మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక శుక్రవారం ముగిసింది. ఆయా మండల కేంద్రాల్లో ఎన్నికల అధికారులు చేతులెత్తే పద్ధతిన ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలో 20 ఎంపీపీ స్థానాలు ఉండగా అంతా అనుకున్నట్లే జరిగింది. టీఆర్‌ఎస్ 13 ప్రాదేశిక పీఠాలను కైవసం చేసుకుంది. మూడింట కాంగ్రెస్ (రేగోడ్, చిన్నశంకరంపేట, నర్సాపూర్), రెండు చోట్ల స్వతంత్రులు (తూప్రాన్, చేగుంట) ఎంపీపీ పదవులను చేజిక్కించుకున్నారు. మరో రెండు స్థానాల్లో ఎన్నిక వాయిదా పడింది. చిన్నశంకరంపేటలో వైస్ ఎంపీపీని ఎన్నుకోలేదు. ఆ సమయంలో సభ్యులు లేకపోవడంతో అధికారులు వాయిదా వేశారు. ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తూప్రాన్, నార్సింగిలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. నర్సాపూర్‌లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ బలం సమానంగా ఉండడంతో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యులను డ్రా పద్ధతిన ఎన్నుకున్నారు. మరోవైపు వెల్దుర్తి, నార్సింగిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
సాక్షి, మెదక్ : చిలప్‌చెడ్‌లో కో ఆప్షన్ సభ్యుడిని ఎన్నుకున్నప్పటికీ.. ఎంపీపీ ఎన్నిక సమయంలో ఎంపీటీసీ సభ్యులు హాజరుకాకపోవడంతో అధికారులు శని వారానికి వాయిదా వేశారు. ఎవరిని ఎన్నుకో వాలో సమన్వయం లేకపోవడంతో ఎంపీటీసీ సభ్యులు హాజరు కాలేదని తెలుస్తోంది. టేక్మాల్‌లో కోఆప్షన్ సభ్యుడిగా మజాహర్ నామినేషన్ వేయగా.. ఎంపీటీసీ సభ్యులెవరూ బలపర్చలేదు. దీంతో అధికారులు వాయిదా వేశారు. త్వరలో ఉన్నతాధికారులు దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. వెల్దుర్తి ఎంపీపీ ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఈ ఎంపీపీ పరిధిలో 12ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్‌ఎస్ నాలుగు, కాంగ్రెస్ ఐదు, స్వతంత్రులు ముగ్గురు గెలుపొందారు. టీఆర్‌ఎస్‌కు చెందిన వెల్దుర్తి–2 ఎంపీటీసీగా గెలిచిన మోహన్‌రెడ్డి మిగతా టీఆర్‌ఎస్ ఎంపీటీసీలు ముగ్గురు, స్వతంత్రులు ముగ్గురితో కలిసి క్యాంప్‌నకు వెళ్లారు. మోహన్‌రెడ్డిని ఎంపీపీగా ఎన్నుకోవాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సైతం సూచించారు. ఎన్నిక సమయంలో క్యాంప్ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో టీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు ఎంపీటీసీలు (మానెపల్లి, కొప్పులపల్లి, అచ్చంపేట) వాహనం దిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత వారు కాంగ్రెస్ ఎంపీటీసీలతో కలిసి చర్చించారు. టీఆర్‌ఎస్‌కు చెందిన మానెపల్లి ఎంపీటీసీ సభ్యురాలు స్వరూపను ఎంపీపీగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన వెల్దుర్తి–1 ఎంపీటీసీ సుధాకర్‌గౌడ్‌ను వైస్ ఎంపీపీగా ఎన్నుకున్నారు.
తూప్రాన్‌లో గలాటా
ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తూప్రాన్‌లో గలాటా చోటుచేసుకుంది. ఘనాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు గడ్డి స్వప్న గెలిచిన వెంటనే కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆమే ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైస్‌ఎంపీపీగా వెంకటయ్యపల్లి ఎంపీటీసీ సభ్యురాలు శరణ్య, కో ఆప్షన్ సభ్యుడిగా గుండ్రెటిపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మున్వర్ పాషా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌కు చెందిన మల్కాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు పంజాల వెంకటమ్మ కొడుకు ఆంజనేయులు అక్కడికి చేరుకుని పేపర్లను చించి వేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ బాహాబాహీకి దిగడంతో అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
నార్సింగి.. సీన్ చేంజ్ !
అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి అన్నట్లు నార్సింగి ఎంపీపీ పీఠం ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
నార్సింగి ఎంపీపీ పరిధిలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. టీఆర్‌ఎస్ రెండు, కాంగ్రెస్ ఒకటి, స్వతంత్రులు (టీఆర్‌ఎస్ రెబెల్స్) రెండు స్థానాల్లో గెలుపొందారు. టీఆర్‌ఎస్ అధిష్టానం నార్సింగి–2 ఎంపీటీసీ ఆకుల సుజాతను ఎంపీపీగా, వల్లూరు ఎంపీటీసీ చిందం సబితను వైస్ ఎంపీపీగా నిర్ణయించింది. ఎంపీపీ ఎన్నిక సమయంలో శుక్రవారం సీన్ రివర్సైంది. అనూహ్యంగా శేరిపల్లి నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన బండారు సంతోష.. టీఆర్‌ఎస్‌కు చెందిన వల్లూరు ఎంపీటీసీ చిందం సబితను అధ్యక్ష స్థానం కోసం ప్రతిపాదించారు. జప్తిశివనూర్ ఎంపీటీసీ మైలారం సుజాత కూడా సబితకు మద్దతు పలకడంతో ఆమె ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆకుల సుజాత వర్గీయులు ఆగ్రహానికి గురై ఎంపీటీసీ సంతోష భర్త గొండా స్వామిపై దాడికి దిగారు. పోలీసులు ఇరువురిని శాంతింపజేసి అక్కడి నుంచి పంపించి వేశారు.
రిటర్న్ గిఫ్ట్!
గత ప్రాదేశిక ఎన్నికల్లో ఆకుల సుజాత భర్త ఆకుల మల్లేశం గౌడ్ కాంగ్రెస్ తరఫున నార్సింగి–2 ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. ఈ సమయంలో కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఎంపీటీసీలుగా గెలుపొందారు. చేగుంట మండలంలో టీఆర్‌ఎస్ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించి ముదం శ్రీనివాస్‌ను ఎంపీపీగా ప్రకటించి క్యాంప్‌నకు తరలించారు. ఇదే క్యాంప్‌లో ఉన్న ఉప్పరపల్లి ఎంపీటీసీ అల్లి రమను ఎన్నిక సమయంలో అనూహ్యంగా ఆకుల మల్లేశం గౌడ్ ఎంపీపీ పదవికి ప్రతిపాదించారు. అనుకోకుండా అల్లి రమ ఎంపీపీగా.. ఆకుల మల్లేశం గౌడ్ వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. తాజాగా ఇలాంటి పరిస్థితే మల్లేశం గౌడ్‌కు ఎదురై ఆమె భార్య సుజాతకు పదవి దక్కకుండా పోయిందని చర్చించుకుంటున్నారు.
నర్సాపూర్ డ్రా..
- నర్సాపూర్‌లో డ్రా పద్ధతిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ ఎంపీపీ పరిధిలో మొత్తం పది ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ చెరో ఐదు స్థానాలను గెలుచుకున్నాయి. అధికారులు మూడు పదవులకు డ్రా తీశారు. కాంగ్రెస్‌కు చెందిన అహ్మద్‌నగర్ ఎంపీటీసీ సభ్యురాలు జ్యోతిని ఎంపీపీ పదవి వరించింది. వైస్ ఎంపీపీగా టీఆర్‌ఎస్‌కు చెందిన చిన్నచింతకుంట ఎంపీటీసీసీ సభ్యుడు వెంకటనర్సింగరావు, కో ఆప్షన్ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌కు చెందిన ఎండీ.అఫ్జల్ ఇమ్రాన్‌ను అదృష్టం వరించింది.
- రేగోడ్ అంతా కాంగ్రెస్‌మయమైంది. మొత్తం ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ నాలుగు, టీఆర్‌ఎస్ మూడింట్లో గెలుపొందాయి. ఎంపీపీగా కాంగ్రెస్‌కు చెందిన పుర్ర సరోజన ఎన్నికయ్యారు. ఈమె గజ్వాడ నుంచి ఎంపీటీసీ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైస్ ఎంపీపీగా కాంగ్రెస్‌కు చెందిన ఆర్ ఇటిక్యాల నుంచి ఎంపీటీసీగా గెలిచిన ఇలీటం వినీల ఏకగ్రీవమయ్యారు.
- చిన్నశంకరంపేట ఎంపీపీ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ ఎంపీపీ పరిధిలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ ఏడు.. టీఆర్‌ఎస్ నాలుగు.. స్వతంత్ర అభ్యర్థి ఒక్కరు గెలుపొందారు. కాంగ్రెస్‌కు ఆధిక్యం ఉండగా.. జంగరాయి ఎంపీటీసీ ఆవుల భాగ్యలక్ష్మిని ఎంపీపీగా ఎన్నకున్నారు. కోఆప్షన్ సభ్యుడిగా కంగ్రెస్‌కు చెందిన శిన్నశంకరంపేట వాసి దూదేకుల ఫరీద్ ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment