సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని రెండు ఎంపీపీ స్థానాలు మినహా అన్నింటిని టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అన్ని మండలాల్లోనూ గులాబీ పార్టీ తన హవాను కొనసాగించింది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జరిగిన ఎంపీపీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 17 మండలాల్లో మెజార్టీ ప్రాతిపదికన ఓటింగ్ నిర్వహించి ఎంపీపీ అభ్యర్థులను ఎన్నుకోగా, ఎంపీటీసీ స్థానాలు సమానంగా వచ్చిన రెండు మండలాల్లో మాత్రమే లాటరీ పద్ధతి ద్వారా ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు.
ఎంపీడీఓ కార్యాలయాల్లో సంబంధిత అధికారుల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి. ఎలాగైనా మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలన్న పట్టుదలతో టీఆర్‌ఎస్ పార్టీ నేతలు వ్యవహరించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పెంట్లవెల్లిలో ఒకరినొకరు తోసుకున్నారు. నాగర్‌కర్నూల్ మండలానికి సంబంధించి కోర్టు పరిధిలో కేసు ఉండడంతో ఎన్నిక వాయిదా పడింది. మొత్తంగా మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యులు ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది.
17ఎంపీపీ స్థానాలు టీఆర్‌ఎస్ కైవసం
జిల్లాలోని 20 మండలాల్లో 212 ఎంపీటీసీ స్థానాలుంటే గోప్లాపూర్, గంట్రావుపల్లి ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, గగ్గలపల్లి ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో మొత్తం 209 ఎంపీటీసీ స్థానాలకు మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో 135 స్థానాల్లో టీఆర్‌ఎస్ ఎంపీటీసీ అభ్యర్థులు విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 4 స్థానాల్లో, సీపీఐ 2స్థానాల్లో, ఇండిపెండెంట్లు 16 స్థానాల్లో విజయం సా«ధించారు. ఏకగ్రీవం అయిన రెండు ఎంపీటీసీ స్థానాలు కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలవడంతో ఆ పార్టీ 137 స్థానాల్లో విజయం సాధించింది. అయితే శుక్రవారం నాగర్‌కర్నూల్ మండల పరిషత్ స్థానానికి మినహా 19 మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు నిర్వహించారు.ఇందులో అధికార పార్టీ 17, కాంగ్రెస్ రెండు స్థానాలు దక్కించుకున్నాయి. వైస్ ఎంపీపీల విషయానికి వస్తే టీఆర్‌ఎస్ 13, కాంగ్రెస్ 4, ఇండిపెండెంట్లు 2 స్థానాలను దక్కించుకున్నారు. కో ఆప్షన్‌కు సంబంధించి 17 టీఆర్‌ఎస్, రెండు కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. లింగాల, ఉప్పునుంతల మండలంలో లాటరీ పద్ధతిలో ఎంపీపీ ఎంపిక జరిగింది.
లింగాలలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్‌లు దక్కాయి. ఉప్పునుంతలలో ఎంపీపీ, కో ఆప్షన్ టీఆర్‌ఎస్ పార్టీ, వైస్ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీకి దక్కాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి, హర్షవర్ధన్‌రెడ్డి వర్గాల మధ్య నువ్వా నేనా అన్న తరహాలో ఎన్నికలు జరిగాయి. పెంట్లవెల్లిలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసలు రంగప్రవేశం చేసి లాఠీచార్జీతో ఇరు వర్గాలను చెదరగొట్టారు.ఇరు వర్గాలు టీఆర్‌ఎస్ పార్టీ చెప్పుకున్నప్పటికీ కోడేరు, పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి మండలాల్లో జూపల్లి వర్గం ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోగా, కొల్లాపూర్‌లో హర్షవర్ధన్‌రెడ్డి వర్గం దక్కించుకుంది. బిజినపల్లి మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలకు టీఆర్‌ఎస్ పార్టీకి 10ఎంపీటీసీలు, కాంగ్రెస్‌కు 8, ఒకటి సీపీఐ, ఒకచోట ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఎంపీపీ స్థానం ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో నేరుగా ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి రంగంలోకి దిగి కాంగ్రెస్ ఎంపీటీసీని తమవైపు తిప్పుకొని అతనికి వైస్ ఎంపీపీ ఇచ్చి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment