అనంతపురం జిల్లా యాడికి మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలిని టీడీపీ నేతలు ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకుని ఎంపీపీ పీఠం కైవసం చేసుకోవడమే ఇందుకు కారణమైంది.
తాడిపత్రి : అనంతపురం జిల్లా యాడికి మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలిని టీడీపీ నేతలు ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకుని ఎంపీపీ పీఠం కైవసం చేసుకోవడమే ఇందుకు కారణమైంది. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్‌సీపీకి 9, తెలుగుదేశం పార్టీకి 7 స్థానాలు దక్కించుకున్నాయి.
వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా.. ఈ పార్టీకి చెందిన మూడో నంబర్ ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మికాంతమ్మ ప్రలోభాలకు గురై టీడీపీకి మద్దతు తెలిపింది. దీంతో ఎంపీటీసీ స్థానాలు రెండు పార్టీలకూ సమానం అయ్యాయి. అధికారులు లాటరీ తీయగా అందులో ఎంపీపీ పదవి టీడీపీని వరించింది. ఎన్నికల అనంతరం బయట ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైకి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పరోక్షంగా టీడీపీ కార్యకర్తలను ఉసిగొలిపి రాళ్లతో దాడి చేయించారు.
దీంతో వారిని ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కూడా రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు లాఠీచార్‌జ చేయడంతోపాటు బాష్ప వాయు గోళాలు ప్రయోగించారు. రాళ్లదాడిలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బొంబాయి రమేష్‌నాయుడు, కార్యకర్త మధురాజు, టీడీపీ కార్యకర్తలు వెంకట్రామిరెడ్డి, నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో పోలీసులు కూడా స్వల్పంగా గాయపడ్డారు. పామిడి సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ రామక్రిష్ణారెడ్డి, సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.