‘ఉప ఎన్నికలు ఎందుకొస్తా’యని ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్య
కులగణన, ఎస్సీ వర్గీకరణతో దేశానికి రోడ్‌మ్యాప్ ఇస్తున్నాం
అసెంబ్లీ లాబీలో మీడియాతో ముఖ్యమంత్రి చిట్‌చాట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని కొందరు మాట్లాడుతున్నారని, అలాంటివేమీ రావని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ‘కేటీఆర్ ఏమైనా ఆత్మహత్య చేసుకుంటారా.. సిరిసిల్లకు ఉపఎన్నిక రావడానికి?’అని ఆయన వ్యాఖ్యా నించారు. ఉపఎన్నికలు వస్తాయని కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను సీఎం దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకుని రాగా పైవిధంగా స్పందించారు. అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో కేబినెట్ సమావేశం ముగిసిన తరువాత తన చాంబర్‌కు వెళ్తున్న సమయంలో సీఎం మీడియాతో చిట్‌చాట్ చేశారు.
శాసనభ్యులకు స్పీకర్ నోటీసులు ఇచ్చారని మీడియా ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకురాగా.. అదంతా ప్రొసీజర్‌లో భాగమేనని సీఎం స్పందించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు దేశానికి తెలంగాణ నుంచి రోడ్‌మ్యాప్‌ను ఇస్తున్నామని, ఈ రెండింటి విషయంలో తాము చేసిన పని ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవడానికి వీలవుతుందని అన్నారు. సభలో ప్రవేశపెట్టే ఈ కులగణన సర్వే డాక్యుమెంట్ భవిష్యత్‌లో ఎప్పుడైనా రెఫరెన్స్‌గా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు, మంత్రివర్గ ఉపసంఘం, ఏకసభ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. ఫ్రధాన ప్రతిపక్షానికి బాధ్యత, చిత్తశుద్ది లేవని, వారిని పరిగణనలోకి తీసుకోవడం లేదని అన్నారు. కీలకమైన రెండు అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలి కదా అని ప్రశ్నించారు. తాము 88 జనరల్ సీట్లలో 30 సీట్లు బీసీలకు ఇచ్చామని చెప్పారు.
కోర్టు ఇచ్చిన క్రీమీలేయర్‌ను తమ ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపారు, బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఆదేశాల మేరకు కమిషన్‌ను నియమించామని, కోర్టు ఆదేశాల మేరకే కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. గత ప్రభుత్వం చేసినట్లు చెప్పుకుంటున్న సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ఎక్కడుందో కూడా తెలియదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తాము ఎన్నికల కోసం కులగణన చేయలేదని, అభివృద్ధి ఫలాలు అందించాలన్నదే తమ తాపత్రయమని సీఎం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment