
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలుచోట్ల గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో పరోక్ష పద్ధతిన ఎన్నిక జరిగే పలు పదవులకు గురువారం ఉప ఎన్నికలు జరగనున్నాయి. గతంలోనే ఎన్నికలు జరిగి రాజీనామా చేయడం, మరణించడం వంటి కారణాలతో ఖాళీ అయిన పదవులకు ఈ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
మచిలీపట్నం నగరపాలక సంస్థలో రెండు డిప్యూటీ మేయర్ పదవులు, పెడన మున్సిపాలిటీలో చైర్‌పర్సన్, మాచర్ల మున్సిపాలిటీలో ఒకటి, ధర్మవరం మున్సిపాలిటీలో రెండు వైస్ చైర్మన్ పదవులకు, 13 మండలాల్లో నాలుగు ఎంపీపీ, ఏడు ఉపాధ్యక్ష, మూడు కో–ఆప్షన్ పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. 12 పంచాయతీల్లో 12 ఉప సర్పంచి పదవులకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ కోసం ఉదయం 11 గంటలకు ఆయా స్థానికసంస్థల ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు.
ఉప ఎన్నికలు జరగనున్న స్థానిక సంస్థలు, పదవుల వివరాలు
పట్టణ ప్రాంతాల్లో..
► మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (కృష్ణా జిల్లా)– రెండు డిప్యూటీ మేయర్ పదవులు
► పెడన మున్సిపాలిటీ (కృష్ణా)– చైర్‌పర్సన్
► మాచర్ల మున్సిపాలిటీ (పల్నాడు)– వైస్ చైర్మన్
► ధర్మవరం (శ్రీసత్యసాయి)– రెండు వైస్ చైర్మన్ పదవులు
.
గ్రామీణ ప్రాంతాల్లో..
► ఎంపీపీ ఎన్నికలు జరిగే మండలాలు (4): రామకుప్పం (చిత్తూరు జిల్లా), తొండంగి (కాకినాడ), వత్సవాయి (ఎన్టీఆర్), చేజర్ల (నెల్లూరు)
► ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే మండలాలు (7): రామకుప్పం, విజయాపురం(చిత్తూరు), రాపూరు (నెల్లూరు), గాలివీడు (అన్నమయ్య), పార్వతీపురం (పార్వతీపురం మన్యం), పెదకడబూరు (కర్నూలు), రాయదుర్గం (అనంతపురం)
► కో–ఆప్షన్ మెంబర్ ఎన్నిక జరిగే మండలాలు (3): చిత్తూరు (చిత్తూరు), బి.మఠం (వైఎస్సార్), రాజంపేట (అన్నమయ్య)
► ఉపసర్పంచి ఎన్నికలు జరిగే పంచాయతీలు (12): అనకాపల్లి, బాపట్ల, అన్నమయ్య జిల్లాల్లో రెండేసి పంచాయతీలు, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో ఒక్కొక్క పంచాయతీ