‘స్థానిక’ రిజర్వేషన్ల ఖరారు నేడే | Zilla Parishad Officials Have Intensified The Reservation Process | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ రిజర్వేషన్ల ఖరారు నేడే

Published Tue, Mar 5 2019 5:35 PM | Last Updated on Tue, Mar 5 2019 5:35 PM

Zilla Parishad Officials Have Intensified The Reservation Process - Sakshi

సాక్షి, నల్లగొండ : స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు సంబంధించి రిజర్వేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 5వ తేదీలోగా రిజర్వేషన్లను ఖరారు చేసి నివేదికలు పంపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన జిల్లా పరిషత్‌లతోపాటు మండలాలను నోటిఫైడ్‌ చేస్తూ గెజిట్‌ను కూడా విడుదల చేసింది. దీంతో జిల్లా పరిషత్‌ అధికారులు రిజర్వేషన్‌ ప్రక్రియను ముమ్మరం చేశారు. మంగళవారం సాయంత్రంలోగా రిజర్వేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి అందించాల్సి ఉంది. 

గ్రామపంచాయతీ ఓటర్ల జాబితా ఆధారంగా.. 
ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికల కోసం తయారు చేసిన ఓటర్ల జాబితా ఆధారంగా స్థానిక సం స్థల ఎన్నికలు నిర్వహించాలని మొదట నిర్ణయించింది. ఆ మేరకు వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపొందించాలని గ్రామ పంచాయతీలకు అప్పగించారు. ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున త్వరితగతిన ఎన్నికలు నిర్వహించేందుకు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహించాలని ప్రస్తుతం నిర్ణయించింది. దీంతో ఆ ఓటర్ల జాబితా ప్రకా రమే రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభించారు.

 నేడు రిజర్వేషన్లు ఖరారు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను కలెక్టర్, ఆర్‌డీఓల ఆధ్వర్యంలో ఎంపీడీఓలు పూర్తి చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ 5వ తేదీలోగా రిజర్వేషన్‌ తయారు చేసి నివేదికలు పంపించాలని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రిజర్వేషన్‌ ప్రక్రియను ఆయా కలెక్టర్లు, ఆర్డీఓల ఆధ్వర్యంలో ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం వరకు ప్రక్రియ ముగియనుంది. వెంటనే అధికారికంగా విడుదల చేయనున్నారు.  

ఇప్పటికే జిల్లా ఎంపీపీల రిజర్వేషన్‌ కోటా ఖరారు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ ఆయా జిల్లాలకు కేటాయించిన ఎంపీపీల రిజర్వేషన్లను ప్రకటించారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో మొత్తం 71 మండలాలు ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తం ఎస్సీలకు 12 ఎంపీపీ స్థానాలు, ఎస్టీలకు 10, బీసీలకు 13, అన్‌ రిజర్వ్‌డ్‌ కింద 36 ఎంపీపీ స్థానాలను రిజర్వ్‌ చేశారు. ఈ జాబితాను ఇప్పటికే ఆయా కలెక్టర్లకు పంపించారు.

 జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లకు ఫైనల్‌ అథారిటీ కలెక్టర్‌
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లు ఇప్పటికే ఆయా జిల్లాకు కేటాయించిన ఎంపీపీ రిజర్వేషన్లను ఏయే మండలాలకు కేటాయించాలనేది మంగళవారం నిర్ణయిస్తారు. అదే విధంగా జెడ్పీటీసీ రిజర్వేషన్‌కు సంబంధించి కూడా రిజర్వేషన్‌ ఖరారు చేయనున్నారు. జి ల్లా యూనిట్‌గా తీసుకొని జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్‌ చేయనున్నారు.

ఎంపీటీసీల రిజర్వేషన్‌ బాధ్యత ఆర్డీఓలకు...
ఎంపీటీసీలకు సంబంధించి రిజర్వేషన్‌ ప్రక్రియ ఆర్డీఓల ఆధ్వర్యంలో చేయనున్నారు. ఆయా డివిజన్లలోని మండల ప్రాదేశిక నియోజకవర్గాల్లో రిజర్వేషన్‌ ఎంపీడీఓలు చేడతారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌ జనాభా ఆధారంగా చేస్తుండగా, బీసీ రిజర్వేషన్‌ మాత్రం ఓటర్ల జాబితా ఆధారంగా చేపట్టనున్నారు.

 జెడ్పీ అధ్యక్షుడు, ఎంపీపీలు రాష్ట్ర యూనిట్‌గా..
జిల్లా పరిషత్‌ అధ్యక్షులు, ఎంపీపీల రిజర్వేషన్లు రాష్ట్ర యూనిట్‌గా తీసుకొని చేయనున్నారు. ఇప్పటికే ఎంపీపీల కోటా ఏ జిల్లాకు ఎవరెవరికి ఎన్ని స్థానాలనేది ప్రకటించారు. జిల్లా పరిషత్‌ అ«ధ్యక్షుల రిజర్వేషన్‌ మాత్రం ప్రకటించలేదు.

 తేలిన ఉమ్మడి జిల్లా ఎంపీపీల రిజర్వేషన్‌ కోటా
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 71 మండలాలు ఉన్నాయి. అందులో నల్లగొండ జిల్లాలో 31 మండలాలు ఉండగా అందులో ఎస్సీలకు 5, ఎస్టీలకు 6, బీసీలకు 4, జనరల్‌ కేటగిరీలో 16 కేటాయించారు. సూర్యాపేట జిల్లాలో 21 మండలాలకు ఎస్సీ 4, ఎస్టీ 3, బీసీ 4, జనరల్‌ 12 కేటాయించారు. అదే విధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలకు ఎస్సీ 3, ఎస్టీ 1, బీసీ 5, జనరల్‌ 8 స్థానాలుగా జిల్లా కోటాను నిర్ణయించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement