సాక్షి, మహబూబ్‌నగర్: హామీలు నెరవేర్చే వరకు సీఎం రేవంత్‌ను వదిలిపెట్టం అంటూ మాజీ మంత్రి హరీష్‌రావు హెచ్చరించారు. రాష్ట్రంలో కొత్త పథకాలు అటుంచి పాత పథకాలను మూలకేశాడంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో సగం మంది రైతులకు రుణమాఫీ జరగలేదని.. కొర్రీలు పెట్టి రుణమాఫీకి ఎగనామం పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టిన పాలకుడు ఇచ్చిన మాట తప్పితే రాష్ట్రానికే అరిష్టం అంటూ వ్యాఖ్యానించారు.
‘‘ఎనముల రేవంత్ కాదు.. ఎగవేతల రేవంత్. ఢిల్లీకి మూటలు పంపేందుకు.. లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణకు డబ్బులిచ్చే సీఎంకు రైతులకు రైతుభరోసా ఇచ్చేందుకు నిధులు లేవా? రైతుబంధు ఇవ్వని కాంగ్రెస్‌ను ఉరికించాలి. పత్తి రైతులకు మద్దతు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారు. డెడ్ లైన్లు మారాయి.. పత్రికల్లో హెడ్ లైన్లు మారాయి.. కాని రైతు రుణమాఫీ మాత్రం ఓ లైన్‌కు రాలేదు’’ అంటూ హరీష్‌రావు చురకలు అంటించారు.
‘‘సర్కార్ దవాఖానాల్లో మందులు కూడా లేవు. 29 జీవోతో నిరుపేద నిరుద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతుంది. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు. పోలీసు పాలన సాగుతోంది. సీఎంకు పాలన మీద పట్టు లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ పోరాటంతోనే కరెంట్ బిల్లులు పెరగలేదు. వచ్చే అసెంబ్లీలో ప్రభుత్వం మెడలు వంచుతాం. అక్రమ కేసులు పెడుతూ.. కొందరు పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారు. వారి పేర్లు డైరీల్లో రాసిపెడుతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి’’ అంటూ హరీష్‌రావు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: సమస్యలు కొని తెచ్చుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి!
Comments
Please login to add a commentAdd a comment