జడ్చర్ల: ఆశావాహులు అడ్డగోలు.. అయోమయం వీడితేనే..! | Mahabubnagar: Who Next Incumbent in Jadcherla Constituency | Sakshi
Sakshi News home page

జడ్చర్ల: ఆశావాహులు అడ్డగోలు.. అయోమయం వీడితేనే..!

Published Tue, Aug 8 2023 9:02 PM | Last Updated on Tue, Aug 29 2023 10:14 AM

Mahabubnagar: Who Next Incumbent in Jadcherla Constituency - Sakshi

నియోజకవర్గం: జడ్చర్ల 
మండలాల సంఖ్య: 6 (జడ్చర్ల, మిడ్జిల్, ఊరుకొండ, బాలానగర్, రాజాపూర్, నవాబుపేట)
మొత్తం పంచాయితీలు: 187
మొత్తం ఓటర్లు: 202404 ఓట్లు
పురుషులు: 102076; మహిళలు: 100326

ఆ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి . ఉమ్మడి పాలమూరు జిల్లాకు రాజకీయ మూలస్థంభంగా వున్న జడ్చర్ల నియోజక వర్గంలో ప్రధాన పార్టీలలో పోటీ చేయాలనే ఆశావాహుల సంఖ్య పెరుగుతుండటం ఆసక్తిని రేపుతుంది. నేతల వ్యవహారంతో అయా పార్టీలో వున్న కార్యకర్తలు అయోమయానికి గురి అవుతున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ అనివార్యం కానుంది.

పారిశ్రామికంగా దినదినాభివృద్ది చెందుతున్న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. ఇటు 44 అటు 167 జాతీయ రహదారులు జడ్చర్ల మీదుగా వెళ్తున్నాయి. దీంతో ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. 2014, 2018 ఎన్నికల్లో జడ్చర్లలో టీఆర్ఎస్ నుంచి డాక్టర్ లక్ష్మారెడ్డి గెలిచారు. ఓ సారి మంత్రిగా పనిచేశారు. సిట్టింగులకే సీట్లంటూ కేసీఆర్ చేసిన ప్రకటనతో మరోసారి ఆయనే పోటీకి రెడీ అయ్యారు. రీసెంట్‌గా అభ్యుర్థుల ప్రకటించిన అధిష్టానం మరోసారి జడ్చర్ల టికెట్‌ను సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే కెటాయించింది. లక్ష్మారెడ్డి నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. మొదటి నుంచి లక్ష్మారెడ్డి కేసీఆర్‌కు సన్నిహితుడిగా ఉన్నారు. 2008లో ఆయన సూచన మేరకు మొదటి వ్యక్తిగా తన పదవికి రాజీనామా చేసి తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో, 2009లో ఎన్నికల్లో  ఓడిపోయారు. తర్వాత వరుసగా గెలిచారు.

పార్టీల్లో కుమ్ములాటలు
రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రభుత్వం నుంచి అన్ని నియోజకవర్గాలకు వచ్చిన ప్రకారం అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేశారు తప్పా తనకంటూ ప్రత్యేక గుర్తింపు నిచ్చే పని ఏ ఒక్కటి చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్‌లోకి చేరిన వారికి సరైన ప్రాధాన్యత లేదనే అసంతృప్తి చాలా మందిలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరంతా ఎన్నికల నాటికి లక్ష్మారెడ్డికి హ్యండ్‌ ఇస్తారనే చర్చ సాగుతుంది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు తగిన న్యాయం చేయలేదనే అపవాదు కూడా ఉంది. ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగటమే కాగా ఇళ్ల పరిహారంలో అక్రమాలు జరిగాయే ఆరోపణలు ఉన్నా న్యాయం చేయటం లేదనే విమర్శలు ఉన్నాయి. జడ్చర్ల మున్సిపాలిటీలో పలువురు కౌన్సిలర్లు  భూకబ్జాలు, అవినీతి కార్యకలాపాల్లో తలదూర్చుతున్నా ఎమ్మెల్యే వారిని కట్టడి చేయటంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడ మైనస్‌గా మారే అవకాశం ఉంది. అయితే ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న కుమ్ములాటలు కలిసొస్తాయని ఆశగా ఉన్నారు. ఈసారి జడ్చర్ల నుంచి మన్నె జీవన్‌రెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. ఆయన మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్న కుమారుడు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఆయనకు కేటీఆర్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో తరచు పర్యటించటం బీఆర్ఎస్ నేతలతో టచ్‌లో ఉండటం చూస్తుంటే ఆయన వచ్చే ఎన్నికల్లో రంగంలో దిగటం ఖాయంగా కనిపిస్తోంది. వ్యూహత్మకంగానే జీవన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇద్దరు సీటు విషయంలో పోటీ పడితే పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంది.

మూడు ముక్కలాట
కాంగ్రెస్‌ పార్టీలో మూడు ముక్కలాట నడుస్తోంది. మొదటి నుంచి ఇక్కడ మల్లురవి ఇంచార్జీగా ఉన్నారు. ఆయన కేవలం 2008లో జరిగిన ఉపఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో పోటీ చేయటం ఓడిపోవటం పరిపాటిగా మారింది. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన మల్లురవి మరోసారి అక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలున్నాయి. జడ్చర్లలో ప్రస్తుతం జనుంపల్లి అనురుద్రెడ్డి ఇంచార్జీగా కొనసాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎం.చంద్రశేఖర్ అలియాస్ ఎర్రశేఖర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరటంతో ముసలం మొదలయ్యింది.

మొదటి నుంచి ఆయన రాకను అడ్డుకుంటూ వచ్చారు. ఆయనకు నేరచరిత్ర ఉందని పార్టీలో చేర్చుకోవద్దని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. తనకు సన్నిహితుడైన అనిరుద్‌రెడ్డికి సీటు విషయంలో ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశ్యంతోనే కోమటిరెడ్డి అడ్డుపడ్డారనే ప్రచారం సాగుతుంది. ఆయన టీడీపీలో ఉన్నప్పటి నుంచి రేవంత్‌ రెడ్డి, చంద్రశేఖర్‌కి మంచి సంబంధాలు ఉన్నాయి. దీనికి తోడు బీసీ ఓట్లు అధికంగా ఉన్న జడ్చర్ల నియోజకవర్గంలో గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్ర శేఖర్‌ను పార్టీలో తీసుకుంటే కలిసివస్తుందని  భావించి ఆయనను పార్టీలో చేర్చుకున్నారు. 

ఇప్పుడు ఇద్దరి మధ్య గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. నియోజకవర్గంలో ఎవరికి వారు తమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎడమొహం..పెడమొహంగా ఉన్నారు. అనిరుధ్‌ రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లో పోటీ చేయటం ఖాయమని ఆయన వర్గీయులు చెబుతున్నారు. సీటు నిరాకరిస్తే వేరే పార్టో లేక ఇండిపెండెంటుగానైనా బరిలో దిగుతారనే ప్రచారం సాగుతుంది. రాహుల్‌ గాంధీ జోడో యాత్రను నియోజకవర్గంలో విజయవంతం చేయటంలో అనిరుధ్‌రెడ్డి కీలకంగా పనిచేసి పార్టీ డిల్లీ అధినేతలతో శభాష్ అనిపిచ్చుకున్నారు. నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు, పాదయాత్ర నిర్వహిస్తూ అనిరుధ్‌రెడ్డి జనాలకు చేరువయ్యే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 

కానీ రేవంత్‌రెడ్డికి కాకుండా కోమటిరెడ్డి వెంకట్ట్రె‌రెడ్డి వర్గీయుడిగా ముద్రపడటం ఆయనకు మైనస్‌గా మారింది. ఎర్రశేఖర్ ప్రస్తుతం నియోజకవర్గంలో తిరుగుతున్నారు. పాత నేతలు, తన వర్గీయులను కలుస్తున్నారు. నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అధికంగా ఉండటం ఎర్ర శేఖర్‌కు కలిసి వచ్చే అవకాశంగా ఉంది. గతంలో ఓడిన తర్వాత నియోజకవర్గం వైపు తిరిగి చూడకుండా కార్యకర్తలను పట్టించుకోలేదనే అపవాదు కూడా ఆయనపై ఉంది. నియోజకవర్గంలో బీజేపీ పార్టీ పరిస్థితి ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది.

అయోమయం‍లో కార్యకర్తలు
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు సన్నిహితంగా ఉన్న బాలత్రిపురసుందరీ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలు తిరుగుతూ పట్టు సాదిస్తుండగా ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ సైతం ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది. ఇప్పటికే నియోజకవర్గంలో మూడు, నాలుగు గ్రూపులు బీజేపీ పార్టీలో ఉండగా ప్రస్తుత రాజకీయ అస్పష్టతతో ఎపుడు ఎవరు ఏ గ్రూప్‌లో చేరతారో తెలియకుండా పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. బీఎస్పీ నుంచి బాలవర్థన్‌ గౌడ్‌ పోటీ చేసేందుకు సన్నద్దమవుతున్నారు. మొత్తంగా జడ్చర్ల నియోజకవర్గం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement