
రసకందాయం.. ‘పట్నం’ రాజకీయం
- 7న ఎంపీపీ ఎన్నికకు ఎట్టకేలకు రంగం సిద్ధం
- శిబిరాల్లో మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు
- అధికార పార్టీ కైవసం కానున్న పీఠం?
ఇబ్రహీంపట్నం: స్థానిక మండల ప్రజా పరిషత్ కొత్త అధ్యక్షుడి ఎన్నికకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారయ్యింది. ఈ నెల 7న ఎంపీపీని ఎన్నుకునేందుకు రంగం సిద్ధమయ్యింది. జూలై 16న వెంకట్రామిరెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో కొత్త ఎంపీపీ ఎన్నిక అనివార్యమయ్యింది. కాగా.. వెంకట్రామిరెడ్డి రాజీనామా చేయడానికి ఒక రోజు ముందు నుంచే నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకున్నాయి. మెజారిటీ ఎంపీటీసీ సభ్యులంతా అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీటీసీ సభ్యుడి శిబిరంలో సేదతీరుతున్నారు. పదిహేనురోజులుగా దాదాపు 8 మంది సభ్యులు రహస్య శిబిరాల్లోనే ఉంటున్నారు.
ఎన్నెన్ని మలుపులో..
పట్నం రాజకీయాల్లో పదిహేను రోజుల వ్యవధిలోనే కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎంపీపీ పదవికి వెంకట్రామిరెడ్డి సెలవు పెట్టడంతో మండల ఉపాధ్యక్షుడు కొత్త అశోక్‌గౌడ్ ఇన్‌చార్జి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వెంకట్రామిరెడ్డి తిరిగి పదవి చేపట్టారు.
ఆ వెనువెంటనే పదవికి రాజీనామా చేశారు. ఎంపీపీ పదవికి వెంకట్రామిరెడ్డి రాజీనామా చేస్తారనే నిర్ధారణకు వచ్చిన తడవే.. మెజారిటీ ఎంపీటీసీ సభ్యులంతా అజ్ఞాతంలోకి వెళ్లడంతో స్థానికంగా సంచలనం రేకెత్తించింది.
టీఆర్‌ఎస్ ఖాతాలోకి..?
ఎంపీపీ పదవిపై గంపెడాశలతో ఉన్న కప్పాపహాడ్ ఎంపీటీసీ సభ్యుడు మర్రి నిరంజన్‌రెడ్డి ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 14 మంది ఎంపీటీ సభ్యులుండగా.. పార్టీలకతీతంగా ఇప్పటికే ఎనమండుగురు నిరంజన్‌రెడ్డి అధీనంలో ఉన్నట్లు సమాచారం. ఎంపీటీసీ సభ్యులు గౌని ఆండాళు, అశోక్‌గౌడ్, వెంకట్రామిరెడ్డి మినహా మిగతా వారంతా ఇప్పటికే నిరంజన్‌రెడ్డికి మద్దతుగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
అంతా సస్పెన్స్..
పట్నం’ ఎంపీపీ పదవిపై చివరి క్షణంలో ఏదైనా జరగవచ్చనే ఊహాగానాలు వస్తున్నా యి. ఇప్పటి వరకు ఆర్ధిక పరమైన అంశాల చుట్టే తిరుగుతున్న క్రమంలో చివరి క్షణం వర కు మెజారిట సభ్యులు ఎవరికి మద్దతు ప్రకటిస్తారోననే విషయం అంతు చిక్కడంలేదు. పదవిని దక్కించుకునేందుకు ప్రస్తుత ఇన్‌చార్జి ఎంపీపీ కొత్త అశోక్‌గౌడ్, కప్పాపహాడ్ ఎంపీటీసీ సభ్యుడు మర్రి నిరంజన్‌రెడ్డి తమదైన శైలిలో రాజకీయ పాచికలు వేస్తున్నారు.