‘గులాబీ’కే పీఠాలు | Telangana MPP Election Winnings TRS | Sakshi
Sakshi News home page

‘గులాబీ’కే పీఠాలు

Jun 8 2019 7:04 AM | Updated on Jun 8 2019 7:04 AM

Telangana MPP Election Winnings TRS - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: కారు జోరుమీదుంది. పరిషత్‌ ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. 20 మండల పరిషత్‌లకుగాను.. 17 మండలాధీశుల పదవులను కైవసం చేసుకుంది. సంఖ్యాపరంగా టీఆర్‌ఎస్‌కే బలం ఉన్నా.. ఎంపీపీ పదవిపై నెలకొన్న పోటీ వల్ల ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్‌ సమావేశానికి హాజరుకాకపోవడంతో కూసుమంచి ఎంపీపీ ఎన్నిక కోరం లేక వాయిదాపడింది. దాదాపు జిల్లా చరిత్రలోనే మొదటిసారిగా మండల పరిషత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఖాతా తెరవలేకపోయింది. 2014 ఎన్నికల్లో అనేక ఎంపీపీ పదవులను గెలుచుకున్న కాంగ్రెస్‌ ఈసారి ఒక్క ఎంపీపీ పదవిని సైతం చేజిక్కించుకోలేదు. అయితే బోనకల్, ఏన్కూరులో ఆ పార్టీ బలపరిచిన సీపీఎం, టీడీపీ అభ్యర్థులు ఎంపీపీలుగా ఎన్నికయ్యారు.

టీఆర్‌ఎస్‌ మాత్రం మెజార్టీ మండలాల్లో అప్రతిహతంగా తన విజయాన్ని కొనసాగించింది. కూసుమంచిలో ఎంపీపీ పదవిని టీఆర్‌ఎస్‌కు చెందిన బాలాజీనాయక్‌కు ఇవ్వాలని కోరుతూ ఆయన మద్దతుదారులు కూసుమంచిలోని ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ పదవికి శ్రీనునాయక్, బాలాజీనాయక్‌ పోటీ పడుతుండడంతో ఇద్దరూ ఒక అవగాహనకు వచ్చి.. ఎన్నికకు మార్గం సుగమం చేయాలని వారికి ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి సూచించారు. దీంతో పదవీ కాలాన్ని చెరి సగం పంచుకోవాలని భావించినా.. ముందు ఎవరు పదవి చేపట్టాలనే అంశంపై సందిగ్ధత నెలకొనడంతో ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్‌ సమావేశానికి సకాలంలో చేరుకోలేదు. దీంతో ఎన్నికను శనివారానికి వాయిదా వేశారు. ఇక చింతకాని మండలంలో ఎంపీపీ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ మండలంలో టీఆర్‌ఎస్, సీపీఎంలు మిత్రపక్షం గా వ్యవహరించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేశాయి.

జెడ్పీటీసీ టీఆర్‌ఎస్‌కు, ఎంపీపీ సీపీఎంకు ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది. జెడ్పీటీసీని టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. ఎంపీపీ పదవిని టీఆర్‌ఎస్‌ మద్దతుతో సీపీఎం గెలుచుకునే అవకాశం ఉంది. అయితే టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలుపొందిన ఎంపీటీసీ పూర్ణయ్య పార్టీ విప్‌ను ధిక్కరించి ఎంపీపీ పదవికి నామినేషన్‌ వేయడంతో ఆయనకు కాంగ్రెస్, సీపీఐలకు చెందిన ఎంపీటీసీలు మద్దతు ప్రకటించారు. దీంతో అనూహ్య రీతిలో పూర్ణయ్య ఎంపీపీగా విజయం సాధించారు. అయితే పూర్ణయ్య పార్టీ విప్‌ను ధిక్కరించారంటూ పార్టీ మండల నాయకులు ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. ఇక కారేపల్లి ఎంపీపీ పదవి కోసం టీఆర్‌ఎస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. ఈ పదవి కోసం ముగ్గురు ఎంపీటీసీలు పోటీ పడ్డారు. టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ సభ్యురాలు మాలోతు శకుంతల, భాగ్యనగర్‌తండా నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన ఈశ్వరీనందరాజ్‌తోపాటు గుంపెళ్లగూడెం ఎంపీటీసీ ధరావత్‌ అచ్చమ్మ ఎంపీపీ పదవి కోసం పోటీ పడ్డారు. అయితే టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి శకుంతలను ఎంపిక చేసినట్లు మిగిలిన ఇద్దరికి నాయకులు నచ్చజెప్పడంతో ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగింది.
 
ప్రశాంతంగా ఉపాధ్యక్ష, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక.. 
ఇక జిల్లాలో ఉపాధ్యక్ష, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. బోనకల్, ఏన్కూరులలో మండల పరిషత్‌ ఉపాధ్యక్ష పదవిని కాంగ్రెస్‌ కైవసం చేసుకోగా.. ముదిగొండ ఉపాధ్యక్ష పదవిని సీపీఎం దక్కించుకుంది. వైరా ఉపాధ్యక్షురాలిగా ఎంపీటీసీగా టీఆర్‌ఎస్‌ రెబల్‌గా పోటీ చేసిన లక్ష్మీనరసమ్మ విజయం సాధించింది. మండల పరిషత్‌ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక నిర్వహించిన అధికారులు మధ్యాహ్నం మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్‌ కైవసం చేసుకున్న జెడ్పీటీసీలైన తిరుమలాయపాలెం, కామేపల్లిలో సైతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే ఎంపీపీలుగా గెలుపొందారు.

బోనకల్‌లో మాత్రం కాంగ్రెస్, సీపీఎం కూటమికి ఎంపీపీ పదవి దక్కింది. ఇక కారేపల్లి మండల పరిషత్‌ ఉపాధ్యక్ష పదవిని టీఆర్‌ఎస్‌ తరఫున ఇమ్మడి రమాదేవికి ఇచ్చేందుకు నిర్ణయించగా.. అప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చిన 8 మంది ఎంపీటీసీలు రావూరి శ్రీనివాసరావుకే వైస్‌ ఎంపీపీ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో కారేపల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు, స్థానిక వార్డు సభ్యుడు గంగరబోయిన సత్యం పెట్రోల్‌ బాటిల్‌ను తీసుకొచ్చి.. రావూరికి వైస్‌ ఎంపీపీ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోల్‌ మీద పోసుకోబోగా.. కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఎంపీటీసీ సభ్యుల నిర్ణయం మేరకు రావూరి శ్రీనివాసరావుకు వైస్‌ ఎంపీపీ పదవిని కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement