స్పీకర్‌తో మాట్లాడుతున్న సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి తదితరులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఒకప్పుడు జిల్లాను శాసించిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ప్రాతినిధ్యం కరువైంది. కాంగ్రెస్‌కు ఆశాకిరణాలుగా భావించిన ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డిలు పార్టీని వీడి కారెక్కడం హాట్ టాపిక్‌గా మారింది. సీఎల్పీని అధికార టీఆర్‌ఎస్ పార్టీలో విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి గురువారం వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం సమర్పించిన వారి జాబితాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండటం చర్చనీయాంశమైంది. వీరి విజ్ఞప్తిని స్పీకర్ ఆమోదించారు. ఇకపై వీరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు. మొన్నటి శాసనసభ ఎన్నికల తర్వాత మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌కు దగ్గరయ్యారు. సీఎం కేసీఆర్‌తో సైతం ఆమె భేటీ అయ్యారు.
అయితే తన కుమారుడి రాజకీయ భవిష్యత్‌తో పాటు తనకు మంత్రి పదవి ఇస్తారన్న హామీ మేరకు ఆమె టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఆమెను అనుసరించారు. ఆ వెంటనే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ కావడంతో ఆయన పార్టీ మారడంపై స్పష్టత వచ్చింది. హస్తం గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచిన వీరిద్దరూ అప్పటి నుంచి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ వచ్చారు. టీఆర్‌ఎస్ నాయకులతో సత్సంబంధాలు కొనసాగించడంతోపాటు లోక్‌సభ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయానికి కృషిచేశారు.
మరోపక్క ఏడాది కిందట టీఆర్‌ఎస్ నుంచి బహిష్కరణకు గురై కాంగ్రెస్ గూటికి చేరిన వికారాబాద్ డీసీసీ అధ్యక్షులు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి కూడా తిరిగి సొంత గూటికి చేరారు. అనూహ్యంగా సీఎల్పీని విలీనం చేయాలని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యేల్లో ఈయన ఒకరు కావడం రాజకీయంగా పెనుదుమారం రేపింది. కాగా, సాంకేతికంగా ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే. అయితే సీఎల్పీ విలీనానికి స్పీకర్ ఆమోదం తెలపడంతో అధికారికంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా పరిగణిస్తారు.
ఆత్మస్థైర్యం నింపితేనే..
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జిల్లాలో కష్టాల్లో చిక్కుకుంది. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ జాబితాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం ఉన్నారు. ఆ తర్వాత తమ నియోజకవర్గాల అభివృద్ధి పేరిట ఎమ్మెల్యేలు సైతం కారెక్కారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది. అయినా పంచాయతీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ రీతిలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా నెగ్గారు. ఆ తర్వాత చేవెళ్ల లోక్‌సభ స్థానం చేజారినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే అధిక సంఖ్యలో ఓట్లు రాబట్టింది. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ ఉనికి చాటుకుంది. 257 ఎంపీటీసీల్లో 73 స్థానాలను, 21 జెడ్పీటీసీలకుగాను.. నాలుగింటిని హస్తగతం చేసుకుంది. ఈ ఫలితాలను విశ్లేషిస్తే నాయకులు, ఎమ్మెల్యేలు పార్టీలు మారినా ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు చెక్కుచెదరలేదని తెలుస్తోంది. అయితే, టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనం, జిల్లాకు చెందిన ముగ్గురు కీలక నేతలు అధికారికంగా కారెక్కడంతో పార్టీ బలహీనపడినట్టే. ఈ పరిణామంతో పార్టీ శ్రేణులు అంతర్మథనంలో పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment