భువనగిరి మండలం : నూతన ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
సాక్షి, యాదాద్రి : జిల్లా వ్యాప్తంగా ఉన్న 17 మండలాల్లో మండల పరిషత్ అ«ధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. టీఆర్‌ఎస్ 10 ఎంపీపీలను కైవసం చేసుకోగా ఏడు మండలాలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే క్యాంప్ రాజకీయాలకు తెరలేపిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్.. సభ్యులతో బేరసారాలకు దిగాయి. పదవుల పందేరాలపై హామీలు, సామాజిక సమీకరణాల ప్రాతిపదికన ఇరు పార్టీలు ఎంపీపీ, వైఎస్ ఎంపీపీలను ఎంపిక చేశాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల్లో ఎంపీపీ అభ్యర్థుల ఎంపిక సందర్భంగా కొన్ని చోట్ల నాయకుల మధ్యన విబేధాలు తలెత్తాయి. అయితే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సమన్వయంతో అభ్యర్థులను ఎంపిక చేయగా కాంగ్రెస్ తమ అభ్యర్థుల మధ్య ఏకాభిప్రాయం కుదుర్చడానికి చాలానే శ్రమించాల్సి వచ్చింది. అయితే ఆద్యంతం ఆసక్తి రేకెత్తించిన తుర్కపల్లి, రాజాపేట స్థానా లను టీఆర్‌ఎస్, మోత్కూర్ ఎంపీపీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆసక్తి రేకెత్తించిన మోత్కూర్ ఎంపీపీ స్థానాన్ని కాంగ్రెస్ లాటరీ ద్వారా కైవసం చేసుకుంది. సంస్థాన్ నారాయణపురం, తుర్కపల్లి వైస్ ఎంపీపీల ఎన్నిక వాయిదాపడింది.
క్యాంప్‌ల నుంచి నేరుగా సమావేశాలకు..
ఈనెల 4న ఎన్నికల ఫలితాలు వెలువడగానే కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు తమ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను క్యాంప్‌లకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ ఎన్నిక కోసం క్యాంప్‌ల నుంచి నేరుగా మండల పరిషత్ కార్యాలయాలకు చేరుకున్నారు. క్యాంప్‌ల్లోనే అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ కొన్నిచోట్ల ఎంపిక సమయానికి ముందు వరకు వివాదాలు జరిగాయి. ఎంపీటీసీలను సమన్వయం చేయడానికి నాయకులు చాలా శ్రమించారు. కులాల వారీగా సమీకరణాలు చేస్తూ భవిష్యత్‌లో పార్టీకి నష్టం కలగకుండా ఉండేందుకు పార్టీ తరఫున రకరకాల బుజ్జగింపులు పెద్ద ఎత్తునే జరిగాయి. టీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేలు పైళ్ల శేఖరెడ్డి, గొంగిడిసునీతామహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున కోమటిరెడ్డి సోదరులు, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి బాధ్యతలను భుజాన వేసుకున్నారు.
కోరం లేక వాయిదాపడ్డ తుర్కపల్లి వైస్ ఎంపీపీ ఎన్నిక
తుర్కపల్లి వైస్ ఎంపీపీ ఎన్నిక కోరం లేక వాయిదాపడింది. 10 ఎంపీటీసీ స్థానాలు ఉన్న ఆ మండలంలో 5 కాంగ్రెస్, 4 టీఆర్‌ఎస్, ఒకరు ఇండిపెండెంట్ గెలిచారు. మెజార్టీ ఉన్న కాంగ్రెస్‌కే ఎంపీపీ దక్కుతుందని భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. కాంగ్రెస్ నుంచి గెలిచిన మాదాపూర్ ఎంపీటీసీ టీఆర్‌ఎస్ శిబిరంలో చేరడంతో వారి సంఖ్య బలం 6కు చేరింది. సమావేశానికి 9మంది టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఇండిపెండెంట్ ఎంపీటీసీలు హాజరయ్యారు. ఎంపీపీ ఎన్నిక జరిగిన వెంటనే టీఆర్‌ఎస్ సభ్యులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. దీంతో సమావేశంలో నలుగురు ఎంపీటీసీలే మిగలడంతో వైస్ ఎంపీపీకి కోరం లేక ఎన్నిక శనివారానికి వాయిదా పడింది.
నారాయణపురంలో మరో తీరు..
వైస్ ఎంపీపీ ఎన్నిక విషయంలో టీఆర్‌ఎస్ ఎంపీటీసీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదాపడింది. 13మంది ఎంపీటీసీలు ఉన్న ఈమండలంలో ఎన్నికల ముందు టీఆర్‌ఎస్, సీపీఎంలు పొత్తు పెట్టుకున్నాయి. సీపీఎంకు వైస్ ఎంపీపీ ఇస్తానన్న ఒ ప్పందం ఉంది. అయితే త మకు 9మంది ఎంపీటీసీలు గెలిచి పూర్తి మెజార్టీ ఉన్నందున సీపీఎంకు వైఎస్ ఎంపీపీ ఎందుకు ఇవ్వాలని కొందరు టీఆర్‌ఎస్ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో వివాదం తలెత్తి వైస్ ఎంపీపీ శనివారానికి వాయిదాపడింది.
లాటరీ పద్ధతిలో కాంగ్రెస్‌ను వరించిన ఎంపీపీ..
నలుగురు సభ్యులు ఉన్న మోత్కూర్ మండల పరిషత్ అధ్యక్ష పదవి లాటరీ పద్ధతిలో కాంగ్రెస్‌ను వరించింది. రెండు స్థానాల్లో టీఆర్‌ఎస్, రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందిన విషయం తెలిసిందే. అందరూ ఆసక్తిగా గమనిస్తున్న ఈ ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ పదవులు లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన దీటి సంధ్యారాణి, వైఎస్ ఎంపీపీ టీఆర్‌ఎస్‌కు చెందిన భూష్‌పాక లక్ష్మి గెలుపొందారు.
ప్రజాప్రతినిధుల హాజరు
ఎంపీపీ ఎన్నికల సందర్భంగా ప్రజాప్రతినిధులు సమావేశాలకు హాజరయ్యారు. మోత్కూర్ ఎంపీపీ ఎన్నికల సమావేశానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, యాదగిరిగుట్ట ఎంపీపీ సమావేశానికి ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి హాజరయ్యారు. బీబీనగర్, పోచంపల్లి ఎంపీపీ సమావేశాలకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, తుర్కపల్లి, రాజాపేట ఎంపీపీ సమావేశాలకు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిలు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment