించింది. ఎంపీపీ అయినా టీఆర్‌ఎస్‌ వశమవుతుందనుకుంటే తీరా కాంగ్రెస్‌ పార్టీకి దక్కడంతో రాజకీయ యోగం అంటే ఇదేనేమో అంటూ చర్చానీయాంశంగా మారింది.

ధన్వడలో స్వతంత్రులకే వరం 
ధన్వాడ మండలం ఎంపీపీ రిజర్వేషన్‌ ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. కాగా మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాలకు 4 బీజేపీ, 4 టీఆర్‌ఎస్, 3 స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థులను కలుపుకుపోయి టీఆర్‌ఎస్‌ ఎంపీపీని పదవిని దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. రాంకిష్టయ్యపల్లి ఎంపీటీసీ గంగాబాయి 
అధికారపార్టీ గాలం వేసితమ వైపు మళ్లించుకుంది. అయితే బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ రంగంలోకి దిగి తన పుట్టినగడ్డలో ఎలాగైనా బీజేపీ ఎంపీపీ పీఠమెక్కించాలని వ్యూహరచన చేస్తూ సఫలీకృతమైంది. నాలుగు స్థానాల్లో గెలిచిన ఎంపీటీసీలను బుజ్జగిస్తూ స్వతంత్రులుగా గెలిచిన కొండాపూర్‌ ఎంపీటీసీ రాజేందర్‌రెడ్డి, హన్మన్‌పల్లి ఎంపీటీసీ పద్మిబాయిని పార్టీలో చేర్చుకొని ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులను కట్టబేట్టేలా పావులు కదిపింది. ఎంపీపీగా పద్మిబాయి, వైస్‌ ఎంపీపీగా రాజేందర్‌రెడ్డిలు కావడంతో బీజేపీ పాగావేసింది.

అనుకున్నదొకటి... అయ్యిందొకటి! 
మాగనూర్‌ మండలం ఎంపీపీ ఎస్సీ మహిళకు రిజర్వుఅయింది. మండలంలోని 7 ఎంపీటీసీ స్థానాల్లో బీజేపీ 2, టీఆర్‌ఎస్‌ 4, స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. అయితే గెలుపొందిన ఎంపీటీసీలో ఎస్సీ మహిళ లేకపోవడంతో అధికార పార్టీకి మొదట్లోనే చుక్కెదురైంది. ఎలాగైనా గెలిచిన బీజేపీ ఎంపీటీసీని తమవైపు మలుపుకొని ఎంపీపీని కైవసం చేసుకోవాలనుకుంది. అధికార పార్టీలో వైస్‌ ఎంపీపీ కోసం వర్కూర్‌ ఎంపీటీసీ తిప్పయ్య, మరొకరపు పోటీపడ్డారు. వారి మధ్య సయోద్య కుదరకపోవడంతో నిమ్మకుండిపోయారు. తీరా ఎంపీపీ ఎన్నిక సమయానికి సీన్‌ మారింది. టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన తిప్పయ్య బీజేపీకి మద్దతు తెలుపుతూ ఎంపీపీ శ్యామలమ్మ అయ్యేందుకు చేతులేత్తారు. వైస్‌ ఎంపీపీ ఎన్నిక సమయంలో బీజేపీ 2, స్వతంత్ర అభ్యర్థి ఒకరూ మద్దతు తెలుపడంతో నలుగురు కావడంతో తిప్పయ్య వైస్‌ ఎంపీపీ అయ్యారు. ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి వచ్చిన ఏమైనా మార్పు వస్తుందనుకున్నారు. కాని తిప్పయ్య అనుకున్నదే చేశారు. బీజేపీ వ్యూహం ఫలించడంతో మాగనూర్‌ మండలంలో ఇద్దరు ఎంపీటీసీలు గెలిచిన ఎంపీపీ బీజేపీ వశమైంది. 

మక్తల్‌లో కాంగ్రెస్‌ వైస్‌ ఎంపీపీ 
మక్తల్‌ మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు చేరి 7 స్థానాల్లో ఎంపీటీసీలను గెలుపొందారు. సత్యవార్‌కు చెందిన ఎంపీటీసీ రామేశ్వరి ఒక్కరే కాంగ్రెస్‌ పార్టీని విజయం సాధించింది. ఎవరూ ఎంపీపీ కావాలన్నా ఆమె మద్దతు కావాల్సిందే. ఒక వైపు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నేత కొండయ్యలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. తమ పార్టీలోకి వస్తే ఎంపీపీ పదవిని ఇస్తామని ఆఫర్‌ చేశారు. మద్దతిస్తే వైస్‌ ఎంపీపీని కట్టబెడతామని వలవేశారు. అధికార పార్టీకి చెందిన మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ఇజ్జత్‌కే సవాల్‌గా పావులు కదిపారు. సత్యవార్‌కు చెందిన కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీ రామేశ్వరమ్మ ఊట్కూర్‌కు చెందిన మాజీ సర్పంచ్‌ ఎం.బాల్‌రెడ్డి మరదలు అని తెలుసుకున్నారు. వెంటనే బాల్‌రెడ్డిని రంగంలోకి దింపి వ్యూహరచన చేస్తూ తమ వైపు గాలం వేయించారు. అధికార పార్టీకి మద్దతునిస్తూ ఆమెను వైస్‌ ఎంపీపీని చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement