
చెరో ఎంపీపీ కుర్చీ
చిత్తూరు (అర్బన్): జిల్లాలో నిలిచిపోయిన మూడు ఎంపీపీ స్థానాల ఎన్నికలు ఆదివారం జరగాల్సి ఉండగా, రెండు చోట్ల మాత్రం ఎన్నికలు జరిగాయి. మరోచోట సభ్యులెవరూ రాకపోవడంతో సోమవారానికి ఎన్నిక వాయిదా పడింది. ఈ నెల నాలుగో తేదీ జిల్లాలోని 65 మండలాల్లో ఎంపీపీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎర్రావారిపాళెం, నిమ్మనపల్లె, కేవీబీ పురం మండలాల్లో కోరం లేకపోవడంతో మండలాధ్యక్ష ఎన్నికలు ఈ నెల 5వ తేదీకి వాయిదాపడ్డాయి. ఆ రోజు మెజారిటీ సభ్యులు లేకపోవడంతో ఎన్నికలు వాయిదా వేశారు. తాజాగా ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. ఎర్రావారిపాళెం ఎంపీపీ స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, నిమ్మనపల్లె ఎంపీపీ స్థానాన్ని టీడీపీ కైవశం చేసుకున్నాయి. కేవీబీ పురంలో కోరం లేకపోవడంతో ఎంపీపీ ఎన్నిక సోమవారానికి వాయిదా పడింది.
ఎర్రావారిపాళెం మండలంలో మొత్తం 8 ఎంపీటీసీ సెగ్మెంట్లు ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 3, కాంగ్రెస్ 3, టీడీపీ రెండు స్థానాలను కైవశం చేసుకున్నాయి. దీంతో స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో ఇక్కడ మరో పార్టీ అభ్యర్థి మద్దతు తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో మండలంలోని ఉదయమాణిక్యం సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన చెంగమ్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు పలికారు. దీంతో పీ రేవతి (వైఎస్సార్ కాంగ్రెస్) మండలాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.నిమ్మనపల్లె మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్నప్పటికీ టీడీపీ కుయుక్తులు పన్ని ఎంపీపీ స్థానాన్ని తన్నుకుపోయింది. ఇక్కడున్న 9 సెగ్మెంట్లకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 5, టీడీపీకి 4 స్థానాలు వచ్చాయి. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిమ్మనపల్లె సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీ సభ్యుడుగా గెలుపొందిన ఈ చంద్రశేఖర్ టీడీపీ ప్రలోభాలకు గురిచేయడంతో ఆ పార్టీకి మద్దతు పలికారు. దీంతో పారిజాతం (టీడీపీ) మండలాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
కేవీబీ పురంలోని 12 స్థానాలకు గాను టీడీపీ 10, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలను కైవశం చేసుకున్నాయి. ఇక్కడ ఎంపీపీ పదవిని ఎస్టీ మహిళకు రిజర్వ్ చేశారు. దీంతో టీడీపీకి చుక్కెదురైంది. టీడీపీలో ఎస్టీ మహిళ ఎంపీటీసీ సభ్యురాలిగా గెలవకపోవడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్టీ మహిళ గెలుపొందడంతో ఆమెకే ఈ స్థానం అనుకున్నారు. అయితే ఇక్కడ కోటమంగాపురం సెగ్మెంట్ నుంచి టీడీపీ తరఫున గెలుపొందిన లోకనాథం రాజీనామా చేయడంతో ఈ స్థానం నుంచి ఎస్టీ మహిళను పోటీ చేయించేందుకు తెలుగు తమ్ముళ్లు ఆరాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆది వారం జరిగిన ఎంపీపీ ఎన్నికకు వైఎస్సార్ సీపీ నుంచి ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఎస్టీ మహిళను ఒకరు ప్రతిపాదించినా, బలపరిచేవారు లేకపోవడంతో ఈ ఎన్నిక సోమవారానికి వాయిదా పడింది.