సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గులాబీ జెండాల రెపరెపల మధ్య జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుల పట్టాభిషేకం శనివారం జరగనుంది. ప్రత్యర్థి పార్టీల ఉనికి సైతం కనిపించని రీతిలో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున జెడ్‌పీటీసీలుగా గెలిచిన నేతలు జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నారు. ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని నాలుగు జిల్లాలకు చైర్‌పర్సన్/చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు జెడ్‌పీటీసీలను ఎన్నుకోనున్నారు. అంతకుముందే ఉదయం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికతో జిల్లా పరిషత్‌లలో పాలక మండళ్ల ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది. కాగా, ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ జిల్లా పరిషత్‌కు 15 మంది జెడ్‌పీటీసీలు టీఆర్‌ఎస్ నుంచే ఎన్నికవడంతో ఇక్కడ ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. పెద్దపల్లిలో 13 సభ్యులకు గాను ఇద్దరు కాంగ్రెస్ నుంచి ఎన్నికవగా, 11 మంది సభ్యులతో టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కో సభ్యుడు ఎన్నిక కాగా, మిగతా సీట్లలో టీఆర్‌ఎస్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో జెడ్‌పీ అధ్యక్షుల ఎన్నిక లాంఛనమే.
మూడు జిల్లాల్లో స్పష్టత– జగిత్యాల తప్ప
టీఆర్‌ఎస్ పార్టీ తరఫున పెద్దపల్లి జెడ్‌పీ చైర్మన్‌గా పుట్ట మధును స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికలకు ముందు రాజన్న సిరిసిల్ల జిల్లా చైర్‌పర్సన్‌గా న్యాలకొండ అరుణ పేరును కేటీఆర్ ఓకే చేశారు. ఇక కరీంనగర్ చైర్‌పర్సన్‌గా ఇల్లందకుంట జెడ్‌పీటీసీ కనుమండ్ల విజయను మంత్రి ఈటల రాజేందర్ తెరపైకి తెచ్చారు. ఈ మూడు జిల్లాలకు చైర్‌పర్సన్లకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కాగా, జగిత్యాల జిల్లాపైనే తొలి నుంచి పీఠముడే కొనసాగుతోంది. తొలుత బుగ్గారం జెడ్‌పీటీసీ బాదినేని రాజేందర్‌కు చైర్మన్ పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపించాయి. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చినట్టుగా భావిస్తున్న లీకుల్లో కోరుట్ల జెడ్‌పీటీసీ దాసెట్టి లావణ్య పేరు తెరపైకి వచ్చింది. శుక్రవారం సీను మారింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్‌కుమార్ రంగంలోకి దిగారు. జగిత్యాల రూరల్ జెడ్‌పీటీసీ దావ వసంతకు చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వాలని పావులు కదుపుతున్నారు. దీంతో రాత్రి వరకు జగిత్యాలపై పీఠముడి వీడలేదు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల పంచాయితీని తెంపే పనిలో పడ్డారు. రాత్రి వేళ ఎమ్మెల్యేలు, జెడ్‌పీటీసీలతో మంతనాలు జరిపి, అధిష్టానం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోనున్నారు.
రెండు జిల్లాలకు వైస్ చైర్మన్లు ఖరారు
కరీంనగర్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా గన్నేరువరం, శంకరపట్నం జెడ్‌పీటీసీలు రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలలో ఒకరు నియమితులవుతారని పార్టీలో ప్రచారం జరిగింది. చివరికి శుక్రవారం అధిష్టానం సైదాపూర్ జెడ్‌పీటీసీ పేరాల గోపాల్‌రావు పేరును ఖరారు చేసింది. రాజన్న సిరిసిల్ల వైస్ చైర్మన్‌గా ఇల్లంతకుంట జెడ్‌పీటీసీ సిద్దం వేణు ఖరారైంది. పెద్దపల్లి వైస్ చైర్‌పర్సన్ విషయంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కాల్వశ్రీరాంపూర్ జెడ్‌పీటీసీ వంగల తిరుపతిరెడ్డికి మద్దతుగా నిలిచారు. సీనియర్ జెడ్‌పీటీసీ, మహిళా నాయకురాలు పాలకుర్తి నుంచి గెలిచిన కందుల సంధ్యారాణి పోటీ పడుతున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి వైస్ చైర్‌పర్సన్ పంచాయితీని కూడా పరిష్కరించే పనిలో పడ్డారు.
నేడే ‘జెడ్పీ’ పట్టాభిషేకం
Published Sat, Jun 8 2019 9:08 AM | Last Updated on Sat, Jun 8 2019 9:08 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment