గులాబీ ఆధిపత్యం!  | TRS Josh In MPP Elections | Sakshi
Sakshi News home page

గులాబీ ఆధిపత్యం! 

Published Sat, Jun 8 2019 9:45 AM | Last Updated on Sat, Jun 8 2019 9:45 AM

TRS Josh In MPP Elections - Sakshi

నకిరేకల్‌లో సంబరాలు జరుపుకుంటున్న ఎమ్మెల్యే చిరుమర్తి, ఎంపీపీలు, సభ్యులు

సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో 31 మండలాల్లో 349 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా, టీఆర్‌ఎస్‌ అత్యధికంగా 191 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 134 స్థానాలకు పరిమితమైంది.  ఈ మేరకు ఎంపీపీ, వైస్‌ఎంపీపీ ఎన్నికకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యాంపుల్లో ఉన్న వారంతా శుక్రవారం ఉదయం 10 గంటలకు వరకు నేరుగా ఎంపీడీఓ కార్యాలయాలకు చేరుకున్నారు. సభ్యులు చేతులు ఎత్తే పద్ధతి ద్వారా ఎంపీపీలను ఎన్నుకున్నారు. అంతకుముందు  కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక నిర్వహించారు.  నల్లగొండ నియోజకవర్గంలో మూడు మండల పరిషత్‌లకు శుక్రవారం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరిగాయి. నల్లగొండ మండల పరిçషత్‌ అధ్యక్ష పీఠాన్ని కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. పూర్తి స్థాయి మెజారిటీ ఉండడంతో ఎంపీపీతో పాటు వైస్‌ ఎంపీపీ, కో–ఆప్షన్‌ సభ్యులు కూడా కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారే ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు టీఆర్‌ఎస్‌ సభ్యులు హాజరు కాలేదు.

కనగల్‌ మండలంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అత్యధిక ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడంలో అధ్యక్ష, ఉపాధ్యక్షలతో పాటు కోఆప్షన్‌ పదవులు టీఆర్‌ఎస్‌ వశమయ్యాయి.  నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కోఆప్షన్‌ సభ్యుడి ఎన్నిక సమయంలో హాజరై ఆ తర్వాత వెళ్లిపోయారు. తిప్పర్తి మండల పరిషత్‌ అధ్యక్ష పీఠాన్ని కూడా టీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. మొత్తం 9 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా అందులో నాలుగు టీఆర్‌ఎస్, మరో 4 కాంగ్రెస్‌  గెలుచుకున్నాయి. మరొకరు ఇండిపెండెంట్‌గా విజయసాధించి కీలకంగా మారారు. ఇండింపెండెంట్‌ అభ్యర్థి నాగులవంచి విజయలక్ష్మీని టీఆర్‌ఎస్‌లోకి తీసుకొస్తే ఎంపీపీ పదవి ఇస్తానని స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి హామీ ఇవ్వడంతో ఆమె టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఆమెను మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. వైస్‌ చైర్మన్‌తో పాటు కోఆప్షన్‌ పదవులు టీఆర్‌ఎస్‌కు దక్కాయి. కాంగ్రెస్‌ సభ్యులు సమావేశానికి హాజరుకాలేదు.

మిర్యాలగూడ మిర్యాలగూడ నియోజకవర్గంలోని మిర్యాలగూడ, దామరచర్ల, అడవిదేవులపల్లి ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల ఎన్నిక సజావుగా సాగింది. వేములపల్లి ఎంపీపీని కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. ఒక స్వతంత్ర అభ్యర్థి, ఒక సీపీఎం అభ్యర్థి మద్దతు తెలపడడంతో వేములపల్లి ఎంపీపీగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పుట్టల సునిత ఎన్నికయ్యారు. వైస్‌ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా కొంత డ్రామా నెలకొంది. వేములపల్లి వైస్‌ ఎంపీపీ పదవికి టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ సభ్యులు శెట్టిపాలానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీటీసీ సభ్యుడు పల్లా వీరయ్యను ప్రతిపాదించారు. తన ఓటు తను వేసుకుంటే ఎంపీపీ అయ్యే వాడే కానీ ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం సీపీఎం ఎంపీటీసీ పాదూరి గోవర్ధనికి మద్దతు తెలిపడంతో వైస్‌ ఎంపీపీగా గోవర్ధని ఎన్నికైంది.

త్రిపురారం(నాగార్జునసాగర్‌): నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎంపీపీ, వైస్‌ ఎంíపీపీ, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. నియోజకవర్గంలోని అనుముల, తిరుమలగిరి, గుర్రంపోడు, నిడమనూరు, పెద్దవూర మండలాల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఐదు ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకోగా త్రిపురారం మండలంలో ఎంపీపీ పీఠాన్ని కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. పెద్దవూర మండలంలో 11 ఎంపీటీసీలున్నాయి. ఇక్కడ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు చెరి సమానంగా 5 ఎంపీటీసీ స్థానాలను గెలవగా, మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అయితే ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేశారు. అయితే పెద్దగూడెం ఎంపీటీసీగా గెలిచిన స్వతంత్ర అభ్యర్థి చెన్ను అనురాధ టీఆర్‌ఎస్‌ పార్టీ వైపు మొగ్గు చూపింది. దీంతో నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చెన్ను అనురాధను ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించి ఆమెతో నామినేషన్‌ వేయించారు. దీంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. అనుముల ఎంపీపీ అభ్యర్థిగా అధికార పార్టీకి చెందిన పేర్ల  సుమతిపురుషోత్తం ఒక్కరే నామినేషన్‌ వేయగా, ఆమె ఎన్నిక  ఏకగ్రీవమైంది. వైస్‌ ఎంపీపీ ఎన్నికలో అధికార పార్టీకి చెందిన కొత్తపల్లి ఎంపీటీసీ చేయి లేపకపోవడంతో  టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు చేరి సమానంగా మూడేసి ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ నుంచి రావుల రాంబాబు కాంగ్రెస్‌నుంచి మాలె అరుణ బరిలో ఉన్నారు. సమాన ఓట్లు వచ్చిన నేపథ్యంలో డ్రా వేయగా, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాలె అరుణను వైస్‌ ఎంపీపీ పదవి వరించింది.

దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాలకుగాను చందంపేట, నేరెడుగొమ్ము మండలాల్లో కోరం లేకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. నేరెడుగొమ్ము మండల కేంద్రంలో కోఆప్షన్‌ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో ఎన్నిక వాయిదాపడింది.  దేవరకొండ, పీఏపల్లి, డిండి మండలాల్లో అధికార టీఆర్‌ఎస్‌ ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకోగా కొండమల్లేపల్లి, చింతపల్లి ఎంíపీపీలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. దేవరకొండ మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు  8 స్థానాలను అధికార టీఆర్‌ఎస్‌ గెలిచినప్పటికి కోఆప్షన్‌ స్థానాన్ని సాధించలేకపోయింది. మూడు స్థానాలను గెలిచిన కాంగ్రెస్‌ ఎంపీటీసీ సభ్యులు ఉదయం 10 గంటలలోపు కోఆప్షన్‌ అభ్యర్థిగా శంషొద్దీన్‌తో నామినేషన్‌ దాఖలు చేయించారు. కాంగ్రెస్‌కు చెందిన ఒకరే నామినేషన్‌ దాఖలు చేయడంతో శంషొద్దీన్‌ను కోఆప్షన్‌ సభ్యుడిగా ప్రకటించారు.  పీఏపల్లి మండలంలో వైస్‌ఎంపీపీ ఎన్నిక వాయిదాపడింది.

నకిరేకల్‌ : నకిరేకల్‌ నియోజకవర్గంలో ఎంపీపీల ఎన్నిక ఆసక్తి రేపింది. నకిరేకల్‌ మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలకు టీఆర్‌ఎస్‌ నాలుగు, కాంగ్రెస్‌ మూడు, ఇండిపెండెంట్లు రెండు స్థానాలు గెలచుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్,  దాసరి వీరార్జున్‌రెడ్డి  వేర్వేరుగా ఎంపీపీ పదవి కోసం పోటీ పడ్డారు. బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్‌ అనుచరులంతా స్థానిక శాసన మండలి ఇన్‌చార్జ్‌ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సారథ్యంలో క్యాంప్‌ నుంచి వారి కాన్వాయ్‌లోనే ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. వారి సమక్షంలోనే ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో ఆప్షన్‌ ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగింది. టీఆర్‌ఎస్‌నుంచి ఎంపీపీ అభ్యర్థిగా మంగళపల్లి ఎంపీటీసీ బచ్చుపల్లి శ్రీదేవి గంగధర్‌ను ప్రతిపాదించారు. ఇదే టిఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎంపీపీ అభ్యర్థిగా గోరెంకలపల్లి టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ దాసరి వీరార్జున్‌రెడ్డిని కూడా తాటికల్‌ ఎంపీటీసీ గాదగోని శ్రీలత ప్రతిపాదించారు. దాసరి వీరార్జున్‌రెడ్డి తనకు మెజారిటీ లేకపోవడంతో తన అనుచర వర్గమైన మరొక ముగ్గురు ఎంపీటీసీలతో కలిసి వెళ్లిపోయారు. దీంతో ఎంపీపీగా బచ్చుపల్లి శ్రీదేవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. కేతేపల్లి మండల పరిషత్‌ ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో ఆప్షన్‌ ఎన్నిక వాయిదా పడింది. చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూరు, శాలిగౌరారం ఎంపీపీలు టీఆర్‌ఎస్‌ వశమయ్యాయి.

మునుగోడు : మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, మునుగోడు , మర్రిగూడ, నాంపల్లి మండలాలో ఎంపీపీ ఎన్నిక ప్రశాంతం జరిగింది. మునుగోడు, నాంపల్లి ఎంపీపీ స్థానాలు టీఆర్‌ఎస్‌ వశం కాగా, చండూరు, మర్రిగూడ మండలాలు కాంగ్రెస్‌ దక్కించుకుంది. చండూరు మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు కాంగ్రెస్, సీపీఐలు పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్‌ 5, సీపీఐ 1, టీఆర్‌ఎస్‌ 4, బీజేపీ 1స్థానం గెలుచుకున్నాయి. సీపీఐ మద్దతుతో ఎంపీపీగా కాంగ్రెస్‌కు చెందిన పల్లె కళ్యాణి విజయం సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement